తెలగుతల్లి తెలంగాణ - చరిత్రతో ముడిపడిన చర్చ
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
-నందిని సిధారెడ్డి
ఎట్టకేలకు ‘తెలుగుతల్లి’ చర్చ మొదలైంది. కెసిఆర్ ఒక్కమాటతో బిడ్డల గుండెలు కలవరపడ్డాయి. తెలుగుజాతి, తెలుగుతల్లి భావన కృత్రిమమైందని, అవసరాల రీత్యా కల్పించబడిందని తెలంగాణవాదులు తొమ్మిదేళ్ళుగా చెప్పుకొస్తున్నా పట్టించుకోని వాళ్ళు రాజకీయ స్వరంలో వినిపించేసరికి రచ్చ చేస్తున్నారు. ఎప్పటికైనా తెలుగుతల్లి చరిత్ర తేలాల్సిందే. దబాయింపు ఏ చర్చకైనా మంచిదికాదు. జాతి భావన, మాతృ భావన, ప్రాంత భావన కాల సందర్భాల్లోంచి రూపొందుతుంది. చారిత్రక అవసరాల కనుగుణంగా ఆయా భావనల ప్రాధాన్యత మారుతూ ఉంటుంది.
భావోద్వేగాలు నిజమే అయినా పరిస్థితుల తోడ్పాటు లేకపోతే ఏ భావం ఉద్వేగస్థాయికి చేరుకోలేదు. ఎవరికైనా ‘భావన’ తయారు చేయటం, తారుమారు చేయటం సులభం కాదు. తగిన పునాది ఉండాలి. పుట్టిన నేలను గౌరవించడం, తల్లిగానో, తండ్రిగానో సంభావించడం పురాతనకాలం నుంచి అన్ని ప్రాంతాల్లో ఉన్నదే. ఆ నేల పొలిమేరలు మాత్రం ఇప్పటివి కావు. ఆ తల్లిపేరు, వివరం ఇప్పుడు వర్ణిస్తున్నది కాదు. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో భారతమాత వర్ణన కనిపించదు. వాల్మీకి వర్ణించిన జనని భారత జనని కాదు. ‘జనని సంస్కృతంబు సకల భాషలకు’ అంటే చాలా భాషలు ఒప్పుకోవు. ‘వందేమాతరం’ ఇటీవలి కాలానిది. బంకిం చంద్రుని దృష్టిలో ఆ మాత కాళీమాతే. ఒకానొక సందర్భం కుదిరి భారతదేశాన్ని ఉర్రూతలూగించింది.
జాతీయగీతంలోని ‘భారత భాగ్యవిధాత’ ‘అధినాయకుడు’ ఎవరు? భారత పితా? భారత సుతుడా? చెప్పలేకపోవచ్చు. ఇంకెవరో కూడా నిరూపించలేం. ‘తెలుగుతల్లి’ విషయంలో అట్లా కాదు. సందర్భం స్పష్టం. చరిత్ర సుస్పష్టం. ఇరవయో శతాబ్ది ఆరంభమే ఆంధ్రోద్యమానికి బీజాలు వేసింది. అప్పటి వరకు జాతి భావన, మాతృభావన లేదు. 1905లో ‘వందేమాతర’ ఉద్యమమే జాతిభావన మేలు కొల్పింది. మదరాసు రాష్ట్రంలో ఆంధ్రులు పడుతున్న అవస్థలే జాతిభావనకు మూలమయ్యాయి. గుంటూరులో ‘యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్’ ఏర్పాటైంది. జొన్నవిత్తుల గుర్నాథం ‘హిందూ’పత్రికలో వ్యాసాలు రాసి ఆంధ్రోద్యమానికి అంకురార్పణ చేశాడు.
ఆంధ్రజాతి భావన నిర్మాణం కోసం 1907లో చరిత్ర ‘తవ్వకం’ పని ప్రారంభించి విజ్ఞాన చంద్రికా మండలి 1910లో ‘ఆంధ్రుల చరిత్ర’ ప్రచురించేనాటికి, 1910లో తమిళుల, ఆంధ్రుల ఉద్యోగాల గణాంకాలు ప్రచురించేనాటికి కూడా ‘తల్లి’ ఏర్పడలేదు. మొదటిసారి ముట్నూరు కృష్ణారావు 1913 మే 24 కృష్ణాపత్రిక సంపాదకీయం ‘మాతృసందర్శనము’లో ‘ఆంధ్రమాత’ను ఆవిష్కరించాడు. ‘భరతమాత ముద్దుకొమరితయగుచు/ అలరి మన ఆంధ్రమాత వర్థిల్లెడు గాత’. ‘ఆంధ్రమాత’ తల్లి ‘భరతమాత’ అని కూడా తెలిపాడు. 1914లో గడ్డం కొండారెడ్డి ‘ఆంధ్ర మాతృస్తవము’ శీర్షికన పద్యాలు రాశాడు.
‘తల్లి’ రూపొందినా ఆంధ్రజనుల్లో ఆ భావన అందుకోలేదు. ‘నాదు జాతి నాదు దేశము నా భాష/ అను అహంకార దర్శనమందు మాంధ్ర’ అని రాయప్రోలు ‘ఆంధ్ర’ శీర్షికతో పద్యాలు రాశాడు. ఆంధ్రబిడ్డడిని అహంకారదర్శనం సంతరిచుకొమ్మని ప్రభోదించాడు. చివరకు ‘శ్రీ’ అనే రచయిత అహంకారదర్శనము చేసి ‘భారత-ఛీ-కాదు ఆంధ్రమాతకు జై’ అని రాశాడు. ఆ తర్వాత ఆంధ్రోద్యమంలో రాయలసీమ వారిని కలుపుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఆ సందర్భంలో ‘ఆంధ్రమాత’ ‘తెలుగుతల్లి’గా రూపాంతరం చెందింది. తిరిగి రాయప్రోలు ‘తెనుగుతల్లి’ పద్యాలు రాశాడు. ‘మన మండలంబున మన తల్లి వేఱవసియింపగా గృహము కట్టింపవలయు’ నని తిరుపతి వేంకటకవులు స్వప్నించారు.
ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కొరకు ఆంధ్రోద్యమం, ఆంధ్రోద్యమ నిర్మాణం కొరకు ఆంధ్రమాత, తెలుగుతల్లి ఉనికిలోకి వచ్చారు. ఈ పరిణామాలతో, భావోద్వేగాలతో తెలంగాణకు సంబంధం లేదు. అయినా- ఈ తల్లుల్ని తెలంగాణ నిరాకరించలేదు. తిరుపతి వేంకటకవులు తల్లికి ‘గృహము కట్టింపవలయు’నని తలపోశారు గాని ఇంకొకరి గృహములో ఉంచుమని కోరలేదు. ఆంధ్రులు మదరాసు నగరాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ నగరాన్ని వశపరచుకున్నారు. ఆనాడు పొట్టి శ్రీరాములు మదరాసు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరాడు. అచ్చం అట్లాగే ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ నగరాంధ్ర ప్రముఖులు కోరుతున్నారు. పుత్రుల కోరికను ‘ఆంధ్రమాత’ మన్నించింది. తెలుగుతల్లి మన్నిస్తుంది. తెలంగాణతల్లి మన్నించదు.
భారత మాతను ఆంధ్ర కవి ‘ఛీ’ కొట్టినా చెల్లింది. ఇంత భావోద్వేగంలోనూ ఏ తెలంగాణీయుడు భారతమాతను ఆక్షేపించలేదు. ప్రఖ్యాత ఆంధ్రకవి తుమ్మల అరవలను ‘దోమలని’, ‘పాలలో బడిన బల్లుల’ని తూలనాడినా సంస్కారంగా చలామణి అయింది. ఇంత స్థితిలోనూ తెలంగాణ కవులు అట్లా తిరస్కారంగా మాట్లాడకపోయినా సంస్కారం కాదు. అగస్త్యుడు ప్రథమాంధ్రుడని, వాల్మీకి ఆంధ్రదేశంలోనే పుట్టినాడని రాసుకున్నా అది చరిత్ర అయింది. రాజరాజ నరేంద్రుడితోగాని, కృష్ణదేవరాయలతోగాని తెలంగాణకు సంబంధం లేదని రాస్తేనో, తెలంగాణ ఆంధ్ర రెండు వేర్వేరు జాతులని రాస్తేనో, కనీసం వేర్వేరు పాలనల్లో ఉన్నాయని రాస్తేనో చరిత్రను తారుమారు చేసినట్టవుతుంది.
ఆంధ్రప్రదేశ్ అవతరణతో తెలుగుతల్లి అవసరం తీరిపోయింది. కొంతకాలం మూలనుంచారు. అవమానాలు తట్టుకోలేక 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయినప్పుడు తెలుగుతల్లిని బయటకు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి కేంద్రసర్కారుతో తేల్చుకోవాల్సి వస్తే స్వాభిమానాన్ని, సాధికారాన్ని సాధించుకోవడానికి తెలుగుతల్లిని ఊరేగించారు. కోరిన వరాలిచ్చినందుకు కృతజ్ఞతగా ఎన్‌టిఆర్ విగ్రహం చెక్కించి ప్రతిష్టించాడు. ఇంత చరిత్ర ‘తెలుగుతల్లి’ది. ఈ చరిత్రంతా లక్ష్యపెట్టకుండా కెసిఆర్ తెలుగుతల్లిని దిక్కుమాలిన తల్లి అన్నాడు.
ఇప్పటి తెలంగాణ ఉద్యమాన్ని అణచటానికి తెలుగుతల్లినే ప్రయోగిస్తున్నారు కనుక అట్లా అనవలసి వచ్చింది. మామ పెట్టించిన విగ్రహం అల్లుడు హైటెక్ అభివృద్ధిలో భాగంగా తొలగించినప్పుడు ఆ తల్లి నిజంగా దిక్కుమాలినదయింది. అపుడు పట్టించుకోని తనయులు దిక్కుమాలిన తల్లి అనగానే ఎగిసిపడ్డారు. ఇది తెలుగుతల్లిమీద ప్రేమకాదు. తెలంగాణ తల్లిమీద అసహనం. నెహ్రూ పేర్కొన్న సామ్రాజ్యం చేజారిపోతుందన్న అసహనం.






ఫిబ్రవరి 5th, 2007 at 7:39 am
మహొజ్వల చరితకు వారసులం…… త్యాగలకు వారసులం…. ఇప్పటికీ…. త్యాగాలకు వెరవం తెలంగాణ వదలం…… వచ్చిన అవకశాన్ని వదలక…. తల్లి రుణం తీర్చుకొనె యాల్ల…తెలివిగ..కొనవరకు కొట్లాడి…
తెలంగాణి తెచ్చుకుందాం.తల ఎత్తుకొని బతుకుదాం..
జై తెలంగాణ
రాజు బూర
బద్దిపడగ