Feed on
Posts
Comments

(Click for PDF Version)

- ప్రొ|| కె. సీతారామారావు
(కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్)

కరీంనగర్ ప్రజల తీర్పు చారిత్రాత్మకం, పరిణితి చెందిన వ్యూహాత్మక రాజకీయ చతురతకు నిదర్శనం, మహోన్నత ప్రజాస్వామిక చైతన్యానికి ప్రతీక, మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల చిరకాల సజీవ ఆకాంక్షను కరీంనగర్ ప్రజల గొంతుతో ఎలుగెత్తి చాటిన తరుణం, తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని హిమాలయ శిఖరోన్నతంగా నిలిపిన ఆనంద సమయం, దుష్ప్రచారాలను, విపరీత ప్రలోభాలను, రకరకాల అధికార దుర్వినియోగ ఆటంకాలను నిశ్చలమైన మనోస్ధైర్యంతో ఎదుర్కొని కపట సమైక్యతా భావాన్ని, బూటకపు అభివృద్ధి నినాదాన్ని కాలదన్ని స్వరాష్ట్ర వాంఛను, స్వపరిపాలన ఇచ్చను భారతావనికంతా వెదజల్లిన పరిమళం, పార్టీలు, జెండాలు పక్కనబెట్టి తెలంగాణా ప్రజలు ముక్త కంఠంతో తమ ఆకాంక్షను, ఆశయాన్ని నినదించిన తీరు అద్భుతం, అమోఘం, అద్వితీయం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ శిలాశాసనం, రాజకీయాల్లో చెప్పేదొకటి చేసేదొకటైతే ప్రజలు నిర్విదంగా తిరస్కరిస్తారని రాజకీయ పార్టీలన్నింటికి నేర్పిన గుణపాఠం, తెలంగాణా ప్రజలు కొత్త దిశకు ఆహ్వానం పలుకుతున్న వైనం, “ఆంధ్రదేశం విచ్ఛిన్నమస్తు తెలంగాణా రాష్ట్రం ప్రాప్తిరస్తు” అంటూ ఇచ్చిన ప్రజాదీవెన. ఎవరికిష్టమున్నా లేకున్నా, ఎవరు వ్యతిరేకించినా సమర్ధించినా ఇకపైన “తెలంగాణా వాదమే” రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల వైఖరికి నిర్ణాయకాంశం కాబోతున్నదనేది అక్షర సత్యం. ఇదీ కరీంనగర్ ప్రజల తీర్పు విశిష్ఠత.


ఎన్నిక ప్రత్యేకత :

సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగిన కరీంనగర్ ఉప ఎన్నికకు ఏ ఎన్నికకు లేని కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ఉనికిని, రాజకీయాలను మూల మలుపు తిప్పగల కీలకశక్తి ఈ ఉప ఎన్నిక ఫలితంలో ఉన్నది కాబట్టే ఈ ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నవి. బొబ్బిలి ఉప ఎన్నిక వలె ఇది సహజంగా వచ్చిన ఉప ఎన్నిక కాదు. కరీంనగర్ స్థానానికి తెరాస అధినేత కె.సి.ఆర్ రాజీనామా చేసిన కారణంగా ఈ ఉప ఎన్నిక అర్ధాంతరంగా వచ్చిపడింది. రాజీనామాకు ప్రధాన కారణం తెలంగాణా వాదం ఆస్తిత్వంపై జనవాక్య సేకరణ చేయాలనే తెలంగాణవాదుల్లో పట్టుదల కొద్దిరోజులుగా కొనసాగుతున్నది. ఈ పరిస్థితిల్లో కాంగ్రెస్ నాయకులు “మా ఓట్లతోని నువ్వు గెచినినవా మీ ఓట్లతోని మేం గెలిచినమా” అని, “తెలంగాణావాదమే లేదని ప్రజలు అభివృద్ధినే కొరుతున్నారని” రెచ్చగొట్టడం కెసిఆర్ ఆ సవాల్‌ను అందిపుచ్చుకోవడంవల్ల ఈఎన్నిక వచ్చింది. తన నిబద్ధత, నిజాయితీపట్ల ప్రజల అవిశ్వాసాన్ని, స్వంత పార్టీలో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్న తరుణంలో తిరిగి ప్రజాదరణను కూడగట్టుకోవలసిన అనివార్య పరిస్థితిలో కెసిఆర్ తిరిగి ప్రజల మధ్యకు వెళ్ళే ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొనే స్థితిలో ఉన్నప్పుడు సంభవించిన ఉప ఎన్నిక ఇది. కాంగ్రెస్ నాయకుల సవాళ్ళు అర్థంలేని ప్రేలాపనలు తెలంగాణా ప్రజల ఆకాంక్షకు అగ్ని పరీక్షగా మారి జనంలో ద్విగుణితం, త్రిగుణితమయి కెసిఆర్ రాజకీయ జీవన్మరణ సమస్యకు గూడా దారిచూపిందీ ఉప ఎన్నిక ఫలితం.

హోరాహోరిగా ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ ఎన్నిక చివరకు పొలింగ్ పూర్తయినంక ఉన్న కాస్త థ్రిల్ పోయింది. గెలుపు స్పష్టంగా తేలిపోయింది. ఓట్ల లెక్కింపు కేవలం మెజార్టీ తెలుసుకోవడం కోసమే జరిగినట్టయింది. ఓట్ల లెక్కించక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటమిని అంగీకరించడం ఈ ఎన్నిక ప్రత్యేకతలలో ఒకటి. ఊహించినట్టుగానే ఒంటిరిపోరులో తెరాస అభ్యర్థి 2,01,582 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపొందడం జరిగింది. గతంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపొందిన అభ్యర్థులందరి కంటే ఇది అత్యధిక రికార్డు మెజార్టీ. 1980 ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొచ్చిన మెజార్టీ 1,56,328, ఇప్పుడు తెరాస అభ్యర్థి కొచ్చిన మెజార్టీ అతనికంటే 45,254 ఓట్లు ఎక్కువ.

కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పార్టీల బలాబలాలు

కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పార్టీల బలాబలాలు ;  ఆధారం : ఈనాడు, తేది : 8.12.2006

(ఆధారం : ఈనాడు, తేది : 8.12.2006)

పోలైన ఓట్లలో గెలిచిన తెరాస అభ్యర్థి కొచ్చిన ఓట్లు 48 శాతం, ఆ తరువాత సమీప అభ్యర్థులైన కాంగ్రెస్, తెదేపా అభ్యర్థులకొచ్చిన ఓట్ల శాతం 43.50, మిగతా అభ్యర్థులందరి ఓట్ల శాతం 8.10, బిజెపి అభ్యర్థితో సహ ఇండిపెండెంట్ అభ్యర్థులందరి జమానతు జప్తయి పోయింది. ఒక్క జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో తప్ప కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాసకు స్పష్టమైన ఆధిక్యత లభించింది. అనధికారిక సమాచారం ప్రకారం, ఈ ఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు పెట్టిన ఖర్చు, అధికారికంగా ప్రభుత్వం ఎన్నిక నిర్వహణకోసం పెట్టిన ఖర్చుగాక, 160 కోట్లపైనే అంటే దాదాపు మా కాకతీయ విశ్వవిద్యాలయ ఐదు సంవత్సరాల బడ్జెట్ కంటె ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ, తెరాస లోంచి అమ్ముడుబోయిన, కొనగల్గిన చోటా, మోటా నాయకులందర్ని లక్షలు పోసి కొన్నది. కుల సంఘాలకు, మహిళా పొదుపు సంఘాలకు, పోలింగ్‌బూత్‌ల వారీ ఓటర్లకు లక్షల రూపాయలు పంచింది. చిన్న, పెద్ద కాంట్రాక్టర్లకు కాంట్రాక్టు లిప్పిస్తామని ఆశ చూపింది. గ్రామీణ యువ సంఘాలకు క్రికెట్ కిట్లు పంచింది. వీటన్నింటికి తోడు చీప్ లిక్కర్ క్రేట్లు, మధ్యం ఏరులైపారింది. తెలుగుదేశంతో సహ ఎన్నికల బరిలో ఉన్న పార్టీలన్నీ ఎక్కువ, తక్కువ తేడాతో ఇదే ఎన్నికల నిర్వహణ వ్యూహాన్ని అమలుచేసాయి. దీనితో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అమలుచేసిన ఓటు బ్యాంక్ రాజకీయ వూహ్యం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సంఖ్యారీత్యా ఎక్కువ ఓటున్న సామాజిక వర్గాలు వెనుకవడిన కులాలు, ముస్లిం మైనార్టీలు, మాదిగలు, బీడికార్మికులు వారి కుటుంబాలు, వెనుకబడిన కులాల్లో ముఖ్యంగా పద్మశాలీలు, వీరిఓట్లు లక్షన్నర పైనే. ఓటు బ్యాంక్‌గా భావించతగ్గ మిగతా ముస్లిం మైనార్టీల, బీడికార్మికుల, మాదిగల ఓట్లన్ని కలిపి మూడు లక్షల పైనే. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగ ఓటర్లను, ఎం.ఐ.ఎం. ద్వారా ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. తెలుగుదేశం ప్రధానంగా బిసిల ఓట్లను ప్రభావితం చేయడానికి పద్మశాలికుల బిసి అభ్యర్థిని నిలబెట్టడమే కాకుండా ఇతర బిసి కులాల ఓట్లను ప్రభావితం చేయడానికి సర్వవిధాల ప్రయత్నించింది. కాని ఈ ప్రలోభాలేవీ పనిచేయలేదు. అంతేగాకుండా తెలంగాణ వాదం నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి బీడి కట్టలపై వుర్రె గుర్తు ముద్రణ సమస్యను పైకి తెచ్చి తెరాస మీదికి మళ్ళించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరకు ఇదికూడా ఆ పార్టీల మెడలకే చుట్టుకొంది. ఆఖరుకు జిల్లా పాలనాయంత్రాంగం, ఇతర జిల్లాల నుండి వచ్చిన రాజకీయ పార్టీల కార్యకర్తలను, ఇతర మద్దతుదార్లను ప్రచారం ముగిసిన రోజు, పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల పేరుతో అందర్ని బలవంతంగా పంపించింది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంగా విమర్శకు లోనైంది.

ఈ ఉప ఎన్నిక కున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, తెలంగాణా అన్ని జిల్లాల ‘తెలంగాణవాదులు’ రకరకాల ప్రజా సంఘాల రూపంలో తెలంగాణావాదాన్ని నిలబెట్టడానికి చేసిన స్వచ్ఛంద కృషి. ముఖ్యంగా తెలంగాణా విద్యావంతుల వేదిక, తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరం (అమెరికా), తెలంగాణా రచయితల వేదిక, తెలంగాణా కళాకారుల వేదిక, తెలంగాణా ధూంధాం కమిటీ, తెలంగాణా ముస్లిం సెక్యులర్ ఫ్రంట్, తెలంగాణా మాదిగ దండోరా, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు, వివిధ ఆదివాసీ సంఘాలు, తెలంగాణా జర్నలిస్టుల ఫోరం, తెలంగాణా రాజ్య సమర్థన సమితి (సూరత్, గుజరాత్), దుబాయి వలస కార్మిక సంక్షేమ సంఘం, వివిధ కుల సంఘాలు ఇలాంటి వెన్నో ప్రజా సంఘాలు తెలంగాణా వాదాన్ని నిలబెట్టడానికి, తెరాసని గెలిపించడానికి చేసిన స్వచ్చంద కృషి ఎంతో శ్లాఘనీయం, మరెంతో అభినందనీయం. ఈ సంఘాలు చేసిన ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నం, నిర్వహించిన ప్రచారం, సమస్యలను విశ్లేషించి ప్రజలను ఆలోచింపచేసి ఆమోదింపచేసిన తీరు తెరాస గెలుపుకు పటిష్ఠమైన పునాది వేసిందనడంలో సందేహం లేదు.

ప్రజల మనోభావాలు :

ఈ రచయిత కరీంనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణా వాదంతో ప్రజలను చైతన్యవంతం చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కలిగింది. ఈ క్రమంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల్లో, ఎంతో మందితో సంభాషించడం జరిగింది. ఇదో గొప్ప రాజకీయ అనుభవం. ప్రజలకున్న ఇంగితజ్ఞాన దృక్పధం, సమస్యలనర్థం చేసుకొన్న తీరు ఎంతో శ్లాఘనీయం. కరీంనగర్ ప్రజలు/ఓటర్లు, ముఖ్యంగా రైతులు, స్త్రీలు, యువకులు, విద్యార్థులు వెలిబుచ్చిన కొన్ని స్పష్టమైన, ఖచ్చితమైన అభిప్రాయాలను వారి మాటల్లోనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ ప్రజలు తెరాస గెలిస్తే వచ్చే లాభం కన్న ఓడితే కలిగె నష్టాన్ని ఊహించుకొని విపరీతంగా భయాందోళనకు లోనైనారని అనిపించింది. దీనికి ఉదాహరణగా ఒక ఊరిలో ఒక పెద్దమనిషి అన్న మాటలు చూడండి “కెసిఆర్ గెలిచినాంక కరీంనగర్‌కు రాలేదు నిజమే, ఇక్కడేం చెయ్యలేదు ఒప్పుకుంటం, మళ్ళీ గెలిచి వచ్చి మాకేదో తొడిపెడ్తడని కూడా అనుకుంటలేం, పుటుక్కున చంద్రశేఖర్రాయుడు ఓడిండనుకోండ్రి మా కరీంనగరోల్లు తలెత్తుకొని తిరిగే ఇజ్జతుంటదా సార్? తెలంగాణా ప్రజలు, మీ లెక్క వేరే జిల్లాల నుండి వచ్చినోల్లు రేపు మా మొఖాన ఊంచరా సార్. కాబట్టి ఇప్పుడు వ్యక్తి కాదు ముఖ్యం తెలంగానను గెలిపిచ్చుకోవాలె, ఇజ్జతి నిలబెట్టుకోవాలె”. ఈ ఉప ఎన్నికలో నిబద్ధతతో పనిచేసిన ప్రతి ఒక్కరు ఎన్నికల బరిలో ఉన్నది తెరాస కాదు, కెసిఆర్ కాదు తామేనన్న ఆందోళనకులోనైన క్షణాలు ఎందరి ముఖాలల్ల ఎన్నోసార్లు ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. దీనికి ఉదాహరణగా కరీంనగర్లో ఒక యువకుడు ఎమన్నడో చూడండి, “ఇది తెలంగాణా ఇజ్జత్ కా సవాల్ సార్. పోటీలో ఉన్నది తెరాస కాదు, కెసిఆర్ కాదు మేమే, మేమే తెలంగానాకోటు ఎయ్యకపోతే మా కరీంనగరోల్ల మొకం నల్లగకాదా సార్. మేమందరం బద్నాం కామాసార్”. మరో గ్రామంలో ఒక అమ్మ ఎమన్నదో చూడండి, “అయ్య, లంగో, లఫూటో మనకొడుకు తప్పు చేస్తే ఇంట్ల కెల్లి ఎల్లగొడ్తమా సార్, కడుపుల పెట్టుకోమా సార్, ఈసారి తెలంగానకే ఓటేత్తం సార్ మీరు చెప్పాల్సిన పనే లేదు”. ప్రభుత్వం తెప్పించుకొన్న ఒక ఇంటలిజెన్స్ రిపోర్టు ప్రకారం నూటికి తొంబై మంది కెసిఆర్ పై అసంతృప్తి వెలిబుచ్చిన వాళ్ళే మళ్లీ కెసిఆర్‌కే ఓటు ఏస్తమని చెప్పారని వినడం జరిగింది. ఈ ఇంటలిజెన్స్ రిపోర్టులో వచ్చిన సమాచారానికి పైన ఆ అమ్మ చెప్పిన అభిప్రాయం సరిగ్గా అతికిందనుకోవచ్చు. వేములవాడలో ఒక ఉపాధ్యాయుడు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గమనించండి, “ఇప్పుడు కరీంనగర్ల తెలంగాణకు వ్యతిరేకంగా సోనియాగాంధి నిలబడ్డ ఓడిపోతది. తెలంగాణకు సపోర్టుగ రాజశేఖర్‌రెడ్డి నిలబడ్డా గెలుస్తడు సార్, ఇది ఇక్కడున్న పరిస్థితి సార్”. అదేవిధంగా సిర్సిల్లలో ఒక ఆర్టిసి ఉద్యోగి అన్న మాటలు చూడండి, “నాకు ఒక్కతే బిడ్డ సార్ తెలివికల్లది బాగా చదువుతాంది సార్, ఇప్పుడు టెంత్, ఒక్క తీరుగ ఈసారి తెలంగాణాకే ఓటెయ్య నాయినా అని రోజు చెప్పతాంది. ఈసారి మా ఇంట్ల అందరం తెలంగానకే ఏత్తమని అనుకున్నం సార్”. ఇట్ల ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రభావితం చేసినారని తెలసింది. ఇంకా కొంతమంది పిల్లలు తమ తల్లి తండ్రులను బెదిరించడం కూడ జరిగిందని తెలిసింది. ఏమని బెదిరించిడ్లో చూడండి, “ఈసారి తెలంగానకెయ్యక పోతే బడికి పోవుడు బందుజేత్తం. ఇంట్ల కెల్లి దెంకపోతం, అన్నలల్ల కలుత్తం, మీ ఇష్టం మరి”. ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాల్లు ప్రచారానికి పోతే ఒక మహిళ ఏమన్నదో చూడండి, “అమ్మా మీరు ఈసారి ఎవరికి ఓటేద్దామనుకుంటాండ్లు?” తెలుగుదేశం కార్యకర్త “అయ్యా మీరెవలకోసం చెప్పడానికొచ్చిండ్లు?” ఆ మహిళ. “అమ్మా మేం తెలుగుదేశపోల్లం, తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యమని అడగడానికొచ్చినం” తెలుగుదేశం కార్యకర్త. “ఏం దేశమో అయ్య, ఏ దేశం లేదు ఈసారి మా దేశానికి మేం ఏసుకుందామని అనుకుంటానం” ఆ గ్రామ మహిళ. ఇదీ జరిగిన సంభాషణ. దీనితో తెలుగుదేశం ప్రచారకులు ఖిన్నులై గ్రామం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. గ్రామాలలో అన్ని పార్టీల కెదురైన ఇలాంటి సంఘటనలెన్నో ఉదహరించవచ్చు. తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు ర్యాలిగా తరలివచ్చిన ప్రజల్లో కొంతమంది స్త్రీలతో మాట్లాడిన టివీ9 మీడియా అభిప్రాయ సేకరణ జరిపింది. ఆ అభిప్రాయ సేకరణలో ఒక మహిళ అన్న మాటలు గమనించండి, “మీరు ఎవరికి ఓటు వేస్తరమ్మ”? టివీ9 ప్రతినిధి. వెంటనే ఆ మహిళ అన్న మాటలు “మేం తెలంగాణా వాదులం సార్. తెలంగానకే ఓటేస్తం సార్”. “మరి తెలుగుదేశం ర్యాలిలో ఎందుకొచ్చినావు? టివీ9 ప్రతినిధి. అప్పుడు “వీల్లు పైసలిచ్చిండ్లు సార్, కైకిలికొచ్చినం (కూలికొచ్చినం), కాబట్టి ఎగురుతానం, దుంకుతానం, ఓటు మాత్రం అటే” ఈ సంభాషణ ఆ రోజు టివీ9లో ప్రసారమయింది. పైన ఉదహరించిన ఘటనలు వాటిలోని వ్యక్తులన్న మాటలు పైపైన పెదవుల మీంచి వచ్చినవి కావు, తమ హృదయాంతరాల్లోంచి ఎగుతన్నుకొచ్చిన చైతన్యతరంగాలు. అవి ఏ గణాంక సర్వేలకందని ఖచ్చితమైన నిర్ణయాలు ఇలాంటి ప్రజల నాడి తెలువకనే ఓడిన పార్టీల నాయకులు ఎలాగైనా తామే గెలుస్తామని రోజుకో కాకి లెక్క ఏసుకున్నరు.

తెరాస గెలుపుకు కారణాలు :

కరీంనగర్ ఎన్నికలో తెరాస గెలవడానికి గల ప్రథాన కారణాలను క్లుప్తంగా ఈకింది విధంగా పేర్కొనవచ్చు. అవి:

(1) తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష (మన మీడియా తెలిక భాషలోనైతే సెంటిమెంట్) నియోజకవర్గ మంతటా, అన్నివర్గాల ప్రజల్లో స్పష్టంగా వ్యక్తీకరించబడడం,
(2) కాంగ్రెస్, తెలుగుదేశం సానూభూతిపరులు గూడా చీలి తెలంగాణా వాదం వైపు మొగ్గడం,
(3) కాంగ్రెస్ ఆశలు పెట్టుకొన్న ముస్లిం/మైనార్టీ ఓటు బ్యాంకు, తెలుగుదేశం ఆశించిన బిసి, బీడి కార్మికుల ఓటు బ్యాంకు ఆయా పార్టీలకు మొండి చెయ్యి చూపడం,
(4) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినాయకత్వం మద్దతు కాంగ్రెస్ పొందగలిగినా మాదిగ ఓటర్లు అందుకు భిన్నంగా ప్రవర్తించడం,
(5) శాసనసభ నియోజకవర్గానికో మంత్రి, మండాలనికో ఎమ్మెల్లె, గ్రామ గ్రామానికి ఇంచార్జి నాయకులున్న తెలంగాణా సెంటిమెంట్ ముందు ఇవన్ని ఎల్లెలుకుల, బోర్లబొక్కల పడిపోవడం,
(6) తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావంలో జాప్యం జరగడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత స్వభావమే ప్రధాన కారణమని ప్రజలు నమ్మడం, తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష ముందు ‘అభివృద్ధి మంత్రం’ పనిచేయ్యకపోడం,
(7) బీడి కార్మికుల సంక్షేమాన్ని మరిచి పుర్రె గుర్తుపై అబద్దపు ప్రచారం చేయడం, పుర్రె గుర్తు తొలగింపు పై కాంగ్రెస్ నేతల ప్రకటనలు కార్మికులను గందరగోళానికి గురిచేయడం,
(8) బిజెపి సైతం తెలంగాణ పాట ఎత్తుకున్నా ప్రజలు నమ్మక, తెలంగాణావాదం పునాదులపైన నిలిచిన తెరాస పట్ల మొగ్గు చూపడం,
(9) తెలంగాణా కావాలనుకున్న ఎన్నో వర్గాలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ప్రచారం చెయ్యడం.

తెరాస సాధించిందేమిటి?

కరీంనగర్ ఉప ఎన్నికలో తెరాస గెలువడం మూలంగా సాధించిన తక్షణ విజయాలను క్లుప్తంగా ఈ కింది విధంగా చెప్పుకోవచ్చు. అవి :

(1) తెలంగాణా వాదం బలహీనపడిందని, వీగిపోయిందని జరిగిన ప్రచారాన్ని నిలువరించగల్గడం, ఇప్పటికీ తెలంగాణా ప్రజల్లో స్వరాష్ట్ర, స్వపరిపాలన ఆకాంక్ష బలంగా ఉందని రుజువు చేయగలిగింది,
(2) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచించే పరిస్థితి కల్పించడం, తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగేలా చేయడం,
(3) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, రాజకీయాలను మరికొంతకాలం తెరాస చుట్టూ తిప్పుకోగల అనుకూల పరిస్థితిని కల్పించడం,
(4) తెలంగాణను కోస్తాతో సమానంగా అభివృద్ధి చేస్తామంటూ చేస్తున్న వైఎస్ అభివృద్ధి వాదంలో పటిష్ఠత లేదని నిరూపించడం, ఈ వాదన పై కాంగ్రెస్ అధిష్ఠానానికి నమ్మకం తగ్గే పరిస్థితిని కలిగించడం,
(5) పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే కుట్రలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయలేవని నిరూపణ చేయడం, తెరాస అసమ్మతి నేతల నోళ్ళకు తాళాలు, కాళ్ళకు బంధాలు పడే పరిస్థితి కల్పించడం,
(6) ఒక్క కరీంనగర్లోనే కాదు ఇతర తెలంగాణా జిల్లాల్లో పార్టీ నిర్మాణాన్ని, యంత్రాంగాన్ని బలోపేతం చేసుకొనే ఊపు తెచ్చుకోవడం,
(7) తెలంగాణ విషయంలో, ఇప్పటికీ కాంగ్రెస్, బిజెపిల కంటే తెరాస వైపే ప్రజల మద్దతు ఎక్కుగా ఉన్నదనే విషయాన్ని నిరూపించడం,
(8) తెలంగాణా విషయంలో సిపిఎం., సిపిఐ పార్టీలతో పాటు, తెలుగుదేశాన్ని కూడా పునరాలోచనలో పడేయడం,
(9) ‘తెలంగాణ’ అంశం మాత్రమే ఎజెండా మీదికొస్తే ఈ ప్రాంత ప్రజలు పార్టీలకు, జెండాలకతీతంగా ఏకమవుతారనే విషయం తెలిసేటట్లు చేయడం. అయితే ఇవి తాత్కాలిక, తక్షణ విజయాలు మాత్రమేనని గుర్తించాలి. వీటిని సంఘటితం చేసుకొని తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, రాజకీయాలను మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత తెరాసపై పెరిగిందని ఆ పార్టీ అర్థం చేసుకోవాలి.

నేర్చుకోవలసిన గుణపాఠాలు :

కరీంనగర్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా సమైక్యతావాదులకు స్పష్టమైన, విలక్షణమైన హెచ్చరికలు, సంకేతాలు పంపింది. తెలంగాణ ప్రజల్లో సమైక్యతావాద వ్యతిరేకత, స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో మళ్ళీ మళ్ళీ వివరించి చెప్పాల్సిన అవసరం లేని విధంగా, నిఖార్సైన విధంగా తెలియజేసిందీ ఎన్నిక. అభివృద్ధి మా పౌరహక్కని, తెలంగాణా మా జన్మహక్కు అని కరీంనగర్ ప్రజలు నిఖచ్చిగా, నిర్ద్వదంగా వెల్లడించారు. ఆంధ్రప్రాంత సమైక్యతా మేధావులు మరింకా “కొడిగుడ్డుమీద ఎంటికలు పీకకుండా” సమైక్యతావాద కొంగ జపం మాని ప్రజాభిప్రాయాన్ని, నిజాయితీగా మన్నించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. కెసిఆర్‌‌ను గత 54 సంవత్సరాల్లో జరిగిన 14 లోకసభ ఎన్నికల్లో కరీంనగర్లో మరెవ్వరికి రాని మెజార్టీతో, 2004 ఎన్నికలకంటే ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికి, ప్రజలెందుకు గెలిపించారు? రాజకీయ వాదులుకాని, రాజకీయాలతో సంబంధాలు లేని మేధావులుగాని స్వప్రయోజనాలను పక్కనపెట్టి నిష్సాక్షికంగా, ప్రజాస్వామికంగా ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం అసాధ్యమేమికాదు. తెలంగాణా ప్రజలు అభివృద్ధివాదాన్ని నిర్ద్వందంగా తిరస్కరించడానికి కారణం, గత ఐదు దశాబ్దాల సమైక్యతానుభవంలో సమైక్య రాష్ట్ర పాలకులు తమకు నిజంగా అభివృద్ధి చేస్తారన్న ఆశలు పూర్తిగా అడుగంటి పోయినయి. ఇప్పుడు సమైక్యతా వాదపార్టీలు వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి అన్నా, సాగునీటి ప్రాజెక్టులున్నా, ప్యాకేజీలన్నా తెలంగాణ ప్రజలు వాటిని నమ్మేస్థితిలో లేరు, వారిలో తిరిగి ఆశలు రేకెత్తించే అవకాశం లేదు. స్వరాష్ట్ర వాంఛ తెలంగాణ ప్రజల మనుసు లోతుల్లో స్థిరపడిపోయిన ఒక బలమైన ఆకాంక్ష. దీనిలో స్వంత ఉనికి, గుర్తింపు, ఆత్మగౌరవం వంటి అంశాలు కలగలిసి ఉన్నవి. ఇది అనేక దశాబ్దాలు గడిచినా చెదరక మరింత బలపడుతున్నది. ఈ రాజకీయ వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ పార్టీలు తమ వైఖరులను, దృక్పథాలను కార్యాచరణ ప్రణాళికలను మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తమ విధానాలు మార్చుకోవాలె గాని, ఆయా రాజకీయ పార్టీల్లోని నాయకత్వ స్థాయిల్లోని ఆధిపత్య వర్గాల స్వప్రయోజనాల ఆధారంగా రూపొందిన సిద్ధాంతాలను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించకూడదు.

కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన మొదటి గుణపాఠం ఇప్పటికైనా కపట నాటకాలు మాని తెలంగాణపట్ల తమ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కవసరమైన రాజకీయ ప్రక్రియను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలి లేకుంటే తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదకరంగా మారే అవకాశమున్నది. తెలంగాణా అంశం ఎజెండా మీదికొస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలు అసలే పనిచెయ్యవని అర్థం చేసుకోవాలె. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు క్రమంగా అధిష్ఠానంపై రాష్ట్రం కోసం ఒత్తిడి పెంచాలి. ఆ దిశలో స్పష్టమైన చర్యలు చేపట్టి ప్రజల విశ్వసనీయతను తిరిగి సంపాదించాలి. తెలంగాణాపై నిర్ణయాన్ని సోనియా గాంధికి వదిలేసామని, తెలంగాణా భవితవ్యం కాంగ్రెస్ అధినేత్రి సోనియా నిర్ణయంపై ఆధారపడి ఉన్నదన్న అర్థం కలిగించడం కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్కరం కాదు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరంగా అధిష్ఠానంతో, ఇతర పార్టీలతో లాబీయింగ్ చేయడానికవసరమైన స్ఫష్టమైన వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తక్షణమే అమలులో పెట్టాలి.

బిజెపికి ఇప్పటికీ తెలంగాణా రాష్ట్ర సాధన రాజకీయాలలో కూడుకొన్నటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అంటూ ఏమిలేదు. బిజెపి కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిడి పెంచే రాజకీయ వ్యూహం రూపొందించుకోవడంతో పాటు, తెలంగాణా ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించి ఆందోళన ద్వారా ప్రజా ఒత్తిడి తీసుకొని రావాలి. కేవలం ఎన్నికలప్పుడే ‘తెలంగానం’ వినిపిస్తే ప్రజల్లో బిజెపి విశ్వనీయత పెరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ బిజెపిలతో సహా జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితులను వివరించి ఆంధ్ర-రాయలసీమ ప్రాంత ప్రజలను కూడా మానసికంగా సంసిద్ధం చేయాలి.

ఇక వామపక్షాలు (సిపిఐ, సిపియంలు), తెలుగుదేశం పార్టీ నిఖార్సయిన సమైక్యతా వాదులు, తెలంగాణా ప్రజల ఆకాంక్ష పట్ల వారికున్న అపసవ్య వైఖరి కరీంనగర్ ఉప ఎన్నికలో మరోసారి అపహాస్యం పాలైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ పట్ల వారికున్న వ్యతిరేకత క్రమంగా సడిలించుకోవాలి. లేకుంటే ఈ సమైక్యతావాద పార్టీలు తెలంగాణాలో పూర్తిగా అంతరించిపోయే పరిస్థితులు త్వరలోనే ఏర్పడుతాయి. ప్రజలకన్న, వాస్తవాలకన్న తెలుగుజాతి సమైక్యతే పరమ ఆదర్శం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఈ పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకొని, నిజాయితీగా ఆత్మ విమర్శ చేసుకొని సవరించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజనకు తెలంగాణా రాష్ట్ర అవతరణకు అడ్డంకులు కల్పించకుండా సహకరించాలి.

తెరాస అధినాయకత్వం తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అమలుచేసిన రాజకీయ ప్రక్రియను, వ్యూహాన్ని నిర్ద్వదంగా పూర్తిగా అంగీకరించలేము. ఈ కార్యక్రమాల్లో ఆమోదించవలసినవి, చర్చించవలిసినవి, తిరస్కరించదగ్గవి కూడా ఉన్నాయి. గతంలో చేసిన తప్పులను సవరించుకొని, రాజకీయ ఆత్మ విమర్శతో కూడిన పునరాలోచనతో సరికొత్త రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. తెలంగాణా వాదాన్ని మరింత బలంగా, వేగంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణా ఉద్యమాన్ని వేగవంతంగా విస్తరించి, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠవంతంగా తయారుచేసుకోవాలి. పటిష్టమైన క్షేత్రస్థాయి కార్యకలాపాలతో ప్రజా ఒత్తిడి పెంచితేనే కేంద్ర ప్రభుత్వస్థాయిలో లాబీయింగ్‌కు సానుకూలత త్వరితంగా ఏర్పడుతుంది. ప్రజల మధ్యే ఉంటూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి తెరాస అధినాయకత్వం పునరంకితమైతే ఆ పార్టీ తెలంగాణాలో బలమైన పోరాటశక్తిగా ఎదుగుతుంది. అసమ్మతివాదులు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు
పునరాలోచనలో పడతారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నించక తప్పదు.

తెలంగాణా పౌరసమాజం ప్రజా సమస్యలపై అర్థవంతంగా, చైతన్యంతంగా ప్రతిస్పందించే లక్షణాలున్న సమాజం. అందుకే తెలంగాణాలో ఎన్నో ప్రజాసంఘాలు క్రియాశీలకంగా ఎన్నోరకాల ప్రజా ఉద్యమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం సోనియా గాంధీ ఇస్తదని, కెసిఆర్ తెస్తడని ఎదురుచూస్తూ ఈ ప్రాంత ప్రజాసంఘాలు నిర్వ్యాపకత్వంగ ఉండవు. గత అర్థ శతాబ్దంగా తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని, చైతన్యాన్ని సమాజంలో, ప్రజల్లో సజీవంగా నిలిపి ఉంచిన ఘన చరిత్ర ఈ ప్రజా సంఘాలదే. తెలంగాణా విద్యావంతుల వేదిక, రచయితల-కళాకారుల వేదికల వంటి, ప్రజాసంఘాల బాధ్యత మరింత పెరింగింది. ఇప్పటికీ లోతుగా పరిశోధించాల్సిన సమస్యలు తెలంగాణాలో ఇంక చాలానే ఉన్నయి. తెలంగాణాలోని అన్ని సామాజిక వర్గాలను తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో కలుపుకు రావాల్సిన రాజకీయార్థిక వ్యూహాన్ని రూపొందించి సమన్వయ పరచాల్సిన అవసరం ఇంకా మిగిలే ఉంది. తెలంగాణ భావజాల వ్యాప్తి విషయంలో ఇంకా కొన్ని సామాజిక వర్గాల్లో ప్రచార దశ పూర్తి కాలేదు. ఏకకాలంలో రాజకీయార్థిక, సాంస్కృతిక ఉద్యమాలు నిర్మించి తెలంగాణా రాష్ట్ర సాధనతో పాటు, తదనంతరం సమాజ పునర్నిర్మాణానికవసరమైన నిర్మాణాలను పటిష్ఠపరచడం ఈనాటి తెలంగాణ ఉద్యమ అవసరం. ఈరంగంలో తెలంగాణా విద్యావంతులు, మేధావులు, ప్రజాసంఘాల పాత్ర ఎంతో కీలకమైనది.

Share/Save/Bookmark

11 Responses to “కపట సమైక్యతావాదం కుత్తుకపై తెలంగాణా ఖడ్గం కరీంనగర్ ప్రజల తీర్పు”

Pages: [2] 1 » Show All

  1. 11
    ఊహా ప్రపంచం ; తెలంగాణా Says:

    comments on discover-telangana.org article.  I spent lot of time keying in telugu, so i thought i could make it a post in my http://harinath.in/blog/?p=612

Pages: [2] 1 » Show All

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో