ఉపరితల జలాలు
రాజ్యాంగంలో 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి.
కేంద్రజాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంది.
రాష్ట్రజాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం ఆయా రాష్ట్ర శాసన సభలకే ఉంది.
ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసనసభకు ఉభయులకూ ఉంది.
రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 17లో ‘నీరు-నీటి సరఫరా, సాగునీరు, కాలువలు, మురుగునీరు, అడ్డుకట్టలు, నీటి నిలువ మరియు విద్యుచ్ఛక్తి’ – ఇవన్నీ ఆయా రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. అయితే ఈ అధికారం కేంద్ర జాబితా ఎంట్రీ 56లో చెప్పిన విషయాలకు లోబడి ఉంటుంది. కేంద్ర జాబితాలోని ఎంట్రీ 56 ప్రకారం అంతరాష్ట్ర నదుల, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్దీకరణపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకుంది. అయితే ఏ మేరకు కేంద్రప్రభుత్వ అధీనంలోకి ఈ హక్కుని సంక్రమింప జేయాలి అన్న విషయంపై ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు చట్టం రూపొందించవలసి ఉంటుంది.
తేలికైన మాటల్లోచెప్పాలంటే కేవలం తమ సరిహద్దుల్లో పుట్టి, ప్రవహించే నదులపైన ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది.ఉదాహరణకు గుండ్లకమ్మ. ఈ నదిపై అంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ అధికారం ఉంది. అంతర్ రాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటి వినియోగంపైన మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించనంత మేరకే అదిసాధ్యం. ఉదాహరణకు గోదావరి నీటిలో తమ వంతును ఆంధ్రప్రదేశ్ నిరాటంకంగా ఉపయోగించుకునే వీలు లేదు. ఉదాహరణకు ఇచ్చంపల్లి నిర్మించాలన్నా, పోలవరం కట్టాలన్నా, కేంద్ర ఆటవీ, పర్యావరణ శాఖ, సంక్షేమశాఖ అనుమతులే కాకుండా, ముంపునకు గురయ్యే అన్య రాష్ట్రాల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
భూగర్భజలాలు
ఇక భూగర్భజలాల విషయానికి వస్తే రాజ్యాంగంలో ‘నీరు’ అన్న మాట కనిపిస్తుందే తప్ప ఎక్కడా భూగర్భజలం అన్నమాట కనిపించదు. (Transfer of Property Act IV, 1982) ఆస్తి బదలాయింపు చట్టం, IV,1982 అనుసరించి భూమి కింద ఉద్భవించే నీరు ఆ భూమికి అనుబంధమైన విషయంగా పరిగణించబడుతుంది. అంటే భూమిపై హక్కులతోపాటు యజమానికి భూమి కింద లభ్యమయ్యే నీటిపై కూడా హక్కు దొరుకుతుందన్నమాట. Indian Easements Act., 1882 కూడా ఇదే విషయాన్ని బలపరుస్తుంది. తేలికైన మాటల్లో చెప్పాలంటే భూమికింద లభ్యమయ్యే నీటిపైన భూస్వామికి పూర్తి హక్కుంది. అవధుల్లేని ఈ అధికారం మూలంగా ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి.
దేశంలో నానాటికీ అడుగంటుతున్న భూగర్భజలాల విషమపరిస్థితి ప్రజాహిత వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తేబడింది. సుప్రీంకోర్టు స్పందించి పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 అనుసరించి కేంద్రభూగర్భ జల మండలిని (సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్), కేంద్ర భూగర్భ జల అథారిటీగా నియమించింది. పర్యావరణ చట్టాన్నుపయోగించి భూగర్భజల స్థాయి పడిపోవటాన్ని, భూగర్భజలాల నాణ్యతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా అథారిటీని ఆదేశించడం జరిగింది. ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది గానీ, ఆ ఆదేశమిచ్చే ముందు యావత్‌దేశంలో భూగర్భజలాల వెలికితీతను నియంత్రించే యంత్రాంగం కేంద్ర భూజలమండలికుందా అన్న అంశాన్ని పరిశీలించడం జరగలేదు. ఈ బృహత్కార్యం సాధించాలంటే బోలెడు మందీమార్బలం, చిత్తశుద్ధి కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల అండదండలు మినహా ఇది సాధ్యమయ్యేది కాదు. కనుకనే కొత్తగా ఏర్పడ్డ (1997లో) కేంద్ర భూగర్భజల అథారిటి అవసరమైన మార్గదర్శక సూత్రాలను మాత్రం రూపొందించింది. నియంత్రణ చర్యలను చేపట్టవలసిందిగా ఆయా రాష్ట్ర భూగర్భ జలమండలులను కోరడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ నత్తనడక సరళిలోనే కొనసాగుతోంది. లోగడ కూడా (సుప్రీంకోర్టు జోక్యం కలిగించుకోక పూర్వం) అనేకమార్లు కేంద్రం భూగర్భజలాల నియంత్రణకై మోడల్ బిల్స్‌ని రూపొందించి ఆయా రాష్ట్రాలను వాటిని చట్టం రూపంలో తీసుకురావలసిందిగా కోరడం జరిగింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగానే ఉంది.
ఇకపోతే నీటిపై సంపూర్ణ అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పాలని కొంతకాలంగా చర్చజరుగుతోంది.
సర్కారియా కమీషన్ సిఫారసులు
నీరు కేంద్రజాబితాలోకిగానీ, ఉమ్మడి జాబితాలోకి గానీ చేర్చాలని వాదించే వారు అడవులను ఉదాహరణగా పేర్కొంటారు. ‘అడవి’ని ఉమ్మడిజాబితాలోకి చేర్చాకే (42వ రాజ్యాంగ సవరణ 1976) అటవీ సంపదను యధేచ్ఛగా కొల్లగొట్టే ప్రయత్నాలకు కేంద్రం చట్టరూపంలో ప్రవేశపెట్టిన కఠినచర్యలు మూలంగా విఘ్నం వాటిల్లిందని, ఫలితంగా అడవులు బాగుపడ్డాయని వాదిస్తారు. రోజురోజుకీ అడుగంటిపోతున్న భూగర్భజలాల పరిస్థితికి ఆయా రాష్ట్రాలు చేతులు ముడుచుకు కూర్చోవడమే కారణమని, నీటిని కేంద్రానికి బదిలీ చేస్తే ఈ పరిస్థితి రాదని వారి వాదన.
కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి అధ్యయనం చేసేందుకు నియమించబడ్డ సర్కారియా కమీషన్ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. రాష్ట్రాలకు భూమిపైన అధికారం ఉన్నట్టే నీటిపైన కూడా అధికారం కలిగి ఉండాలని కమీషన్ భావించింది. అయితే అంతర్ రాష్ట్ర నదులు ఏ ఒక్క రాష్ట్రంలోనో ప్రవహించవు కాబట్టి, వాటిపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకే ఉండాలని భావించింది. కనుక రాజ్యాంగంలో ఇపుడున్నట్టుగానే ‘నీరు’ రాష్ట్ర జాబితాలోనూ, అంతర్ రాష్ట్రనదీ జలాలు కేంద్రం అధీనంలో ఉండటమే సబబని భావించింది. సర్కారియా కమీషన్ ‘నీరు’ని అటు కేంద్రం జాబితాలోకిగాని ఇటు ఉమ్మడి జాబితాలోకిగాని మార్చడానికి ఒప్పుకోలేదు.
అంతర్ రాష్ట్ర నదుల విషయంలో కేంద్రానికి ఇపుడున్న అదికారాన్నే సవ్యంగా వినియోగించుకోలేకపోయిందని ఒక విమర్శ. ఒకపక్క రాష్ట్రాలకు మరిన్ని అధికారాలను కేంద్రం అప్పజెబుతున్న సమయంలో రాష్ట్ర అధికారాలను కేంద్రానికి హస్తగతం చేయడమెలా సాధ్యమవుతుందని కొందరి వాదన. ‘అడవి’ని ఉమ్మడి జాబితాలోకి మార్చింది 1975-77లో నెలకొన్న అత్యయిక పరిస్థితుల్లో- ఈ రోజుల్లో అది సాధ్యమయ్యుండేది కాదన్నది వారి వాదన.
ఈ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన National Commission for Integrated Development Plan’ (సౌలభ్యం కోసం ‘జాతీయ జలకమీషన్’ అని వ్యవహరిద్దాం) ప్రభుత్వానికి సమర్పించిన తమ నివేదికలో సర్కారియా కమీషన్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కేంద్రం రాష్ట్రాల మధ్య సలహాసంప్రదింపులు కొనసాగించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వల్ల నీటికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిఫారసు చేసింది.