నీటి ప్రాముఖ్యతను, కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా నీటి విషయంలో సంక్రమించిన అధికారాలు, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని యావత్ దేశానికి ఉపయోగపడే జాతీయ జల విధానాన్ని రూపొందించాలని భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగా యోచిస్తోంది. 1987లో మొదటిసారి, ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ జలవనరుల పరిషత్తు (నేషనల్ వాటర్ రీసోర్సెస్ కౌన్సిల్) సమావేశమై జాతీయ జలవిధానాన్ని ఆమోదించింది. ఈ జాతీయ జల వనరుల పరిషత్తు 1983లో ఏర్పడింది. ఈ పరిషత్తులో సంబంధిత కేంద్రమంతులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. సభ్యులు అందరికీ అంగీకారయోగ్యంగా ఉంచే ప్రయత్నంలో జాతీయ జల విధానం కొంతవరకు నిర్వీర్య డాక్యుమెంటుగా మారింది. మొదట ప్రతిపాదించిన ముసాయిదాలోని అనేక క్లాజులను రాజీమార్గంగా మార్చవలసి వచ్చింది. ఫలితంగా వెలువడిన జాతీయ జలవిధానంలోని ముఖ్యమైన అంశాలు ఇవి:
- అభివృద్ధి ప్రణాళికలో అత్యంత కీలకమైనది నీరు. అరుదైన, విలువైన జాతీయ వనరు కనుక సమీకృత ప్రాతిపదికన, పర్యావరణ పరిరక్షణ, సంబంధిత రాష్ట్రాల అవసరాల దృష్ట్యా ఈ వనరును అభివృద్ధి పరచుకోవాలి, కాపాడుకోవాలి.
- ఏ ప్రణాళికకైనా మూలాధారం పటిష్టమైన సమాచార వ్యవస్థ. ప్రామాణికమైన సమాచార వ్యవస్థను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి. వివిధ సంస్థలు స్వేచ్ఛగా పరస్పరం డేటాను ఇచ్చి పుచ్చుకోవాలి. నీటి లభ్యత, నీటి వినియోగంపైనే కాకుండా వివిధ ప్రయోజనాలకోసం భవిష్యత్తు నీటి అవసరాలను విశ్వసనీయంగా సమగ్రంగా అంచనా వేయగల వ్యవస్థ ఏర్పాటు కావాలి.
- దేశంలో లభించే జల వనరులను వీలైనంత మటుకు ఉపయోగించాలి. నష్టాలను తగ్గించి ఎక్కువ మోతాదులో నిలువ చేసే ప్రక్రియ చేపట్టి వనరులను పరిరక్షించుకోవాలి. విడి విడి అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్రాలు రూపొందించాలి. అవి బేసిన్, లేక ఉప బేసిన్ సమగ్ర ప్రణాళిక చట్రంలో భాగమై ఉండటంద్వారా సాధ్యమైనంతమేరకు ఉత్తమ ప్రాజెక్టులను రూపొందించవచ్చు. నదీ బేసిన్‌ని మొత్తంగా పరిగణించి అభివృద్ధి పరచడం, నిర్వహించడంకోసం సముచితమైన సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకమైన బహు శాఖలకు చెందిన సిబ్బందితో కూడిన యూనిట్లను (మల్టీ డిసిప్లినరీ యూనిట్స్) ఏర్పాటు చేయడం ద్వారా నీటి పారుదలే కాకుండా అన్ని అవసరాలను తీర్చగల సమగ్రమైన ప్రణాళికలను తయారు చేయవచ్చు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటి కొరత వున్న ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి నీరుని బదిలీ చేయాలి. అయితే ఆయా బేసిన్లు లేక ప్రాంతాల అవసరాలు తీరిన తరువాతే ఈ బదిలీ చేయవలసి ఉంటుంది. ఒక్కసారి వాడిన నీటిని మళ్ళీ ఉపయోగించడ మనేది (రీసైక్లింగు అండ్ రీ యూజ్) జల వనరుల అభివృద్ధి పథకంలో ఓ అంగమై ఉండాలి.
- జల అభివృద్ధి పథకాలను వీలైనంతమటుకు బహుళార్థ సాధక ప్రాజెక్టులుగా రూపొందించాలి. ప్రణాళిక దశలోనూ, అమలు చేసే దశలోనూ, పర్యావరణ సమతుల్యం కాపాడం ప్రథమ కర్తవ్యం అయివుండాలి. ప్రాజెక్టులు రూపొందించినపుడు, అమలు చేస్తునప్పుడు, పరీవాహక ప్రాంత రక్షణ, పర్యావరణ రక్షణ, ప్రాజెక్టు మూలంగా ప్రభావితులైన వారికి సహాయం తదితర విషయాలతో కూడిన మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ను చేపట్టాలి. బలహీన వర్గాలు, గిరిజనులు, షెడ్యూలు జాతులు, షెడ్యూలు వర్గాలకు లాభం చేకూర్చే ప్రాజెక్టులను రూపొందించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి తాగునీరు విధిగా అందించాలి. వీలైనంతమటుకు సాగునీరు, విద్యుత్ అందించే ప్రయత్నం చేయాలి.
- భారీ వ్యయంతో నిర్మించిన కట్టడాల వ్యవస్థ సరిగ్గా ఉండేట్టు చూడాలి. అవసరమైన మరమ్మత్తులు, ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టాలి.
- డ్యాములు, ఇతర నీటి సంబంధమైన కట్టడాలు సురక్షితంగా ఉండేందుకు వీలైన వ్యవస్థాగత ఏర్పాట్లు చేయాలి.
- భూగర్భ జల పరిమాణాన్ని అంచనా వేసేందుకై తరచుగా శాస్త్రీయ పద్ధతిన అధ్యయనం చేయాలి. సామాజిక సమానత ఉండేట్టు, రీఛార్జీని మించకుండా, భూగర్భ జలాల వెలికితీతను క్రమబద్ధీకరించాలి- ప్రాజెక్టు రూపొందించే దశలోనే ఉపరితల జలాలు, భూగర్భ జలాల సమగ్ర అభివృద్ధి, మిశ్రమ వినియోగం జరిగేట్టు చూడాలి. సముద్ర తీరం దగ్గర భూగర్భ జలాలను వెలికితీసే సమయంలో ఉప్పునీరు, తీయటి నీరుని కలుషితం చేసే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ పనిని అతిగా చేయకూడదు.
- ప్రాధాన్యత పరంగా నీటి పంపిణీ, కేటాయింపు ఈ ప్రయోజనాల కోసమే ఉంటుంది.
- మొదటి ప్రాధాన్యత- తాగునీరు
- రెండవది- సాగునీరు
- మూడవది- విద్యుచ్ఛక్తి
- నాలుగవది- జల రవాణా
- అయిదవది- పారిశ్రామిక, ఇతర ప్రయోజనాలు
అయితే ప్రాంతాన్ని బట్టి ప్రాధాన్యత మార్చుకోవచ్చు.
- సాగునీరు ప్రాజెక్టులు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో తాగునీటి వసతి తప్పక ఏర్పాటు చేయాలి.
- ఎక్కువగా దిగుబడి సాధించడంకోసం సాగునీరును వీలైనంత ఎక్కువ రైతు కుటుంబాలకు అందచేయాలి. సాగునీటి ప్లానింగు చేస్తున్నప్పుడు, భూమి సాగుకు పనికొస్తుందా లేదా అన్న విషయంతో పాటు అన్ని రకాల నీటి వనరులను, సముచితమైన సాగునీటి సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ తక్కువ ఖర్చుతో సాగు చేయగల ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. సాగునీటి వ్యవస్థలో నీటి కేటాయింపు, సమానత, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ జరపాలి.
- నీటి వినియోగదారులకు అమూల్యమైన నీటి విలువ తెలిసేలా నీటి తీరువా నిర్ధారించాలి. వార్షిక ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయిన్‌టెయినెన్స్) చార్జీలే కాకుండా, కట్టడాలపై అయిన ఖర్చులో కొంత భాగం కూడా నీటి తీరువా భరించగలిగేలా ఉండాలి.
- సాగునీటి వ్యవస్థ నిర్వహణలో రైతులను క్రమక్రమంగా భాగస్వాములను చేయాలి. రైతులు సమర్థంగా నీటిని వినియోగించే విషయంలో స్వచ్ఛంద సేవాసంస్థల సేవలనుపయోగించాలి.
- ఉపరితల జలం, భూగర్భ జలాల నాణ్యతను పరిరక్షించే కార్యక్రమాలను చేపట్టాలి.
- దేశంలో నీటి లభ్యత దృష్ట్యా జోనింగు చేయాలి. ఆ జోనింగు ప్రకారమే ఆర్థికపరమైన కార్యక్రమాలు (వ్యవసాయ, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి వగైరా) చేపట్టాలి.
- నీరు అరుదైన, విలువైన వనరు. దీన్ని కాపాడుకోవాలి అన్న విషయాన్ని ప్రచారం ద్వారా, క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రోత్సాహకాల ద్వారా తెలియజేయాలి.
- వరదకు గురయ్యే ప్రాంతంలో వరద నియంత్రణ, నిర్వహణ కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. వరద ఉధృతి తగ్గించేందుకు అడవుల పరిరక్షణ, పరీవాహక ప్రాంత పరిరక్షణ, చెక్‌డ్యాంల నిర్మాణం మొదలైన వాటర్‌షెడ్ పథకాలు చేపట్టాలి. వరదలను పసిగట్టి ముందుగా హెచ్చరికలు విడుదలచేసే యంత్రాంగాన్ని విస్తరింపచేయాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రతీర ప్రాంతాలు దురాక్రమణకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలి.
- నీటి వనరుల సమర్థమైన, పొదుపుగా వినియోగం సాధించేందుకై నీటికి సంబంధించిన వివిధ రంగాలలో పరిశోధనలు విస్తృతంగా జరపాలి.
- జలవనరుల అభివృద్ధి పథకాలలో ప్రామాణిక శిక్షణ ఒక భాగమై ఉండాలి. అనేక మంచి, గొప్ప విషయాలు ప్రవచించిన జాతీయ జల విధానం ‘నీతి చంద్రిక’లా నీతులు వల్లిస్తూనే ఉంది గాని ఏ రాష్ట్రమూ దీన్ని పాటించిన పాపాన పోలేదు. జాతీయ జల వనరుల పరిషత్తు ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ జల మండలి (నేషనల్ వాటర్ బోర్డు) జాతీయ జల విధానంలోని సిఫారసులను అమలు చేసేందుకై చేసిన ప్రయత్నాలను భగ్నంచేసి, రాష్ట్రాలు స్వప్రయోజనాల గురించి ఆలోచించడం కారణంగా ఈ జాతీయ జల విధానం ఉన్నది అని చెప్పుకుని సంతృప్తి పడటం తప్ప వాస్తవానికది ఉండీ లేనట్టే. కొంతకాలంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను దృష్టిలో వుంచుకుని 1987 జాతీయ జల విధానంలో మార్పులు చేసి కొత్త విధానాన్ని ఆమోదం కోసం 2000లో ఏర్పాటైన జాతీయ జల వనరుల పరిషత్తు సమావేశంలో ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తు ఆ సమావేశంలో ‘సెగపొగలు’ లేచి చర్చ నిరవధికంగా వాయిదా పడింది.