Feed on
Posts
Comments

నల్గొండ జిల్లా, జనగామ తాలూకాకు (ప్రస్తుతం జనగామ తాలూకా వరంగల్లు జిల్లాలో ఉంది) చెందిన పేరు మోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాలకు భూస్వామి. ఆయన కౌలుదార్లనుండి, రైతుల నుండి నిర్బంధంగా భూములు కబళిస్తూనే వచ్చాడు. తన ఆధీన ప్రాంతంలోని, దాదాపు 40 గ్రామాల రైతులచేత నిర్బంధంగా సంవత్సరం పొడవునా తన పొలాలలో చాకిరి చేయించుకొనేవాడు. కుటుంబంలో బిడ్డ పుట్టినా, వివాహం జరిగినా, ఎవరైనా మరణించినా ఆ సందర్భాలలో రైతులనుండి నిర్బంధంగా నజరానాలు (ధనరూపంగాగాని, వస్తురూపంగాగాని బహుమానాలు) పొందుతుండేవాడు.

ప్రతి చేతి పనివాడు, వ్యాపారస్తుడూ తన ఉత్పత్తులలో కొంత భాగాన్ని లేదా రొక్కరూపంగా నిర్ణీత మొత్తాన్ని చెల్లించక తప్పేదికాదు. చర్మకారులు – చెప్పులను, పశువులు కొమ్ములను, గొల్లవారు – కంబళ్ళను, విందుకోసం గొర్రెలను, మేకలను, పాలను; రైతులు – ధాన్యం, కూరగాయలు మొదలైనవి యిచ్చుకొంటూ వుండేవారు. 1940 ప్రాంతంలో ఆయన రెండు లక్షల రూపాయల విలువజేసే భవనం కట్టించాడు. ఆ భవన నిర్మాణ వ్యయంలో దాదాపు సగభాగాన్ని వివిధ నిర్మాణ పనులకు నిర్బంధంగా చాకిరీ చేయించుకోవడం ద్వారాను, రొక్కరూపంగాను సేకరించాడు. మూడు రోజుల క్రితమే ప్రసవించిన ఒక యువతిని, తన పసికందును ఇంటి వద్ద వదిలి అతని పొలాలలో చాకిరీ జేయటానికి నిర్బంధంగా రప్పించుకున్నాడు. దానితో చూచేవారెవరూ లేక, పాలులేక ఆ పసికందు కన్ను మూసింది. అతడెంత దుర్మార్గుడుగా పేరు మోసాడంటే, ఆ గ్రామలలో నివసించేవారికి తమ బిడ్డలనిచ్చి పెండ్లి చేయటానికి రైతులు వెనకాడేవారు.

ఆయన తన గ్రామాలలో ఒకటైన పాలకుర్తిలో సంఘాన్ని గట్టిగా బలపరిచే కార్యకర్తయగు అయిలమ్మ అనే రజక స్త్రీకి చెందిన పొలాన్ని స్వాధీనం చేసుకొనటానికి ప్రయత్నించాడు. పొలాలనుండి పంటను కోయించుకెళ్ళాలని పథకం వేసాడు. అంతకముందే ఆ గ్రామంలో జరిగిన ఒక బహిరంగసభపైకి, సంఘం నాయకులను హత్య చేయటంకోసం గూండాలను పంపించాడు. అయితే ప్రజలాతని పథకం సాగనివ్వలేదు. గూండానాయకుడగు ఓనమాల వెంకడుని చితకదన్ని పంపించారు. ఆ సాకుతో భూస్వామి, పధ్నాలుగుమంది సంఘనాయకులను అరెస్టు చేయించాడు. హత్యాప్రయత్నం చేసినట్టు వారిపై కేసు పెట్టించాడు. ఈ కేసులో ఆ గ్రామానికి, తాలూకాకు, జిల్లాకు చెందిన సంఘనాయకులు యిరికించబడ్డారు. ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ పరిస్థుతులలో, తాను అయిలమ్మ పొలాలను స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడే వారెవరూ వుండబోరని విసునూరు రామచంద్రా రెడ్డి భావించాడు.

అయిలమ్మ పొలంలో పంట కోసుకురమ్మని ఆడ, మగ నౌకర్లను వందమందిని, వందమంది గూండాలను పంపించాడు. అప్పుడు సంఘ నాయకులు, 28 మంది వలంటీర్లతో బయలుదేరారు. ప్రాణాలకు తెగించి, కర్రలు చేతబట్టుకుని, నినాదాలిచ్చుకుంటూ వెళ్ళి గూండాలపై దాడి చేసారు. ఈ వాలంటీర్లు కర్రలు చేతబూని ఒక వ్యూహం ప్రకారం నడుస్తూండటంజూచి, వారి ముఖాలలో కానవస్తున్న ధృఢ నిశ్చయాన్ని గాంచి గూండాలు బ్రతుకుజీవుడా అంటూ పలాయనం చిత్తగించారు. ఇంకెవ్వరూ మిగలలేదు, వాలంటీర్లే పంట కోసి అయిలమ్మ యింటికి పంపించారు. ఆ రాత్రే విసునూరునుండి పోలీసులు దిగారు. అయినా, అయిలమ్మ ఇంట్లో వున్న ఆ ధాన్యాని, ముట్టుకొనటానికి సాహసించలేదు. ఈ సంఘటన ప్రజలను ఉత్తేజ పరిచింది.

ఆ మరునాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్లు ప్రతాపరెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి గార్లతో సహా ఆరుగురు నాయకులను అరెస్టుజేసి, విసునూరు పోలీసు స్టేషనుకు తీసుకుపోయారు. వాళ్ళ చేతులకు, కాళ్ళకు బేడీలు వేసి అర్ధరాత్రి వేళ, కచేరిచావిడికి తీసుకుపోయారు. అక్కడ వాళ్ళను తీవ్రంగా దెబ్బలు గొట్టారు. వారి తలలు పొయ్యిలలోకి నెట్టారు. వారి ఆసనాలలో కారం కూరారు. వాళ్ళ నోళ్ళలో మూత్రంపోశారు. ఫాసిస్టు పైశాచిక చర్యలింకా అనేకం చేశారు. అయితే ఇంత జరిగినా, అయిలమ్మ పొలాన్ని గాని, ఆపొలంలో పండినపంటనుగాని దేశముఖు స్వాధీనం చేసుకోలేకపోయాడు. పేరుమోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డిపై సాధించిన ఈ విజయం మొత్తం తెలంగాణా ప్రజలను ఉత్తేజ పరిచింది. ధైర్యాన్నిచ్చింది. ఇది జరిగిన చాలాకాలం తర్వాత కూడా ప్రజలు ఈ వీరోచిత పోరాటాన్ని గూర్చి కథలుగా చెప్పుకుంటూ ఆగాధలను గూర్చి పాటలు పాడుకుంటూ వుండేవారు.

దొడ్డి కొమురయ్య ఆత్మార్పణ: 1946 జులై 4:


పైన పేర్కొన్న సంఘటనతో విసునూరు దేశముఖ్ బాగా రెచ్చిపోయాడు. తనజీవితంలోనే ఎన్నడూ ఎరుగనంతటి ఘోరమైన ఓటమిగా దాన్ని పరిగణించాడు. పోలీసుల సహాయంతో కడవెండి గ్రామానికి చెందిన నాయకులను హత్యజేయాలని పథకం వేసాడు. ఈ పథకంలో భాగంగా అనేకమంది ప్రజలపై కేసులు పెట్టాడు. వారిలో 15 మందిని అరెస్టు చేయించాడు. వారు తర్వాత బెయిలు మీద విడుదల చేయబడ్డారు. ఆరోజుల్లో ఎంత అవ్యవధిగానయినా సరే, ప్రజలు సంఘం కార్యాలయం వద్ద చేరేవారు. తమ కార్యక్రమాన్ని గూర్చి చర్చించుకొనేవారు. ఆ విధంగా సమావేశమై చర్చించుకొనటాన్ని అరికట్టేందుకు గాను, వారిపై కోర్టులలో కేసులుపెట్టి భయపెట్టేట్లయితే తన హత్యా పథకాలు, అమలు జరపవచ్చునని అతడు తలంచాడు. పోలీసు అధికారులు, జమీందారుతోను, అతని గూండాలతోనూ, కలిసి మొత్తం పధకమంతా తయారు చేసారు. జమీందారు యధేచ్ఛగా వ్యవహరించటంకోసం వాళ్ళక్కడనుండి వెళ్ళిపోయారు.

అది 1946 జూలై 4వ తేది. తప్పత్రాగిన గూండాలు నాయకుల యిండ్లపై రాళ్ళు విసిరారు. లాఠీలు, వడిసెలలు, చేతబూని నినాదాలు చేసుకుంటూ ప్రజలు ఊరేగింపు జరిపారు. ఆ ఊరేగింపు ప్రధాన వీధిలోనే వున్న జమీందారు యింటిదాపుకు వచ్చేసరికి, జమీందారు యింటిప్రక్కన ఒక పాకలో అప్పటికే సిద్ధంగా వున్న గూండాలు ప్రజలపైకి కాల్పులు జరిపారు. ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న గ్రామసంఘ నాయకుడు దొడ్డి కొమురయ్యకు తుపాకీతూటా పొట్టలో గుండా దూసుకుపోయింది. ఆయన అక్కడకక్కడే మృతిచెందాడు. ఆయన అన్నగారైన దొడ్డి మల్లయ్య కాలికి తూటా తగిలి క్రిందపడిపోయాడు. మంగలి కొండయ్య నుదుటికి దెబ్బ తగిలింది, అతని సోదరుడు నరసయ్య ముంజేయి గాయపడింది.

అయినా ప్రజలు భయకంపితులై పారిపోలేదు. రక్తానికి రక్తం అని నినాదాలు చేసుకుంటూ వారు జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి ప్రక్కనే పాకలోవున్న గూండాలది చూసి కంపించిపోయారు. ప్రజల కోపాగ్ని నుంది తప్పుకొని బతికి బయటపడటం సాధ్యం కాదని తలంచారు. జమీందారు భవనపు ఎత్తయిన గోడలు తమకు రక్షణ నివ్వగలవని భావించారు. జమీందారు భవనంలోకి దూకారు. అయితే ప్రజలప్పటికే ఆ భవనాన్ని చుట్టుముట్టారు. పరిసర గ్రామాల ప్రజలకు కబుర్లు పంపారు. జమీందారు భవనానికి నిప్పంటించడం కోసం ఎండుగడ్డి మోపులతో ప్రజలు వచ్చిపడ్డారు. రెండువేల మంది ప్రజలక్కడ చేరారు. కొంతమంది గడీని చుట్టుముట్టారు. మరికొంతమంది వూరి వెలుపల కాపలా కాస్తున్నారు. యింకా కొందరు గ్రామవీధులలో పహరా తిరుగుతున్నారు. ప్రజలు ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారు.

ఈ వార్త విని విసునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబూరావు (జగన్ మోహన్) విసునూరు నుండి, కత్తులు, పిస్తోళ్ళు, బల్లేలు చేతబూనిన రెండువందల మంది గూండాలను తీసుకొచ్చాడు. గ్రామం వెలుపల కాపలాకాస్తున్న ప్రజలు వాళ్ళను చూసి ఆకాశం దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు. వడిసెలతో రువ్వుతూ మూకవుమ్మడిగా గూండాలమీదికి నడిచారు. ఆగ్రహావేశపరులైన జనసామాన్యాన్ని చూసిన గూండాలు, తుపాకీ కాల్పులు సహితం ప్రజల పురోగతిని ఆపజాలవని తలపోశారు. ప్రాణాలు దక్కితే చాలునని కాలికి బుద్దిజెప్పి పారిపోయారు. ప్రజలు వాళ్ళను మూడుమైళ్ళ దూరం తరిమికొట్టారు. అనేకమంది గూండాలకు రాళ్ళదెబ్బలు తగిలాయి. వాళ్ళలో చాలామంది, పారిపోతూ మాడాపురం తండాలో దాగుకున్నారు. అయితే అచ్చటి ప్రజలు పరిస్థితిని గమనించి ఆ గూండాలను తరిమివేశారు. పేరుమోసిన గూండా అనుముల రామిరెడ్డిని ఒకచోట పట్టుకున్నారు. కామ్రేడ్స్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, సి.యాదగిరిరావు తదితరుల నోళ్ళలో మూత్రంపోసిన వాళ్ళలో అతడూ వొకడని తెలిసిన ప్రజలు అతనిని చితకదన్ని పంపించారు. గూండాలు ఎక్కివచ్చిన బండ్లను ముక్కలుముక్కలు చేశారు. జమీందారు మామిడితోటలో ఒక్క చెట్టయినా మిగలకుండా చేశారు.

సరిగ్గా అదే సమయంలో 60 మంది రిజర్వుపోలీసులు ఆ గ్రామానికి వచ్చారు. గూండాలపై తాము చర్య తీసుకుంటామని ప్రజలకు చెప్పారు. వారిని అక్కనుండి వెళ్ళిపొమ్మన్నారు. ప్రజలక్కడినుండి చెదిరిపోయిన తర్వాత గూండాలను సురక్షితంగా జమీందారుకు వొప్పగించారు. ఇదంతా జరిగిన తర్వాత సంఘం నాయకులపై ఆరు కేసులు పెట్టారు. గూండాలపై దాడి చేసారని, గడీని చుట్టుముట్టరని, దానికి నిప్పంటించటానికి ప్రయత్నించారని. గూండాలలో ఎవరినీ అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసూ పెట్టలేదు. అయినా ప్రజలు చలించలేదు.

దొడ్డి కొమరయ్య మృతదేహానికి, శవపరీక్షానంతరం వేలాది ప్రజలు ఆ గ్రామాలన్నింటా పెద్ద వూరేగింపు జరిపిన అనంతరం అంత్యక్రియలు జరిగాయి. పరిసర గ్రామాల ప్రజలుకూడా ఆ వూరేగింపులో పాల్గొన్నారు. జమీందారు ఎదుట తాము తలవంచేది లేదని, సంఘంకోసం తామంతా ఇనుమడించిన శక్తితో పనిచేస్తామని వారంతా ప్రతినబూనారు. ఆ తర్వాత మూడు నెలల కాలంలో వారు, జమీందారు మనుషులను పొలాలలోకి రానివ్వలేదు. పనిచేయనివ్వలేదు. ఈ సంఘటన అనంతరం తమకు ప్రియతమమైన అమరవీరుని శ్లాఘించే పాటలు పాడుకుంటున్నారు.

కొమరయ్య మరణం, అమరత్వం తెలంగాణా రైతాంగంలో నిద్రాణమైవున్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్లజేసింది. నల్గొండ జిల్లాలోని అన్ని తాలూకాలలో ప్రజలు ఒక్కుమ్మడిగా విజృంభించారు. జిల్లా అంతటా జరిగే అన్ని సభలలోనూ, ప్రదర్శనలలోనూ, ఈ అమరవీరునికి జోహార్లర్పించే పాటపాడడం జరుగుతుండేది. కర్రలు, వడిసెలు ధరించిన ప్రజలు ఒక గ్రామానికి చెందినవారు మరొక గ్రామానికి వెళ్ళి వస్తూ ఉత్తేజం కలుగజేసేవారు. వారు ఉమ్మడిగా భూస్వామి గడీముందు బహిరంగ సభ జరిపేవారు. ఎర్రజెండాను ఆవిష్కరించేవారు. “ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్ళు, బేదఖళ్ళు ఇంకెంతమాత్రం సాగవు”, అని ప్రకటించేవారు. భూస్వామిగాని, దేశముఖ్ గాని సంఘం యొక్క ఈ ఉత్తర్వులను అమలు జరపకపోతే అతనిని సాంఘిక బహిష్కారానికి గురిచేసేవారు. అతని పొలాలను ఎవరూ పనిచేయటానికి వీలులేదు. క్షుర కర్మకారులుగానీ, రక్షకులుగాని ఇంటిపని వాళ్ళుగాని, ఇతర పనివాళ్ళుగాని ఎవరూ అతనికి ఏ పని చేయటానికి వీలులేదు. ఈ యాత్రను నిర్వహించింది, నిర్మించి వ్యాప్తి గావించింది స్థానిక నాయకులే.

పొరుగు గ్రామం నుండి వచ్చిన ప్రజలకు కులమత వివక్షతలేకుండా, భోజనాలు పెట్టి సత్కరించేవారు. వారికి ఘనంగా వీడ్కోలిచ్చేవారు. దూర గ్రామాలనుండి వచ్చినవారు, వెనకకు వెళ్ళిపోగా, ఆ గ్రామం నుండి మరికొంతమంది ఆ యాత్రలో చేరి పక్క గ్రామం వరకు వెళ్ళివచ్చేవారు.

ఈ వూరేగింపులు, జమీందార్ల ఇండ్లముందు నిలిపి, “జమీందారీ విధానం రద్దుకావాలి,”  “భూస్వాముల పీడనకు, పోలీసు జులుముకు స్వస్తి చెప్పాలి,” “నిర్బంధ ధాన్యసేకరణను, వెట్టిని, అవినీతిని అంతంచేయాలి,” “అమరజీవి దొడ్డి కొమరయ్య జిందాబాద్” మొదలగు నినాదాలు చేసేవారు. తమ చేతుల్లోని గుటపలన్నిటిని (కర్రలన్నింటినీ), ఒక్కుమ్మడిగా నేలపై కొట్టి పెద్ద శబ్దం చేసేవారు. ఆ శబ్దం యావత్తు గ్రామాన్ని దద్దరిల్ల చేసేది. ప్రజాద్రోహుల గుండెల్లో కంపరమెత్తించేది. “గూటుపాల సంఘం” అని వాళ్ళు పిలిస్తుండే సంఘం నినాదాలు వినపడగానే, ఈ ప్రజాద్రోహులు తమ తలుపులు మూసుకొని, లోపల కూర్చొని తాళాలు పెట్టుకునేవారు. ఈ వూరేగింపులలో గల ప్రత్యేక లక్షణాలలో ఒకటి ఏమిటంటే, పురుషులతోపాటు స్త్రీలుకూడా తమ గ్రామాలలోనేగాక, ఇతర గ్రామాల్లో కూడా పాల్గొనటం. అయిలమ్మ భూమి పోరాటంపై రాసిన పాటలు మహిళలను అత్యంతంగా ఆకర్షించాయి. మొట్టమొదటిసారిగా భూమి, బేదఖళ్ళు, వెట్టి, నిర్బంధ ధాన్యసేకరణ వంటి జీవిత సమస్యలను జమీందారీ రద్దు నినాదాని జోడించటం జరిగింది. ఈ దశలో ప్రధానమైన అంశమిది.

ఈ ప్రజా ఉద్యమ వెల్లువలో, ప్రభుత్వం లెవీ ధాన్యం సేకరించలేకపోయింది. లెవీ ధాన్యం వసూలు చేస్తుండే అధికారులను గ్రామంలో అడుగయినా పెట్టనివ్వటంలేదు. అదే విధంగా వెట్టికూడా దానంతటదే అంతమయింది. వెట్టి చేయించుకుంటూ వచ్చిన దేశముఖులు, గ్రామాధికారులు, గ్రామాలు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళు ఊళ్ళోనేవున్నా తలెత్తుకు తిరగలేకపోయేవాళ్ళు. కొలది వారాలలోనే ఈ ఉద్యమం నల్గొండ జిల్లాలోనూ, పొరుగునే ఉన్న వరంగల్లు (ఖమ్మం) జిల్లాలో మూడు – నాలుగు వందల గ్రామాలకు వ్యాప్తి గాంచింది.

మూలం : పుచ్చలపల్లి సుందరయ్య ‘వీర తెలంగాణ విప్లవపోరాటం’

తెలంగాణ సాయుధ పోరాటం : జీ-టీ.వీ సమర్పణ, విడియో చూడండి

Share/Save/Bookmark

4 Responses to “తెలంగాణ సాయుధ పోరాటం : దొడ్డి కొమురయ్య”

  1. 1
    vijay rapaka Says:

    బాగుంది , నెను పుట్టి పెరిగింది పాల్కుర్తి లొనె ,
    చాన బాగ చెప్పినారు , ప్రస్తుతం ఇంగ్లాండు లొ వున్నను.

  2. 2
    vijay rapaka Says:

    మీరు తెలంగాన గురించి బాగ చెప్పారు, ఈ వెబ్ సైట్ బాగుంది

  3. 3
    chandra sheker chilappa Says:

    హై విజయ్ మామ , ఎట్ల వున్నవు మామ , ఈ వ్యాసము చదివినాను చాలా బాగుంది , నీ అభీప్రాయము చూచినాను , మనము గర్వపడాలి మన తెలంగాణ సైటు వున్నందుకు, నీ మిత్రుడు షార్మ.

  4. 4
    kondapalli venu gopal rao Says:

    ఈ విషయం మా పెద్ద నాన్న గారు వరుసకు అయిన శ్రీ యాదగిరి రావు గారు మరియు మామ గారు శ్రీ పెండ్యాల రాఘవ రావు గారు చెప్పినరు. ఇలాంటి అకృత్యాలు రామచంద్ర రెడ్డి ఎన్నో చేసిండట. మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణ డిస్కవర్ లో పెట్టడము గర్వకారణము.
    వేణు గోపాల్ రావ్ కొండపల్లి

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com