తొలి తెలుగు సినీ గేయ రచయిత కేశవదాసు
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’కు పాటలు రాసిన తొలి సినీగేయ రచయిత చందాల కేశవదాసు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిల 1876 జూన్ 20వ తేదీన జన్మించిండు. చందాల లక్ష్మి నారాయణ, పాపమ్మలు తల్లిదండ్రులు. కేశవదాసు నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త. భక్త ప్రహ్లాద, కనకతార చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు రచించి, సినీరంగంల ఖ్యాతిపతాక నెగురవేసిండు. ‘భలే మంచి చౌక బేరమున్ పోయినన్ దొరుకదు’, అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే.
1930-33 లల్ల ఈయన రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు సాతారు రాజేశ్వరరావు, అముల నరసింహారావు గారలు పాడగా బెంగుళూరుల రికార్డు చేసింరు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంల భక్తుల సౌకర్యార్థం ‘బావి’ తవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేసిండు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించిండు. ఇతను సినిమా స్క్రిప్టులతో పాటుగా కేశవ శతకం, బలిబంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు, మొదలైన ఎన్నో రచనలు చేసిండు. అవధానవిద్యల ఆరితేరినవాడు. ఈయన ఆధ్వర్యంల ‘బాల భారత్ సమాజం’వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. ‘కనక తార’, ‘లంకాదహనం’ నాటకాలను సినిమాలు తీసింరు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చు చేసి మార్గ దర్శకంగా నిలిచిండు. సినిమా అంటే ఏమిటో అంతగా పరిచయంలేని రోజులల్ల సినీ రచనలు చేసి ఖ్యాతి గడించిన కేశవదాసు తెలంగాణకు గర్వకారణం. 1956, జూన్ 14న ఆయన తుదిశ్వాస విడిచిండు.





