సవారీ
నవంబర్ 22nd, 2006 by డిస్కవర్ తెలంగాణ
ఉత్తరం ఇచ్చిన ఆ వ్యక్తిని ఆపాదమస్తకం ఓసారి పరీక్షగా చూశాడు. చెమటతో తడిసి ముద్ద అయిపొయాడు ఆ వ్యక్తి.
“నమస్తే…! అని కూడ అనకపాయె ఏందీ? ఆ…” అనికున్నాడు ప్రతాపరావు దొర. “పేరేమిటి?” దొరగారి ప్రశ్న.
“నారాయణ” ఆ వ్యక్తి జవాబు. కళ్ళజోడు సవరించికుని ఉత్తరం విప్పాడు ప్రతాపరావు. బావమరిది రాసినట్టు సంతోషం వేసింది. గబ గబ చదవడం మొదలెట్టడు.
ఉత్తరం చదివి సంతృప్తిగా నిట్టూర్చి నారాయణని ఉద్దేశించి.
“ఇంతేనా? ఇంకేవైన నోటి మత్‌లబ్ చెప్పాడా?” అని అడిగాడు.
“ఊహు ఏం చెప్పలేదు. జెప్పన రమ్మన్నరు గంతే” అన్నాడు నారాయణ.
“సరె నువ్వు వెళ్ళు” అన్న తర్వాత సైకిల్ తీసుకుని వెళ్తున్న నారాయణ కేసి మరోసారి గుర్రుగా చూసి… ఉత్తరం మడిచి జేబులో ఉంచుకున్నాడు. వేపచెట్టు చాటునుంచి “బర్సి” కట్టె కన్పిస్తోంది.
“అరేయ్ మల్లిగా…” అంటూ పిలిచాడు ప్రతాపరావు.
“అయా…” అంటూ వచ్చి ఆయన కూర్చున్న వాలు కుర్చీకి కొంత దూరంలో వినయంగా నిలబడ్డాడు మల్లిగాడు. “నువ్వు తొందరగవొయ్యి సాకలోన్ని పిల్సుకరాపో. నడువ్ తొందరగ పోవాలె.” “అయా…” అంటు తల నిలువుగా తిప్పుతూ, పాతపంచను బుజంపై సరిచేసుకుంటు పరుగులాంటి నడకతో చాకలి వాడవైపు వెళ్ళాడు సుంకరి మల్లిగాడు. వెళ్ళగానే బావ మరిదితో మాట్లాడవలసిన విషయాల గూర్చి ఆలోచనలో పడిపోయాడు ప్రతాపరావు-మాదిగల క్వార్టర్సు కంట్రాక్టు, హైస్కూల్ బిల్డింగ్ కంట్రాక్టు ఇంక పెద్ద పెద్దవి చాలాచాలా ఆలోచించి వెతికి పట్టుకుని ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని అనుకోకపోయినా అటువంటి నిర్ణయానికి వచ్చాడు-పావుగంటలో ఎదురుగా వస్తున్న మల్లిగాన్ని చూసి.
“ఏవాయెరా?” అంటూ నుదురు చిట్లించాడు.
“వాడు రాలేదు దొరా-పోరన్ని తోలిండు” అంటూ పోరని కోసం వెనక్కి తిరిగాడు. గోడపెచ్చులు ఊడదీస్తూ కొద్దిదూరంలో నిలబడిపోయాడు పోరడు. “అదె? వానికేవైందట?” రావుగారి కంఠంలో విసుగు, కోపం. “ఊరుడుకు మగ్గినవోలె నొప్పులు మొదలై గిప్పుడు గిప్పుడే ఏగిలివారంగ కాన్పు అయింది- నేను వాయిలాక్కో తక్కలాక్కో పోవల్సి ఉంటదని చెప్పి కొడుకును దోలిండు బాంచెన.” “నొప్పులు పెండ్లానికా? బిడ్డకా?” నిజం తెలిసికూడ అడిగాడు వ్యంగ్యంగా ప్రతాపరావు. “వాని పెండ్లానికే దొరా! కొడుకు పుట్టిండు-“ మల్లిగాడు. “తూ…నీయవ్వ! సిగ్గులేదురా? కొడుకులు, బిడ్డలు కనే ఈడుకచ్చినా ఇంకా వాడు పోరగాండ్లకనుడా? వానవ్వ బరుకతి తక్కువ… సంఘాలు, గింగాలు బెట్టి భూవులు కావన్నని, జాగలుకావన్నని సింగసానవేత్తరుగని గిత్ల కుక్కలుగన్నట్లు పోరగాండ్ల కనవద్దని చెప్పరేందిర మీవోళ్ళు” అంటూ లేచినిలబడి “ఏడి ఆపోరడు? బండిఅంత ఉరికత్తడా?” సందేహంగా అడిగాడు. “అదె?వానికేందిదొరా? దుడ్డెపిల్లవున్నట్టు వున్నడు ఏవైంది-వానికి?” “ఇట్రారపోరడ గాడనిలవడ్తివి?” అంటు పోరన్ని పిలిచాడు మల్లిగాడు. వాడు నేలచూపులు చూస్తూ వచ్చినిలబడ్డాడు మల్లిగానిచాటుకి. “ఏం పేర్రా?…” దొరగారి ప్రశ్న, “ఓదెలు” అయిష్టంగా మొగం పెట్టి చెప్పాడు వాడు. “సరె పొయ్యి బండి తయారుచెయ్యిండ్రి” అంటూ ఆజ్ఞ జారీ చేసి బంగళా లోపలికి వెళ్ళాడు టిఫిన్ తిని బట్టలు మార్చుకోవడానికి.
* * *
పాలేర్లకి, షెగేదార్లకి చెప్పాల్సిన విషయాలు చెప్పి బండెక్కాడు ప్రతాపరావు దొర. పగ్గాలు చేతికి అందించాడు మల్లిగాడు. దొర ఓదెలు వంక చూసిండు అది చూసి మల్లిగాడు ఓదెల్ను ఉద్దేశించి. “నడువరా నడువ్ బండి ముందట నడువ్“ అన్నాడు. ఓదెలు కొద్దిగా బిత్తరవోయి కాళ్ళకున్న పాత ‘హవాయి’ చెప్పులు ‘చిటుక్ చిటుక్‘ మంటుంటె, బండిముందు నడవసాగిండు. బండికికట్టిన కోడెలు పొట్టిగ దిట్టంగ ఉన్నయ్. తోకలు చురుగ్గా కదిలిస్తూ పరుగు మొదలెట్టినయ్. మెడలో ‘గుంగుర్లు’ గలగల చప్పుడు చేస్తున్నయ్. బండి ఊరు దాటింది ఊరు ఆవలి దొరగారి పెద్దమావిడి తోటదాటింది. బండిముందు పరిగెత్తుతున్న ఓదెలికి శ్వాస వేగం హెచ్చింది. ఎగబీలుస్తూ పరుగెత్తుతున్నాడు. మెల్లగా నడవాలనిపిస్తుంది. కాని కోడెలు కాళ్ళు త్రొక్కినట్టు పైపైకే వస్తున్నాయ్. ‘బండికిందవడితె సచ్చుడే’ అనుకుంట శక్తిని కూడ దీసుకుంట పరుగెత్తుతున్నాడు. ఊరు దాటిన తర్వాత బండెక్కమంటడో ఏమోనని ఆశపడ్డాడు. ఇప్పుడు ఆశకి అవధి ఊరి పొలిమేర చేసుకుని పరుగెత్తుతున్నాడు. దాపటి కోడెపగ్గం ఊడిపోయింది. దొర బండి బలవంతంగా ఆపాడు. దాన్ని మళ్ళీ కట్టడం కోసం కోడె ముండు నిలబడి కడుతోంటె అది కొమ్ము విసిరింది. ‘ఫటక్’మని ఓదెలు తలకి తగిలింది. తల దిమ్మెక్కి నట్టుఅయింది. పగ్గం పక్కకి జరుగుతుంటె కోడె చెప్పుపై కాలువేసింది. గూడ తెగిపోయింది తలదెబ్బతో బాధపడ్తున్న ఓదెలికి అది మరింత బాధ కల్గించింది. ఏడ్పువచ్చినంత పనైంది. బండి మళ్ళీ సవారీ మొదలెట్టింది. బండి వెనుక తడిక పట్టుకుని పరుగెత్తుతున్న ఓదెలికి తల ‘ధిమ్ ధిమ్’ అని ఒకటేబాధ, పైగా ఓ చేతిలో రెండు చెప్పులు.
సూర్యుడు పడమటి కొండల్లోకి జారుతున్నాడు. ఆకాశం చిత్రవర్ణాలతో… చల్లని గాలి సంధ్యారాగం పాడుతోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ‘మానేటి’ గట్టు పొడవునా ప్రయాణం. ఏటిగట్టు, తాడిచెట్లు చాలా అందమైన దృశ్యాలు కదిలిపోతున్నాయ్. ఓదెలు ఇవేవి గమనించే స్థితిలో లేడు. వెళ్ళాల్సిన ఊరు ఎప్పుడు వస్తుందో? ఏమో? అనుకుంటూ బండికి కాస్తా వెనుకబడిపోతున్నాడు. అప్పుడప్పుడు వెనక్కి చూస్తున్న దొరగారు.
“నడువరా నడువ్ ఇగో ఆ కనవడే ఊరు దాటితే అచ్చేదె మన6 బొయేది” అంటూ బండి వేగాన్ని కొద్దిగా తగ్గించాడు. బండి ఏటికాల్వలోకి ప్రవేశించింది. గిత్తలు కాల్వలో ఆగాయి. దప్పిక తీర్చుకున్నాయి. ఇంకా తాగినట్టు నటిస్తూ దమ్ము తీర్చుకోవడం కోసం మూతులు నీళ్ళపైనే అనించాయి. వాటితీరు చూసిన ఓదెలుకు నవ్వువచ్చింది. కాల్వ ఎగువకు వెళ్ళి దోసిలితో నీళ్ళుతీసుకుని పిక్కిళించి ఉమ్మి కడుపార నీళ్ళుతాగాడు. తాటిచెట్ల పైనించి గాలి రయ్ మని వీస్తోంది. తాటి ఆకులు గలగల శబ్దం చేస్తూ కదుల్తున్నయ్. ఆ గాలిలో… ఆ ఆకులు శబ్దసంగీతంలో కలిసి ఎక్కడి నుంచో ఉత్తేజకరమైన పాట విన్పిస్తోంది. “బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి ఏ బండ్లెవోతవ్ కొడుకో నైజాం సర్కరోడా…” అంటూ మైకులో కొంతమంది కలిసి పాడుతున్నట్టున్నారు. ఉద్వేగంతో… ప్రతాపరావు నుదురు చిట్లించి పాట విన్పిస్తున్న ఊరివైపు చూశాడు. విపరీతమైన జనసమూహం పోగైవున్నారు. ఇంకా దారీ తెన్ను అనకుండా పొరుగూళ్ళ జనం వస్తున్నారు ఆ బహిరంగసభకి జనసమూహం మధ్యలోంచి… సన్నగా దారి కన్పిస్తోంది ‘పాపిడ’లా. ఆ దారిలోంచే బండి వెళ్ళాలి. తలుచుకుంటుంటె ఆపాట వింటుంటె ప్రతాపరావు దొర దవడలు బిగుసుకుపోతున్నాయ్. జన సమూహం మధ్యలోంచి ఎర్రని జండా రెపరెపలాడ్తోంది. ఎవరో వీపుకి కొతలు పెట్టి కారం అద్దినట్టు ఇదైపోతున్నాడు. బండి అలాగే నిలబడిఉంది. దొరగారి మనసులో కొద్దిగా అనుమానం. కొద్ది దూరంలో ఉన్న తాటి చెట్లలోంచి కావడి బుజాన వేసుకుని వస్తున్నాడొక గౌడు. బండి దగ్గరికి రానేవచ్చాడు.
“ఏం రా గౌడు! అక్కడ జరిగేది ఏం మీటింగు?” అంటూ ప్రశ్నించాడు. “సంగపోల్లది” అంటూ వెళ్ళిపోయాడు గౌడు. దొరగారు దారికి ఇరువైపుల చూశాడు. పక్కదారులు కన్పించలేదు-అంతటా పచ్చని వరిపొలాలె. బండెనుక మనిషితో, మీటింగు మధ్యలోంచి పోతె?” తల అడ్డంగా ఊపుకున్నాడు- ఓమారు ఓదెల్ను, ఓమారు జనసమూహాన్ని రెపరెపలాడె ఎర్రజెండాని చూసి నిట్టూర్చాడు.
“అరేయ్ ఎనుకబండెక్కు తొందరగ పోవాలె” అన్నడు. ఓదెలు నమ్మలేనట్టు చూశాడు. “ఎక్కరాగాడిదీ- ఎక్కు ఎక్కవంటె చెవులు ఇనవడ్తలేవ్!” కోపంగా అన్నడు దొర. భయంగా బండెక్కి వెనుక ఒదిగికూర్చున్నాడు ఓదెలు. కోపంగా ఉన్న ప్రతాపరావు దొర. రెండుగిత్తల్ని రెండుగిత్తల్ని రెండుదెబ్బలు కసిగాకొట్టాడు. బండిమళ్ళీ ‘సవారీ’ మొదలెట్టింది.
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి, నవంబర్ 1981
రెండో భాగం త్వరలో




చాలా బాగుంది ఇన్కా మంచ్హి కధలూ చీర్చ్హంది
ఇత్లు
బాలాసుబ్రమన్యమ్ యాదగిరి