తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. ‘నా తెలంగాణ కోటీ రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
దాశరథి కృష్ణమాచార్యులు జన్మస్థలం వరంగల్ జిల్లా గూడూరు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించిండు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయిండు. పీడిత ప్రజలకు గొంతుగా మారి నినదించిండు. “రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే” అని గర్జించిండు. “దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్” అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసిండు.
‘అగ్నిధార’, ‘మహాంధ్రోదయం’, ‘రుద్రవీణ’, ‘మార్పు నా తీర్పు’, ‘ఆలోచనాలోచనాలు’, ‘ధ్వజమెత్తిన ప్రజ’ మొదలైన కవితా సంపుటాలు వెలువరించిండు. ‘ఆంధ్రమహాసభ’లో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించిండు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించిండు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించిండు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేసిండు. రాష్ట్ర,కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.