వరదలు-నియంత్రణ
జనవరి 24th, 2006 by డిస్కవర్ తెలంగాణ
ఇంత సువిశాల దేశంలో, వైవిధ్యం కలిగిన వాతావరణం, పోకడలలో దేశంలో ఏదో ఓ మూల వరద, మరోచోట దుర్భిక్షం ఏక సమయంలో సంభవించడం అసహజమేమీ కాదు. ఒకేసారి ఒకే రాష్ట్రంలో కొన్నిచోట్ల వరదలు సంభవిస్తుంటే కొన్ని ప్రాంతాలు క్షామానికి గురై తల్లడిల్లడం కూడా గమనిస్తున్నాం. ఆదినుండీ, మానవుడు వరదతో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే పూర్వపు రోజుల్లో మనుషులు తక్కువ ఉండేవారు. పారిశ్రామిక కార్యకలాపాలు అంతగా లేకపోవడం, వరద ప్రాంతాలలో (ఫ్లడ్ ప్లెయిన్స్)లో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోకపోవడంవల్ల వరద ప్రభావం అంతగా కనిపించేది కాదు. కొద్ది కాలంలో గణనీయంగా జనాభా పెరుగుదల, తమ ఉనికికోసం నదీ పరివాహక ప్రాంతంలో అడవులను సమూలంగా తుడిచిపెట్టడం, నదీ గర్భంలో ఇళ్లు కట్టడం మొదలగు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం వగైరాలతో వరద సమస్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. వీటికితోడు తమ ఉపాధికోసం గిరిజనులు అడవులలో అవలంబించే ఝూమింగు (పోడు) వ్యవసాయ పద్ధతి (చెట్లను నరికి అడవిలో కొంత భాగాన్ని తగలబెట్టి వ్యవసాయం చేసి మరో చోటికి వలస వెళ్లి అదే పని కొనసాగించే విధానం) కూడా ఈ వరద ప్రక్రియకు దోహదం చేసిందనే చెప్పాలి. గత పాతికేళ్లలో సుమారు 4500 కోట్ల రూపాయలను ఖర్చుచేసి 1 1/2 కోట్ల హెక్టార్ల భూమికి వరద నుండి ఓ మాదిరి రక్షణ కల్పించినప్పటికీ, ఏటేటా వరద పరిస్థితి ఉధృతంగా మారి మనల్ని కలవరపరుస్తోంది. ఓ పరిమిత స్థాయిలో వరద రక్షణ పథకాలు మన దేశంలో ఎప్పట్నుంచో అమలులో ఉన్నాయి. గత శతాబ్దంలో వరద కట్టలు చేపట్టడం ద్వారా చీటికి మాటికి వరదలు తెచ్చే నదులను కొంత మేరకు నియంత్రించడం జరిగింది. అయితే ఈ చర్య వరద సమస్యను స్పృశించడమే తప్ప సంతృప్తికరమైన పరిష్కారాలకు దారితీయలేదు. మన దేశంలో ప్రప్రథమంగా 1954లో జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానిపేరు జాతీయ వరద నీటి నిర్వహణ కార్యక్రమం (The National Flood Management Programme). అప్పటివరకు మన దేశంలో కేవలం 30 లక్షల భూభాగానికి మాత్రమే వరద రక్షణ లభించింది. 1954లో వెలువడిన ‘విధాన ప్రకటన’లో వరదలను సక్రమంగా నియంత్రించడం ద్వారా దేశం మొత్తానికి వరద బీభత్సాల నుండి విముక్తి కల్పించాలన్న ఆశయం ప్రకటితమైంది. అయితే అది పగటి కలే అని, సంపూర్ణంగా వరద విపత్తునుండి యావత్ దేశాన్ని రక్షించడం సాధ్యం కాదని త్వరలోనే తేలిపోయింది. వరదలు రావడానికి ప్రకృతిపరమైన కారణాలే కాక మనిషి చేపట్టే అనేక కార్యక్రమాలు కూడా కారకాలే. వీటి ప్రభావాన్ని పసికట్టడం, అంచనా వేయడం చాలా కష్టం. కనుక పిండికొద్ది రొట్టె అన్నట్టు మన దగ్గరవున్న ఆర్థిక వనరులను దృష్టిలో వుంచుకొని సాంకేతికంగా సాధ్యమైనంత మేరకు వరదల నుండి సముచిత రక్షణ కల్పించాలని నిర్ణయింపబడింది. ఈ లక్ష్యం సాధించే దిశలో 1954 నుండి 1980 దాకా అనేక జాతీయ, రాష్ట్రస్థాయి సంఘాలను స్థాపించడం జరిగింది. 1976లో భారత ప్రభుత్వం శ్రీ జయసుఖ్‌లాల్ హాథీ అధ్యక్షతన జాతీయ వరద సంఘం ఏర్పాటు చేసింది. ఆ సంఘం తన నివేదికలో 204 సిఫారసులు చేసింది.
ఆ సిఫారసుల్లో ముఖ్యమైనవి ఇవి:
- వరద పల్లపు ప్రాంతాల వర్గీకరణ (Flood Plain Zoning), దాని నిర్వహణ వెంటనే చేపట్టాలి. ఇందుకోసం అవసరమైన చట్టాలు ప్రవేశపెట్టాలి.
- అవసరమైన చట్టాలు అమలు చేయడం ద్వారా నదీగర్భంలో అనధికార వ్యవసాయం, అలాగే వరద కాలువ ప్రాంతాలను ఆక్రమించడం అరికట్టాలి.
- వర్తమాన, భవిష్యత్ వరద నియంత్రణ పనులు అమలు జరుగుతున్న వైనం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే నిమిత్తం అవసరమైన డేటాబేస్‌ని సమకూర్చుకోవాలి.
- ప్రతి బేసిన్‌లోని భూ, నీటి వనరులను సమర్థంగా వినియోగించు కోగలందుకై మాస్టర్ ప్లాన్‌లో వరద నియంత్రణ కూడా విధిగా భాగమై ఉండాలి.
- విపత్తు నివారణార్థం ఒక జాతీయ సమితిని ఏర్పాటు చేయాలి. రాజ్యాంగపరంగా వరద నియంత్రణ అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. కనుక ఈ సిఫారసులను అమలు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలదే. ‘రాష్ట్రీయ భాడ్ ఆయోగు’ సిఫారసుల సమీక్ష, వాటి పనులు చేసిన తీరు అధ్యయనం సూచించడంకోసం భారత ప్రభుత్వం (జల వనరుల మంత్రిత్వ శాఖ) 1996లో ప్రాంతీయ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. వారు చేసిన సిఫారసుల సారాంశం ఇది.
- రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి బేసిన్‌లో ఈ క్రింది కేటగిరీలలో వరద నష్టాలను వాస్తవ అంచనా వేయాలి.
1) వరద రక్షణ కల్పించని క్షేత్రాలు.
2) రక్షణ పనుల వైఫల్యం సంభవించిన రక్షణ కల్పించిన క్షేత్రాలు.
3) నదులు మరియు వరద కట్టల మధ్య గల క్షేత్రాలు. - వరదలను ముందస్తుగా సూచించే పద్ధతి (flood forecasting system) ని ఆధునీకరణం చేసి, తమ కార్యకలాపాలను కేంద్ర జలసంఘం విస్తృతపరచాలి.
- వరద పల్లపు ప్రాంతాలను ఆక్రమించుకోవడాన్ని సమర్థంగా నిలుపుచేయాలి.
- తరచూ వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలలో ఎత్తయిన వేదికలను (Raised Platforms) నిర్మించాలి.
- వరదనీరు ప్రవహించడానికి తగిన వైశాల్యం కలిగిన తూములు, రోడ్లు, రైల్వే వంతెనలు ఉన్నాయా లేవా అన్న విషయంలో తగు పరీక్షలు జరపాలి.
- ఈశాన్య రాష్ట్రాలలో వరద నియంత్రణ కోసం భారీ ప్రాజెక్టులు నిర్మించాలి.
- వరద ప్రమాదాన్ని సూచించే చిత్రపటాలను రాష్ట్ర ప్రభుత్వాలు తయారుచేసి అనుగుణమైన చర్యలు చేపట్టాలి.
- వరద పల్లపు ప్రాంతాల వర్గీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టి తక్షణం అమలు చేయాలి.
- వరద నియంత్రణ చర్యలను చేపట్టేముందు వాటి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలి.
పైన చెప్పిన టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలు ‘మనసా వాచా కర్మణా’ అమలు చేసివుంటే చాలా రాష్ట్రాలలో ఇప్పుడు వాటిల్లిన దుర్గతి పట్టేది కాదు.
మన దేశ విస్తీర్ణంలోని ఎనిమిదోవంతు అంటే సుమారు 4 కోట్ల హెక్టార్ల భూమి వరద తాకిడికి గురవుతుందని అంచనా వేయడం జరిగింది. 1997 సంవత్సరం నాటికి మొత్తం సుమారు 1 కోటి 70 లక్షల హెక్టార్ల భూమికి వరద రక్షణ కల్పించడం జరిగింది. 1953 నుంచి 1996 వరకు అంటే 44 సంవత్సరాల్లో వరదల మూలంగా వాటిల్లిన నష్టం 43,776 కోట్లు. 66 వేల 667 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 లక్షల 87 వేల 481 పశు నష్టం జరిగింది. అంటే సగటున ప్రతి సంవత్సరం 1515 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక, సుమారు లక్ష పశు నష్టమే కాక వేయి కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లుతోందన్నమాట. 1997 నాటి వరదలలో అత్యధిక ప్రాణనష్టం (11316) జరిగింది. 1988 సంవత్సంలో అత్యధిక నష్టం వరదల మూలంగా (4630 కోట్లు) సంభ వించింది. మొదటి ప్రణాళికా ప్రారంభించిన ఏటి (1954) నుంచి ఎనిమిదో ప్రణాళికా కాలం (1997) ముగిసేవరకు మనం సుమారు 5 వేల కోట్ల రూపాయలను వరద నియంత్రణ పనులకోసం వెచ్చించినప్పటికీ, ఇంకా ప్రతి సంవత్సరం సగటున వేయి కోట్ల రూపాయల నష్టం, 1500 మంది జననష్టం జరుగుతూ ఉన్నదీ అంటే మన కార్యక్రమాల అమలు తీరు లోపభూయిష్టంగా ఉన్నదని తేలుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వరద నియంత్రణ చర్యలను రెండు కేటగిరీలలో విభజించ వచ్చు.
ఒకటి: నిర్మాణపరమైన చర్యలు (Structural measures) .
రెండు: నిర్మాణేతర చర్యలు (Non Structural measures).
నిర్మాణపరమైన చర్యలలో వరద నీటిని నిలువరించడానికి రిజర్వాయర్లు నిర్మించి వాటిలో కొంత భాగాన్ని కాని పూర్తిస్థాయి సామర్థ్యాన్ని కాని వరదల కోసం కేటాయించడం, వరద నీటికి ఆశ్రయమివ్వడానికి చెరువులు, సరస్సులు, సహజమైన లోయలను డిటెన్షన్ బేసిన్‌లుగా ఉపయోగించడం, వరదల నుండి రక్షణ నిమిత్తమై వరద కట్టలను నిర్మించడం, సముద్రం నుండి రక్షణ కోసం అడ్డుగోడల నిర్మాణం చేపట్టడం, వరద నీరు ప్రవహించే నదీ లేక కాలువ గర్భాలను అభివృద్ధి చేయడం వగైరా పద్ధతులు చోటు చేసుకున్నాయి.
వరదలను నియంత్రించడానికి రిజర్వాయర్లు ఏ మేరకు పని చేస్తాయో ముందు తెలుసుకుందాం.
అమెరికాలోని గ్రేట్ మిసిసిపీ నదిలో 1927 సంవత్సరం సంభవించిన వరదల్లో 1,62,017 మంది నిరాశ్రయులైనారు. అమెరికా చరిత్రలో సంభవించిన అతి ఘోరమైన వరద విపత్తు ఇది. ఇలాంటి సంకటం మళ్ళీ రాకూడదని ప్రజలు, పత్రికలు పెద్ద ఎత్తున ఆందోళనలు లేవదీసాయి. ఫలితంగా టెన్నిసీ లోయలో 9 డ్యాంలు, టెన్నిసీ నదికి ఉపనదులపై మరో పదకొండు డ్యాంలు నిర్మించబడ్డాయి. ఇవి తాగునీరు, సాగునీరుని అందివ్వడమే కాకుండా వరదలను నియంత్రించడానికి బాగా తోడ్పడ్డా యన్నది జగమెరిగిన సత్యం.
‘టెన్నిసీవేలీ’ నమూనాగా తీసుకుని మన దేశంలో దామోదర్ నదిలో ప్రతి ఏడూ వస్తున్న వరదలను నియంత్రించడానికి కొన్ని ఆనకట్టలను నిర్మించడం జరిగింది. (River of Sorrow of Bengal గా దామోదర్‌ని పాఠ్య పుస్తకాలలో పేర్కొంటూ ఉంటారు). అయితే ముందుగా దామోదర్ వేలీ కార్పొరేషన్ తలపెట్టిన ఎనిమది డ్యాంల స్థానంలో అనేక కారణాల వల్ల కేవలం నాలుగు ఆనకట్టలను మాత్రమే నిర్మించడం జరిగింది. ఈ డ్యాంల నిర్మాణం మూలంగా వరదల ఉధృతి గణనీయంగా తగ్గింది. ఈ నాలుగు ఆనకట్టలు నిర్మింపబడకుండా ఉంటే 1978లో సంభవించిన వరదలలో దుర్గాపూర్ వద్ద నదీ ప్రవాహం 33,144 క్యూసెక్కులు ఉండి ఉండేదని, ఈ కట్టడాల మూలంగా ఆ ప్రవాహ ఉధృతి 10,732 క్యూసెక్కులకు పడిపోయిందని అంచనా. వరద నియంత్రణకు రిజర్వాయర్లు ఎలా ఉపయోగపడతాయన్న అంశానికి మరో ఉదాహరణ తాపీ (తపతి) నదిపై నిర్మించిన ఆనకట్ట. 1959లో తపతీ నదిలో వచ్చిన వరదలు కలిగించిన బీభత్సం ఇంతా అంతా కాదు. దిగువ ప్రాంతంలో వున్న సూరత్ పట్టణం ప్రమాదం అంచున నిలబడింది. 1970 ప్రాంతంలో ఉకై డ్యాం నిర్మాణం జరిగాక అందులో కల్పించిన 7092 మిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యంలో 1332.25 మిలియన్ క్యూబిక్ మీటర్లను వరద నీటికి ఆశ్రమివ్వడానికి కేటాయించారు. దీనికితోడు పరీవాహక ప్రాంతంలో వరదనీటి ఉనికిని పసిగట్టి ముందే రిజార్వయర్‌ని కొంతమేరకు ఖాళీచేసే ప్రక్రియ ద్వారా 17.5 లక్ష క్యూసెక్కుల అత్యధిక వరద ప్రమాణాన్ని 8 1/2 లక్ష క్యూసెక్కులకు తగ్గించేవిధంగా ఏర్పాటు జరిగింది. ఈ పద్ధతి ద్వారా ఉకైకి దిగువ ప్రాంతాలు, ముఖ్యంగా సూరత్ నగరం ‘వరద విపత్తు’ నుండి ఊపిరి పీల్చుకోగలిగాయి. అయితే అన్నిచోట్ల జరుగుతున్నట్టే నది దిగువ భాగాలలో కృత్రిమ సురక్షిత భావాన్ని (Artificial Safety Concept) ఆసరాగా చేసుకుని అక్రమంగా కట్టడాలు పెరిగి నది ప్రవహించడానికి తగినంత చోటు లభించక 1998లో నదిలో 9.25 లక్ష క్యూసెక్కుల నీరుని వదిలినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో విపరీతమైన నష్టం వాటిల్లింది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భాగ్యనగరం ‘గండిపేట’ మొదలైన చెరువులు నిర్మించకపూర్వం ప్రతి ఏడూ వరద పాలిట పడేది. డాక్టర్ విశ్వేశ్వరయ్యగారి చలవ మూలంగా హైదరాబాద్ నగరం వరదల నుండి విముక్తి పొందింది అన్నది నిర్వివాదాంశం. అయితే హీరాకుడ్ (మహానదిపై), ఉకై (తపతీ నదిపైన), మరికొన్ని రిజర్వాయర్లలో తప్ప వరద నీటి ఆశ్రయానికి ప్రత్యేకమైన Flood cushion లేదు. కనుక సమగ్రమైన Rule Curves/Operation manuals ద్వారా వరద ప్రమాద సూచికలను దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్లలో వరద నీటికి తాత్కాలిక ఆశ్రయం కల్పించి తద్వారా దిగువ ప్రాంతాలకు కొంత ఉపశమనం కలిగించవచ్చు.
అనాదిగా మన దేశంలో వరదల నుండి రక్షించడానికి నదికి ఇరుపక్కలా కట్టలను నిర్మిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో వాటి ఉనికిపై సవాళ్ళు ఎదురయ్యాయి. ఈ కట్టల మూలంగా ప్రవాహాన్ని స్వేచ్ఛగా ప్రవహించనీయకుండా దిగ్భందం చేస్తున్నామని, కట్టలలో గండ్లు పడితే వాటివల్ల కలిగే నష్టం, కట్టల మూలంగా కలిగే రక్షణతో పోలిస్తే ఎంతో ఎక్కువ అని వాదనలు వినవస్తున్నాయి. ఈ వాదనలను తోసిపుచ్చకుండా వాటిలోని వాస్తవాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తర భారతంలో అనేకచోట్ల ప్రతి సంవత్సరం వరద కట్టలు గండ్లు పడటం, వాటికి మరమ్మత్తులు చేయడంకోసం కోట్లాది రూపాయలు వెచ్చించడం, మళ్లీ తదుపరి సంవత్సరానికి అదే తంతు ప్రారంభం కావడం పరిపాటయింది. నిర్మాణాల ద్వారా జరిగే నియంత్రణ సరిపోదు. కనుక నిర్మాణేతర చర్యలు కూడా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చర్యలలో ముఖ్యమైనవి: వరద పల్లపు ప్రాంతాల వర్గీకరణ, వరద నుండి రక్షణ లేక ఫ్లడ్ ప్రూఫింగు, విపత్తు ఎదుర్కోవడానికి సమాయత్తపరచడం మొదలైన అంశాలతో కూడిన వరద క్షేత్ర నిర్వహణ, వరదలను ముందే పసిగట్టి ప్రమాద సూచికలు, హెచ్చరికల జారీ, విపత్తు నుండి విముక్తి కలిగించడం, ప్రజారోగ్య ఉపాయాలతో సహా వరదనెదుర్కునే చర్యలు, వరద బీమా మొదలైనవి.
ఈ పైన చెప్పిన చర్యలలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశం Flood Plain Zoning. దీనికి అవసరమైన చట్టబద్ధత కల్పించడం, వరదకు గురయ్యే ప్రాంతాలను సర్వే చేసి, వాటిల్లో ప్రతి ఏడూ లేక తరచుగా వరదకు గురయ్యే ప్రాంతాలు, 25 సంవత్సరాలకో మారు వచ్చే వరద (వరద ఉధృతి మామూలు వరదకంటే ఎక్కువ)కు గురయ్యే ప్రాంతాలు, అలాగే వంద లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాలకోమారు వచ్చే వరద (అత్యధిక ఉధృతి కలిగిన వరద అన్నమాట)లకు గురయ్యే ప్రాంతాలను విడివిడిగా వర్గీకరించి, తరచుగా వరదకు గురయ్యే ప్రాంతాలలో పార్కులను, ఆటస్థలాలు మొదలైన వాటిని మాత్రమే అనుమతించడం, 25 సంవత్సరాలకోమారు వచ్చే వరద క్షేత్రంలో ఇల్లు, గ్రంథాలయాలు, ప్రభుత్వ కచేరీలు మొదలైనవాటిని అనుమతించడం, వంద లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాలకోసారి వచ్చే వరద క్షేత్రాలలో రక్షణ సంబంధిత కట్టడాలు, విమానాశ్రయాలు, విపణి కేంద్రాలు, టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు, నీటి సరఫరా కట్టడాలను మొదలైన వాటిని అనుమతించడం చేయాలి.
Flood Proofing పనుల్లో వరదకు కేటాయించిన తూముల నిర్వహణ, వరద నీరు నిలిచిపోకుండా సత్వర చర్యలు చేపట్టడం, అవసరమైనచోట పంపుల ద్వారా నీటిని తొలగించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిన అవసరం లేకుండా ఉన్న చోటనే ఎత్తయిన వేదికలను ఏర్పాటు చేయడం, వరద స్థాయికి ఎగువ ప్రాంతాలలో ప్రజా సౌకర్య కట్టడాలను పునర్మించడం వగైరా చోటు చేసుకుంటాయి.
విపత్తు ఎదుర్కోవడానికి సమాయత్తపరిచే ప్రక్రియలో తక్కువ వ్యవధిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించేందుకు అవసరమైన చర్యలు భాగాలుగా ఉన్నాయి. వరద ప్రమాద హెచ్చరికలను సకాలంలో విడుదల చేయడం, అత్యయిక (emergency) పరిస్థితుల్లో చేపట్టవలసిన చర్యలకోసం అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సమాయత్తపరచడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వగైరా ఉన్నాయి. ఇందుకోసం ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో సమన్వయం అవసరం. ఈ విషయంగా ఓ నమూనా కార్యాచరణ పథకాన్ని model action plan కేంద్రం (వ్యవసాయ మంత్రిత్వశాఖ) రూపొందించి అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది.
వరద బీమా పథకం అత్యంత ప్రయోజనకారే అయినప్పటికీ అంతగా ఆచరణలో లేదు. వరద నష్టాన్ని, పంట నష్టాన్ని అంచనా వేయడంలో వస్తున్న చిక్కుల మూలంగానే బీమా పథకం ప్రచారం పొందలేదు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో వరద ప్రమాద సూచికలు జారీచేసే సంస్థ (flood forecasting organisation) పని చేస్తోంది. దేశవ్యాప్తంగా అంతర్ రాష్ట్ర నదులపైన ముఖ్యంగా వరద తాకిడికి గురయ్యే నదులపైన 157 కేంద్రాలను నెలకొల్పి వాటిద్వారా వరద ప్రమాద సూచికలను జారీ చేస్తోంది. ఈ సంస్థను ఆధునీకరణం చేసి అంతర్ రాష్ట్ర నదులే కాకుండా, వరదతాకిడికి గురయ్యే అన్ని నదులపై కూడా హెచ్చరికలు జారీచేసే పని ఈ సంస్థ చేపట్టేందుకు వీలుగా కేంద్రం ఉత్తరువులు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎన్ని చట్టాలు చేసినా ప్రభుత్వం ఎన్ని ప్లానులు వేసినా, ఎందరు అధికారులు ఆ ప్లానులను అమలు పరచాలని ఉద్యుక్తులయినా, ప్రజల భాగస్వామ్యం, సహకారం లేనిదే ఇవేవీ విజయవంతం కావు. నదీ పరీవాహక ప్రాంతంలో భూసంరక్షణ, జలసంరక్షణ కార్యక్రమాలు, అడవులను కాపాడటం, స్వార్థపరులు నదులను, చెరువులను కబ్జాలు చేయకుండా కాపాడటం, దిగువ ప్రాంతాలపై అక్రమమైన కట్టడాలు రాకుండా చూడటం, చెరువుకట్టల, నదుల కిరువైపునా ఉన్న వరదకట్టల సంరక్షణ మొదలైన కార్యక్రమాల్లో స్వచ్ఛంద ప్రజాసంఘాలు చురుగ్గా పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మన ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల ఎగువ ప్రాంతాలను ఎప్పుడూ వరదలకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించలేదు. ఈ నదుల దిగువ ప్రాంతాలను, ఈ రెండు నదుల డెల్టాలమద్య ఉన్న కొల్లేరు సరస్సును మాత్రమే వరద తాకిడికి గురయ్యే ప్రాంతం గుర్తించింది. కోస్తా నదులు బుడమేరు, తమ్మిలేరు వంటివి కొల్లేరులోకి తమ ప్రవాహాన్ని వదలటం, కొల్లేరు నుండి సముద్రంలోకి కలిపే ఉప్పుటేరు ఇరుకుగా ఉండటం మూలాన దాన్ని విశాలం చేయడానికి అవసరమైన dredging operations (తవ్వకం పనులు) పైన, ఇంకా డెల్టా క్షేత్రంలో నీరు బయటికి సాపీగా వెళ్ళేందుకు అవసరమైన చర్యలపైనా, ఆ తరువాత తుఫాను తెచ్చే ముప్పు నుండి ప్రజలను రక్షించే మార్గాలు, ఉపాయాలను, వసతులను కల్పించడంలో ప్రభుత్వం తమ దృష్టిని కేంద్రీకరించిందే తప్ప కృష్ణా, గోదావరి ఎగువ ప్రాంతాలు కూడా వరదకు గురవవచ్చని, రాజధాని నగరమైన హైదరాబాదుకు మూసీ నుంచి విపత్తు వాటిల్లే అవకాశముందని మన ప్రభుత్వం ఎన్నడూ భావించినట్లు లేదు. అలా భావించి వుంటే మూసీనదీ గర్భంలో ఇమ్లీబన్ బస్‌స్టేషన్, నందనవనం, హుస్సేన్‌సాగర్ కట్టపైన బ్యూటీఫికేషన్ పేరుతో అడ్డుగోడ, విగ్రహ ప్రతిష్ఠాపన, వరదనీరు తూములను ఆపి వాటిపై అయిదు నక్షత్రాల హోటల్ నిర్మాణం, వరద దిగువ ప్రాంతాలలో అధికార, అనధికార కట్టడాలు వెలిసేవి కావు.
మన రాష్ట్రం మొత్తంలో వరదకు గురయ్యే ప్రాంతం 13 లక్షల 92 వేల హెక్టార్లని, 1995 మార్చినాటికి అందులో 10 లక్షల 13 వేల భూభాగానికి వరద రక్షణ కల్పించామని మన ప్రభుత్వం ప్రకటించుకుంది. ‘రాష్ట్రీయ భాడ్ అయోగు’ సిఫారసులు 1981లోనే మన రాష్ట్రానికంది నప్పటికీ, ఇంతవరకు ఆ సిఫారసులపై ఎటువంటి చర్య తీసుకున్నట్టు లేదు. ముఖ్యమైన సిఫారసు వరద పల్లపు ప్రాంతాల వర్గీకరణ (flood plain zoning) అమలుకోసం విస్తృతంగా సర్వే జరిపి, అందుకు అవసరమైన చట్టాన్ని ప్రవేశపెట్టాలి.
ఇది మనం ఇంతవరకు మొదలుపెట్టలేదు. విచిత్రమేమిటంటే, నదీగర్భంలో తలపెట్టే అక్రమ వ్యవసాయాన్ని నివారించే విషయంలో, వరదనీటి క్షేత్రాలు, కాలువలపై పెచ్చరిల్లుతున్న కట్టడాలను, కబ్జాలను నివారించే చర్యల అమలుకోసం, పీనల్ క్లాజుతో సహా చట్టాలను ప్రవేశపెట్టాలన్న ‘రాష్ట్రీయ భాడ్ ఆయోగు’ సిఫారసును మన ప్రభుత్వం అంగీకరించడమే కాక చర్యలు చేపడ్తున్నామని కేంద్రానికి భరోసా ఇచ్చింది. అయితే ఈ వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలాయి కాని కార్యరూపం దాల్చినట్టు లేదు.
ముక్తాయింపు
‘కర్ణుడి చావుకు కారణాలనేకం’ అన్నట్టు వరదలు సంభవించడానికి కారణాలు అనేకం. ఇందులో ప్రకృతిపరమైనవి (సముద్రంలో అల్పపీడనం, పరీవాహక ప్రాంతాలలో భారీవర్షాలు మొదలైనవి) కొన్నయితే, మనిషి తన మనుగడకోసం చేపట్టే అకృత్యాలు (పరీవాహక ప్రాంతాల్లో అడవులను నాశనం చేయడం, ఉపాధికోసం చెట్లు నరికి అడవిని తగులబెట్టడం, చెరువు భూములపై కబ్జా పెట్టి ఇళ్ళ స్థలాలుగా మార్చడం, దిగువ ప్రాంతాలను అధికారికంగా అనధికారంగా ఆక్రమించడం, ఎత్తైన భవనాలు నిర్మించడం ప్రవాహానికి ఆటంకాలు కలిగించడం, చెరువులలో వరద కాలువలలో పూడికలు తీయకపోవడం, మరమ్మత్తు పనులను సకాలంలో చేపట్టకపోవడం వగైరా) అనేకం.
ఎన్ని జాతీయ వరద సంఘాలు, టాస్క్‌ఫోర్స్‌లు సిఫారసులు చేసినా, వారు ఎన్ని నమూనా కార్యాచరణ పథకాలు పంపినా ప్రభుత్వాలు వాటిని చిత్తశుద్ధితో అమలు చేయకపోతే ఫలితం శూన్యం.
ఏదైనా విపత్తు వాటిల్లితే తప్ప మేల్కొనపోవడం అసలు మన సంస్కృతిలోనే వుంది. అటు డెంగూ జ్వరం కానివ్వండి, ఇటు కార్గిల్ యుద్ధం కానివ్వండి, మన పైన పిడుగు పడితే తప్ప మనం మేల్కోము, తరుణోపాయాలు వెదకం. ఆ గండం గడిచాక మళ్ళీ పరిస్థితి మామూలే. మన రాష్ట్రంలో మూసీ నదిలో వచ్చిన ఆకస్మిక వరద విపత్తు కూడా ఈ కోవకు చెందిందే.
ఇప్పటికైనా ప్రభుత్వం, విపక్షాలు, ప్రజలు కళ్ళు తెరుచుకుని వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుని ఈ విపత్తు కలగడానికి మూలకారణాలు శోధించి, తిరిగి అలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, తక్షణ చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. అయితే ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమంటే ‘మనం వరదలను నివారించలేం-కొంత మేరకు వాటిని నియంత్రించవచ్చు’ అన్నది. వరదతో మనం సహజీవనం కొనసాగించక తప్పదు (live with floods) అన్న సత్యాన్ని మనం జీర్ణించుకోవాలి.





