- గవ్వా జానకిరామరెడ్డి
మ. ధర స్వాతంత్ర్యమె స్వర్గతుల్యమను తత్వజ్ఞాన లేశంబులో
నరయ జాలని మందబుద్ధులిటు లాహా! మాదృశుల్ విత్తలో
భరతి తుచ్ఛసుఖానురక్తినిజ యావచ్చక్తుల రిత్తవోఁ
బరతంత్రంబుల బుద్ధులౌదు రిది యే ప్రారబ్ధ కర్మంబొకో.
సీ. స్వర్గమ్మునకుమించు సమ్మోదమొనరించి
జన్మభూమిని బరస్థలము చేసి
కని పెంచి కఱపిన జననీ జనకుల శు
శ్రూషా షరత్వంబు సున్న చేసి
పిన్న నాఁటనుగోలె ప్రీతిఁ బోసించిన
పోషకావళిమేలు బూదిచేసి
తమ శుభాశుభములన్మమతఁ బాల్గొనువట్టి
బంధుసంతతిఁ జూడఁ బ్రాలుమాలి
గీ. నిజ సహోదరబృందమ్ము నెచ్చెలులను
సతి సుతాదులవిడిచి దుశ్శాంతిగుంది
ఐహికామష్మిక సుఖంబులందుఁజెడుచు
దుర్విధిం జెందుచుందు రుద్యోగవశత.
మ. వ్యవసాయంబులో వణిక్సరణి నేవ్యాపారమందో స్వశ
క్తి వశంబా మరియే క్రియాకళలనో! ధీపారగుండై ధృఢా
ధ్యవసాయాత్మక వృత్తిఁబూని విలసద్ధర్మార్థ కాముండునై
యవని జీవిత కాలయాత్ర నడుపన్న్యాయంబు మోక్షార్థికి
‘గోలకొండ కవుల సంచిక’ (1934)