తెలంగాణ ‘కాపుబిడ్డ’ను కావ్యనాయకుని చేసిన గంగుల శాయిరెడ్డి
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణ రైతుల జీవితాన్ని సాహిత్యంగా మలిచిన మహనీయుడు గంగుల శాయిరెడ్డి. పోతన వారసత్వాన్ని ఆవాహన చేసుకొని వ్యవసాయ జీవితంలోని కడగండ్లను పరిష్కరించటానికి ఒక చేత హలం మరొక చేత కలం పట్టిన కవి శాయిరెడ్డి. తెలంగాణ సాహిత్య చరిత్ర మొదటి వరుసలో పేర్కొనదగిన శాయిరెడ్డికి ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు సముచిత స్థానమివ్వలేదు.
గంగుల శాయిరెడ్డి 1890 సంవత్సరంల వరంగల్ జిల్లాలోని రామచంద్రగూడెంల జన్మించిండు. స్వాతంత్ర్య పోరాటంల స్వయంగా పాల్గొన్నడు. నిజాం వ్యతిరేక ఉద్యమంల క్రియాశీల పాత్ర వహించటం వల్ల దాదాపు ఒక సంవత్సరం జైలుల ఉన్నడు. ఆంధ్రమహాసభల పాల్గొని తరువాతి చీలికలకు చిన్నబుచ్చుకున్నడు. 1947-48 రజాకార్ల దౌర్జన్యాలను చూసి చలించిపోయిండు.
జీడికల్ రామచంద్ర దేవాలయ వికాసానికి పాటుబడ్డడు. భువనగిరి, నెల్లుట్ల, గుముదవెల్లి గ్రామాలల్ల విద్యార్థుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేయించిండు. వయోజన విద్యావశక్యతను గుర్తించి నాలుగు బాలశిక్షలు రచించి తెలుగుపలుకులను సుస్థిరం చేసిండు.
1937 సంవత్సరంల ‘కాపుబిడ్డ’ కావ్యం ప్రచురించి కట్టమంచి రామలింగారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రశంసలందుకున్నడు. ఈ కావ్యం నాలుగు ముద్రణలు పొంది బహుళ ప్రచారంలకి వచ్చింది. భూమి, నీరు, చేను-చెలకలు, చెమట-కష్టం, పంటలు, ఎరువులు, కూలీ, కుటుంబం, పరిస్థితులల్ల వచ్చిన మార్పులు, అధికారులు, పాలకులు అనుసరించే పీడనలు అన్నీ ఇందుల చిత్రితమైనయి.
అచ్చమైన కర్షక కవి అయిన శాయిరెడ్డి పూర్వీకుల నుండి, అనుభవజ్ఞులనుండి సేకరించిన జ్ఞాన సమచారంతో మూలికావైద్యం చేసి ఆనాటి గ్రామీణులనెందరినో రోగాలబారినుండి కాపాడిండు. శాయిరెడ్డి 1975, సెప్టెంబర్ 4వ తేదీన పరమపదించిండు.





