Feed on
Posts
Comments

నీళ్ల పైన నేను రాస్తాననిగాని, రాయాలనికాని ఎన్నడూ అనుకోలేదు. చిన్నతనం నుంచీ నేను రాసింది కవిత్వం, కథలు, నాటికలు - వేసింది స్టేజిపైన నాటకాలు, రేడియో, దూరదర్శన్లో నాటికలు. ఈ రేడియో పిచ్చి ఎంతదాకా వెళ్లిందంటే నేను క్యాసువల్ ఆర్టిస్ట్‌గా రేడియోలో వార్తలు చదవడం, అనౌన్సర్‌గా పని చేయడం మొదలుకుని భారత ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు తెలుగులో వేయికిపైగా రేడియోలో నాటికల రూపంలో దశాబ్దానికి పైగా రాయడం ప్రసారం చేయడం వరకు సాగింది. నా రచనా వ్యాసంగం 1950లో ‘బాల’పత్రిక మొదలుకుని 1975లో స్వాతి మాసపత్రికలో `ప్లస్ మైనస్’ కథదాక నిరాఘాటంగా కొనసాగింది. గత ముప్ఫై ఏళ్లుగా నేను నా పేరును పత్రికలలో చూసుకోలేదు. కవిత్వంలో బాలగంగాధర తిలక్, నటనలో దుగ్గిరాల సోమేశ్వరరావు నన్ను ప్రభావితం చేసినంతగా మరే వ్యక్తి నన్ను ఆకట్టుకోలేదన్నది నూటికినూరు పాళ్లు నిజం. చదువులో చురుగ్గా ఉండటం మూలాన ఇంజనీరింగ్ సీటు రావడం, ఫలితంగా ఇంజనీర్ని కావడం జరిగిందే కాని నామనసంతా సాహిత్యం, నటనపైన్నే. రాష్ట్రంలో మూడేళ్లపాటు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం వెలగబెడ్తున్న రోజుల్లో ఖాళీ సమయాల్లో ఎక్కువ సేపు గడిపింది రవీంద్రభారతిలో, సాహితీమిత్రులతోటే.

1963లో యు.పి.ఎస్.సి. ద్వారా క్లాస్-1 పోస్టుకు ఎంపికయి కేంద్ర జలసంఘంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరినప్పుడు నాతోటి తెలుగువాళ్లు ఢిల్లీని చలి మూలంగా తిట్టుకుంటూ వుంటే నా హాబీలు కొనసాగించడానికి ఎంతో అనువైన కేంద్రమని రాజధాని నగరాన్ని విశేషంగా అభిమానించాను. కేంద్ర జలసంఘంలో వివిధ స్థాయిలలో పని చేసిన 34 ఏళ్ల సుదీర్ఘకాలంలో అనేక సాంకేతిక విషయాలపై వృత్తిరీత్యా జాతీయ, అంతర్జాతీయ `ఇంజనీరింగ్ జర్నల్స్’ లో రాయడం జరిగిందే కాని నేను ఐచ్ఛికంగా, జలవనరుల పైన అధ్యయనం చేసి అటు ఆంగ్లంలో కాని ఇటు తెలుగులో కాని ప్రచురించ లేదు. విదేశాలలో జరిగే సదస్సులలో పాల్గొనే నిమిత్తం తప్పని సరిగా కొన్ని వ్యాసాలను రాయవలసి వచ్చింది. కేంద్ర జలసంఘంలో పనిచేస్తున్న రోజుల్లో ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం వచ్చే రాష్ట్ర అధికారులతో చర్చించే సందర్భాల్లో వివిధ ప్రాజెక్టుల స్థితిగతులు తెలిసేవి. పత్రికలలో వస్తున్న సమాచారం, ప్రభుత్వం చేస్తున్న ప్రచారం విని మన రాష్ట్రం అద్భుతంగా ప్రగతిపథంలో పయనిస్తోందని అనుకున్నానే కాని రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని నాకనిపించలేదు. ఢిల్లీలో ఉన్న రోజుల్లో నేనెప్పుడూ రాజకీయ నాయకులతో సంపర్కం పెట్టుకోకపోవడం వల్ల ప్రాజెక్టులే కాదు మరే ఇతర విషయాలపైన కూడా సరైన అవగాహన లేకుండా పోయింది. మరో ఏడెనిమిదేళ్లలో రిటైరవుతాననగా నాకు తగిలిన మొదటి రాజకీయ నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కీ.శే. చొక్కారావుగారు. అయనకు సాయం చేయమని మా మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.ఎస్.రెడ్డిగారు కోరడంతో చొక్కారావు గారితో సాన్నిహిత్యం పెరిగింది. చొక్కారావుగారి గొడవంతా శ్రీరాంసాగర్ ప్రాజెకే. దానికి సంబంధించిన సమస్యలను విశదీకరిస్తూ వాటి పరిష్కారానికి కొన్ని పిటీషన్లను ఇంగ్లీష్‌లో‌ నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి‌ రాయడంతో ప్రారంభమైంది నా నిజమైన నీటిరాత కత. చొక్కారావుగారితో చర్చిస్తున్న దరిమిలా `శ్రీరాంసాగర్ ప్రాజెక్టు’ ఎలా వివక్షకు గురయిందో కొంతమేరకు తెలిసొచ్చింది.

మరో నాలుగేళ్లలో రిటైరవతాననగా నదుల అనుసంధానం కోసం ఏర్పాటయిన `నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజన్సీ’లో చీఫ్ ఇంజనీర్‌గా (సౌత్) పదవీ బాధ్యతలను హైదరాబాదులో చేపట్టడం జరిగింది. ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ని‌ సందర్శించడం జరిగింది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 10 వేల క్యూసెక్కులయినప్పుడు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ని‌ 30 వేల సామర్థ్యంతో ఎందుకు నిర్మించారో అర్థం కాలేదు. ఆ విషయాన్ని అక్కడి సాగునీటి అధికారులనడిగితే `మాకు తెలీదని’ చెప్పారు. ఆ రోజే అనిపించింది `దాల్‌మే కుఛ్ కాలాహై’ అని. కృష్ణా, పెన్న బేసిన్ల మధ్య ఉన్న రిడ్జ్‌ని ఛేదించి నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మున్ముందు రాష్ట్రానికి ఉరితాడవుతుందని నేనాడే భావించి, ఆ ప్రమాదాన్ని మా సెక్రటరీగారికి చెప్పితే ఆయన `మనకెందుకులే’ అని ఊరుకున్నట్టున్నారు. కేంద్ర జలసంఘంలో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యాక భారతప్రభుత్వం, ప్రణాళికాసంఘం సభ్యుని అధ్యక్షతన ఏర్పాటు చేసిన `నేషనల్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్లాన్’ కమిటీలో రెండేళ్లపాటు పనిచేసే సువర్ణావకాశం నాకు లభించింది. ఇది నిజంగా నాకు బంగారు అవకాశమే. దేశంలోని వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు ఈ కమిటీలో సభ్యులు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన `లీగల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ ఫైనాన్సింగ్‌ ఆస్పెక్ట్స్‌’ వర్కింగ్‌ గ్రూప్‌కు‌ నేను రిసోర్స్‌పర్సన్ని - ప్రధానంగా నీటికి సంబంధించిన పలు దేశాల్లోని చట్టాలను అధ్యయనం చేయడానికి ఎందరో ఎక్స్‌పర్ట్స్‌తో నీటికి సంబంధించిన అనేక అంశాలను చర్చించడానికి నాకు వీలు కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న పనికి, నా నీటి రాతకు బలమైన పునాదులు పడింది అక్కడే. ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాక నా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటన్న ఆలోచనలో పడ్డాను. ఢిల్లీలో కన్సల్టెంట్‌గా‌ ఉంటూ నా హాబీలను కొనసాగించడమా లేక హైదరాబాద్‌కు‌ మకాం మార్చడమా అన్న సందిగ్ధంలో ఉండిపోయాను. హైదరాబాద్‌లో‌ని నా పాతనాటకాల మిత్రుడొకడు `టి.వి.కి డైలీ సీరియల్ తీస్తున్నా - నాకు అండగా ఉండు’ అని పిలవడమే తడవుగా ఢిల్లీకి గుడ్‌బై చెప్పి కొంతకాలం పాటు టి.వి. మాయాజాలంలో పడ్డాను. ఢిల్లీలో క్రమశిక్షణతో గడిపిన జీవితానికి హైదరాబాద్‌లో‌ని స్వేచ్ఛా వాతావరణానికి సరిపడదు అని తెలుసుకోవడానికి ఆరు నెలలు పట్టింది. ఈ సందర్భంలో దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరావు గారు నా అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలోని నీటి సమస్యలపై మాట్లాడమని కోరారు. అందుకోసం ఒక అరగంట స్క్రిప్ట్‌ తయారు చేయడం జరిగింది. ప్రప్రథమంగా నటుడిగా కాక ఓ `జలవనరుల నిపుణుని’గా తెలుగు ప్రేక్షకులకు నన్ను పరిచయం చేసింది దూరదర్శన్ కేంద్రం. వారికి నా కృతజ్ఞతలు. నా ఇంటర్వ్యూ చూసిన మిత్రులు టి.వి. దర్శకులు శ్రీధర్ నాకు వి. ప్రకాశ్‌ను‌ పరిచయం చేసారు. వృత్తిరీత్యా ప్రకాశ్ న్యాయవాదైనా `సాగునీటి రంగం’ గురించి అధ్యయనం చేసి `వార్త’ పత్రికలో వ్యాసాలు రాసిన వ్యక్తి. `వార్త’ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి గారిని కలవమని సలహా ఇచ్చింది ప్రకాశే . `దూరదర్శన్’ ప్రసారం కోసం తయారు చేసిన స్క్రిప్ట్‌ పట్టుకుని కె.రా ని కలిసాను. వారు నన్ను ఎంతో గౌరవించి,`వార్త’లో జలరంగ నిపుణునిగా నీటికి సంబందించిన వ్యాఖ్యలు రాయమని కోరారు. .`జలవిజ్ఞానం’ శీర్షికన నన్ను తెలుగు పాఠకులకు పరిచయం చేసి వారం వారం నా వ్యాసాలను ప్రచురించి నీటి సమస్యలపై విశేషమైన అవగాహన కలిగించిన క్రెడిట్ `వార్త’ దే. నా వ్యాసాల్లో ఎక్కువగా జాతీయ, అంతర్జాతీయ సమస్యలనే ప్రస్తావించేవాడిని. వీటితోపాటు రాష్ట్రంలోని నీటి సమస్యల గురించి రాయమని సలహా ఇచ్చింది.కె.రా గారే. నేను రాష్ట్రంలో పని చేయకపోవడం వల్ల ఇది కొంత కష్టమే అయింది. మిత్రుల సహకారంతో ఈ ఇబ్బందిని అధిగమించగలిగాను. నా రచనలకు అనూహ్యంగా విశేషమైన స్పందన లభించింది. నేను పుట్టి పెరిగిన `తెలంగాణ గడ్డ’ కు నీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావలసిన ఆవశ్యకతను ఆ సందర్భంగా గుర్తించాను. వివక్షకు గురయిన తెలంగాణ ప్రాజెక్టుల గురించి నేను రాసాక తెలంగాణ నలుమూలల నుంచి మేధావులు, సామాన్య ప్రజలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవాసంస్థల నిర్వాహకులు ఎందరో నన్ను అభినందించి ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు.

కేవలం పునాదిరాళ్ళకే పరిమితమయిన తెలంగాణ ప్రాజెక్టులు, ముఖ్యంగా దారుణ వివక్షకు గురవుతున్న రాజోలిబండ, సమృద్ధిగా నీరున్నా అభివృద్ధికి నోచుకోని గోదావరి ప్రాజెక్టులు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోరుబావులు త్రవ్వినా చుక్కనీరు రాక విలవిలలాడుతున్న పేద తెలంగాణ రైతుల దీనగాదలు-బాధలు, కన్నీళ్ళు నన్ను పూర్తిగా `తెలంగాణ’ ప్రాంతసమస్యలకే కట్టుబడేట్టు చేసాయి. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ది గురించి ప్రభుత్వం పనిగట్టుకొని చేస్తున్న అసత్య, అనైతిక ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత కూడా నాపైన పడింది. నేను రాసిన ప్రతి వ్యాసాన్ని ప్రచురించి పాఠకలోకానికి నన్ను చేరువ చేసిన `వార్త’ `ఆంధ్రజ్యోతి’ పత్రికాధిపతులకు నా హార్ధిక కృతజ్ఞతలు. ఇందుకు ప్రత్యేకంగా నేను కె. రామచంద్రమూర్తి, టంకశాల అశోక్ గార్లకు విశేషంగా రుణపడి ఉన్నాను.

కేవలం రచనలకే పరిమితం కాకుండా,వీలయినప్పుడల్లా టి.వి. ఛానళ్ళలో, సభలలో, సదస్సులలో నీటి సమస్యలపై విస్త్పుతంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం జరిగింది. సాహిత్య నాటకరంగాలు, టి.వి. రేడియోలతో నాకున్న అనుబంధం నా `జలావగాహన యజ్ఞా’నికి విశేషంగా తోడ్పడింది.

నేను వ్యాసాలలో రాసిన విషయాలేవీ కట్టుకథలు కావు. ఊహాజనితాలు కావు. అన్నీ యదార్థాలే. అయితే నిజాలు చేదుగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన నిజాలు చాలామందికి కంటకంగా ఉన్నాయన్న విషయం నాకు తెలియంది కాదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని అక్రమంగా తరలించడం తప్పు అంటే నేను రాయలసీమకు వ్యతిరేకిని అని,`పులిచింతల’, `పోలవరం’ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని చెప్పితే నేను కోస్తాకు వ్యతిరేకమని కొందరు అదే పనిగా ప్రచారం చేస్తున్నారని కూడా నాకు తెలుసు. ఈ ప్రాంతీయ దురభిమానం ఎంతదాక వెళ్ళిందంటే బచావత్ ట్రిబ్యునల్ రిపోర్టులో శ్రీశైలం కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమేనని, అక్కడి నుండి సాగునీటి కోసం నీటిని తరలించకూడదని స్పష్టంగా రాసుందని చెప్పితే ట్రిబ్యునల్ రిపోర్ట్‌ కాపీలను తగలబెట్టడం, డెల్టాకు మిగిలిన ప్రాజెక్టుల కంటే అధక ప్రాధాన్యతలేదు- ఈవిషయం రిపోర్టులో ఉంది అని తెలియజేస్తే డెల్టావాసులకు రుచించక ప్రభుత్వం మెడలు వంచి వారికి అనుకూలంగా ప్రకటనలు చేయించడందాకా జరిగింది.

ఒక్కటి మాత్రం నిజం-రాజకీయనాయకులకే కాదు. ప్రభుత్వంలోని సంబంధిత అధికారులకు, ఇంజనీర్లకు, ఇంకా చాలా మందికి అనేక విషయాలపై సమగ్రమైన అవగాహన లేదు. రాజకీయప్రయోజనాలు, వత్తిళ్ల మూలంగా వారు తాము చేసే పనులను సమర్థించుకోవచ్చుగానీ శాస్త్రీయంగా, చట్టపరంగా చివరకు నైతికంగా నైనా నేను వ్యాసాలలో రాసిన విషయాలకు, బయట పెట్టిన నిజాలను కాదనే స్థితిలో లేరు.

ఆగస్టు 2000 నుంచి ప్రారంభించి నవంబర్ 2005 వరకు `వార్త’ `ఆంధ్రజ్యోతి’ ఇంకా ఇతర పత్రికలలో నేను రాసిన వ్యాసాలలో ముఖ్యమైనవాటిని ఎంపిక చేసి పుస్తకరూపంలో తీసుకురావాలని దృఢసంకల్పంతో ముందుకు వచ్చిన సంస్థ `తెలంగాణ విద్యావంతులవేదిక’. వారి ప్రయత్నానికి చేదోడు వాదోడుగా నిలిచిన మరో సంస్థ `తెలంగాణ డెవలెప్‌మెం‌ట్ ఫోరం (USA)’. ఈ రెండు సంస్థలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. వివిధ సమయాల్లో రాసిన వ్యాసాలు కాబట్టి పొందు పరిచిన సమాచారంలో కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. వీలైనంతమేరకు అప్డేట్ చేశాను. పుస్తకం కోసం రాసిన వ్యాసాలు కావు కాబట్టి కొన్ని విషయాలు అనేకచోట్ల రిపీట్ కావచ్చు. పునరుక్తి దోషానికి మన్నిస్తారని ఆశిస్తాను.

ఇకపోతే చివరగా మిత్రుడు శ్రీధర్ దేశ్‌పాండే కృషి ఫలితమే ఈ పుస్తకం. శ్రీధర్‌కు‌ ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకర్ధం కావడం లేదు. అడగ్గానే నా పైన ప్రత్యేక అభిమానంతో ముందుమాట రాసిచ్చిన కె. రామచంద్రమూర్తి గారికి నా ధన్యవాదాలు. పుస్తకం ఇంత అందంగా రూపొందడంలో తోడ్పడిన విప్ల కంప్యూటర్ సర్వీసెస్, హైదరాబాద్ వారికి ధన్యవాదాలు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
పుస్తకం మీ చేతుల్లో ఉంది. ఇక మీ ఇష్టం.

మీ
ఆర్. విద్యాసాగరరావు

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com