Feed on
Posts
Comments

ఏ ట్రిబ్యునల్‌ ఏం చేసింది?

అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు, అంతర్‌ దేశ జలయుద్ధాలు కొత్తేమీ కావు. మనదేశానికి సంబంధించిన వరకు అంతర్‌రాష్ట్ర జలవివాదాల పరిష్కారం నిమిత్తం రాజ్యాంగంలోని 262 అధికరణం కింద పార్లమెంటు చట్టం 1956లో తెచ్చింది. దీని ప్రకారం ఏదైనా జలవివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆ తగాదా రాజీ యత్నాల ద్వారా పరిష్కారం కాదని కేంద్రం అభిప్రాయపడితే, ఓ జలవివాద న్యాయపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ తగాదాలను పీఠానికి అప్పచెపుతుంది.

చట్టం ఏర్పాడ్డాక గత యాభై సంవత్సరాల్లో అయిదు న్యాయపీఠాలు కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి, రావి-బియాస్‌ నదులపై తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద వివాదాలు పరిష్కారమై తీర్పులు వెలువడ్డాయి. కావేరి, రావి-బియాస్‌ వివాదాలు ఏదో ఒక కారణం చేత ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలాయి. నర్మద విషయంలో తీర్పు వెలువడినప్పటికీ ముంపునకు సంబంధించి అనేక సమస్యల మూలంగానే సుప్రీంకోర్టులో కేసులు పెండింగులో ఉండి డ్యాంల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గోదావరి విషయంలో ఎలాంటి గొడవలు లేకపోయినా, కృష్ణ విషయంలో రాష్ట్రాలు పరస్పరం దెబ్బలాడుకుంటూ చీటికి మాటికి సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నాయి.

కావేరి వివాదం

కావేరి జలవివాదం అలనాటి మదరాసు, మైసూరు ప్రభుత్వాల మధ్య 1807 సం.లో మొదలయింది. 1892 సం.లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒడంబడిక జరిగింది. అయితే 1910 సం.లో కర్నాటక ప్రభుత్వం 41.5 టి.ఎం.సిల సామర్థ్యంతో కృష్ణరాజసాగర్‌ కట్టాలని ప్రతిపాదించగా, అందువల్ల మదరాసు ప్రభుత్వం తలపెట్టిన మెట్టూరు రిజర్వాయర్‌ (సామర్థ్యం 80 టిఎంసిలు) ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందన్న కారణంతో మళ్లీ వివాదం చెలరేగింది. తిరిగి 1924లో అంగీకారం కుదిరింది – అనుబంధంగా 1929, 1933లలో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 1956లో రాష్ట్రాల విభజన జరిగి,కొత్త రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్నాటక కావేరి జలాలలో భాగస్వాములై తమ ప్రయోజనాల కనుగుణంగా ప్రతిపాదనలు పెట్టాయి. అంతర్‌ రాష్ట్ర చర్చలు ప్రారంభమయ్యాయి.

1986 సంవత్సరంలో తమిళనాడులోని ఓ రైతు సంఘం సుప్రీంకోర్టుకు ఆర్జీ పెట్టుకున్న కారణంగా నాలుగేళ్ల తరువాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేసింది. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ట్రిబ్యునల్‌పై వత్తిడి తేగా, ట్రిబ్యునల్‌ ఒక మధ్యంతర ఆదేశాన్నిచ్చింది. ఆ ఉత్తర్వు ప్రకారం కర్నాటక నిర్ణీత సమయాల్లో ఏడాదిలోపు 105 టిఎంసిల నీటిని తమిళనాడులోని మెట్టూరు జలాశయానికి వదలవలసి ఉంటుంది. అంతేగాక, కావేరి జలాలను ఉపయోగించుకుని కర్ణాటక తన రాష్ట్రంలో కొత్త ఆయకట్టును ఏర్పాటు చేసుకోకూడదని కూడా ఆదేశం. ట్రిబ్యునల్‌ మధ్యంతర అదేశాలు కర్ణాటకకు ఆగ్రహం తెప్పించాయి. ఈ అదేశాల ప్రభావం పడకుండా కర్ణాటక ఆర్డినెన్స్‌ని జారీ చేసింది. ఈ పరిణామం రాజ్యాంగ సంక్షోభానికి దారితీయడంతో రాష్ట్రపతి ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరడం, సుప్రీంకోర్టు కర్ణాటక జారీ చేసిన ఆర్డినెన్స్‌ చెల్లదనడం, దాంతో కేంద్రం ట్రిబ్యునల్‌ మధ్యంతర ఆదేశాలను 11 డిసెంబర్‌ 1991న అధికారికంగా ప్రకటించడం జరిగాయి. మళ్లీ రెండు రాష్ట్రాలలో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. 1992-95 మధ్య కాలంలో కావేరీ బేసిన్లో బాగా వర్షాలు కురిసినందున ఎవరూ ఈ గొడవలను పట్టించుకోలేదు. తిరిగి 1995 మధ్యలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉద్రిక్తలు మొదలయ్యాయి. మళ్లీ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు సమస్యను పరిష్కరించమని ప్రధానికి చెప్పడం, ప్రధాని అధ్యక్షతన కావేరీ రివర్‌ అథారిటీ ఏర్పడి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి తాత్కాలికంగా సర్దుబాటు చేయడం జరిగింది.

రావి-బియాస్‌ వివాదం

భారత-పాకిస్థాన్‌ల మధ్య 1960 సంవత్సరంలో ఓవైపు సింధు జలాల ఒప్పందం జరుగుతున్నప్పుడే మనదేశంలో అప్పటి పంజాబ్‌, పెప్సూ, జమ్మూ-కాశ్మీర్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల మధ్య సింధు జలాల పంపకం గురించి చర్చలు జరిగి ఓ అంగీకారానికి రావడం జరిగింది. ఆ ఒడంబడిక ప్రకారం రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులలోని 15.85 ఎంఎఎఫ్‌లో (ఒక ఎం.ఎ.ఎఫ్‌ అంటే సుమారు 43.56 టి.ఎం.సి.లు) జమ్మూకాశ్మీర్‌కు 0.65 ఎంఎఎఫ్‌, పెప్సూకి 1.3, పంజాబ్‌కు 5.9, రాజస్థాన్‌కు 8 ఎంఎఎఫ్‌ వాటాలు లభించాయి. ఎంఎఎఫ్‌ అంటే మిలియన్‌ ఎకర్‌ ఫీట్‌ (పది లక్షల ఎకరా అడుగులు). పెప్సూ పంజాబ్‌లో విలీనం కావడంతో పంజాబ్‌ వాటా 7.2 ఎంఎఎఫ్‌కి పెరిగింది. అయితే పంజాబ్‌ రాష్ట్రం 1966 సంవత్సరంలో పునర్‌ వ్యవస్థీకరణ కారణంగాతన వాటా 7.2 ఎంఎఎఫ్‌ని కోల్పోయి ఢిల్లీకి 0.2 ఎంఎఎఫ్‌, కొత్త రాష్ట్రం హర్యానాకు 3.5 ఎంఎఎఫ్‌ ఇవ్వాల్సి రావడంతో పంజాబ్‌ మిగిలిన 3.5 ఎంఎఎఫ్‌తో సరిపెట్టుకోవసి వచ్చింది. ఈ పరిణామంతో తృప్తిపడని పంజాబ్‌ కేంద్రానికి విరుద్ధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా కూడా తన వాటా అందజేయాలని కోర్టునాశ్రయించింది. ఈలోగా కేంద్రం చొరవ చూపటం, తాజా అంచనాల ప్రకారం నీటి లభ్యత 15.85 ఎంఎఎఫ్‌ నుంచి 17.17 ఎంఎఎఫ్‌కు పెరగడంతో, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. దీని ఫలితంగా పంజాబ్‌కు 1.32 ఎంఎఎఫ్‌ అదనంగా నీరు అందింది. అయితే హర్యానా వాటా మాత్రం అంతే ఉంది. ఒడంబడిక ప్రకారం సుప్రీంకోర్టులో కేసులను ఉపసంహరించుకుంటామని హర్యానా, పంజాబ్‌లు హామీ ఇచ్చాయి. సట్లెజ్‌ యమునా కాలవను రెండేళ్లలో పూర్తి చేయడానికి పంజాబ్‌ ఒప్పుకుంది. కొంత కాలానికి పంజాబ్‌ ప్రభుత్వం 1981 డిసెంబర్‌ 81న చేసుకున్న ఈ ఒప్పందాన్ని అమలుచేసేది లేదని ప్రకటించింది. మళ్లీ చర్చలు జరిగాయి. 24 జూలై 1985న ‘పంజాబ్‌ పరిష్కారం’ పేరుతో మళ్లీ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. రావి-బియాస్‌ జలాలపై మూడు ముఖ్యమైన అంశాల గురించి మూడు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం 15 ఆగస్టు 1986 నాటికి సట్టెజ్‌ యమునా కాలువ పూర్తికావాలి.

రావి-బియాస్‌ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో రాష్ట్రపతి తనంతట తానే స్యూమోటోగా జనవరి 1986లో ఆర్డినెన్స్‌ జారీ చేసి, 1956 నాటి అంతర్‌ రాష్ట్ర జలాల వివాద చట్టాన్ని సవరించి, కొత్త ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్‌ నిర్ణయించాల్సిన విషయాలు రెండు. ఒకటి: జూలై 1, 1985 నాటికి రావి-బియాస్‌ జలాలను ఏ రాష్ట్రం ఎంత మేరకు ఉపయోగించుకుంటోంది? రెండు: మిగిలిన జలాలను పంజాబ్‌, హర్యానా ఏ విధంగా పంచుకోవాలి? మొదటి విషయంపై ట్రిబ్యూనల్‌ తన నిర్ణయాన్ని ఈ విధంగా తెలియజేసింది. పంజాబ్‌ 3.106 ఎంఎఎఫ్‌ (దేశ విభజనకు పూర్వం వినియోగం అదనం) రాజస్థాన్‌ 4.985 ఎంఎఎఫ్‌ (పై విధంగానే) హర్యానా 1.620 ఎంఎఎఫ్‌ ఉపయోగించుకొంటున్నాయి. ఇక రెండవ అంశానికి వస్తే పంజాబ్‌, రావి-బియాస్‌ జలాలకు తాను మాత్రమే సొంతదారునని, హర్యానా, రాజస్థాన్‌ బేసిన్‌కు అవతల ఉన్న ప్రాంతాలు కనుక వాటికి అదనపు జలాలు ఇచ్చే ప్రసక్తి లేదని వాదించింది. అయితే ట్రిబ్యునల్‌ పంజాబ్‌తో ఏకీభవించలేదు. నదులు తమ ప్రవాహమార్గాన్ని మార్చినట్టే రాష్ట్ర సరిహద్దులు మారుతూ ఉంటాయి. కనుక హర్యానా, రాజస్థాన్‌లకు హక్కు లేదనడం సరికాదంది. చివరకు ఈ విధంగా మిగిలిన జలాలను పంచింది. పంజాబ్‌ 5 ఎంఎఎఫ్‌, హర్యానా 3.83 ఎంఎఎఫ్‌, రాజస్థాన్‌ 8.60 ఎంఎఎఫ్‌, జమ్మూ-కాశ్మీర్‌ 0.65 ఎంఎఎఫ్‌ వాడుకోవాలి. ట్రిబ్యునల్‌ తీర్పును సవాలు చేస్తూ పంజాబ్‌ సుప్రీంకోర్టులో ‘రివ్యుపిటీషన్‌’ వేసింది. ఇదిలా ఉండగా, సట్లెజ్‌ యమునా కాలువను సంవత్సర కాలంలో పూర్తి చేయాలని పంజాబ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో సుప్రీంకోర్టు కాలువ నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు పంజాబ్‌ పొరుగు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ ఇటీవలే పంజాబ్‌ ‘టెర్మినేషన్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌ బిల్‌’ను ప్రవేశపెట్టి అంతర్‌ రాష్ట్ర వివాదాల చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించింది.

నర్మద జలవివాదం

నర్మద జలాల పంపకం విషయంలో ట్రిబ్యునల్‌పై రాష్ట్రాలకు అనువుగా ఉండే ‘హార్మన్‌ సిద్ధాంతం’ దిగువ రాష్ట్రాలకు అనువుగా ఉండే ‘రైపేరియన్‌ హక్కు సిద్ధాంతం’, మధ్యస్తంగా ఉండే ‘సముచిత కేటాయింపు సిద్ధాంతం’- మూడింటినీ పరిశీలించి చివరకు అన్ని రాష్ట్రాలను సంప్రదించి సముచిత కేేటాయింపు సిద్ధాంతం వైపే మొగ్గు చూపింది.

కృష్ణా జలవివాదం

1951లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు ఓ అవగాహనకు వచ్చి కృష్ణాజలాలను పంచుకుంటామని ఒప్పుకున్నాయి. అయితే ప్రణాళికా సంఘం ఎదుట మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు కుదుర్చుకున్న ‘అవగాహన పత్రం’ చెల్లదని కర్ణాటక, మహారాష్ట్రలు, చెల్లుతుందని ఆంధ్రప్రదేశ్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట వాదించాయి. అన్ని పార్టీలు ఒప్పుకుంటే తప్ప ఏ అంగీకారానికైనా చట్టబద్ధత ఉండదని ట్రిబ్యునల్‌ తేల్చింది. 1969లో ఏర్పాటైన ట్రిబ్యునల్‌ తమ తుది నివేదికను 1976లో అంటే ఏడేళ్ల తర్వాత సమర్పించింది.

నివేదికలోని ప్రధాన అంశాలు: 1. 31 మే 2000 తరువాత తగిన అర్హత గల వ్యవస్థ తమ నివేదికను సమీక్షించడం కాని, సవరించడం కాని చేయవచ్చు. అయితే వీలైనంతవరకు రాష్ట్ర కేటాయింపులను, వినియోగించుకోకుంటే తప్ప మార్చరాదు. (కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌ని ఇటీవలే ఏర్పాటు చేసింది) 2. తమ వంతుకు వచ్చిన జలాలను ఇతర బేసిన్‌కు తరలించే స్వేచ్ఛ బేసిన్‌ రాష్ట్రాలకుంది.

కృష్ణా ట్రిబ్యునల్‌ మాదిరిగా, గోదావరి ట్రిబ్యునల్‌ నివేదికకు సమీక్ష లేదు. అంటే సంబంధిత రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ (అప్పటి మధ్యప్రదేశ్‌), కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాలు సంయుక్తంగా ఒప్పుకోవడం, లేదా పార్లమెంటు చట్టం ద్వారా సవరణ చేస్తే తప్ప గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పులో మార్పు ఉండదు.

( | నీళ్లునిజాలు : సూచిక | )

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com