- గంగుల శాయిరెడ్డి
సీ. నీజాతివారలు రాజులైయుండియుఁ
గనఁజాలరైరి నీ కష్టమెల్ల
నీ కులమందు జన్మించిన యానమీం
దారులుగనరు నీ తాపమెల్ల
నీశాఖలో ధననిలయులౌకొందఱు
పరికింపలేరు నీ బాధ్లెల్ల
నీ తెగలో విద్యనేర్చిన బియ్యేలు
లిఖియించరైరి నీ లేములెల్ల
గీ. న్యాయవాదులు నీవార లడుగరైరి
న్యాయమూర్తులునీవార లరయరైరి
ఇంక పెఱవారిముచ్చట లెందుకయ్య
కర్షకా! మీదుకష్టముల్ గాంతురెవరు?
సీ. జాగీరుపౌరులు స్థానంబులేకను
పరులు పంచలఁజేరి బ్రతుకవలసె
అగ్రహారపుఁబ్రజ హక్కులన్నిటివీడి
యొరులొద్దఁజేరియు నొదగవలసె
బంజర రైతులు బాటలుగానక
దశదిశలంజూచి తారవలసె
కౌలుదార్లెప్పుడు కడగండ్లఁబడుచును
స్థిరముగుర్తెఱుఁగక తిరుగవలసె
గీ. గొఱ్ఱెమేఁకలనావులఁ గుదువఁబెట్టి
పల్లెలోనున్న పైరుల నిల్లు విడిచి
ఆలుపిల్లలు దుఃఖింప నడలవలసె
కర్షకా! లెమ్మువేగమే కనులువిప్పి.
‘గోలకొండ కవుల సంచిక’ (1934)