‘అణాగ్రంధమాల’తో చైతన్య పరిచిన కె.సి.గుప్త
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
ప్రాంతీయ విద్యావికాసంల విశేషమైన కృషి సల్పిన సేవాపరాయణుడు కె.సి.గుప్త. గ్రంధ ప్రచురణా కర్తవ్యాన్ని స్వీకరించిన ఘనుడు గుప్త. తెలుగు చదువునుంచి దూరం చేయబడిన తెలంగాణ ప్రజలకు చదువులను, సాహిత్యాన్ని పంచిన గుప్తది భిన్నమైన వ్యక్తిత్వం. ఇక్కడి రాజకీయ పరిస్థితుల పరిణామంల తనదైన ముద్రతో భాగస్వామ్యం వహించిండు గుప్త.
గుప్త పూర్తి పేరు కల్వకుంట చంద్రసేన్ గుప్త. రామన్న, లక్ష్మమ్మ దంపతులకు సెప్టెంబర్ 1919ల, హైద్రాబాద్‌ల జన్మించిండు. ప్రాధమిక విద్య ఉర్దూల సాగటంవల్ల మాతృభాష ప్రాధాన్యతను గుర్తించిండు. నగరంల పుట్టినా కామారెడ్డి వంటి ఊరుల పెరగడం వల్ల సామాన్య జీవనంల సమస్యలు అర్థమైనయి. ఉన్నత చదువు సాగకపోవడం వల్ల ఉన్నత ఆశయంతో పుస్తక ప్రచురణ, వర్తకంలకు దిగిండు. ‘మాడ్రన్ బుక్ డిపో’ స్థాపించి రాజకీయ, సాహిత్య పుస్తకాలు అమ్మేవాడు. కమ్యూనిస్టు లక్ష్యాలకు ఆకర్షితుడై కమ్యూనిస్టు పార్టీ సాహిత్యాన్ని ప్రచారంలకి తెచ్చిండు. క్రమంగా పబ్లిషింగ్ సంస్థ ఆవకశ్యతను గుర్తించి ‘ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ’ స్థాపించి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ పుస్తకాలు ప్రచురించిండు. ‘రాజ్యాంగ సంస్కరణలు’, ‘రైతు (వెల్దుర్తి మాణిక్యరావు)’, ‘ఆంధ్రవీరులు’, ‘అణాకథలు’, ‘జాగీర్లు’, ‘మొగులాయి కథలు (సురవరం ప్రతాపరెడ్డి)’, ‘కాళోజి కథలు’, ‘ఖాదీ వ్యాసాలు’, ‘సుభాష్ చంద్ర బోస్ (కె.రంగదాసు)’, మొదలైన 25 పుస్తకాలు ప్రచురించిండు. అతను ప్రచురించిన రైతు నిషేధించబడ్డది. ‘సుభాష్ చంద్ర బోస్’, ప్రచురించి నిషేధం, జైలుపాలు అయ్యిండు. నిజాం రాజు గుప్తని రెండు సంవత్సరాలు జైల్ల పెట్టిండు. 250/-లు జరిమాన వసూలు చేసిండు. కాంగ్రెస్ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల ఆయన క్రియాశీల కార్యక్రమాలు అప్పటి సర్కారుకు కోపం తెప్పించినా ప్రజలల్ల చైతన్యం నింపినయి.





