అంతర్ రాష్ట్ర నదులలో రెండు, అంతకుమించి రాష్ట్రాల మధ్య జల వికాసం, వినియోగం, వాటాల విషయంలో తరచుగా వివాదాలు తల ఎత్తుతున్నాయన్నమాట నిజం. అయితే వాటిని త్వరగా పరిష్కరించే యంత్రాంగం అమలులో లేదు. ఉన్న యంత్రాంగం పరిష్కార మార్గం సూచించడానికి ఏళ్లు తీసుకుంటుంది. ఆ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాల అమలు సక్రమంగా కావడం లేదు. ఏదో ఒక మిషపైన రాష్ట్రాలు తగాదా పరిష్కారానికి నామమాత్రంగా కేంద్రానికి విన్నవించుకోవడం, కేంద్రం చొరవ చూపినా, చూపకపోయినా, ఏదో ఓ చట్టపరమైన అంశాన్ని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు వెళ్లి మొరపెట్టుకోవడం జరుగుతోంది.
ఆ మధ్య నర్మదా విషయంలో ఎంత గొడవ జరిగిందో పాఠకులకు తెలిసే వుంటుంది. ‘నర్మదా బచావో ఆందోలన్’ కార్యకర్తలు డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా పెట్టుకున్న ఆర్జీపై ముందు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి డ్యాం నిర్మాణాన్ని ఒక స్థాయి వరకే అనుమతించి, అంతకు మించి చేపట్టరాదని ఆదేశించింది. విచారణ పూర్తయ్యాక తాను పెట్టిన ఆంక్షలు తొలగించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో సంతృప్తి చెందని ‘నర్మదా బచావో ఆందోళన్’ కార్యకర్తలు తీవ్రమైన నిరసన తెలియచేశారు. కర్నాటక ప్రభుత్వం తలపెట్టిన ఆలమట్టి డ్యాం ఎత్తు విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం జరిగింది. ఇటీవలే మన రాష్ట్రం చేపట్టిన, రూపొందించిన, తెలుగు గంగ, భీమా, ఎస్.ఎల్.బి.సి., పులిచింతల విషయంలో కూడా కర్ణాటక తమ ఫిర్యాదును సుప్రీంకోర్టుకు చేసుకుంది. అలాగే, కావేరీ విషయంలో కర్ణాటక తమకు సక్రమంగా ట్రిబ్యునల్ మధ్యంతర ఆదేశాల ననుసరించి నీళ్లు వదలడం లేదని, కావేరీ నదిపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంఘం అధ్యక్షులు (ప్రధానమంత్రి) చెప్పినా కూడా తమకు న్యాయం జరగడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
పై ఉదాహరణలను బట్టి తేలేదేమంటే తమకు సత్వర న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు ద్వారానే సాధ్యమని, ఇతరత్రా వీలుపడదన్న విషయం రాష్ట్రాలకు ఖచ్చితంగా తెలుసు. ఇది చాలామటుకు నిజం. రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడితే పరిష్కరించవలసిన బాధ్యత కలిగిన కేంద్రానికి ఏమీ పట్టలేదా అన్న అనుమానం మనకు కలగడం సహజం. కేంద్రానికి ఉన్న హక్కులు, బాధ్యతలు చర్చించేముందు, రాజ్యాంగం నీటి తగాదాల విషయంలో ఏమంటుందో చూద్దాం. రాజ్యాంగంలోని 262 అధికరణలో అంతర్ రాష్ట్ర నదీ జలాలకు సంబందించిన తగాదాల పరిష్కారం గురించి ప్రసావిస్తూ రెండు విషయాలు స్పష్టపరిచింది.
ఒకటి: అంతర్ రాష్ట్ర నదీ జలాల వినియోగం, పంపకం, నియంత్రణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే, దాన్ని పరిష్కరించే నిమిత్తం పార్లమెంటు చట్టం చేయవచ్చు.
రెండు: పైన చెప్పిన తగాదా విషయంలో సుప్రీంకోర్టు గానీ, ఇతర కోర్టులుగానీ జోక్యం చేసుకోరాదని పార్లమెంటు చట్టం చేయవచ్చు.
ఈ 262 అధికరణం కింద పార్లమెంటు 1956 సంవత్సరంలో అంతర్ రాష్ట్ర జలవివాద చట్టాన్ని రూపొందించింది. ఈ యాక్ట్‌లోని సెక్షన్ 3లో ఈ విధంగా ఉంది.
”పరాయి రాష్ట్రం చేసే లేక చేయబోయే చట్టంవల్ల కానీ, అధికారిక చర్యల మూలంగా కానీ, అంతర్ రాష్ట్ర జలాల వినియోగం, పంపకం, నియంత్రణ విషయంలో తమ అధికారాలను అమలు చేయడంలో పర రాష్ట్రం లేక ఆ రాష్ట్ర సంబంధిత సంస్థ విఫలం కావడం కారణంగా కానీ, తమతో ఆ పరాయి రాష్ట్రం చేసుకొన్న ఒప్పందం ప్రకారంగా కార్యక్రమాలు అమలు జరగని సందర్భంలోకానీ, ఆ పరాయి రాష్ట్రంతో తమ రాష్ట్రానికి నీటి తగాదా ఏర్పడిందని లేక ఏర్పడబోతుందని, ఆ తగాదా మూలంగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశముందని అనిపించిన ప్పుడు ఆ రాష్ట్రం నీటి తగాదాని పరిష్కరించేందుకు న్యాయమండలి ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరవచ్చు”.
ఇక సెక్షన్ 4 ఏం చెప్తోందంటే…
”సెక్షన్ 3 కింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నీటి తగాదాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెస్తే, చర్చలు, సంప్రదింపుల ద్వారా ఆ తగాదా పరిష్కారం సాధ్యం కాదని కేంద్రానికి అనిపిస్తే, కేంద్రప్రభుత్వం అధికార పత్రం (అఫీషియల్ గెజెట్) ద్వారా ఆ నీటి తగాదా పరిష్కార నిమిత్తం న్యాయమండలి ఏర్పాటు చేయవచ్చు”.
ఇప్పటి వరకు అయిదు జల వివాద ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. అవి కృష్ణా, గోదావరి, నర్మద, కావేరీ, రావి-బియాస్ ట్రిబ్యునళ్లు. కృష్ణా గోదావరి, నర్మద విషయాలలో మాత్రమే ట్రిబ్యునళ్ళ అవార్డులు అమలు చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల మిగిలిన రెండు ట్రిబ్యునళ్ల అవార్డుల ప్రకటన, అమలు వివిధ దశలలో ఉన్నాయి. కృష్ణా, గోదావరి, నర్మద ట్రిబ్యునళ్లు నదీ జలాల వాటాలు వివిధ రాష్ట్రాలకు (బేసిన్ రాష్ట్రాలకు) కేటాయించాయి. ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన రావీ-బియాస్ ట్రిబ్యునల్ సున్నితమైన అంశంగా మారి కేంద్రానికి ఓ తలనొప్పిగా తయారయింది. కావేరీ ట్రిబ్యునల్ అవార్డు (మధ్యంతరం మాత్రమే – అంతిమ అవార్డు రాలేదింకా) కృష్ణరాజసాగర్ డ్యాం (కర్ణాటక) నుండి మెట్టూరు డ్యాం (తమిళనాడు) కు ఏ సమయంలో ఎంత నీరు విడుదల చేయాలన్న అంశానికి సంబంధించింది.
నర్మదా నదిపై కడ్తున్న నవగాం డ్యాం ఎత్తు విషయంగానీ, కృష్ణపై మన రాష్ట్ర ప్రభుత్వం కడ్తున్న లేక తలపెట్టిన రిజర్వాయర్ నిర్మాణాలు కానీ నీటి పంపకానికి సంబంధించిన విషయాలు కావు. నర్మదా నదిపై ఎత్తు కుదింపు కోసం మానవీయ దృక్పథంతో స్వచ్ఛంద సేవా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇక కృష్ణానదిపై వెలుస్తున్న ఎత్తయిన ఆలమట్టి, తెలుగుగంగ, భీమా, ఎస్‌ఎల్‌బిసి, పులిచింతల ప్రాజెక్టులు ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులు ఉల్లంఘించాయన్న ఆరోపణలతో ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టు ముందుకు తెచ్చినవి. ఇలాంటి ఫిర్యాదులు వస్తే కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పిలిచి, నచ్చచెప్పి, చర్చల ద్వారా తగాదా పరిష్కరించే ప్రయత్నం చేయడమే తప్ప రాష్ట్రాన్ని శాసించి, న్యాయం చేసే అధికారం కేంద్రానికి లేదు. అందుకే ఎలాంటి నీటి తగాదా వచ్చినా రాష్ట్రం ముందు కేంద్రానికి మొరపెట్టుకోవడం, కేంద్రం చర్యతో సంతృప్తిచెందకపోవడం, వెన్వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతోంది.
ఇతర రాష్ట్రాలతో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం ఒకే రాష్ట్రంలో ఉద్భవించి, ప్రవహించే నదుల విషయంలో కేంద్రానికెలాంటి జోక్యం ఉండదు.కేంద్రానికి నదీ జలాల విషయంలో ఏదైనా హక్కు అధికారం సంక్రమిస్తుందీ అంటే అది అంతర్‌రాష్ట్ర నదులలోనే. అంతర్ రాష్ట్ర జల వివాదాల విషయంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి అంతర్‌రాష్ట్ర జలవివాద చట్టం, 1956 కట్టబెట్టిందని తెలుసుకున్నాం. ఇది కాకుండా అంతర్‌రాష్ట్ర నదుల వికాసం విషయంలో కేంద్రానికి కొన్ని షరతులకు లోబడి రాజ్యాంగం అధికారాన్ని కట్టబెట్టింది. రాజ్యాంగంలోని 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో జతపరచిన మూడు జాబితాలలో ఒకటి కేంద్ర జాబితా. ఈ జాబితాలో ఉటంకించిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకుంది. కేంద్ర జాబితాలో (List) ని ఎంట్రీ 56 ప్రకారం అంతర్‌రాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్దీకరణపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకుంది. అయితే ఏ మేరకు కేంద్రానికి ఈ హక్కుని సంక్రమింప జేయాలి అన్నది ప్రజా ప్రయోజనాలను బట్టి ఉంటుంది. రాజ్యాంగంలోని ఈ అధికారం పురస్కరించుకొని పార్లమెంటు 1956లో ‘ది రివర్ బోర్డ్ యాక్ట్’ అన్న చట్టాన్ని రూపొందించింది. అయితే నిజానికి ఈ చట్టం కేంద్రానికి అంతర్ రాష్ట్ర నదుల అభివృద్ధి విషయంలో ఎలాంటి అధికారాన్ని ఇవ్వలేదు. ఈ చట్టాన్ని ‘కాగితపు పులిగానే’ పరిగణిస్తారు. అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం అనగా The Inter-State Water Disputes Act, 1956, నదీ మండలి చట్టం అనగా The River Board Act, 1956 మినహాయించి నదీ జలాల అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ, తగాదా పరిష్కారం మొదలైన విషయాలకు సంబంధించిన మరి ఏ ఇతర చట్టమూ కేంద్రానికెలాంటి అధికారం ఇవ్వలేదు. (పర్యావరణం, కాలుష్యం సంబంధిం చిన చట్టాల విషయం ప్రస్తావించడం లేదు). ఇలాంటి పరిస్థితుల్లో ‘సత్వర న్యాయం’ ఆశించే, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమ ఫిర్యాదును సుప్రీంకోర్టుకే తీసుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టు కోవడం, కోర్టుకు వెళ్లే ముందు అనుసరించవలసిన విధి గాబట్టి మొక్కుబడిగా చేయడమే కానీ, నిజంగా కేంద్రం తమ సమస్యను పరిష్కరిస్తుందని కాదు. రోజురోజుకూ సుప్రీంకోర్టుకు వస్తున్న అంతర్ రాష్ట్ర జల వివాద సంబంధిత కేసుల సంఖ్య చూస్తూ ఉంటే ఏదో ఓ రోజూ Central Administrative Tribunal మాదిరిగానే Central Water Tribunal ఏర్పాటు చేయడం, సుప్రీంకోర్టు ఒక ధర్మాసనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అవసరమేమో అనిపిస్తోంది. కాగా, అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం, 1956 సెక్షన్ 11 అనుసరించి ట్రిబ్యూనల్‌కు సమర్పించిన నీటి తగాదా విషయంలో సుప్రీంకోర్టుకుగానీ, ఇతరకోర్టుకూగానీ అధికార పరిధి (Jurisdiction) లేదు అని స్పష్టంగా రాసుంటే రాజ్యాంగంలోని 131 అధికరణం అనుసరించి కేంద్ర ప్రభుత్వం, రెండూ అంతకుమించిన రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా వస్తే న్యాయం అందజేసే అధికారం తమకుందని సుప్రీంకోర్టు చెప్తోంది.
ఏదేమైనా ఇప్పటి పరిస్థితి ఎలా వుందంటే తుమ్మినా దగ్గినా సుప్రీంకోర్టునే ఆశ్రయించవలసి వస్తోంది.