నీటి లభ్యత
జనవరి 24th, 2006 by డిస్కవర్ తెలంగాణ
ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయన్నమాట వాస్తవం కాదు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భూమిపై ఉన్న నీరు 140 కోట్ల ఘనపు కిలోమీటర్లు. అంటే ఆ నీటిని మన భూమిపైన విస్తరింపజేస్తే అది మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. అయితే ఈ నీటిలో 97శాతం పైగా ఉప్పునీరు. సముద్రాలలో దాగుంది. మిగిలిన స్వచ్ఛమైన నీటిలో సుమారు 77.6 శాతం ధృవాలలో మంచురూపంలో, 21.8 శాతం భూగర్భంలో చాలా లోతున నిక్షిప్తమై ఉంది. అంటే మనకు లభ్యమయ్యే నదులలో, తటాకాలలోని స్వచ్ఛమైన నీరుకేవలం 0.6 శాతమే. ఈ నీరు మొత్తం నీటి పరిమాణంలో కేవలం 1/5000 వంతు మాత్రమే.
ఇకపోతే ప్రతి సంవత్సరం సముద్రం నుండి 3 లక్షల 40 వేల ఘనపు కిలోమీటర్ల నీరు, భూమి ఉపరితలం నుంచి 60 వేల ఘనపు కిలోమీటర్ల నీరు ఆవిరై ఎగిరిపోతుంది. తిరిగి వర్షరూపంలో సముద్రంలోకి 3లక్షల ఘనపు కిలోమీటర్ల నీరు, భూమిపైకి లక్ష ఘనపు కిలోమీటర్ల నీరు కురుస్తుంది. ఫలితంగా ప్రతి ఏడు భూమిపై నుంచి 40 వేల ఘనపు కిలోమీటర్ల నీరు సముద్రం వైపు పయనిస్తుంది. ఈ నీరే ప్రతి సంవత్సరం మనకు దొరికే స్వచ్ఛమైన నీరు. ప్రతి సంవత్సరం ఇదే పరిమాణంలో ఈ నీరు మనకు లభ్యమవుతుంది. అంటే నీటి వనరులు తగ్గడం లేదన్నమాట. అయితే నానాటికీ జనాభా పెరగటం కారణంగా మనకు లభించే తలసరి నీరు (per capita availability) ఏటేటా తగ్గుతోంది. ఉదాహరణకు స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశ జనాబా 34 కోట్లు. ప్రస్తుతం మన జనాభా 100కోట్లకి పైగా. మన దేశంలో ఆ రోజున ప్రతి మనిషికి సుమారు 6 వేల ఘనపు మీటర్ల నీరు దొరికేది. 2025 నాటికి ఆ సంఖ్య 1350 ఘనపు మీటర్లకు దగ్గరవుతుందని అంచనా.
అంతర్జాతీయ నిపుణుల ప్రకారం ఏ ప్రాంతంలోనయినా సగటున ప్రతి వ్యక్తికి 1700 ఘనపు మీటర్లు లేక అంతకన్నా ఎక్కువ నీరు లభిస్తే అక్కడ నీటి కొరత లేనట్టు. 1000 ఘనపు మీటర్లు లేదా అంతకన్నా తక్కువ నీరు లభిస్తే ఆ ప్రాంతంలో నీటి ఒత్తిడి పరిస్థితులు (water stressed conditions) ఏర్పడి ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తాయి. ఆ సంఖ్య 500 ఘనపు మీటర్ల స్థాయికి దిగజారితే ప్రజలు జీవన్మరణ సమస్య నెదుర్కొంటారు.
ప్రపంచవ్యాప్తంగా, 1955లో water stressed conditions ఏర్పడ్డ దేశాలు 7 అయితే, 1990 నాటికి అలాంటి దేశాలు 20 అయ్యాయి. 2050 నాటికి ప్రపంచజనాభాలో 2/3 అంటే మూడింట రెండొంతుల జనాభా water stressed conditions ని ఎదుర్కొంటుందని అంచనా.
ఇలాంటి దారుణ పరిస్థితులు ఏర్పడితే నీటి కొరత కలిగిన దేశాలు, నీరు సమృద్ధిగా ఉన్న దేశాలపైన విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదు. కనుకనే, నీటి సంక్షోభం, అంతర్యుద్ధాలకు, భావి సంగ్రామాలకు దారితీస్తుందని అంటారు.
మన దేశంలో
మన దేశం జలవనరుల గురించి చెప్పాల్సి వస్తే మన నేలపై కురిసే వర్షం, హిమపాతం కలిసి సాలీనా సగటున 4000 ఘనపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే 4 లక్షల కోట్ల ఘనపు మీటర్లన్న మాట. అయితే, ఇందులో చాలా భాగం అవిరి రూపంలో వాతావరణంలోకి వాపసు పోతుంది. మనకు నదుల్లోనూ, మరి లోతుగా లేని భూగర్భంలోనూ లభ్యమయ్యే నీరు 1953 ఘనపు కిలోమీటర్లు. భౌగోళిక పరిస్థితుల మూలంగా, అంటే నిలువ చేయడానికి ఆయా నదుల్లో అనువైన డ్యాం సైట్‌లు లేకపోవడం వల్లనైతేనేం, ఇతర కారణాల వల్లనైతేనేం మనం 690 ఘ.కి.మీల ఉపరితల జలాన్ని (surface water) 396 ఘ.కి.మీ.ల భూగర్భ జలాన్ని వాడుకోగలం. అంటే మన వినియోగానికి కేవలం 1086 ఘ.కి.మీటర్ల నీరు మాత్రమే లభ్యమవుతుందన్న మాట. మరోమాటలో చెప్పాలంటే మన నేలపై కురిసే మొత్తం నీటిలో నాలుగోవంతును మాత్రమే మనం ఉపయోగించుకోగలం.
మన దేశంలోని వివిధ నదీ బేసిన్లలో లభించే నీరు, వినియోగించగల నీటి వివరాలు మనం తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలగకమానదు. మనదేశంలో 33.5శాతం భూభాగం ఆక్రమించిన గంగా, బ్రహ్మపుత్ర, మేఘన బేసిన్లో 62 శాతం నీరు లభిస్తుంది. కాని దొరికే ఈ నీటిలో కేవలం 27.5 శాతాన్ని మాత్రమే వాడుకోగలం. అంటే దాదాపు ముప్పాతిక వంతు గంగా, బ్రహ్మపుత్ర, మేఘన నీరు మనకుపయోగపడకుండా వృధా అవుతుందన్న మాట. అలాగే తపతీ నదికి దక్షిణాన పశ్చిమ దిశగా ప్రవహించే నదులు మొత్తం కలిపి మన భూభాగంలో కేవలం 3.5 శాతాన్ని మాత్రమే ఆక్రమిస్తున్నాయి. కాని ఇవి మనం మొత్తం నీటిలోని 10 శాతాన్ని కలిగి ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ నదులలోని నీటిలో కేవలం 18 శాతాన్ని మాత్రమే వినియోగించుకోగలం. ఇక మిగిలిన నదీ బేసిన్లన్నీ కలిసి మన భూభాగంలోని 63 శాతం జాగాని ఆక్రమిస్తూ, మొత్తం నీటిలోని 28 శాతాన్ని కలిగి ఉన్నాయి. ఈ బేసిన్లలోని నీటిని 70 శాతం దాకా మనం వినియోగించుకోగలం. సులువుగా చెప్పాలంటే అటు ఉత్తర భారతాన, ఇంకా ఈశాన్య దిశన ప్రవహించే నదులు, ఇటు పశ్చిమ దిశన పయనించే అరేబియా సముద్రంలో కలిసే నదుల నీటిని అనేక కారణాల వల్ల మనం సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నాం. మిగతా బేసిన్లు అంటే నర్మద, తపతీ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి ఇంకా ఇతర చిన్న నదీ నదాలలోని జలాన్ని మనం సమర్థంగా వినియోగించుకోగలమన్నమాట.
ఇక మన అవసరాల మాటకొస్తే 2050 నాటికి వ్యవసాయరంగానికి 628 నుంచి 807 ఘ.కి.మీటర్లు (68 శాతం), గృహరంగానికి (Domestic use) 90 నుండి 111 ఘ.కి.మీటర్లు (9శాతం), పరిశ్రమలకు 81 ఘ.కి.మీటర్లు (7 శాతం), విద్యుత్ రంగానికి 63 నుండి 70 ఘ.కి.మీటర్లు (6 శాతం), నదీ-రవాణా (Inland Navigation) కోసం 15 ఘ.కి.మీటర్లు (1 శాతం), పర్యావరణ పరిరక్షణ కొరకై 20 ఘ.కి.మీటర్లు (2 శాతం), అవిరైపోయే నీరు 76 ఘనపు కిలోమీటర్లు (6 శాతం) వెరసి 973 నుండి 1180 ఘనపు కిలోమీటర్ల నీరు (100 శాతం) అవసరముంటుందని అంచనా.
2050 నాటికి మనకు లభించే 1086 ఘనపు కిలోమీటర్ల నీరు మన అవసరాలకు (973 నుంచి 1180 ఘనపు కిలోమీటర్లు) బొటాబొటిన సరిపోతుంది (ఈ లభించే నీటికి అదనంగా వినియోగానంతరం వాపసు వెళ్లే (return flows) సుమారు 25 ఘ.కి.మీటర్లు ఉండవచ్చని అంచనా. అయితే ఈ return flows ఏ మేరకు పనికి రాగలవన్నది వివాదాంశం. లభించే నీరు అవసరాలకు సరిపోతుంది నిజమే. ప్రస్తుతం 100 కోట్లు ఉన్న మన జనాభా 2050 నాటికి 134 నుంచి 158 కోట్ల దాకా పెరిగి అక్కడ స్థిరపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే మనం కంగారు పడాల్సిందేమీ లేదు అని నిశ్చింతగా ఉండవచ్చా? - ఇందులో ఓ తిరకాసు ఉంది. మనం చేసిన లెక్కలు దేశం మొత్తం కలిపి దొరికే నీరు. అలాగే దేశ ప్రజలందరి అవసరాలు దృష్టిలో పెట్టుకొని. అంటే దీనర్థం పెన్నానదీ బేసిన్లో దొరికే నీరు అక్కడి ప్రజల అవసరాలకు, గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో దొరికే నీరు అక్కడి ప్రజల అవసరాలకు సరిపోయిందని కాదు. మనకు తెలిసిన ఉపమానంలో చెప్పాలంటే నది సగటు లోతు చూసి మోకాళ్ల లోతే కదా అని దాటటానికి ప్రయత్నించడన్నమాట. పైన చెప్పిన కారణం కాక ఇంకో ముఖ్యమైన ఇబ్బంది కూడా ఉంది. మనం 690 ఘనపు కిలోమీటర్ల ఉపరితలజలాన్ని వాడుకోగలమని లెక్కవేసాం. ఈ నీటిని వాడుకోవాలంటే మనం ఇంతవరకు నిర్మించుకున్న, నిర్మాణంలో ఉన్న జలాశయాలు (మొత్తం 253 ఘ.కి.మీటర్ల సామర్థ్యం) కాకుండా ఇంకా 132 ఘ.కి.మీటర్ల సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో (ఆర్థిక, సాంఘిక, పర్యావరణ సమస్యల మూలంగా) ఈ ఉపరితల నీటి మొత్తం అంటే 690 ఘ.కి.మీటర్లను ఉపయోగంలోకి తీసుకురావడం గగనకుసుమమే అనిపిస్తుంది.
మన దేశంలోని విభిన్న ప్రాంతాల నీటి లభ్యతలో సమతౌల్యం లేకపోవడం కారణంగా చాలినంత నీరున్నా తాగటానికి వీలులేక పంట పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులకు గురికావలసి వస్తోంది.
మనదేశపు నదులలో 80నుండి 90 శాతం నీరు కేవలం వర్షాకాలంలో అంటే నాలుగు నెలల్లోనే ప్రవహిస్తుంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు అధికవర్షానికి లోనయితే, మరికొన్ని నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడటం గమనించే ఉంటారు. ఉదాహరణకు అస్సాంలోని చిరపుంజిలో సగటున ప్రతిఏడు 1100 సెంటిమీటర్ల వర్షం కురిస్తే, పశ్చిమ రాజస్థాన్‌లో కేవలం 10 సెంటీమీటర్ల వర్షం మాత్రమే పడుతుంది. దేశం మొత్తంలో సగటు వర్షం సాలీనా 117 సెంటీమీటర్లు. ఇందులో 50 శాతం కేవలం 15 రోజుల్లో అదీ నూరుగంటల్లోనే కురుస్తుంది. ఎడారి క్షేత్రంలో వర్షం ఏడాదికి ఐదు రోజులయితే, ఈశాన్య ప్రాంతాల్లో 150 రోజులపాటు కురుస్తుంది. ఉత్తర భారతంలో ప్రవహించే గంగానదిలో ప్రతిఏడూ 525 ఘనపు కిలోమీటర్లు నీరు లభ్యమయితే, అదే గోదావరిలో 110 ఘ.కి.లు కృష్ణాలో 70 ఘ.కి.మీటర్లు, పెన్నాలో కేవలం 6 ఘ.కి.మీటర్లు నీరు లభ్యమవుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లోని నదులలో లభించే నీటి ప్రమాణంలో ఇంత వైవిధ్యముండబట్టే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని జనం కటకటలాడుతున్నారు. అయితే నీరు సమృద్ధిగా లభించే ఈశాన్య భారతంలో కూడా ప్రజలు నీరు తగిన ప్రమాణంలో అందక బాధపడటానికి వేరే కారణాలున్నాయి. అది అక్కడి భౌగోళిక స్వరూపం, అక్కడ పర్యావరణానికి జరుగుతున్న హాని, నీరు నిలువచేయడానికి అనువైన స్థలాల్లో జలాశయాలు నిర్మించకపోవడం వగైరా. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించే నదులు వర్షరుతువులో వానల మూలంగా, ఎండాకాలంలో మంచు కరిగి ఏడాది పొడవునా సజీవంగా ఉంటాయి. దక్షిణాది నదులు ఎండాకాలంలో నిర్జీవంగా ఎండిపోయి ఉంటాయి. కనుకనే ఉత్తర భారతంకన్నా, దక్షిణ భారతంలో ప్రజలకే నీటి ఎద్దడి ప్రధానసమస్య.
ఇక భూగర్భ జలాల మాటకొస్తే మనకు లభించే (అంటే ప్రతి ఏడూ వాన మూలంగా లభించి తేలిగ్గా తీయగల- replenishable) 432 ఘ.కి. మీటర్ల నీరు (ఇందులో 396 ఘ.కి.మీటర్లనే మనం ఉపయోగించుకోగలం అని లెక్క కట్టాం) కాకుండా భూగర్భంలో బాగా లోతున లభించే Static Ground Water resource (నిశ్చల భూగర్భ జలం) 10812 ఘనపు కిలోమీటర్లు ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, దుర్భర కరువు పరిస్థితుల్లో తాగునీటి అవసరానికి మాత్రమే దీన్ని వాడుకోవచ్చని, మామూలు పరిస్థితుల్లో ఈ నీటిని వాడుకోకూడదని నిపుణుల సలహా.
టూకీగా చెప్పాలంటే దేశం మొత్తం మీద నీటి లభ్యత, అవసరాలకు సరిపడా ఉన్నా, వివిధ ప్రాంతాల నదుల నీటి లభ్యతలో సమతౌల్యం లేకపోవడం, జలాశయాల నిర్మాణానికి ప్రతిబంధకాలు ఏర్పడటం, ఆర్థిక దుస్థితి వల్ల ఇంకా ఇతర కారణాల వల్ల మన అవసరాలకు సరిపడా నీరు లభించడం దుర్లభం అవుతుంది. కనుక నీటిని పొదుపుగా వాడటం, అనువైన స్థలాలలో భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులు నిర్మించుకోవడం, వాటర్‌షెడ్ల అభివృద్ధి మొదలైన పనులను సత్వరం చేపట్టడం అవసరం.





