కలమే ఆయుధంగా ప్రజల్ని మేల్కొల్పిన వెల్దుర్తి మాణిక్యరావు
నవంబర్ 19th, 2006 by డిస్కవర్ తెలంగాణ
కలమే ఆయుధంగా ప్రజలల్ల చైతన్యం విస్తరింపజేసిన వ్యక్తి వెల్దుర్తి మాణిక్యరావు. ఒక పక్క రచయితగా మరొక పక్క పాత్రికేయుడుగా ఆయన కృషి చిరస్మరణీయం. ఆంధ్రమహాసభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు పత్రికలల్ల రచనా బాధ్యతలు నిర్వహిస్తూ స్వాతంత్ర్యోద్యమ పిపాసను రేకెత్తించిండు. తెలంగాణ ప్రజల చైతన్యం కోసం ఆయన బహుముఖాలుగా కృషి చేసిండు.
వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లాలోని వెల్దుర్తి గ్రామంల 1913ల జన్మించిండు. సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో ‘గోలకొండ’ పత్రికకు సహాయ సంపాదకులుగా పని చేసిండు. మద్యపాన నిరోధక మాస పత్రికకు తెలుగుల ఉర్దూల సంపాదకునిగా ఉన్నడు. నిజాం నిరంకుశ పాలనల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ అణిచివేత విధానాలు వివరిస్తూ ‘రైతు’ పుస్తకం 1946ల రచించిండు. అది నిజాం ఫర్మానా ద్వారా నిషేధించబడ్డది. ఆయన పలుసార్లు జైలుశిక్షలు, రహస్య జీవితం గడప వలసి వచ్చింది. ఆయన రచించిన కవితలు ‘మాణిక్యవీణ’ సంపుటిగా వెలువడినయి. ‘మాడపాటివారి జీవితం’, ‘సర్దార్ జమలాపురం కేశవరావు జ్ఞాపకాలు’, ‘రాజ్యాంగ సంస్కరణలు’, ‘హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర’ మొదలైన పుస్తకాలు రచించిండు. రచయితగానే కాక క్రియాశీల కార్యకర్తగా కూడా సుప్రసిద్ధుడు. 1938ల ఆంధ్ర యువజన సంఘం కార్యదర్శిగా, 1940ల నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ కార్యదర్శిగా విశేష కృషి చేసిండు. ఆ రోజులల్ల తెలుగు గ్రంధ ప్రచురణ ఒక ఉద్యమంగా సాగింది. మాణిక్యరావు 1939ల ‘అణాగ్రంధమాల’ అనే ప్రచురణ సంస్థకు సంపాదకులుగా వ్యవహరించి ఎన్నో ఉత్తమ గ్రంధాలు వెలువరించిండు. ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, మరాఠి, కన్నడ భాషలల్ల కూడా సాహిత్య రచనా వ్యాసంగం కొనసాగించిండు. హైద్రాబాద్‌ల స్థిరపడి ‘వెల్దుర్తి మాణిక్యరావు’గా సుప్రసిద్ధుడైన తాను 81వ ఏట 1994ల కన్నుమూసిండు.





