విప్లవ చైతన్యంల వినూత్న వ్యక్తిత్వం మగ్దుం
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణ రైతాంగ ఉద్యమంల నిర్మాణాత్మక పాత్ర మగ్దుం మొహియుద్దీన్. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంల, ట్రేడ్ యూనియన్ సంస్థల నిర్మాణంల మగ్దుం కృషి మరువరానిది. కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయిల నిలిపిన మగ్దుం తెలంగాణకు గర్వకారణం. ప్రజలల్ల ఆయనకున్న అభిమానం, స్థానిక చరిత్ర నిర్మాణంల అయన చొరవ అనన్య సాధ్యం.
1908, ఫిబ్రవరి 3 నాడు మెదక్ జిల్లా సంగారెడ్డిల మగ్దుం మొహియుద్దీన్ జన్మించిండు. సంగారెడ్డిల ప్రాధమిక విద్య పూర్తి చేసుకొని ఉన్నత విద్య హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంల పూర్తి చేసిండు. 1932ల విద్యార్థి దశలనే కవిత్వం రాయసాగిండు. ‘పీలా దుషాల’ (పసుపుపచ్చ ఉత్తరీయం) ఆయన మొదటి రచన. తర్వాత ‘షాదీ’ గేయం రాసిండు. మగ్దుం మంచి నటుడు కూడా. విద్యార్థి జీవితంల నటన ప్రారంభించి విశ్వవిద్యాలయ అధ్యాపకుల ప్రశంస పొందిడు. ‘హూన్ కే నాఖున్’ అనే మగ్దుం నాటకం రవీంద్రనాథ్ ఠాగూర్ మెప్పు పొందింది. ఉర్దూలోని ఆయన కవితలు ఎందరినో ఉర్రూతలూగించినయి.
1930 నుండి 1941 వరకు హైదరాబద్ సిటీ కాలేజిలో ఉర్దూ అధ్యాపకుడుగా పనిచేసిండు. ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ ప్రారంభించి కమ్యూనిస్టు కార్యకలాపాలు సాగించిండు. హైదరాబాద్ రాష్ట్రంల కార్మికోద్యమ నిర్మాణం కోసం, కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల భాగస్వామ్యం కోసం 1940 ల లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసిండు. మగ్దుం మంచి వక్త. ఉర్దూల, తెలుగుల అనర్గళంగా ఉపన్యసించేవాడు. ఆయన ప్రసంగాలల్ల తొణికే కవిత్వంల, ఛలోక్తులల్ల జనం ఉర్రొతలూగేవాళ్ళు. కార్మికుల ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు నిర్మించి పైదరాబాద్ రాష్ట్రంల నిజాం వ్యతిరేక, జమీందారీ వ్యతిరేక పోరాటం నడిపించిండు. 1952ల హుజూర్‌నగర్ నియోజక వర్గంనుండి శాసన సభకు ఎన్నికయ్యిండు. 1956ల శాసన మండలి సభ్యుడిగ సేవలందించిండు.
‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’, అని నినదించిన ఆయన గేయం భారతదేశమంతటా ప్రకంపనాలు సృష్టించింది. ‘భాగమతి’ కవిత ఎంతో ప్రచారం పొందింది. మగ్దుంకు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు లభించింది. ఉర్దూ సాహిత్యంల, తెలంగాణ చైతన్యంల మగ్దుం మాయని, మరువలేని చంద్రబింబం.





