2.18) జలయజ్ఞం - వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు
జనవరి 24th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలుగుదేశం ప్రభుత్వం 9 సంవత్సరాలపాటు ఏలినా చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టు ఒక్కటైనా నిర్మించలేకపోయింది. ఇది అనావృష్టి. ప్రస్తుత ప్రభుత్వం పెండింగు ప్రాజెక్టులన్నింటిని కా0కపోయినా 28 ప్రాజెక్టులను, ఐదు సంవత్సరాలలో రూ.46 వేలకోట్ల వ్యయంతో నిర్మించి 65 లక్షల ఎకరాలకు సేద్యపు వసతిని కల్పిస్తానంటోంది. ఇది అతివృష్టి. ముఖ్యమంత్రి వాగ్దానం చేస్తున్నట్టు ఐదు సంవత్సరాలలో 28 ప్రాజెక్టులు కట్టగలిగితే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఉండదు. ఆయన నిజాయితీని శంకించనవసం లేదు కాని ఈ హామీలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవు. ఇందుకవసరమైన మందీ మార్బలాన్ని, రూ.46 కోట్లను ఎక్కడినుంచి తెస్తారన్న విషయాన్ని కూడా పక్కనబెట్టినా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక ఆటంకాలున్నాయి.
కృష్ణా, పెన్నా బేసిన్ ప్రాజెక్టులు
బచావత్ ట్రిబ్యునల్ మనకు కేటాయించిన నికర కృష్ణా జలాలు 811 టిఎంసిలు. ఈ వినియోగానికి సరిపడా ప్రాజెక్టులు ఇదివరకే కట్టుకున్నాం. అదనపు జలాలపై, వరదనీటిపై ఆధారపడి తెలుగు గంగ కట్టుకుపోతున్నాం. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ) కూడా కట్టుకుంటున్నాం. ట్రిబ్యునల్ అవార్డుననుసరించి కృష్ణా నదిలో లభ్యమయ్యే అదనపు జలాలను వినియోగించకునే స్వేచ్ఛను మాత్రమే కలిగి ఉండి హక్కు కలిగి ఉండకపోవడటంచేత ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. పైపెచ్చు కర్నాటక అభ్యంతరాలపై సుప్రీంకోర్టు స్పందించి ఈ ప్రాజెక్టులను ఆమోదించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని అన్యాపదేశంగా ఆదేశించింది. అంటే తెలుగు గంగ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులు రెండూ కేంద్రం దృష్టిలో అనధికారిమైనవే. మనం వీటిపైన పెట్టే ఖర్చు యావత్తూ రాష్ట్ర బడ్జెట్‌దే. ఈ ప్రాజెక్టులకు ఎలాంటి మంజూరు లేదు కాబట్టి కేంద్రం ఇచ్చే ఎలాంటి సహాయం వీటికుండదు. కేంద్రం ఆమోదం లేదు కాబట్టి ప్రపంచబ్యాంకు గాని ఇతర దేశాలు గానీ నిధులను అప్పుగా ఇవ్వవు.
ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కృష్ణా నదిలో లభ్యమయ్యే వరద జలాలను ఉపయోగించుకొని మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కడతామని ఉరకలు వేస్తోంది. ఈ ప్రాజెక్టులు మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు, రాయలసీమకు ఉపయోగపడే గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడే వెలిగొండ ఎత్తిపోతల పథకం. నెట్టంపాడుకు 13.25 కల్వకుర్తికి 25, గాలేరు నగరికి 38, హంద్రీనీవాకు 40, వెలిగొండకు 43.50 టిఎంసిలు కావాలి. అంటే ఈ ప్రాజెక్టులకు 160 టిఎంసిల ‘అదనపు’ కృష్ణా జలాలు కావాలి. లోగడ మనం తెలుగుగంగ, ఎస్‌ఎల్‌బిసి చేపట్టిన సందర్భంలో కర్నాటక మనపైన విరుచుకుపడి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ప్రాజెక్టులపైన కూడా కేంద్రంతోనూ, సుప్రీంకోర్టుతోనూ కర్నాటక, మహారాష్ట్రలు మొరపెట్టుకునే అవకాశం ఉంది. కృష్ణా నదికి సంబంధించిన జలవివాదాల పరిష్కారం నిమిత్తం ఎలాగూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పడింది కాబట్టి, ఈ ఫిర్యాదులను కొత్త ట్రిబ్యునల్ పరిశీలిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చేతులు దులుపుకోవచ్చు. అప్పటివరకు వీటిపై ప్రాజెక్టులు కట్టవద్దని ‘స్టే’ ఇచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు. దుర్భిక్ష ప్రాంతాలైన మహబూబ్‌నగర్‌కు, రాయలసీమ జిల్లాలకు, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడే ఈ అయిదు ప్రాజెక్టులపైన మనకు కనికరం ఉంటుందేమోగాని, పై రాష్ట్రాలు దయ తలుస్తాయని ఆశించడం పొరపాటు.
వరదలొస్తేనే ఉపయోగం
ఇక, ఈ సంవత్సరం బడ్జెట్ పుస్తకంలో ఇచ్చిన అంకెల ప్రకారం నెట్టంపాడు పథకం మొదటి దశకు రూ.134.30 కోట్లు, కల్వకుర్తి మొదటి దశకు రూ.1766 కోట్లు, గాలేరునగరి మొదటి దశకు రూ.430 కోట్లు కావాలి.
ఈ అయిదు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సుమారు రూ.5 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంత కష్టపడి, రాష్ట్రం రూ.5 వేల కోట్లు వెచ్చించినా, అడ్డంకులు దాటి ఈ ప్రాజెక్టులు నీళ్లతో కలకాలం కళకళలాడే అవకాశం చాలా తక్కువ. కృష్ణలో వరదలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులు సక్రమంగా పని చేస్తాయి. కరవుతో తల్లడిల్లే ఈ ప్రాంతం రైతాంగానికి మేలు చేకూర్చే మరో ప్రత్యామ్నాయమార్గం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టులు కట్టడం తప్పపనిసరి అన్న ముఖ్యమంత్రి మాట కాదనలేం. కాకపోతే, కృష్ణ్ణమ్మ వరద నీటితో పొంగి పొరలినప్పుడే ఇవి ఉపయోగపడతాయని రైతులకు స్పష్టం చేయాలి. లేకపోతే నిరుడు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్‌కు నీరు వదలకుండా రిజర్వాయర్ నీటిమట్టం పెంచి తమకు నీళ్ళు వదలాలని రాయలసీమ రైతులు ఆందోళన చేయగా, అలా కుదరదు అసలు కృష్ణా నది జలాలను ఉపయోగించుకునే హక్కు మీకెక్కడిదని దానిపై రాయలసీమ రైతులను కృష్ణా డెల్టా, సాగర్ ఎడమ కుడి కాలువల రైతులు సవాలు చేయగా సమస్యనెలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకు కూర్చున్న ప్రభుత్వ దీనావస్థ పునరావృతమవుతుంది. ఈ పద్ధతిలోనే ఆలోచిస్తూ గండికోట నిర్మాణంవైపు కూడా ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పెన్నా నదిలో వరద వచ్చినా, కృష్ణా నదిలో వరద వచ్చినా ఇది నిండుతుందని ఆశ.
కృష్ణా అదనపు లేక వరద జలాలపై ఆధారపడ్డ తెలుగుంగ ప్రాజెక్టును రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అదే ఊపులో ఎలిమినేటి మాధవరెడ్డి కాలవను కూడా రెండేళ్ళలోపున పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఇలాంటి చర్యవల్ల ప్రభుత్వం కేవలం రాయలసీమవైపే కాదు, తెలంగాణవైపు కూడా సమదృష్టితో చూస్తోందన్న మంచి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది.
తాజా పరిస్థితి
‘వరదజలాలు’ ఎన్ని ఉన్నాయి వాటిపైన మనకు ఏ మేరకు హక్కు లభిస్తుంది. ఇలాంటి విషయాల జోలికి పోకుండా, వరదజలాల ఆధారంగా ప్రభుత్వం జి.ఓ.పైన జి.ఓ. ఇస్తూ, నిధులు కేటాయిస్తూ బస్తీమేసవాల్‌లాగ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోంది. వరదజలాల ముసుగులో నికరజలాలను తరలిస్తారేమోనని ఇటు తెలంగాణా అటు కోస్తా రైతాంగం భీతిల్లుతోంది.



