Feed on
Posts
Comments

ప్రకృతి ప్రసాదించిన వనరు, వరం- నీరు. గాలి తరువాత సమస్త జీవరాశులకు అవసరమయిన అతి ముఖ్యమైన వనరు నీరు. ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయన్నమాట వాస్తవం కాదు. భూమిపై ఉన్న నీటినంతటినీ విస్తరింపచేస్తే అది మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. అయితే ఈ నీటిలో 97 శాతం ఉప్పునీరు, మిగతా స్వచ్ఛమైన నీటిలో అధిక భాగం ధ్రువాలలో, భూగర్భంలో నిక్షిప్తమై ఉంది. మనం ఉపయోగించుకోగల మంచినీరు పదివేల యూనిట్లలో కేవలం ఒక యూనిట్‌ మాత్రమే. ఏ ప్రాంతంలోనైనా ప్రతి వ్యక్తికి 1800 ఘనపు మీటర్ల నీరు లభిస్తోంది. 2025 నాటికి ఆ సంఖ్య 1350 అవుతుందని అంచనా. అంటే సమీప భవిష్యత్తులోనే మనం నీటి ఎద్దడిని ఎదుర్కోవడం తథ్యమన్నమాట.


మన దేశంలో మనం ఉపయోగించుకోగల నీటిని 1086 ఘనపు కిలోమీటర్లుగా (1 ఘనపు కిలోమీటరుకు 35.3 టి.ఎం.సి.లు) అంచనా వేసారు. అది బొటాబొటిగా మన అవసరాలకు సరిపోతుంది. అయితే ఇందులో ఓ తిరకాసుంది. సగటున ప్రతి వ్యక్తికి నీరు లభిస్తోంది అంటే అన్ని ప్రాంతాలకు నీరు సమంగా దొరుకుతున్నది కాదు. పెన్నానది బేసిన్లో, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో లభించే నీరు ఆ ప్రాంతాలకు సరిపోతుందని కాదు. మన దేశంలో వివిద నదీ బేసిన్లలో లభించే నీరు, వినియోగించుకుంటున్న నీటి పరిమాణంలో తేడా ఉంది. 33.5 శాతం భూభాగం ఆక్రమిస్తున్న ‘గంగ, బ్రహ్మపుత్ర, మేఘన బేసిన్లలో 62.5 శాతం నీరు లభిస్తుంది. కాని ఆ నీటిలో 27.5 శాతాన్ని మాత్రమే మనం వినియోగించుకోగలం ముంబాయికి దక్షిణంగా పశ్చిమ దిశగా ప్రవహించే నదులు 3.5 శాతం భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ నదుల్లో 10 శాతం నీరు లభిస్తోంది. కాని ఇందులో 18.5 శాతం నీటిని మాత్రమే వినియోగించుకోగలం. ఇక మిగిలిన ఈ బేసిన్లన్నీ 63 శాతం భూమిని ఆక్రమించినా, వాటిలో లభించే నీరు 28 శాతం మాత్రమే. అందులో 70 శాతాన్ని ఉపయోగించుకోగలం. భౌగోళిక పరిస్థితులు, సాగుభూమి లభ్యత, పర్యావరణం మొదలైన కారణాల వల్ల నీటి వినియోగంలో పరిమితులు, ఆంక్షలు, అడ్డంకులు ఉన్నాయి.

నీటి అవసరాలు

2050 నాటికి వ్యవసాయ రంగానికి 68 శాతం, గృహ రంగానికి 39 శాతం, పారిశ్రామిక రంగానికి 7 శాతం, విద్యుత్‌ రంగానికి 6 శాతం, నదీ రవాణాకు 1 శాతం, పర్యావరణానికి 2 శాతం, మిగతా నీరు ఆవిరి నష్టంకోసం కావలసి వస్తుందని అంచనా. మనం ఉపయోగించుకోగల 1086 ఘనపు కిలోమీటర్ల నీటిలో ఉపరితల జలం 690 ఘనపు కిలోమీటర్లు. అయితే ఈ పరిమాణాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో ఆర్థిక సాంఘిక, పర్యావరణ సమస్యలు, అవరోధాలు ఎదురవుతున్నాయి.
నీటి వినియోగం భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, స్థానిక జలవ నరుల అభివృద్ధి పథకాల ద్వారా జరుగుతుంది. భూగర్భ జల వినియోగం చిన్న తరహా కోవకే చెందుతుంది. మన దేశంలో, రాష్ట్రంలో నీటి వినయోగంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. జల వనరుల అభివృద్ధి, నిర్వహణ విషయాల్లో 1987లో ఆమోదించి, 2001లో సవరించిన జాతీయ జల విధానం చెబుతున్న కీలక అంశాలు ఇవి: సాగునీటి వ్యవస్థలో నీటి కేటాయింపు, సమాన, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని జరగాలి. ఎక్కువ దిగుబడికోసం సాగునీటిని వీలైనన్ని ఎక్కువ రైతు కుటుంబాలకు అందచేయాలి. సాగునీటి వ్యవస్థ నిర్వహణలో రైతులను భాగస్వాములుగా చేయాలి. రైతులు సమర్థంగా నీటిని వినియోగించు కునేందుకు, స్వచ్ఛంధ సంస్థల సేవలను ఉపయోగించు కోవాలి. ప్రాధాన్యతల పరంగా నీటిపంపిణీ, కేటాయింపు- మంచినీరు, సాగునీరు, విద్యుచ్ఛక్తి, జలరవాణా, పారిశ్రామిక, ఇతర అవసరాలకోసం జరుగుతుంది. సాగునీటి వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని పాటించాలని జాతీయ జలవిధానం ఘోషిస్తున్నా, ఆ విధానానికి చట్టపరమైన బలం లేకపోవడంవల్ల, అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. జాతీయ జలవిధానం లోని సూత్రాలు ‘నీతిచంద్రిక’లోని ప్రబోధాలే తప్ప ఆచరణకోసం కాదన్న విషయం అనుభవంలో తేలింది.

జల హక్కులు

జల హక్కుల విషయం పరిశీలిస్తే, ఉపరితల జలంపై సంపూర్ణ హక్కు ప్రభుత్వానిదే. నదులను అంటి పెట్టుకున్న వ్యక్తులకు కొన్ని పరిమితుల మేరకు ‘రైపీరియన్‌ హక్కులు’ లభిస్తాయి. భూగర్భ జల విషయంలో ఆస్తి బదలాయింపు చట్టం- 4, 1882 అనుసరించి భూమికింద లభ్యమయ్యే నీటిపై భూస్వాములకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అవధులు లేని ఈ అధికారం వల్ల ఎన్నో దుష్పరిణామాలు వాటిల్లుతున్నాయి. వంద సంవత్సరాలుగా మన దేశంలో అమలులో ఉన్న నీటిపారుదల చట్టాలను పరిశీలిస్తే, వాటిలో ఎక్కడా రైతుల భాగస్వామ్యానికి వీలు కల్పించలేదు. అదినుంచి సాంకేతిక సిబ్బంది చేతుల్లోనే సాగునీటి పాలనా యంత్రాంగం ఉంది. 1873లో రూపొందించిన ఉత్తర భారత కాలువ, మురుగునీటి చట్టం, 1876 నాటి బెంగాల్‌ నీటి పారుదల చట్టం, 1879 నాటి బాంబే నీటి పారుదల చట్టం ఇందుకు ఉదాహరణలు. అయితే 1997లో చట్టరూపం దాల్చిన ‘ఆంధ్రప్రదేశ్‌ రైతుల సాగునీటి నిర్వహణ’ అమలులోకి వచ్చింది. మూడంచెలుగా సాగునీటి వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే ఈ సంఘాలు ఏ మేరకు ఆశయాన్ని సాధించాయో భవిష్యత్తు చెబుతుంది. రైతుల ప్రయోజనాలకన్నా రాజకీయాలకే ఈ సంఘాలు పెద్ద పీట వేస్తున్నాయన్న భావన చలామణిలో ఉంది.

ఒక ప్రాజెక్ట్‌ కట్టాలంటే…!

నేడు ఒక ప్రాజెక్టు నిర్మించాలంటే, అది పెట్టిన పెట్టుబడికి కనీసం ఒకటిన్నర రేట్లు రాబడి సంపాదించగలిగితేనే ప్రణాళికా సంఘం ఆమోదిస్తుంది. అంటే లాభం, వ్యయం నిష్పత్తి 1.5:1గా ఉండాలి. ఆ ప్రాజెక్టు గిరిజన ప్రాంతంలో అయితే, లాభం నిష్పత్తి ఒకటి చాలు. అయితే లబ్దిదారులు ఎవరు, వారిలో డబ్బున్నవారు ఎందరు, పేద, బడుగు వర్గాలవారు ఎందరన్న అంశాలకు ప్రాధాన్యత లేదు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాగునీటి పంపిణీ జరిపే భూగర్భ జలాల విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని జాతీయ జలవిధానం చెబుతున్నా, దానికి చట్టబద్ధత లేని కారణంగా, సామాజిక న్యాయం సాధించాలని సిఫారసు చేసిన ‘జాతీయ కమిషన్‌’ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేసినట్టు లేదు.
ఆర్థిక సాంకేతిక అంశాలతోపాటు పర్యావరణం, సాంఘిక అంశాలు కూడా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఉంటాయి. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే బాధితులకు సరైన పునరావాసం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. భూమి కోల్పోయేవారికి ఆయకట్టులో భూములివ్వడం అన్న అంశం మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పునరావాస చట్టంలో ముఖ్యమైనది. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ‘భూమి కోల్పోయేవారికి భూమి’ అన్న బలమైన సూత్రాన్ని పునరావాస విధానంలో చేర్చడం ద్వారా కొంతమేరకు సామాజిక న్యాయాన్ని కల్పించినట్టవుతుంది. అయితే ఇప్పటిదాకా ప్రాజెక్టులలో నగదును నష్టపరిహారంగా ఇస్తున్నారే తప్ప, ఆయకట్టులో భూమిని ఇవ్వడం లేదు. గిరిజనుల పునరావాసం విషయం ఆలోచించడానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞం కార్యక్రమం తూతూ మంత్రంగా, మేడిపండు వ్యవహారంగానే ఉంటూ, అటు వెనకబడ్డ ప్రాంతాలకు గాని, ఇటు పేద, బడుగు రైతులకు గాని న్యాయం చేకూర్చే దిశలో సాగుతున్నట్టు లేదు. ఇందుకు ఉదాహరణలు అనేకం.

అదనంగా ఒక్క ఎకరం కూడా సాగుకు రాని, ఉన్న వాడికే మరింత దోచిపెట్టే ప్రాజెక్టు పులిచింతల. ఈ ప్రాజెక్టువల్ల నల్లగొండ ప్రాంతంలో సాగర్‌ ఆయకట్టు రైతులు నష్టపోవడమే కాక, భూమిలేని నిరుపేద కుటుంబాలు అనేకం తమ జీవికను కోల్పోయే ప్రమాదం ఉంది. ఏటా పధ్నాలుగు లక్షల మంది వలసపోయే పాలమూరు జిల్లాలోని భీమా ప్రాజెక్టుకన్న పులిచింతలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే ప్రభుత్వానికి సామాజిక న్యాయంపట్ల పట్టింపు లేదని విదితమవుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని అయిదు తెలంగాణ జిల్లాల వెనకబాటుతనాన్ని తొలగించే పథకాలవైపు మొగ్గు చూపకుండా, ఇదివరకే సంపన్నమైన కృష్ణా, గోదావరి డెల్టా రైతులను మరింత భాగ్యశాలురుగా చేయాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఆమోదం లేకపోయినా ‘పోలవరం’ ప్రాజెక్టుపై వాత్సల్యం ప్రదర్శించడం కూడా ‘సామాజిక న్యాయం’ గురించి పట్టించుకోకపోవడమే అవుతుంది. బేసిన్‌ అవసరాలను తీర్చకుండా గోదావరి నీటిని కృష్ణకు తరలిస్తామని, అందులో భాగంగా దుమ్ముగూడెం కడతామని ప్రకటించడం కూడా ప్రభుత్వ ఈ వైఖరికి మరో ఉదాహరణ.
బక్కచిక్కిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు నీరందించే రాజోలిబండ వివాదాన్ని పరిష్కరించకుండా కెసి కాలువకు అనధికారికంగా తుంగభద్ర నీటిని తరలించడం, ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ ప్రజలను ఆదుకొనే ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులు ప్రారంభించకుండా, ‘వెలిగొండ’ సొరంగం మొదలెడతా మని ప్రకటించడం వంటి పనులు వెనకబడ్డ ప్రాంతాలు, నిరుపేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అనుకోవడానికి దోహదపడవు. నేడు దేశంలో, రాష్ట్రంలో నీటి వినయోగం సామాజిక న్యాయదృష్టితో జరగడం లేదు. నేడు ప్రాజెక్టుల కాలువలు, గొట్టాలనుంచి నీటికి మారుగా రాజకీయం ప్రవహిస్తోంది. సామాజిక న్యాయం కేవలం ఎండమావి, దుడ్డున్న వాడిదే బర్రె! ఈ పద్ధతి మారాలంటే మేధావులు, పాలకుల ఆలోచనా సరళిలో మార్పు రావాలి. అందుకు ఎదురుచూడడం కంటే చేసేదేముంది?

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com