Feed on
Posts
Comments

ప్రకృతిప్రసాదించిన జీవనదులు దేశాల మధ్యా, రాష్ట్రాల మధ్యా మైత్రీహారాలుగా, సుహృద్భావ సేతువులుగా ఉండవలసింది పోయి మనిషి స్వార్థం, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కారణంగా వివాదాలు రగిలిస్తున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాలు నీటికోసమే జరుగుతాయంటూ ఈజిప్టు సామాజిక శాస్తవ్రేత్త ఇస్మాయిల్ సెరాగెల్డిన్ చెప్పిన జోస్యం నిజమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య కృష్ణా జలాలకు సంబంధించి అలమట్టి సమస్య, కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ జలకలహం, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య రావి-బియాస్ జలవివాదం ఎప్పుడు ముదిరి జాతీయ సమస్యలుగా మారిపోతాయో సంక్షోభాలు సృష్టిస్తాయో తెలియని పరిస్థితి. స్వాతంత్య్ర భానూదయం తర్వాత దేశవ్యాప్తంగా మొదలైన దాదాపు నాలుగువేల సాగునీటి ప్రాజెక్టులలో సగం దాకా వివాదాలలో చిక్కుకొని ఉసూరుమంటున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.

స్వతంత్ర భారతావని తన అపార జలనిధులను సవ్యంగా వినియోగించుకోక పోవడం వల్లనే కక్షలూ, కార్పణ్యాలు పెరుగుతున్నాయి. నీటి దుర్భిక్షం జనజీవనాన్ని బడబాగ్నిలోకి నెట్టుతున్నది. 2025 నాటికి దేశంలో ఒక్కొక్క వ్యక్తికి లభించే నీటి మొత్తం వేయి క్యూబిక్ మీటర్ల కంటే మించే అవకాశం లేదని ప్రవీణులు హెచ్చరిస్తున్నారు. మనకున్న నీటి వనరులు తక్కువ. ప్రపంచజనాభాలో భారతదేశ జనాభా పదహారు శాతం కాగా నేల మీద లభించే మంచినీటిలో భారత్ వాటా నాలుగుశాతం మాత్రమే. ఇందులోనూ అత్యధిక భాగం వ్యవసాయ క్షేత్రాలను తడిపి సిరులు పండించవలసింది పోయి నిష్ప్రయోజనంగా కడలిలో ఉప్పునీటిలో కలసిపోతున్నాయి. నదీజలాలు వృధాగా సముద్రంలో కలసిపోకుండా ప్రాజెక్టులు నిర్మించి పొలాలకు మళ్ళించే అవకాశాలు ఉన్నప్పటికీ క్షుద్ర రాజకీయాల కారణగా పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. లోగడ ప్రకృతి ప్రసాదంగా పరిగణించిన నీటి వనరులను ఇప్పుడు జాతీయ సంపదగా గుర్తించి వాటిపై సమస్త అధికారాలనూ ప్రభుత్వాలు స్వీకరించాయి. ఫలితంగా ప్రజలకూ, ప్రజలకూ మధ్యా, ప్రజలకూ, ప్రభుత్వాలకీ మధ్య జలయుద్ధాలకు రంగం సిద్ధం అవుతోంది. మరో పక్క నీటితో వ్యాపారం చేసే ధోరణి ప్రబలింది. మినరల్ వాటర్ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం సాగిపోతున్నది. తాగునీరే కాకుండా ఇతర అవసరాలకు ఇళ్ళలో వాడుకునే నాటిని కూడా బిందెకు అయిదు రూపాయల నుంచి వంద రూపాయల వరకూ గిరాకీని బట్టి అమ్ముతున్నారు. భూగర్భజలాలను విరివిగా వినియోగిస్తున్న కారణంగా అవి కూడా అడుగంటుతున్నాయి. వరుస అనావృష్టి ఫలితంగా వ్యవసాయ భూములకు సాగునీరు అందక పంటలు పండక దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యం ప్రాజెక్టుల నిర్మాణం నినాదంగా ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. పదవీ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి జలయజ్ఞం చేయబోతున్నట్టు ప్రకటించారు. వేలకోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించేందుకు పథకాలు వెల్లడించారు. కానీ ప్రాజెక్టులను ఎక్కడ కట్టాలన్న అంశంపైనా, ఎంత ఎత్తు కట్టాలన్న అంశంపైనా, నిర్వాసితులకు ఏ రకమైన పునరావాసం కల్పించాలన్న అంశంపైనా వివాదాలు చెలరేగుతున్నాయి. ఉద్యమాలు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే అస్తిత్వం కోల్పోయే గిరిజనులనూ, ఇతర పేద వర్గాలను ఆదుకునేందుకు నర్మదా బచావ్ ఆందోళన సంఘం నాయకురాలు మేధాపాట్కర్ రాష్ట్రాన్ని తరచుగా సందర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల ఎజెండాలో కొంతకాలంగా సాగునీటి ప్రాజెక్టులే ప్రధానంగా ఉన్నాయి. మరికొంతకాలం ఉంటాయి.

సమైక్య రాష్ట్ర నిర్మాణ స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలోనూ అన్నిటికంటే ముఖ్యమైన వివాదాలు నదీజలాలలకు సంబంధించినవే. వేర్పాటువాదాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బలపరచడానికి కారణం జలరాజకీయాలే. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వాలూ, రాజకీయ పక్షాలూ ఏమీ చేయకపోగా ఈ వివాదాలను వినియోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలని అనైతికంగా ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలు ఒకే వివాదంపై ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఒక విధానం, మరో ప్రాంతంలో వేరొక విధానం అమలు చేస్తున్నాయి. ఒకే ప్రాంతంలో జిల్లాల మధ్య భిన్న విధాలను రూపొందించి స్థానిక జలసంఘర్షణలకు తెరలేపుతున్నాయి. ఈ విషయంలో ప్రాంతీయపార్టీలు జాతీయ పార్టీలను అనుసరిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. నిప్పుతో చెలగాటం అంటే ఇదే. నీరు నిప్పు అవుతున్నది.

మనిషి మనుగడకు నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. జనజీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న జలవనరుల గురించీ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న నదీజలాల విధానాల గురించీ సరైన అవగాహన రాజకీయ నాయకులకూ, కార్యకర్తలకూ లేదు. సాధారణ ప్రజలకు అసలే లేదు. జలవిజ్ఞాన రాహిత్యం ప్రజలలో ఆవేశాన్ని రెచ్చగొట్టడానికీ, వారిని తప్పుదారి పట్టించడానికీ కారణం అవుతున్నది. ప్రజలను అన్యాయం చేయడానికి కూడా వీలు కల్పిస్తున్నది. రాష్ట్రంలోని నదీజల వనరులపైనా, ప్రాజెక్టులపైనా సమగ్రమైన పుస్తకాన్ని పుచ్చలపల్లి సుందరయ్య రాసిన తర్వాత క్షేత్రంలో అనేక మార్పులు సంభవించాయి. నదీ జలాల వినియోగంపైన ట్రిబ్యునళ్ళు వచ్చాయి. ఎగువ రాష్ట్రాలలో అనేక ప్రాజెక్టులు వెలిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో‌ సైతం కొన్ని కొత్త ప్రాజెక్టులు వెలిశాయి. ప్రపంచీకరణ ధర్మమా అని నీటి వినియోగంలో అనేక అవాంఛనీయమైన పోకడలు మొదలైనాయి. చివరికి పాలకంటే తాగునీటి వెల ఎక్కువ పలుకుతున్న పరిస్థితులను చూస్తున్నాం. నీటి వనరుల గురించి నిజనిజాలను ప్రజలకు తెలియజేస్తే జలవివాదాలపై దురభిప్రాయాలు తొలగిపోతాయి. ఏ ప్రాంతానికి ఎంత నీరు అవసరమో, ఎంత కేటాయించవచ్చునో, ఎంత విడుదల చేయవచ్చునో ఆ ప్రాంతం ప్రజలకు తెలిసి ఉంటుంది. ఇతర ప్రాంతాల అవసరాలపైన, వినియోగంపైనా అవగాహన పెరుగుతుంది. సహజీవన ధర్మాన్ని అనుసరించి అందరి సంక్షేమాన్ని ఆశించి విధానాల రూపకల్పన జరగాలనీ, ఒక ప్రాంతానికి అన్యాయం చేసి మరొ ప్రాంతానికి నీరు దోచిపెట్టరాదనీ పాలకులను ప్రజలే శాసించే రోజు వస్తుంది. అందుకు జలవిజ్ఞాన ప్రచారం అత్యవసరం. కేంద్ర జలవనరుల సంఘంలో పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం, దేశ జలవనరులకు సంబంధించి లోతైన అవగాహన, రాష్ట్ర జలవివాదాలకూ, విధానాలకూ సంబంధించిన సమగ్రమైన, కూలంకషమైన పరిజ్ఞానం గల ప్రముఖ ఇంజనీరు, రచయిత, కవి ఆర్. విద్యాసాగరరావుగారు నీటి నిజాలను వెల్లడించడానికి అత్యంత యోగ్యులని భావించాను. `వార్త’లో వ్యాసపరంపరను రాయవలసిందిగా ఆ పత్రిక సంపాదకుడిగా ఉన్న రోజుల్లో ఆయనను అభ్యర్థించాను. విద్యాసాగరరావు జాతీయ జలసంపద గురించీ, జలరాజకీయాల గురించీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతల గురించీ, ప్రత్యేకంగా తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయం గురించీ విస్పష్టంగా, నిస్పక్షపాతంగా, నిర్దుష్టంగా వివరించారు. ఇంతవరకూ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలలో లోపాలను ఎత్తి చూపించారు. సమస్యలకు పరిష్కారాలు సూచించారు. నీటి నిజాలపైన ఆయన రచన ధారావాహికంగా సాగింది. రాష్ట్ర నీటి వనరులపైన సాధికార వ్యాఖ్యాతగా, ఉన్నతస్థాయి ప్రవీణుడుగా ఆయనను ఇంజనీర్లూ, రాజకీయ పార్టీల నాయకులూ, పత్రికా పాఠకులూ పరిగణిస్తున్నారు. తెలంగాణ మేధావిగా ఈ రంగంలో విశిష్ఠ సేవచేస్తున్నారు. జలవిజ్ఞాన నిధిగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన విద్యాసాగరరావు రచనలు దినపత్రిక పుటలకే పరిమితం కాకుండా, నీటి మీది రాతలుగా చెరిగిపోకుండా పుస్తకరూపంలో రావాలనీ,

ప్రజలకూ, పాలకులకూ మార్గదర్శనం చేయాలనీ, జలనిధులు జనసమూహాల మధ్య స్నేహవారధులు నిర్మించడానికి దోహదం చేయాలని కోరుకున్న వారిలో నేనూ ఒకడిని. ఇది జలవిజ్ఞాన సర్వస్వం. ఈ పుస్తకం చదివిన వారికి నదీజలాల వినియోగంపైన సమగ్రమైన దృష్టి సిద్ధిస్తుంది. అవగాహన పెరుగుతుంది. మెరుగైన సమాజ నిర్మాణానికి తోడ్పడే సమ్యక్ దృష్టి అలవడుతుంది. ఈ రచనలు చదువుతుంటే రచయితతో కలిసి జలవిజ్ఞాన యాత్ర చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇటువంటి ఉపయోగకరమైన గొప్ప రచనలు చేసిన మాన్యమిత్రులు విద్యాసాగరరావు గారిని మనసారా అభినందిస్తున్నాను.

హైదరాబాద్ డిసెంబర్ 6, 2005

కొండుభట్ల రామచంద్రమూర్తి
`ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com