Feed on
Posts
Comments

ఆలమట్టి

అలనాటి మైసూరు రాష్ట్రం 1960లో దుర్భిక్ష ప్రాంతాలైన బీజాపూర్‌, గుల్బర్గా, రాయచూర్‌ జిల్లాల లబ్ధికోసం అప్పర్‌కృష్ణా ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టులో రెండు డ్యాంలు ఉన్నాయి. 1. ఆలమట్టి 2. నారాయణపూర్‌. ఈ ప్రాజెక్టు కాలక్రమంలో కొన్ని మార్పులకు గురైంది. 1963లో శాంక్షన్‌ ప్రకారం ఈ ప్రాజెక్టు 103 టిఎంసిల (శతకోటి ఘనపు అడుగులు) కృష్ణా నీటిని వినియోగించుకోవచ్చు. అప్పర్‌ కృష్ణా స్టేజ్‌-1గా ఆమోదించబడ్డ ఈ ప్రాజెక్టులో నారాయణపూర్‌ డ్యాం, ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువ నిర్మించబడాలి. ఈ ప్రాజెక్టు కింద గుల్బర్గా, రాయచూర్‌ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. ఈ ప్రాజెక్టు శాంక్షన్‌ ఎస్టిమేట్‌లో నారాయణపూర్‌ డ్యాంకు ఎగువన ఉన్న ఆలమట్టి డ్యాం పునాదులు కూడా తీసేందుకు వీలు కల్పించబడింది.

ఈ 103 శ.కో.ఘ. అడుగులకు అదనంగా మరో 125 శ.కో.ఘ. అడుగుల నీటిని వినియోగించుకోవడానికి కర్నాటక తమ క్లెయిమ్‌ని బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట పెట్టింది. అయితే కర్నాటక ఆమోదించిన ప్లాన్‌ప్రకారం నారాయణపూర్‌ నుండి మొత్తం 103 శ.కో.ఘ. అడుగుల నీరు ఎడమగట్టు కాలువ ద్వారానే వినియోగింపబడుతోంది. కుడిగట్టు కాలువ అసలు నిర్మింపబడనేలేదు. శాంక్షన్‌ అయిన ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం కుడిగట్టు కాలువ 52 శ.కో.ఘ. అడుగుల నీటిని ఉపయోగించుకొనవలసి ఉంది. ట్రిబ్యునల్‌ ఈ కారణంగా అప్పర్‌కృష్ణా ప్రాజెక్టుకు అదనంగా మరో 52 శ.కో.ఘ. నీటి వినియోగాన్ని కేటాయించింది. అంటే ట్రిబ్యునల్‌ ప్రకారం అప్పర్‌ కృస్ణా ప్రాజెక్టు మొత్తం 155 శ.కో.ఘ. అడుగుల నీటిని వినియోగించుకోవచ్చు.

ఈలోగా కర్నాటక ప్రభుత్వం కృష్ణా నదిలోని తన వాటా మొత్తం 700 శ.కో.ఘ. అడుగుల వినియోగంలో కొంత సర్దుబాటు చేసి అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టులో ట్రిబ్యునల్‌ కేటాయించిన 155 శ.కో.ఘ. అడుగులకు బదులుగా 173 శ.కో.ఘ. అడుగుల నీటిని ఉపయోగించుకోవాలని తలపెట్టింది. దీన్ని రెండు స్టేజీలుగా తలపెట్టాలని యోచించింది. మొదటి స్టేజీలో 119 శ.కో.ఘ. అడుగుల నీటిని వినియోగించుకుని 4.25 లక్షల హెక్టేర్లను సాగుచేస్తుంది. ఈ స్టేజికి 1990లో ప్లానింగు కమిషన్‌ నుంచి పెట్టుబడి క్లియరెన్స్‌ లభించింది. స్టేజి 2లో 54 శ.కో.ఘ. అడుగుల నీటిని వినియోగించి 1.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందివ్వడమే కాక 297 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన చేస్తుంది. ఈ రకంగా 173 శతకోటి ఘనపు అడుగుల నీటి వినియోగానికి ఆలమట్టి జలాశయంలో అవసరమైన పూర్తి జలాశయస్థాయి 518.7 మీటర్లు. కాని కర్నాటక ప్రభుత్వం ఆలమట్టి పూర్తి జలాశయ స్థాయిని 524.25 మీటర్లుగా నిర్ధారించింది. ఇది 173 శ.కో.ఘ. అ. నీటికంటే అదనంగా ఎంతో నీటిని నిలువచేయగల సామర్థ్యం కలిగి ఉందన్నమాట.

ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం తెలిపింది. అభ్యంతరాలు ఇవి:

  1. డ్యాం ఎత్తు చాలా ఎక్కువ. ఈ ప్రాజెక్టు కోసం ట్రిబ్యునల్‌ కేటాయించిన 155 శతకోటి ఘనపు అడుగుల నీటిని వినియోగించు కోవాలంటే జలాశయ సామర్థ్యం 103 శ.కో.ఘ. అడుగులుంటే చాలు.
  2. కర్నాటక అదనపు జలాల్ని ఆలమట్టిలో నిలువచేస్తే జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో దిగువ ప్రాంతాలకు ప్రవహించే నీరు గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఈ నెలలలో నాగార్జునసాగర్‌, శ్రీశైలం విద్యుదుత్పాదన పడిపోతుంది. నాగార్జునసాగర్‌ ఆయకట్టు, కృష్ణాడెల్టా వ్యవసాయ పనులు కూడా దెబ్బతింటాయి. కర్నాటక ప్రభుత్వం తలపెట్టిన చర్య కృష్ణా ట్రిబ్యునల్‌కి విరుద్ధం.

ఆగస్టు 1996 ప్రధానమంత్రి, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, నీటిపారుదల మంత్రులు, సీనియర్‌ అధికారులతో ఈ సమస్యను చర్చించారు. కర్నాటక ప్రభుత్వం ఆలమట్టి డ్యాం ఎత్తును తగ్గిస్తేనే వారు తమ వాటాకన్న ఎక్కువ నీటిని వాడరన్న భరోసా తమకు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ నొక్కిచెప్పింది. డ్యాం ఎత్తును పెంచినా తాము తమ వాటా నీటికన్నా అదనంగా ఉపయోగించమని కర్నాటక హామీ ఇచ్చింది. తన వాటా నీటిని మాత్రమే వాడుకుంటానని మహారాష్ట్ర భరోసా ఇచ్చింది.

ఈ సమావేశంలో ఏమీ తేలకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక వాదనలు విని సమస్యను పరిష్కరించవలసిందిగా నలుగురు ముఖ్యమంత్రులతో కూడిన ఒక ప్యానల్‌ని కేంద్రం అర్థించింది. ఈ ప్యానల్‌లో అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, ఆనాటి బీహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, అస్సాం ముఖ్యమంత్రి మహంతో ఉన్నారు. ఈ ప్యానల్‌ తమ వంతుగా 9 మంది ఇంజనీర్లతో కూడిన ఒక సాంకేతిక కమిటీని నియమించింది. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, తమిళనాడు, అస్సాం, ప్రణాళికా సంఘం, కేంద్ర జలసంఘం సభ్యులు డ్యాంసైటుని సందర్శించి చర్చలు జరిపి ముఖ్యమంత్రుల ప్యానెల్‌కి తమ నివేదిక అందజేశారు.

ఈ లోగా బచావత్‌ అవార్డు గురించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఓ రిట్‌ పిటిషన్‌ దాఖలు కావడం, దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. తమ తీర్పులో హైకోర్టు, ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా చూస్తామని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని కేంద్రం ఇచ్చిన హామీని ప్రస్తావించింది. ఈలోగా ఇప్పుడు 509 మీటర్ల ఎత్తున్న ఆలమట్టిని 524 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళాలని కర్నాటక యోచిస్తోందని కర్నాటక యోచనలకనుగుణంగా క్రెస్ట్‌ నిర్మాణం జరుగుతోందని, దీన్ని నిరోధిం చవలసిందిగా ఆంధ్ర అర్జీ పెట్టుకుంది. ఆరోపణ ప్రత్యారోపణల మధ్య సుప్రీంకోర్టు తమ అంతిమ నిర్ణయాన్ని 2000 ఏప్రిల్‌ 25న తెలియజేసింది. నిర్ణయాలు ఇలా ఉన్నాయి:

  1. కర్నాటక ఆలమట్టి ఎత్తును (ప్రస్తుతం స్థాయి 509 మీటర్లు) 519.6 మీటర్ల దాకా తీసుకెవెళ్ళవచ్చు. (ముఖ్యమంత్రులు నియమించిన ఇంజనీర్ల కమిటీ డ్యాం ఎత్తుని 519 మీటర్లకు పెంచవచ్చని సిఫారసు చేసింది) అయితే ఇందుకు అవసరమైన అనుమతులు అటు పర్యావరణానికి సంబంధించినవి, ఇటు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి పొందవలసి ఉంటుంది.
  2. ట్రిబ్యునల్‌ తమ అవార్డులో ‘స్కీం ఎ’ని మాత్రమే ప్రస్తావించింది. అందులో వివిధ రాష్ట్రాలకు నీటి పరిమాణాన్ని కేటాయించింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన అవార్డు రాష్ట్రాలకు గుండుగుత్తగా (ఎన్‌బ్లాక్‌ బేసిస్‌) నీటిని కేటాయించింది.
  3. అవార్డులో డ్యాం ఎత్తుపై ఎలాంటి నిషేధం లేదు. (కర్నాటక 524 మీటర్ల ఎత్తుదాకా ఆలమట్టి పెంచకుండా శాశ్వత చట్టబద్ధమైన, ఇంజక్షన్‌ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థనను సుప్రీం తిర్కరించింది).
  4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దిగువన ఉన్న రాష్ట్రం ‘స్కీం ఎ’ ప్రకారం కృష్ణా అదనపు జలాలను (ఆ నీటిపై హక్కు పొందకుండా) వినియోగించుకునే స్వేచ్ఛ ఆ రాష్ట్రానికుంది. ఆంధ్ర రూపొందించే కొత్త, పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించకూడదు.

కర్నాటక ఆలమట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచితే తమ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు మునిగిపోతాయన్న మహారాష్ట్ర అప్పీలుకి జవాబిస్తూ సుప్రీంకోర్టు, ఇది ‘జల వివాదం’ కింద వస్తుంది. కాబట్టి దీని పరిష్కారం కోసం ఆ రాష్ట్రం కేంద్రాన్ని సంప్రదించి దీనిపై ట్రిబ్యునల్‌ తీర్పు పొందవలసిందిగా సలహా ఇచ్చింది. అన్నింటికంటే ఓ విప్లవాత్మకమైన నిర్ణయం ఈ సందర్భంగా వెలువడింది. రాజ్యాంగంలోని 262 అధికరణ, అంతర్‌ రాష్ట్ర జలవివాద చట్టం 1956 సెక్షన్‌ 11 అనుసరించి, అంతర్‌రాష్ట్ర నదికి సంబంధించిన తగాదా విషయంలో సుప్రీంకోర్టుకు గాని, మరే ఇతర కోర్టుకు గాని అధికార పరిధి (అతిజీరిరీఖిరిబీశిరిళిదీ) లేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 131వ అధికరణ ప్రకారం తమకు హక్కు ఉందని ఉద్ఘాటించింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని 131 అధికరణ ఏమంటుందో చూద్దాం.

ఏదైనా తగాదా…

  1. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేక ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య.
  2. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా ఎక్కువ రాష్ట్రాలు ఒక పక్క మరో పక్క ఒకటి లేక ఎక్కువ రాష్ట్రాలుండి వాటిమధ్య…
  3. రెండు లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలమధ్య ఏర్పడితే సుప్రీంకోర్టుకు ఆ తగాదా తీర్చే విషయంలో అధికారముంది…

రాజ్యాంగంలో ఇతరత్రా ఏమి ఉన్నా ఖాతరు చేయకుండా అంతర్‌రాష్ట్ర నదీబేసిన్‌ నీటి విషయంలో ఏర్పడిన తగాదాలో సుప్రీంకోర్టు గాని, మరే ఇతర కోర్టు గాని తల దూర్చకూడదని, పార్లమెంట్‌ చట్టం చేయవచ్చని రాజ్యాంగంలోని 262 అధికరణ పేర్కొంది.

ఈ అధికరణ అనుసరించే పార్లమెంటు అంతర్‌ రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 ఆమోదించింది. మున్ముందు న్యాయనిపుణులు ఈ విషయమై ఏమంటారో వేచిచూడాలి. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పుతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టు కాదు. తాత్కాలికంగా తెరపడ్డట్టే అయింది. ఈ తీర్పు ఏ రాష్ట్రాన్నీ సంతృప్తి పరిచినట్టు లేదు. ఏదేమైనా ఆలమట్టిని 524 మీటర్ల ఎత్తుకు పెంచితీరతామని కర్నాటక ప్రతిజ్ఞలు చేస్తోంది. అలా ఎంతమాత్రం పడనివ్వమని ఆంధ్రరాష్ట్రం పట్టుపడుతోంది.

నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు!

సుప్రీంకోర్టు బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డును పరిశీలించి ఇచ్చిన తీర్పు ప్రకారం కర్నాటక ఆలమట్టి ఎత్తును నిరభ్యంతరగా పెంచుకోవచ్చు. అలా పెంచుకోవడం మూలంగా మన రాష్ట్రానికి ఆలస్యంగా నీరు రావడంవల్ల కలిగే నష్టానికి కర్నాటక బాధ్యత వహించదు. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో మూడు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులో ఆయా రాష్ట్రాల ప్రాజెక్టులకు ఇంతింత అని నిర్ధారించినా ఆ పరిమాణాన్నే ఆయా ప్రాజెక్టుల్లో వాడుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. ఉదాహరణకు కర్నాటకకు ట్రిబ్యునల్‌ మొత్తం 700 టిఎంసిల నీటిని కేటాయించింది. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకింత అని నిర్ధారించి ఆ ప్రాతిపదికన రాష్ట్రం మొత్తంగా వచ్చిన అంకెను ట్రిబ్యునల్‌ రిపోర్టులో పొందుపరిచింది. కర్నాటకకు జరిపిన 700 టిఎంసిల నీటి కేటాయింపులో అప్పర్‌ కృష్ణ ప్రాజెక్టు (ఆలమట్టి, నారాయణపూర్‌)కు 155 టిఎంసిల వినియోగాన్ని చూపించడం జరిగింది. కర్నాటక తన మొత్తం వాటా 700 టిఎంసిలను మించకుండా తన రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల వినియోగంలో సర్దుబాటు చేసి అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టుకు 173 టిఎంసిల వినియోగించుకుంటానంటే అది ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించినట్టు కాదు. అన్ని రాష్ట్రాలకు కూడా అలాంటి సదుపాయాన్ని బచావత్‌ ట్రిబ్యునల్‌ కలిగించింది.

సరిగ్గా ఇదే సాకుని చూపి కర్నాటక ఎగువతుంగ (Upper Tunga) (పాజెక్టును చేపట్టడం సక్రమమే అని వాదిస్తోంది. ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కర్నాటక తుంగభద్ర జలాలను 295 టిఎంసిల మేరకు వినియోగించుకోవచ్చు. ఇందులో తుంగ ఆనకట్టకు 11.50 టిఎంసిల నీరు కేటాయింపు మాత్రమే ఉంది. నీటిపారుదల సంఘం (Irrigation Commission) 1972లో సమర్పించిన నివేదికలో రాయచూర్‌ జిల్లాలోని కొప్పల్‌ తాలూకా, ధార్వాడ్‌ జిల్లాలోని ముందర్గి, రానెబెన్నూర్‌ తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా పేర్కొంది. ఈ క్షేత్రాలకు సాగు నీరందించే నిమిత్తం 20 టిఎంసిల నికర జలాలు, 20 టిఎంసిల మిగులు జలాలు వెరసి 40 టిఎంసిల తుంగభద్ర నీటిని ఉపయోగిస్తూ కర్నాటక తలపెట్టిన అప్పర్‌ తుంగ ప్రాజెక్టును ట్రిబ్యూనల్‌ అంగీకరించలేదు. తుంగభద్రలో లభ్యమయ్యే నీటిపై మరికొంత అధ్యయనం జరిపేంత వరకు కర్నాటక కోరిక పరిశీలించిదగ్గదిగా లేదని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. అంటే- ఎగువతుంగ ప్రాజెక్టుకు తుంగభద్రలో సరిపడా నీరులేదు అన్న కారణంగా ట్రిబ్యునల్‌ దానికి నీటి కేటాయింపు జరపలేదు.

అయితే కర్నాటక ‘ఆల్మట్టి’ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ ఆధారంగా తుంగభద్ర జలాలలో తనకు లభించిన 295 టిఎంసిల నీటిని మించకుండా ఆ బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల వినియోగాలలో మార్పులు చేసి ఎగువ తుంగను కట్టుకుంటానని వాదిస్తోంది. ట్రిబ్యునల్‌ final orderలో తుంగభద్ర డ్యాం నుంచి, రాజోలిబండ ఆనకట్ట నుండి విడుదలయ్యే నీటిని ఏ రకంగా వాడాలో నిర్ధారించింది. కాని తుంగభద్ర డ్యాంకు ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో గాని, ఇతర ప్రాజెక్టుల్లో గాని ఇంత నీరు వాడుకోవాలన్న ఖచ్చితమైన నిబంధన ఏదీ పెట్టలేదు. కాకపోతే ఆంక్ష పెట్టిందల్లా మొత్తం తుంగభద్ర సబ్‌ బేసిన్‌ నుంచి కర్నాటక 295 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌ 127.5 టిఎంసిలకన్నా హెచ్చుగా వాడుకోకూడదని మాత్రమే. తుంగభద్ర డ్యాంద్వారా మొత్తం వినియోగం 230 టిఎంసిలు, ఇందులో కర్నాటక 151.50 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌ 78.50 టిఎంసిలు ఉపయోగించుకుంటాయి. రాజోలిబండ నుంచి కర్నాటక 1.2 టిఎంసిలు, మన రాష్ట్రం 15.9 టిఎంసిలు వాడుకోవాలని కూడా నిబంధన ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి కోల్పోయే ఆవిరి నష్టాన్ని కూడా రెండు రాష్ట్రాలు నిర్ధారించిన పద్ధతిలో పంచుకోవాలని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్‌ అంతిమ ఆదేశాలకు లోబడి కర్నాటక తుంగభద్ర డ్యాంకు ఎగువన ఉన్న ప్రాజెక్టులు, ఉదాహరణకు తుంగ ఆనకట్ట, భద్ర ఆనకట్ట, భద్ర జలాశయం, ఇంకా ఇతర ప్రాజెక్టుల వినియోగంలో సర్దుబాటు చేసి పాత ప్రాజెక్టులకు గాని, కొత్త ప్రాజెక్టులకు గాని నీటిని వాడుకుంటే చట్టపరంగా అభ్యంతరముండదు.తుంగభద్రకు ఎగువన ఉన్న ప్రాజెక్టులలో ఎక్కువ వినియోగం చేసుకుంటే తుంగభద్ర డ్యాంపై ఆధారపడ్డ ఆంధ్ర, కర్నాటక ఆయకట్టలు దెబ్బతినడం సహజం. ఇది వాస్తవ పరిస్థితే అయినా ట్రిబ్యునల్‌ అంతిమ ఆదేశాలను అనుసరించి ఎగువ తుంగ ద్వారా 20 టిఎంసిల (ప్రస్తుత ప్రతిపాదన) నీరును వాడుకోవడం చట్ట విరుద్ధం కాదు. అంటే తుంగభద్ర బేసిన్‌లో ఎగువతుంగ నిర్మించి 20 టిఎంసిల నీరు వాడుకున్నా, ఆలమట్టి ఎత్తును పెంచి 173 టిఎంసిలు లేక అంతకన్నా ఎక్కువ వాడుకున్నా, ఈ చర్యలేవీ ట్రిబ్యునల్‌ ఆదేశాలకు గాని, సుప్రీంకోర్టు తీర్పుకు గాని విరుద్ధం కావు. కాకపోతే కర్నాటక చేయవలసిందల్లా తుంగభద్ర, కృస్ణా జలాల కేటాయింపు పరిమితులను దాటకుండా ఉండటమే. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్నేమిటంటే కర్నాటక తుంగభద్రలో 295 టిఎంసిల వినియోగం, కృష్ణాలో మొత్తం 700 టిఎంసిల వినియోగం మించకుండా, తనకు అనువుగా ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగం చేసుకుంటే, ఆ ప్రక్రియల మూలంగా ఆంధ్రప్రదేశ్‌ నష్టం చేకూరితే దానికి పరిష్కారమేమిటి అన్నది. ఇంతేకాక కర్నాటక తుంగభద్రలో 295 టిఎంసిలు మొత్తం కృష్ణాలో 700 టిఎంసిల మాత్రమే వాడుకుంటోందన్న గ్యారంటీ కూడా ఏమిటి? పంపిణీని పర్యవేక్షించడానికి సమర్థమైన యంత్రాంగం లేదు కదా! అయితే దీనికంతటికీ మన రాష్ట్ర స్వయంకృతాపరాధమే కారణం. వివిధ కారణాలవల్ల మనం ట్రిబ్యునల్‌ సూచించిన స్కీం ‘బి’ ఒప్పుకోలేదు. స్కీం ‘బి’లో అమలు కాలేదు. స్కీం ‘ఎ’ ప్రకారం మనకు మన వాటాకన్నా ఎక్కువ నీరందినా, తక్కువ నీరందినా మనం పై రాష్ట్రాలనేమీ అనలేం. అనుభవించవలసిందే.

ఇదిలా ఉండగా మన రాష్ట్రం తలపెట్టిన తెలుగుగంగ, శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణాలు అక్రమమని, వాటికి నికర జలాల కేటాయింపు లేదని, కర్నాటక అభ్యంతరం చెప్తూ వాటిని ఆపివేయవలసిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాకు నికర జలాల కేటాయింపు లేకపోయినా, అదనపు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఉంది. పైగా ఈ ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీశాఖల అనుమతి ఉంది. కర్నాటక తుంగ ప్రాజెక్టుకు అటు నికర జలాల కేటాయింపు లేదు. అదనపు జలాలను వాడుకునే అధికారం లేదు. పైగా దానికి పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ పర్మిషన్‌ లేదు. కనుక తుంగ డ్యాం నిర్మాణం అక్రమం అంటూ సుప్రీంకోర్టుకు మన రాష్ట్రం అఫిడవిట్‌ సమర్పించుకుంది.

ఈ తతంగాన్ని పరిశీలిస్తే రెండు రాష్ట్రాలు కూడా తమకు అనువైన నిర్మాణాలు చేపడ్తూ నిందను అవతిలివాళ్లపైన వేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ‘నాది రైటు, నీది తప్పు’ అన్నట్టుగా ఉంది ఇరు రాష్ట్రాల ధోరణి.

ఇదిలా ఉండగా, కర్నాటక నిర్మిస్తున్న ‘ఎగువ తుంగ’ ప్రాజెక్టుకు తీవ్రమైన అభ్యంతరం తెలుపుతూ, అది పూర్తి అవుతే తుంగభద్రకు నీరు రాకుండా పోతుందన్న సీమ రైతుల కలవరం గురించి ఇంతగా వాపోతున్న ప్రభుత్వం రాయలసీమలో చేపడుతున్న అనేక అనధికార ప్రాజెక్టుల వల్ల, ఇంకా విద్యుత్‌ ఉత్పాదన మిషతో సాగర్‌ జలాశయంలో కనీస మట్టాన్ని (510 అడుగులు) తాకనీయకుండా రిజర్వాయర్లోకి వచ్చిన నీటినంతా కృష్ణా డెల్టాకు సరఫరా చేస్తూ- సాగర్‌ ఆయకట్టును, ముఖ్యంగా ఎడమ కాలువ ఆయకట్టును ఎండబెడుతున్న ప్రభుత్వం తెలంగాణ రైతుల ఆవేదన, దుగ్ధ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నది విజ్ఞులు ఆలోచించవలసిన విషయం. కర్నాటక చేస్తే తప్పు. అదే పని మన రాష్ట్రం చేస్టే ఒప్పు! ఇదెక్కడి న్యాయం! కర్నాటక వేరే రాష్ట్రం కాబట్టి దాని చర్యలను మనం తప్పు పట్టవచ్చు. మన రాష్ట్రంలో మనం చేస్తున్న పనులవల్ల కొన్ని ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లినా అది ఆంతరంగిక సమస్య కనుక మనం పట్టించుకోనక్కర్లేదు. కృష్ణా జలాలు మన రాష్ట్రంలో ఎక్కడో అక్కడ సద్వినియోగమవుతూన్నయి కదా అని తృప్తిపడి ఊరుకోవాలి. అదే నీతిని మరికాస్త దూరం తీసుకెళ్ళి మనందరిదీ ఒకే దేశం కదా, మన జలాలు మన దేశంలోనే ఏదో ఓ రాష్ట్రంలో సద్వినియోగమవు తున్నాయి కదా, ఇతర దేశాలకు వెళ్లడం లేదు కదా అని ఊరుకుంటే సరిపోలా? ఇంతకీ చెప్పొచ్చేదేమంటే మనది ‘ప్యూర్‌ హిపోక్రసీ’! మనకు చిత్త శుద్ధి లేదు. పారదర్శకత అంతకన్నా లేదు. మనం ఇతరులను తప్పు పట్టేముందు మనం చేసే పనులు ఎంతవరకు సక్రమం అని ఆలోచించాలి. ఈ వేళ మన రాష్ట్రంలోనే కాదు యావత్‌ దేశంలో జలవనరుల వివాదాలు, వాటి పంపిణీ, అభివృద్ధి విషయాలలో మనం అనుభవిస్తున్న ఈ దుస్థితికి వేరే ఎవరినో నిందించనక్కర్లేదు. మనల్ని మనం సరిదిద్దుకుంటే చాలు.

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు

సగం గెలుపు, సగం ఓటమి

కృష్ణా నదిపై అదనపు జలాలు ఉపయోగించుకుంటూ మన రాష్ట్రం కడుతున్న తెలుగుంగ, శ్రీశైలం ఎడమ గట్టుకాలువ ప్రాజెక్టులను ఆపమని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు కర్నాటక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఒకే ఒక ప్రశ్న అడిగింది. ‘తెలుగుగంగ, ఎస్‌.ఎల్‌.బి.సి.ప్రాజెక్టులకు కేంద్రం, అనుమతి లేదని తెలిసాక కూడా, కేంద్రాన్ని ఈ విషయంలో ఎందుకు దిలించలేదు? ఈ ప్రశ్నను సంధించడమే కాక, ఈ ప్రాజెక్టులపైన కర్నాటక పెట్టుకున్న అర్జీని 2000 సంవత్సరంలో ఇచ్చిన తీర్పులో తాము తోసిపుచ్చామని, మళ్ళీ అదే విషయాన్ని మరో రూపంలో తిరగదోడటం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో కర్నాటక తమ కేసును ఉపసంహరించుకుంది. అంటే, ఈ తీర్పుతో మన రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు ప్రస్తుతం ఎలాంటి ఢోకా లేదన్న మాట. ఇది మనకు గెలుపు. కర్నాటకకు ఓటమి. ఎగువ తుంగ, సింగటలూరు, హీరెహల్లా, మార్కండేయ, భీమా ఎత్తిపోతల పథకాలను కేంద్రం అనుమతి లేకుండా కర్నాటక నిర్మించే దశలో ఉండటం, ఆ ప్రాజెక్టుల మూలంగా తుంగభద్ర జలాశయంలోకి నీళ్లు రాక, సీమ రైతులు నష్టపోయే ప్రమాదముందన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తేవడం జరిగింది. కాని కర్నాటక తమ కేసును ఉపసంహరించుకోవడంతో మన మొరను సుప్రీంకోర్టు ఆలకించే అవకాశమే లేకపోయింది. అంటే దీనర్థం కర్నాటక యధేచ్ఛగా తమ అక్రమ నిర్మాణాలు సాగించుకుంటూ పోవచ్చు! ఇది కర్నాటకకు గెలుపు, మనకు ఓటమి. 1997 మార్చి ఒకటిన కర్నాటక సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ పెట్టుకుంది. అందులో కృష్ణా నదిలో లభించే అదనపు జలాలను అన్ని రాష్ట్రాలు పంచుకునేందుకు వీలు కల్పించే స్కీం ‘బి’ అమల్లోకి వచ్చేలా ఆదేశించడంతోపాటు, ఈ స్కీం అమలుకు అవసరమయ్యే ‘కృష్ణా వేలీ అథారిటీని’ ఏర్పాటు చేయాలని కోరటం మొదటి అంశం. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టుకాలువ (ఎస్‌.ఆర్‌.బి.సి.), శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి), భీమా, పులిచింతల ప్రాజెక్టులను కట్టకుండా నిరోధించమని కోరడం రెండవ అంశం. సుప్రీంకోర్టు కర్నాటక అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ: జలవివాదం ఏర్పడిన పక్షంలో ఆ తగాదాను సంబంధిత బేసిన్‌ రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకురావచ్చు. ఆ తగాదా తీర్చడానికి కేంద్రం ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ కడుతున్న ప్రాజెక్టులపై ఆంక్ష విధించడం కుదరదు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తమ నివేదికలో స్కీం ‘బి’ అమలు చేయమని నిర్దేశించలేదు. కనుక స్కీం ‘బి’ అమలులోకి వచ్చే ప్రశ్నే లేదు. స్కీం ‘ఎ’ అమలులో ఉన్నంతకాలం బేసిన్‌ దిగువ రాష్ట్రం (ఆం.ప్ర.) పై రాష్ట్రాల నీటివాటాకు భంగం కలిగించకుండా అదనపు జలాలను ఉపయోగించు కోవచ్చు. తమకు కేటాయించిన జలాలకన్నా అదనంగా మిగులు జలాలను వాడుకునే చట్టపరమైన హక్కు దిగువ రాష్ట్రానికి లేదు కనుక ఆ రాష్ట్రం (ఆం.ప్ర.) నిర్మించదలబెట్టే పెద్ద ప్రాజెక్టులను కేంద్రం అనుమతించకూడదు. మిగులు జలాలపై తమ హక్కును ఎక్కడ కోల్పోతామో అన్న భయాందోళనలు ఎగువ రాష్ట్రాలలో కలిగించకూడదు.

ఇదిలా ఉండగా, 1997 మార్చి 21న ఆంధ్రప్రదేశ్‌ మరో పిటిషన్‌ ద్వారా కర్నాటక రాష్ట్రంపైన సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. అందులో ఆలమట్టి డ్యాం నిర్మాణంపై ఆంక్ష విధించమని కోరడమే కాకుండా కర్నాటక తమ ప్రాజెక్టుల నీటి వినియోగంలో సర్దుబాటు చేసి, కొంత నీటిని ఆదాగా చూపి, ఆ నీటిని వినియోగించుకునే నిమిత్తం చేపట్టదలచిన కొత్త ప్రాజెక్టులను నిలిపివేయవలసిందిగా కోరింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు 2000 ఏప్రిల్‌ 25న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులోని ముఖ్యాంశాలు: కర్నాటక ఆలమట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల వరకు పెంచుకోవచ్చు. కర్నాటక కోరిన విధంగా 524.256 మీటర్ల దాకా అనుమతించే విషయాన్ని కొత్త ట్రిబ్యునల్‌ (ఏర్పడ్డాక) పరిశీలిస్తుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆయా రాష్ట్రాలకు చేసిన కేటాయింపు గుండుగుత్తగా కానీ, ప్రాజెక్టు ప్రాతిపదికన కాదు. అంతర్‌ రాష్ట్ర నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఇతర రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. ప్రతి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి. తమకు లభించిన మొత్తం వాటాలో సర్దుబాటు చేసుకుని కొత్త ప్రాజెక్టులకు నీటిని కేటాయించే హక్కు రాష్ట్రాలకుంది. సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అంగీకారం, ప్రణాళికా సంఘం ఆమోదం లేకుండా ఏ రాష్ట్రం కూడా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించకూడదు.

ఈ తీర్పు ఫలితంగా కర్నాటక ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్లకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌ తన వాటా 811 టిఎంసిలలో ఇతర ప్రాజెక్టుల వినియోగాన్ని కుదించి, కొంత నీటిని ఆదా చేసి, ఎస్‌ఆర్‌బిసి, భీమా, పులిచింతల ప్రాజెక్టులకు ఆ ఆదా నీటిని సర్దుబాటు చేసి ఈ ప్రాజెక్టులను కూడా 811 టిఎంసి నికర జలాల పరిధిలోకి వచ్చే జాబితాలోకి చేర్చింది. మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కి ఉండటంతో తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువను నిర్మించనారంభించింది. ఈ రెండు ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల అనుమతి లభించిందికాని, దీర్ఘకాలిక నీటి లభ్యత లేని కారణంగా కేంద్ర జలసంఘం అనుమతి రాలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులతో ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి కర్నాటక కూడా తగు మొత్తం వాటాలో మార్పులు చేసి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అందులో మన ప్రభుత్వం అభ్యంతరం వెలిబుచ్చిన హీరెహల్లా, అప్పర్‌ తుంగ, సింగటలూర్‌, మార్కండేయ, భీమా ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. 29 జూన్‌ 2001 నాడు సుప్రీంకోర్టుకు కర్నాటక పెట్టుకున్న అర్జీలో కేంద్రం అనుమతి లేకుండా ఆంధ్ర తెలుగుగంగ, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఇవి కొనసాగకుండా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించలేదని, కనుక వెంటనే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపమని ఆంధ్రను ఆదేశించవలసిందిగా కర్నాటక అభ్యర్థించింది.

కర్నాటక అభ్యంతరాలను ఇదివరకే సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయాన్ని దృష్టికి తెస్తూ ఈ కేసును కొట్టివేయవలసిందిగా మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. అప్పర్‌ తుంగకు అవసరమైన పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు లేవన్న విషయం ఆంధ్రప్రదేశ్‌ మరో అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తెచ్చింది. కర్నాటక అప్పర్‌తుంగ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం 12.24 టిఎంసిల నీటిని కేటాయించిందని, రాష్ట్రానికి వచ్చిన మొత్తం 734 టిఎంసిలు మించకుండా, అప్పర్‌తుంగతో సహా ఇతర ప్రాజెక్టులను కట్టుకునే హక్కు తమకు ఉందని, ఈ కొత్త ప్రాజెక్టులకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులకోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, అనుమతులు వచ్చేలోగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పింది. చివరకు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందో మనం మొదటే చెప్పుకున్నాం! దానాదీనా తేలిందేమిటంటే కర్నాటకలో నికర జలాల పునఃకేటాయింపు పేరుతో అనేక కొత్త ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. వాటివల్ల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యంగా రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుంది. అయినా మనమేం చేయలేం.

మొన్న ఆలమట్టి, నిన్న ఎగువ తుంగ, నేడు పరగోడు

కొంతకాలంగా కర్నాటకతో నీటి యుద్ధాలు చేస్తున్నాం. పాక్షికంగా గెలుపును, ఓటమిని చవిచూస్తూనే ఉన్నాం. అయితే ఈ యుద్ధాలు ఇలా కొనసాగవలసిందేనా? చీటికి మాటికీ సుప్రీంకోర్టు తలుపు తట్టవలసిందేనా? ఈ సమస్యకు మరో మార్గం లేదా? ఈ విషయంలో తగిన అధ్యయనం జరుగుతున్నట్లు లేదు.

కర్నాటకతో జరుగుతున్న నీటి వివాదాలకు మూలం కృష్ణా ట్రిబ్యూనల్‌ తీర్పు. బచావత్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు అనుసరించి మనకు 800 టిఎంసిల నీరు దక్కింది. పరీవాహక ప్రాంతం, జనాభా, వెనుకబాటుతనం, సాగుకు యోగ్యమైన భూమి, సామాజిక అంశాలు ఇలా ఏ అంశాల ప్రాతిపదికనైనా మన రాష్ట్రానికి ఇంత నీరు వచ్చి ఉండేది కాదు. ఎంతో కాలంగా అమలులో ఉన్న కృష్ణా డెల్టా, కడప-కర్నూలు కాలువలకు, నాగార్జునసాగర్‌కు కేటాయింపులు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కారణంగా మహబూబ్‌నగర్‌కు జరిగిన నష్టానికి పరిహారంగా జూరాల ప్రాజెక్టుకు నీటి కేటాయింపు, విద్యుత్తు కొరకు ఉద్దేశించిన శ్రీశైౖలం ప్రాజెక్టులో కలిగే ఆవిరినష్టం కోసం కేటాయింపులు పరిగణలోకి తీసుకోవటం మూలంగా ఆంధ్రప్రదేశ్‌కి అత్యధికంగా వాటా రావటం కర్నాటకకు రుచించని మొదటి విషయం.

నికర జలాల పరిస్థితి అలా ఉంటే మిగులు జలాల పంపకంలో ట్రిబ్యూనల్‌ ప్రతిపాదించిన స్కీం ‘బి’కి మన రాష్ట్రం ఒప్పుకోక, కేవలం స్కీం ‘ఎ’ వైపే మొగ్గు చూపటం, తద్వారా మిగులు జలాలను అనుభవించే స్వేచ్ఛ మనకే సంపూర్ణంగా లభించటం కర్నాటకకు సహించని రెండో అంశం. మిగులు జలాలు నిలువ చేసుకునేందుకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను భారీ ఎత్తున నిర్మించడానికి ట్రిబ్యూనల్‌ అంగీకరించటం కర్నాటకకు మింగుడు పడని మూడో అంశం. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా నికర జలాలను, మిగులు జలాలను బేసిన్లో కాకుండా బేసిన్‌ ఆవల వినియోగించుకుంటున్నదని, దాన్ని అనుమతించకూడదని కర్నాటక పట్టుపట్టినా ‘తమ వాటాకు వచ్చిన నీటిని రాష్ట్రంలోని ఏ మారుమూలనైనా వినియోగించుకునే అధికారం ప్రతీ రాష్ట్రానికుందని’ తుది ఆదేశాల్లో ట్రిబ్యూనల్‌ చేర్చటం కర్నాటకకు కోపం తెప్పించిన మరో అంశం. ట్రిబ్యూనల్‌ తీర్పుతో సంతృప్తి చెందని కర్నాటక వీలయినప్పుడల్లా మన రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉంది. మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ మాత్రమే కలిగిన మన రాష్ట్రం వాటి వినియోగంపై చట్టపరమైన హక్కులేదని తెలిసి కూడా, తెలుగు గంగ, ‘ఎస్‌ఎల్‌బిసి’ వంటి రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టింది. మిగులు జలాల ఆధారంగా నెట్టంపాడు, కల్వకుర్తి, హంద్రీ, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటన్నింటిపై కర్నాటక ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా బేసిన్‌ దిగువన ఉండి మిగులు జలాలు ఉపయోగించుకోవాలంటే డ్యాంలు కట్టకపోతే ఎలా అని సమర్థించుకుంటున్నది. భీమా, పులిచింతల, ఎస్‌ఆర్‌బిసిలపైన కర్నాటక అభ్యంతరాలు లేవదీస్తే మాకు కేంద్ర జల సంఘం అనుమతి ఉందని వాటికి అవసరమైన నీటిని కెసి కాలువ ఆధునీకరణ, కృష్ణా డెల్టా ఆధునీకరణ ద్వారా ఆదా చేసుకుంటున్నామని వారి నోరు మూయించింది.

మొన్నటి ఆల్మట్టి యుద్ధం

ఆల్మట్టికోసం బచావత్‌ ట్రిబ్యూనల్‌ అనుమతించిన పరిమాణంకంటే ఎక్కువ నీటిని ఆల్మట్టి జలాశయంలో నిలువ చేసుకునే ఉద్దేశంతో కర్నాటక భారీ ఎత్తున జలాశయం నిర్మించాలనుకున్నదని, అందుకు అనుమతించరాదని మన రాష్ట్రం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు, ట్రిబ్యూనల్‌ తమ అంతిమ ఆదేశాల్లో వెలువరించిన విషయాలే చట్టరీత్యా అమలుకు నోచుకుంటాయి. అందులో ఎక్కడా ఆల్మట్టిలో ఇంత నీరే నిలువచేయాలని, ఆల్మట్టిని ఇంత ఎత్తువరకే కట్టాలని ఆదేశాలు లేవు. కర్నాటక తన వాటా నీటిని (700 టిఎంసిలను) తుది ఆదేశాల్లో నిర్ధారించిన పరిమితులకు లోబడి నిలువ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్మట్టి ఎత్తును కేంద్ర జలసంఘం అనుమతించవలసి ఉంటుందని తీర్పు పేర్కొన్నది. ఫలితంగా 512.20 మీటర్ల నుంచి కర్నాటక 519.60 మీటర్లకి ఆల్మట్టి ఎత్తు పెంచింది. మరో అయిదు మీటర్ల ఎత్తు పెంచాలని కర్నాటక ఉవ్విళ్లూరుతున్నది. ఆల్మట్టి ఎత్తు పెరిగితే మన రాష్ట్రం జలాశయాలు వెలవెలబోతాయని మన ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఆల్మట్టిపై మన ఫిర్యాదుకు ప్రతిగా కర్నాటక తెలుగు గంగ, ‘ఎస్‌ఎల్‌బిసి’ల నిర్మాణం అక్రమమని ఫిర్యాదు చేసింది. మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ మనకు ఉందని ధృవీకరిస్తూనే వాటి వినియోగానికి పెద్ద జలాశయాలు నిర్మించుకోవటానికి కేంద్రం అనుమతించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

నిన్నటి ఎగువ తుంగ యుద్ధం

తుంగభద్ర బేసిన్లో కర్నాటక ఎగువ తుంగ మొదలైన స్కీంలను అక్రమంగా కట్టుకోబోతోందని, వాటివల్ల తుంగభద్ర డ్యాంకు, దిగువన కెసి కాలువకు తక్కువ నీరు అందుతుందని, రాయలసీమ ప్రాంతాలు నష్టపోతాయని, వెంటనే ఆ అక్రమ కట్టడాలను ఆపాలని మన రాష్ట్రం సుప్రీం కోర్టును కోరింది. కేంద్రం అందుకు అనుమతించ లేదు. మన రాష్ట్రంలో తెలుగు గంగ, ఎస్‌ఎల్‌బిసిల నిర్మాణాన్ని నిలిపివేయాలని కర్నాటక ఫిర్యాదు చేసింది. అంతకుమునుపే కర్నాటక తమిళనాడుల మధ్య ఉన్న కావేరీ జలవివాదంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు రాష్ట్రాలను మందలించి, కృష్ణాపై కొత్త ట్రిబ్యూనల్‌ ఏర్పాటుకోసం కేంద్రానికి విన్నవించుకుంటే, పరిష్కారం లభిస్తుందని హితవు పలికింది.

నేటి పరగోడు యుద్ధం

నాటి మద్రాసు మైసూరు ప్రభుత్వాలు 1892లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెన్నా బేసిన్‌లోని చిత్రావతి నదిపై నిర్దేశించిన పరిమితి దాటి ఏదైనా రాష్ట్రం ప్రాజెక్టు కట్టాలనుకుంటే విధిగా రెండో రాష్ట్రం అనుమతి పొందాలి. చిత్రావతి నదిపై కర్నాటక నిర్మిస్తున్న ‘పరగోడు’ మూలంగా అనంతపురం జిల్లాలో తాగునీరు, సాగునీటికి కష్టమవుతుందని, అందుకని పరగోడును కట్టగూడదని మన వాదన. పరగోడును నిర్మించేది తాగునీటి కోసమని, అందువల్ల అది సమస్య కాదని కర్నాటక వాదించింది. విధిలేక మన రాష్ట్రం సుప్రీంకోర్టు తలుపు తట్టవలసిన అగత్యమేర్పడింది.

రేపటి నాగలమడక యుద్ధం

పెన్నా నదిపై కర్నాటక గుట్టుగా నాగలమడక ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికిందని ఇటీవలే బయటపడింది. ఈ సందర్భంగా మరో యుద్ధం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తుంగభద్ర డ్యాంలో ఇసుకమేటలవల్ల జలాశయం సామర్థ్యం తగ్గిందని, మన వాటా నీటిని ఉపయోగించుకునేందుకు తలపెట్టిన సమాంతర తుంగభద్ర కుడిగట్టు ఎగువ కాలువ నిర్మాణానికి కర్నాటక సహకరించటం లేదన్నది మరో ఫిర్యాదు.

అతి తక్కువ వర్షపాతంవల్ల కృష్ణా బేసిన్లో మనకు రావలసిన నీటి వాటా మనకు లభించక తాగునీటికే కటకటలాడుతున్నందున 37.5 టిఎంసిల నీటిని ఆల్మట్టి నుండి విడుదల చేయవలసిందిగా కర్నాటకను మన రాష్ట్రం కోరింది. ప్రతిగా కర్నాటకకు విద్యుత్తు అందిస్తామని ఆశ చూపింది. కర్నాటక హామీ ఇచ్చిందే తప్ప ఏమీ చేయలేదు. ఆల్మట్టిలో నీరంచుకుని కూడా మన తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయలేదని మన రాష్ట్రం మరో ఫిర్యాదు.

పరగోడు విషయంలో కర్నాటక వాదన సమంజసం కాదు. కాని, ఆల్మట్టి నుండి మనకు నీరు ఇవ్వలేదని, కర్నాటక తన వాటా కంటే ఎక్కువ నీటిని ఆల్మట్టి జలాశయంలో నిలువ చేసుకుంటుందనటం అర్థరహితం. ఇప్పుడు ఆల్మట్టిలో నీళ్లున్నాయి. మన శ్రీశైౖలం, సాగర్‌ జలాశయాలు ఎండిపోయాయి. అందుకు కారణం మన రాష్ట్రం ట్రిబ్యూనల్‌ ప్రతిపాదించిన స్కీం ‘బి’ ఒప్పుకోకపోవటం, స్కీం ‘ఎ’ వైపే మొగ్గు చూపటం, ఇప్పుడు అమల్లో ఉన్న స్కీం ‘ఎ’ ప్రకారం పై రాష్ట్రాలు తమ వంతు నీటికంటే ఎక్కువ నీటిని వినియోగించుకోవటానికి వీల్లేదు. అంటే మహారాష్ట్ర 560 టిఎంసిలు, కర్నాటక 700 టిఎంసిలకంటే ఎక్కువ ఉపయోగించు కోకూడదు. మన వాటాకు వచ్చిన నీరు 800 టిఎంసిలకంటే ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా అనుభవించాల్సిందే. స్కీం ‘బి’ని ఒప్పుకుంటే ఎక్కువ, తక్కువలను నిర్ణీత పద్ధతుల్లో పంచుకునేవాళ్ళం. కొత్త ట్రిబ్యునల్‌ ఎదుట కూడా స్కీం ‘ఎ’ కావాలనుకుంటున్నాం, అదే విచిత్రం.

ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళకుండా, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కర్నాటకతో వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి. ప్రపంచంలో అనేక అంతర్జాతీయ నదులపై ఆయా దేశాలు ఒడంబడికలు చేసుకుని తమ పనులు సక్రమంగా చేసుకుంటున్నాయి. మనం కూడా ఈ దిశగా పయనిస్తే మంచిది. ఇప్పట్లో అంతర్‌ రాష్ట్ర నదులపై నదీ బేసిన్‌ సంస్థలు ఏర్పాటు కాకపోయినా, పొరుగు రాష్ట్రాలు సామరస్యంగా, పరస్పరం సహకరించుకుంటాయని ఆశించవచ్చు.

మరింత తెలివి, మరిన్ని సాక్షాధారాలు కావాలి!

ప్లస్‌ని ప్లస్‌తో, ప్లన్‌ని మైనస్‌తో, మైనస్‌ని ప్లస్‌తో, మైనస్‌ని మైనస్‌తో గుణిస్తే ఏమవుతుందన్నది గణితశాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు. అయోమయం లేకుండా తేలిగ్గా అర్థమయ్యేందుకు మా లెక్కల మేష్టారు ప్లస్‌ని మిత్రునిగా, మైనస్‌ని శత్రువుగా భావించమన్నాడు. మిత్రుని మిత్రుడు మిత్రుడు అంటే ప్లస్‌xప్లస్‌=ప్లస్‌. ఇదేవిధంగా శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు. అంటే మైనస్‌xమైనస్‌=ప్లస్‌ అవుతుందని, ఇదే మూసలో ప్లస్‌xమైనస్‌ లేక మైనస్‌xప్లస్‌ మైనస్‌ అవుతుందని, మిత్రుడి శత్రువు కాని శత్రువుకి మిత్రుడు కాని మనకు శత్రువు అవుతాడని అర్థం. ఈ పోలిక మనసులో నాటుకుపోయి, పొరపాటు చేయకుండా ప్లస్‌ మైనస్‌ విషయంలో జాగ్రత్తపడుతూ ఉన్నాం, నేనూ, నాలాంటి అనేకమంది.

నేడు అన్ని రంగాలలోనూ ఈ సూత్రాలను పాటిస్తూనే ఉన్నాం. గత కొద్దికాలంగా మనం కర్నాటకపై జలయుద్ధాలు చేసి ఆ రాష్ట్రంపై కోర్టులో కేసులు దాఖలు చేయడమే కాక, కర్నాటకపై అనేక ఆరోపణలను పార్లమెంటులోను, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జలవనరుల మంత్రి తదితర అధికారుల ఎదుట దుమారం లేపాం. తుంగభద్ర, పరగోడు, ఎగువతుంగ, సింగటలూరు ఇంకా అనేక అక్రమ కట్టడాలు, అలాగే మంజీర బేసిన్లో కూడా నిర్మాణాలు కర్నాటక చేపడ్తోందని మన ప్రభుత్వం ఇటీవల ప్రచారం చేసింది. అయితే తగినన్ని సాక్ష్యాధారాలు లేకపోవటంతో మనం కేంద్రాన్ని నమ్మించలేకపోయాం. మన వాదనలు బలహీనపడటంతో మన ప్రభుత్వం మద్దతుకు తమిళనాడును ఎంచుకోవడం గమనార్హం. చాలా కాలంగా కర్నాటకకు, తమిళనాడుకు కావేరీ జలాల విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు పొడసూపాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కర్నాటక ఖాతరు చేయని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని బట్టి, కర్నాటకపై మనం జరుపుతున్న పోరుకు సహాయ సహకారాలు అందించాలని తమిళనాడును అర్థించాం. కొంత విజయం కూడా సాధించాం. పార్లమెంటులో మన తెలుగుదేశం ఎంపిల ప్రసంగాలకు తమిళనాడు ఎంపిలు చప్పట్లు కొట్టడమే అందుకు తార్కాణం. అయితే డిఎంకె నాయకుడు కరుణానిధి మన ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ‘కర్నాటకపై యుద్దంలో మా మద్దతు సంగతి సరే, ముందు కృష్ణా జలాలను మదరాసుకు పంపే విషయం ఆలోచించండి’ అని హితవు పలికారు. కర్నాటకపై చేస్తున్న నీటిపోరుకు మనం తమిళనాడును మద్దతు అడగటం ఏ మేరకు సబబు? అసలు కర్నాటక రాష్ట్రంపై కూడా మనం చేస్తున్న రభస అవసరమా? సమస్య పరిష్కారానికి మరో ప్రత్యామ్నాయం ఆలోచించడం కూడా అవసరం.

ఆరోపణలు ఏమిటి?

కర్నాటకపై మనం ఆరోపణలు చేస్తున్న ఏమిటన్న విషయం సక్రమంగా అర్థం చేసుకుంటే వాటిలో నిజానిజాలు అవగతం చేసుకోవచ్చు. ఒక టిఎంసిలో పదోవంతు నీటిని ఉపయోగించుకునే ఉద్దేశంతో కర్నాటక ‘పరగోడు’ నిర్మిస్తోంది. అలనాటి మదరాసు (ప్రస్తుత ఆం.ప్ర.) మైసూరు (ప్రస్తుత కర్నాటక) రాష్ట్రాలు కుదుర్చుకున్న 1892, 1933 సంవత్సరపు ఒప్పందాలను కర్నాటక ఉల్లంఘించిందన్నది మన ప్రథమ ఆరోపణ. మొదట పరగోడును 589 ఎకరాలకు సాగునీరు, బాగేపల్లి పట్టణానికి మంచినీరు అందించే లక్ష్యంతో నిర్మించాలని కర్నాటక తలపెట్టిందని, మనం గొడవ చేసేటప్పటికి ప్రాజెక్టు రిపోర్టులో ‘సాగునీరు’ అంశాన్ని తొలగించి, మునుపటి సామర్థ్యంతో మంచినీటి ప్రాజెక్టుగా మార్చారన్నది మన అభియోగం. ఈ ప్రాజెక్టు కట్టితే అనంతపురం, కడప జిల్లాల నీటి పథకాలు దెబ్బతింటాయని, లక్షల మంది మంచినీటి వసతి కోల్పోతారు కనుక ఆ ప్రాజెక్టును ఆపేందుకు ఆదేశాలివ్వాలని మన ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పరగోడు ప్రాజెక్టును తనిఖీ చేసిన కేంద్ర బృందానికి అది మంచినీటి ప్రాజెక్టుగానే తోచింది. కాకపోతే వాళ్ళు పొందుపరచిన గణాంకాలతో కేంద్రం ఏకీభవించలేదు. ఏది ఏమైనా ఏమీ జరగలేదు. కర్నాటక ప్రాజెక్టును కట్టుకుంటూనే ఉన్నది. పరగోడుపై మన ప్రభుత్వం చేసిన హడావిడి ఎవరికీ పట్టని ‘అడవి గోడు’గానే మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం ఎగువతుంగ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం మన ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. బచావత్‌ ట్రిబ్యూనల్‌ తుంగభద్ర నీటి వినియోగంలో కర్నాటకపై విధించిన ఆంక్షలను కూడా పట్టించుకోకుండా కేంద్ర జలసంఘం ‘ఎగువ తుంగ’కు ఆమోదం తెలపడం సరికాదని కనుక ఎగువ తుంగకిచ్చిన ‘క్లియరెన్స్‌’ రద్దు చేయాలని మన ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. కర్నాటక ఎగువతుంగను 12.34 టిఎంసిల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్టు కేంద్ర జలసంఘం నుండి క్లియరెన్స్‌ తీసుకున్నా 40 టింఎసిల నీటిని వాడుకుని 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రయత్నం చేస్తోందని మన ప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది.

అంతర్‌ రాష్ట్ర నదులపై ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ ఇచ్చేముందు కేంద్ర జలసంఘం ఆ ప్రాజెక్టు అంతర్‌ రాష్ట్ర ఒడంబడికలకు లోనై ఉన్నదా, ప్రాజెక్టుకు కావలసిన నీటి లభ్యత ఉన్నదా అన్న విషయాలను ధృవీకరించుకున్నాకే సాంకేతి విషయాలను అధ్యయనం చేస్తుంది. అవార్డులు, ఒప్పందాలు కేంద్ర జలసంఘం దగ్గర ఉంటాయి. నీటి లభ్యత వినియోగం, ఇతర సమాచారానికి కేంద్ర జలసంఘం రాష్ట్ర డేటానే ఉపయోగిస్తుంది. అంటే తుంగభద్ర కర్నాటక పథకాలను పరిశీలిస్తున్నప్పుడు కేంద్ర జలసంఘం ఆంధ్రప్రదేశ్‌ని సంప్రదించదు. అందరూ పట్టుబడితే కేంద్రం ప్రస్తుత పద్ధతి వదలిపెట్టి, కొత్త పద్ధతికి నాంది పలకవచ్చు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా గమనించాలి. ‘ఒక అంతర్‌ రాష్ట్ర నదిపై ఒక రాష్ట్రం ప్రాజెక్టు నిర్మించదలిచితే ఆ బేసిన్‌కు చెందిన ఇతర రాష్ట్రాల అనుమతి అవసరం లేదు’ అన్నది ఆ తీర్పు సారాంశం.

అంతర్‌ రాష్ట్ర నదుల వినియోగంలో ఏ రాష్ట్రం సరైన సమాచారాన్ని ఇంకో రాష్ట్రానికివ్వదు. కేంద్రానికీ ఇవ్వదు. అలాంటి సమాచారాన్ని చట్టపరంగా సేకరించే వ్యవస్థ ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదిస్తే ఏ రాష్ట్రం ఒప్పుకోలేదు. కర్నాటక అక్రమ కట్టడాలు కట్టుకుపోతుంటే కేంద్రం వాటిని ఆపుచేయగలదా అన్నది ప్రస్తుత అంశం. నీటి విషయంలో కేంద్ర అధికారం అంతంతమాత్రమే. ఆయా రాష్ట్రాల ప్రాజెక్టు రిపోర్టులను అధ్యయనం చేసి సాంకేతిక, ఆర్థిక ఆమోదం ఇవ్వడం ద్వారా ప్లానింగు కమిషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ తెచ్చుకోవడానికి దోహదపడటం సి.డబ్ల్యు.సి. ప్రథమ కర్తవ్యం. అంతర్‌ రాష్ట్ర నదుల వినియోగంలో, ఆయా రాష్ట్రాలు కోరితే ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయడం కేంద్రం చేయగలిగిన పని. రాష్ట్రాలు పరస్పరం అంగీకరిస్తే సలహాలు ఇవ్వడం వరకే కేంద్రం చేయగలిగేది. నిబంధనలను అతిక్రమించి ఏదైనా రాష్ట్రం అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డప్పుడు ఆపే అధికారం కేంద్ర జలసంఘానికి లేదు. కాకపోతే తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక పంపుతుంది. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రాజెక్టునూ కేంద్రం ఆపిన దాఖలా కాని నిధులను బంద్‌ చేసిన దృష్టాంతం కాని లేదు. ఇలాంటి పరిమితులున్న కేంద్రంపై మనం ధ్వజం ఎత్తి సాధించగలిగింది లేదు. ఇదే అదనుగా కర్నాటక కేంద్ర జలసంఘం పనితీరును మెచ్చుకున్నది. మన ఆర్భాటంవల్ల పరగోడు ఆగిపోలేదు. ఎగువతుంగకిచ్చిన క్లియరెన్స్‌ వాపసు తీసుకోలేదు. అయితే మన రాష్ట్రానికి నష్టం కలిగేలా కర్నాటక వ్యవహరిస్తుంటే చేతులు ముడుచుకు కూర్చోవాలా అన్నది సమస్య. ఆవేశాగ్రహాలు ప్రదర్శించడం కాక తెలివిగా, చాకచక్యంగా కర్నాటక అక్రమ కట్టడాలపై సమాచారం, పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి సరైన సమయంలో కేంద్రం ఎదుట బయటపెట్టి, వారి సానుకూలత రాకపోతే అపుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాలి.

( నీళ్లు-నిజాలు : సూచిక )

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com