జల కాలుష్య నివారణకు, నియంత్రణ కొరకు చట్టాలున్నాయి. అవి: 1. జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 2) జల (కాలుష్య నివారణ, నియంత్రణ) పన్ను చట్టం, 1977, 3) పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986, 4) ప్రమాదకర వ్యర్థ పదార్థాల (నిర్వహణ) నియమాలు, 1989.
పైన చెప్పిన అన్ని చట్టాల్లోకి పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 అతి ముఖ్యమైనది. కాలుష్య నియంత్రణకు తీసుకోవలసిన అన్ని చట్టపరమైన చర్యలు, శిక్షలు వగైరా ఇందులో సవిస్తరంగా పొందుపరచారు. ఈ చట్టాలను అమలుచేసి కాలుష్య నివారణ, నియంత్రణ చేయగల అధికారాలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆయా రాష్ట్ర కాలుష్య నివారణ, మండళ్ళకు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, పర్యావరణ చట్టం- ఈ రెండు చట్టాల ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని ఆయా కాలుష్య నియంత్రణ మండలులు దేశంలోని జల వనరులను కాలుష్యం బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యతలు కలిగి వున్నాయి. అయితే ఈ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలులు ఏ మేరకు తమ బాధ్యతలు నిర్వర్తించాయన్నది సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని ముఖ్యమైన కేసుల్లో ఇచ్చిన తీర్పులను బట్టి విశదమవు తుంది. ఆ కేసులు ఇవి:
1) భవానీ నది- శక్తి షుగర్ లిమిటెడ్ (1998)
శక్తి షుగర్ లిమిటెడ్ కంపెనీవారు, తమ వ్యర్థ పదార్థాలను తగు రీతిలో మడుగుల్లో నిలువచేసి, ఆనక శుద్ధి చేసి, విసర్జించే విషయంలో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి కొన్ని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలలో కొన్నిటిని పాటించని కారణంగా ఒకానొక మడుగు నుండి నిలువ చేసిన వ్యర్థ పదార్థాలు కొంతమేరకు మురికి నీటికాల్వల ద్వారా భవానీ నదిలోకి ప్రవేశించి ఆ నదీ జలాలను కలుషితం చేయడం జరిగింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు నదీ జలాలు కలుషితమవడానికి ఆ కంపెనీదే బాధ్యత అని, దాని నిర్లక్ష్య ధోరణి కారణంగానే నదీ జలాలు కలుషితమై పర్యావరణానికి భంగం కలగడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి ప్రమాద హేతువయ్యాయని అభిప్రాయపడి, వెంటనే ఆ పరిశ్రమను మూసివేయ వలసిందిగా తీర్పునిచ్చింది.
2) వినీత్‌కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1996)
గోమ్తీ నదిలో సంభవించిన కాలుష్యం, దాని కారణాలను ఉటంకిస్తూ సుప్రీంకోర్టుకి వినీత్ కుమార్ పెట్టుకున్న అర్జీని రిట్ దరఖాస్తుగా పరిగణించి 15.1.1993న సుప్రీంకోర్టు సంబంధిత పరిశ్రమలకు తమ తమ వ్యర్థ పదార్థాలను శుద్ధిచేసే ప్లాంట్‌లలోని లోపాలను 21.3.93 లోపు తొలగించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మోహన్ మెకిన్స్ బ్రెవరీస్ కంపెనీకి అనుమతి పత్రం ఇవ్వడానికి కాలుష్య నియంత్రణ మండలి నిరాకరించింది. అయితే మరుసటిరోజే తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ కంపెనీకి అనుమతి పత్రాన్ని జారీ చేయడమే కాక, శుద్ధి చేసే ప్లాంట్ లోపాలను తొలగించేందుకు ఆ కంపెనీకి 31.12.93 దాకా గడువిచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా కాలుష్య నియంత్రణ మండలి చేసిన ఈ వెసులుబాటు కోర్టు ధిక్కార చర్యగా పరిగణించబడింది. అయితే తాము ఏ పరిస్థితుల్లో అలాంటి ఆదేశాలు ఇవ్వవలసి వచ్చిందో వివరణ ఇస్తూ సంబంధిత అధికారులు క్షమాభిక్ష పెట్టమని కోర్టును ప్రాధేయపడ్డారు. ఆ అధికారులను కఠినంగా హెచ్చరించడమే కాక తమ హెచ్చరిక ఆదేశాన్ని ఆయా అధికారుల సర్వీస్ రికార్డులలో జతపరచేట్టు సుప్రీకోర్టు ఆదేశమి చ్చింది.
3) వెల్లోరు సిటజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యు.ఓ.ఐ. (1996)
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లోరు ప్రాంతంలో నెలకొని వున్న తోళ్ల పరిశ్రమలు తమ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయకుండా విసర్జించడంతో ఆ వ్యర్థ పదార్థాలు పంట పొలాలు, రోడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాలను ఆక్రమించి విపరీతంగా కాలుష్యం కలిగిస్తున్నాయని ఆ వ్యర్థ పదార్థాలు చివరకు పాలార్ నదిలోకి చేరి ఆ నదీ జలాలను సైతం కలుషితం చేయడం మూలంగా తమకు తాగునీరు కరువైందని వెల్లోరు పౌరులు పెట్టుకున్న ప్రజాహిత అర్జీని సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు తోళ్ళ పరిశ్రమ దేశానికి ప్రధానమైన పరిశ్రమ. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నది. ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. నిజమే! అంతమాత్రంచేత అది పర్యావరణాన్ని నాశనం చేసేట్టుగానూ, ఆరోగ్యానికి భంగం కలిగించేట్టుగా ఉండకూడదు. వికాసం, పర్యావరణం ఈ రెండు ప్రత్యర్థులు అన్న విషయం ఇప్పుడు నిజం కాదు. ఈ రెండింటినీ సమన్వయపరచేదే Substainable Development ‘ముందు జాగ్రత్త సూత్రం’ (the precautionary principle) కాలుష్యం కొరకు మూల్యం చెల్లించాలన్న సూత్రం (Polluter pays principle) ఈ రెండు సూత్రాలు ‘Substainable Development’ కు ప్రధాన అంగాలు అని వివరిస్తూ కాలుష్యానికి కారకాలైన పరిశ్రమలపై జరిమానా విధించటమే కాక వాటిని తాత్కాలికంగా మూయించి, నిర్ధారిత గడువులోగా తోళ్ళ పరిశ్రమలు ఉమ్మడి వ్యర్థ పదార్థాల శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
4) అజయసింగు రావత్ వర్సెస్ యు.ఓ.ఐ. (1995)
అందమైన సీతాకోకచిలుక ‘నైనిటాల్’ గొంగళీ పురుగులా మారుతోంది జల, వాయు, ధ్వని, ‘విఐపి’ కాలుష్యాలు దీనికి ప్రధాన కారణాలు అని విన్నవించుకున్నాడు దరఖాస్తుదారు. స్పందించిన సుప్రీంకోర్టు సంబంధిత కోర్టు నుండి రిపోర్టు తెప్పించుకుంది. ‘ఒకప్పుడు అందంగా అలరారిన నైనిటాల్ సరస్సు చెత్తా చెదారం, మలమూత్రాలు, గుర్రపుపెంట, ప్లాస్టిక్ సంచులు, చిత్తు కాగితాలు మొదలైన అనేక వ్యర్థ పదార్థాలతో నిండిపోయి ముదురుపచ్చగా మారిపోయింది’ అని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు సరస్సులోకి మురికి నీరు చేరకుండా ఆ ప్రాంతాల్లో గుర్రాలు ప్రయాణించకుండా సందర్శకుల వాహనాలపై ఆంక్షలు విధించడమే గాక, అక్రమంగా చెట్ల నరికివేత నిషేధాజ్ఞలు విధిస్తూ, అవసరమైన ఆదేశాలు జారీచేస్తూ తమ ఆదేశాల అమలుతీరు ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకై పర్యవేక్షక సంఘాన్ని ఏర్పాటు చేసింది.
5) ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల కేసు
నక్కవాగు పక్కన వున్న పద్నాలుగు గ్రామ వాసుల తరపున ఇసిలా (ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో- లీగల్ యాక్షన్) అన్న స్వచ్ఛంద సేవాసంస్థ ఒకటి ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన నక్కవాగు ప్రాథమిక శుద్ధి యంత్రాలు కూడా లేని 250 పరిశ్రమలు విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థ పదార్థాల వల్ల మురుగు కాలువగా మారిందని సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. కేసు విచారించిన సుప్రీంకోర్టు జల, వాయు కాలుష్యం మూలంగా తమ పంటలు, పశువులు నష్టబోయిన రైతు లకు కోటి రూపాయలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశమిచ్చింది. అంతేకాక ఆయా పరిశ్రమలు కాలుష్య నియంత్రణకవసరమైన యంత్రాలను సమకూర్చుకునే పనిపై నిఘా వేసేందుకు అధికారులను పురమాయించింది.
6) ఎం.సి.మెహతా వర్సెస్ యు.ఓ.ఐ.
హర్యానాలో సూరజ్‌కుండ్ సరస్సులు సుందరమైన పర్యాటక కేంద్రాలు. ఆ కేంద్రాలకు ఐదు కి.మీ. పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హర్యానా కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించింది. అలా చేస్తే ఎంతో డబ్బు పోసి కొనుక్కున్న తమ ప్లాట్లు కోల్పోతామని, తాము ఎంతో నష్టపోతామని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మున్సిపల్ కార్పొరేషన్ ఫరీదాబాద్, హర్యానా అభివృద్ధి సంస్థ మొదలైనవారు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. ఆ విషయం పైన జాతీయ పర్యావరణ ఇంజనీరింగు పరిశోధన సంస్థ నుండి ప్రత్యేకమైన నివేదిక తెప్పించుకున్న సుప్రీంకోర్టు ముందు జాగ్రత్త సూత్రాన్ని అమలుచేసి పర్యావరణం నష్టం కాకుండా కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. బడ్కల్, సూరజ్‌కుండ్ సర స్సులకు పర్యావరణ హాని కలగకుండా ఉండేందుకు ఆ సరస్సుల దరిదాపుల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు అని ఆదేశమిచ్చింది.
7) దేశంలో నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాల పరిస్థితిని శ్రీ ఎం.సి మెహతా పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా భూగర్భ జలాల స్థాయిని, నాణ్యతను కాపాడే నిమిత్తం కేంద్ర భూగర్భ జల మండలిని కేంద్ర భూగర్భ జల అథారిటీగా నియమిస్తూ పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 అనుసరించి చర్యలు చేపట్టవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశమిచ్చింది.
దీన్నిబట్టి తేలేదేమంటే, నదులు, సరస్సులు, భూగర్భ జలాలను కాలుష్యం కోరల నుండి కాపాడటానికి అవసరమైన చట్టాలున్నాయి. చట్టాలను అమలు చేయవలసిన కాలుష్య నియంత్రణ మండలులున్నాయి. కాని అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు పని జరగడం లేదు. ఏ వ్యక్తో, స్వచ్ఛంద సేవా సంస్థో పని గట్టుకుని సుప్రీంకోర్టు, హైకోర్టుల దృష్టికి తెస్తే తప్ప కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టబడటం లేదు. కాలుష్యం నివారించడానికి, నియంత్రించడానికి, నియమించబడ్డ అధికారులు, కాలుష్య కారకాలైన పరిశ్రమలకు పర్మిట్లు స్వేచ్ఛగా ఇచ్చి తమ జేబులు నింపుకుంటున్నారు. కంచె చేనుని మేస్తే కాపాడేదెవరు?