Feed on
Posts
Comments

(Click for PDF Version)

- ప్రొ|| కె. సీతారామారావు
(కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్)

మూడుకోట్ల మేటి ప్రజల
గొంతొక్కటి కోర్కెఒక్కటి
తెలంగాణ వెలసి నిలచి
ఫలించాలె భారతాన … కాళోజి

కరీంనగర్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చిపడింది. ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎన్నికల యుద్ధరంగంలో రాజకీయ పార్టీలు తమ సైన్యాలను మోహరిస్తున్నాయి. ప్రచార హోరు జోరుగా సాగుతున్నది. మొత్తం భారతదేశం కరీంనగర్ ఎన్నిక ఫలితం కోసం అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నది. ఎన్నిక తప్పని ఈ సమయంలో ఎన్నికరాకుంటె బాగుండుకదా, దీనవల్ల ఎంత ప్రజాధనం వృధా అవుతున్నది కదా అని ఆలోచించే సమయం కాదిది. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పగల శక్తి ఉన్న ఈ ఉప ఎన్నికను కరీంనగర్ ప్రజలు తేలికగా తీసుకోరాదు. తెలంగాణా రాష్ట్ర సాధన కీలకదశకు చేరుకొన్న ఈతరుణంలో జరుగుతున్న ఈ ఎన్నిక తెలంగాణా ప్రజలందరి భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైనదన్న విషయాన్ని మరువరాదు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా తెలంగాణా ప్రజల, అందులో ముఖ్యంగా కరీంనగర్ ప్రజల కర్తవ్యమేమిటి? మన కర్తవ్యమేమిటో తెలుసుకోవాలంటే కరీంనగర్ ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో తెలుసుకోవాలె. ఈ ఎన్నిక ఫలితం వల్ల జరుగబోయె పర్యవసానాలేమిటో అంచనా వేసుకోవాలె. అప్పుడు మనమేం చేయాల్నో, ఎవరు మనకు చెప్పాల్సి అవసరం లేకుండనే విషయం దానంతటదే మనకు తెలిసిపోతది.

ఎన్నిక ఎందుకొచ్చింది :

కరీంనగర్ ఉప ఎన్నిక తెరాస అధినాకత్వానికి దూరదృష్టిలోపించడంవల్ల వచ్చిందా? లేక వాచాలత్వానికి పేరుపొందిన వృద్ధ జంబుకం ఎంస్సార్, జనం పునాదిలేని నాయకుడు తనుకు తానే గొప్ప మేధావిననుకొనే కేకె లాంటి కాంగ్రెస్ నాయకులు పన్నిన ఉచ్చులో, దాని వెనుక ఉన్న రాజకీయ కుట్రలో కెసిఆర్ పడడంవల్ల ఎన్నిక వచ్చిందా? ఒక వ్యూహం, ఎత్తుగడడలు లేకుండా కెసిఆర్ ఎన్నిక అనే మాయా జూదంలో ఇరికిండా? ఈ ప్రశ్నల మీద చర్చ ఇప్పుడు అప్రస్తుతం, అనవసరం. ఒకటి మాత్రం నిజం కరీంనగర్ ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తెలంగాణా కోసం చేసిన వాగ్ధానంతో పాటు సంకీర్ణ ధర్మాన్ని విస్మరించడం, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకవసరమైన రాజకీయ ప్రక్రియను సుగమం చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనుసరిస్తున్న అహంకారపూరిత, మోసపూరిత వైఖరే కరీంనగర్ ఉప ఎన్నిక రావడానికి బలమైన ప్రముఖమైన కారణం. దీనికి తోడు

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలు, పదవులే పరమావదిగా వహిస్తున్న అవకాశవాద మౌనం అంతేగాకుండా తెలంగాణా ఉద్యమం బలహీనపడిందని ప్రజలు “అభివృద్ధిని” మాత్రమే కోరుతున్నారని, ప్రజల తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను అవహేళనకు గురి చెయ్యడం వీటన్నింటి వల్లనే కరీంనగర్ ఉప ఎన్నికొచ్చింది. సంకీర్ణ రాజకీయ ధర్మాన్ని మరిచి తెరాసను బలహీనపరిచి తద్వారా తెలంగాణా ఉద్యమాన్ని రూపుమాపాలనే కాంగ్రెస్ దుర్బద్ధి ఫలితమే కరీంనగర్ ఉప ఎన్నిక. దీనిల్ల మేం కూడా రాజకీయంగా నష్టపోతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా కరువయింది మన కాంగ్రెస్ నాయక మన్యులకు. దీంట్లో సందేహమేమి లేదు.

ఉప ఎన్నిక ఫలితం - పర్యవసానాలు :

రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఉప ఎన్నికలో గెలుస్తుందని ఒక సాధారణ అభిప్రాయం. ఎందుకంటే ఆ పార్టీకి అధికారబలంతో పాటు అర్థ-అంగ బలాలన్నీ ఉంటాయి కాబట్టి. కాని విచిత్రమేమిటంటే కరీంనగర్లో కాంగ్రెస్ గెలిచే సమస్యేలేదని ఎన్నిక తప్పదని తేలిన రోజు నుంచి అన్ని వర్గాల ప్రజలు నిర్బీతిగా ఘంటా ఫథంగా చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ఇక్కడ కాంగ్రెస్ విధానం గెలిచినట్టుకాదు. ఆంధ్ర వలసపాలక వర్గ ప్రతినిధి అయిన రాజశేఖర్ రెడ్డి అహంకారం గెలిచినట్టు లెక్క. కరీంనగర్ ఎన్నిక ఆంధ్ర పాలక వర్గ అహంకారపూరిత ఆధిపత్యానికి తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవానికి, స్వపరిపాలన ఆకాంక్షకు జరుగుతున్న పోరాటం. ఆంధ్ర వలసపాలకుల ధన బలానికి తెలంగాణా ప్రజా బలానికి జరుగుతున్న సమరం. ఇప్పటికే రాజశేఖర్రెడ్డిని చూసి లాగులు తడుపుకొంటున్న మన తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆ తరువాత అతని ముందు నొరెత్తడానికే సాహసించక పూర్తిగా పాదాక్రాంతులవుతారు. ఇతర పార్టీల్లోని తెలంగాణా రాజకీయ నాయకులకు ఈపాటి గౌరవ మర్యాదలు కూడా దక్కవు. వాళ్ళ గొంతు నొక్కబడుతది. రాజశేఖర్రెడ్డి బలంతో పాటు అహంకారం మరింత పెరుగుతుంది. అతని నియంతృత్వానికి, ఫాక్షనిస్ట్ అణిచివేతకు ఎదురు లేకుండా పోతది. తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కాదు, “అభివృద్ధి”ని కోరుతున్నారని కాంగ్రెస్ అధినాయకత్వానికి చెప్పి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెనుకకు తొయ్యడానికి మరింత గట్టి ప్రయత్నం చేస్తడు. తెలంగాణా వాదం, ఉద్యమం నిర్ధాక్షిణ్యంగా అణిచివేయబడుతుంది. తెలంగాణా ఉద్యమకారులు “సమైక్యాంధ్ర రక్షణసేన” లాంటి మాఫియా గ్యాంగులతో నిర్మూలించబడుతారు. కాంగ్రెస్ గెలిస్తే జరుగుబోయే పర్యవసానమిది.

అయినా కాంగ్రెస్ గెలిచే అవకాశమెక్కడిది. దిగ్విజయ్ సింగ్ మొదలే కాంగ్రెస్ పార్టీ నైతిక పరాజయాన్ని అంగీకరించాడు. ఇక మిగిలింది భౌతిక పరాజయమే. కరీంనగర్ ఉప ఎన్నిక రెఫరెండమేనన్న రాజశేఖర్రెడ్డి మల్ల ఎనుకకు గుంజుకొన్నడు. ఇంటలీజెన్స్ రిపోర్టు, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని గ్రహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తమ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని “అభివృద్ధి మంత్రం” నుండి “కాంగ్రెస్‌తోనే తెలంగాణా రాష్ట్రం సాధ్యమనే” నినాదానికి మార్చుకొన్నది. ఇదంతా ఓట్లకోసం, కరీంనగర్లో గెలుపుకోసం ఆడుతున్న నాటకం. కాంగ్రెస్ నాయకులకు అమాయకులైన తెలంగాణా ప్రజలను మోసం చేయడం వాళ్ళ “ఒంట్లో, ఇంట్లో, రక్తంలో” ఉన్న సులువైన విద్య. ఇపుడున్న తెలంగాణా ఎనుకటి ఎడ్డి తెలంగాణా కాదు కాబట్టి కరీంనగర్ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీలోని నిజమైన తెలంగాణా వాదులు అంతరాత్మను చంపుకోలేక పరోక్షంగా, రహస్యంగా కాంగ్రెస్ ఓటమికి కృషి చేసితీరుతారు.

కాంగ్రెస్ పార్టీ కాకపోతే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం గెలుస్తుందా? ఇది కోటి వరహాల ప్రశ్న. తెలుగుదేశం గెలిస్తే చంద్రబాబునాయుడి “సమైక్యవాదం” లేక “సమైక్యరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి” నినాదం గెలిచినట్టే. చంద్రబాబునాయుడు తెలంగాణాను శాశ్వత దాస్యంలోకి నెట్టే హైటెక్ స్కీంలకు, స్కాంలకు శ్రీకారం చుడుతాడు. ఈ విషయంలో చంద్రబాబు రాజశేఖర్‌రెడ్డికి సీక్రెట్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తాడు. ఇద్దరు కలిసే పనిచేస్తరు. గత ఎన్నికల్లో “సమైక్యరాష్ట్ర” నినాదంతో పోటీచేసిన తెలుగుదేశం మళ్ళీ అదే నినాదంతో బరిలోకి దిగుతున్నది. ఈ ఎన్నికలో తెలుగుదేశం ప్రధాన ప్రచార వ్యూహం “సమైక్యరాష్ట్రం” కంటె కాంగ్రెస్-తెరాసల ఐక్యతవల్ల తెలంగాణా ప్రజలకు జరిగిన మోసాన్ని ప్రచారం చెయ్యడం. తెలుగుదేశం టాక్టికల్గా సమైక్యరాష్ట్రమే మాధ్యేయమని ఎక్కువ ప్రచారం చెయ్యదు అట్ల చేస్తే ప్రజాగ్రహనికి గురికావల్సి వస్తదని వాళ్ళకు తెలుసు. తెలుగుదేశం గెలుపు ఆశ అంతా బిసిల ఓట్లమీద. కాని అంతరాత్మ ప్రబోధానుసారం, పార్టీ జెండాల కతీతంగా ఆలోచించే తెలుగుదేశంలోని తెలంగాణా అభిమానులు తెలుగుదేశం ఓటమినే ఇష్టపడుతారు లేకపోతే ఇప్పటిదాకా ఉన్న ప్రత్యేక పరిగణన, గౌరవం తగ్గిపోతాయని తెలుగుదేశంలోని తెలంగాణా నాయకులకు తెలుసు. తెలుగుదేశంలోని నాయకులు చాలమంది “మాకు తెలంగాణా రాష్ట్రం రావడం ఇష్టమే కాని పార్టీ వ్రత్యాన్ని, చంద్రబాబు విధేయతను వదులుకోలేంకదా” అని అంటరు. ఉవ్వెత్తున లేస్తున్న కరీంనగర్ ప్రజల ధర్మాగ్రహ ఉప్పెనలో తెలుగుదేశం కొట్టుకపోకతప్పదు.

ఎక్కడో ఒక దగ్గర గెలుస్తమనే చిన్న ఆశ, గుడ్డిదీపంలా మిలుకు మిలుకుమంటున్నది బిజెపికి. నిజానికి తప్పక గెలుస్తమన్న మనోబలం లేని పార్టీ అది. కాని జాతీయ కార్యవర్గంలో తెలంగాణా రాష్ట్రం కోసం తీర్మానం చేసినం కాబట్టి, గెలిస్తే పార్లమెంటులో తెలంగాణా కోసం ప్రైవేట్ బిల్లు పెడుతమంటున్నరు కాబట్టి కరీంనగర్ ప్రజలు గెలిపిస్తరేమోనని ఆశ. ఇప్పుడది కష్టం. అంతేగాక ఇప్పుడు బిజెపిని గెలిపించడం వాంఛనీయమూ కాదు, సాధ్యమూ కాదు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రత్యక్షంగా మద్దతునిస్తున్న బిజెపి నిజాయితిని శకించాల్సిన అవసరం లేదు. కాని కేంద్రంలో బిజెపి కూటమి అదే యన్.డి.ఎ. అధికారంలో లేదు కాబట్టి బిజెపిని గెలిపించినా ప్రయోజనం చేకూరదని, బిజెపి ప్రైవేటు బిల్లు తెలంగాణా కోసం పార్లమెంటులో తెచ్చినా అది కాంగ్రెస్ సహకారం లేక వీగిపోతుందని అందరికీ తెలుసు కాబట్టి బిజెపిని గెలిపిస్తే” వ్రతం చెడుతది తప్ప ఫలితం దక్కదని” కరీంనగర్ ప్రజలకు తెల్వదా? అసలు నిజానికి తెలంగాణా వాదం ఓట్లు చీలకూడదని ఉద్దేశంతో మేం పోటిలో లేమని ప్రకటిస్తే బిజెపి గౌరవం తెలంగాణా ప్రజల్లో మరింత పెరిగి ఉండేది. బిజెపికి ఆ అవకాశం కూడా పోయింది. కాబట్టి కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలు తమతమ బలహీనతలు, పరిమితులు

తెలిసికూడా తెలంగాణా ప్రజల భవితవ్యంతో “రాజకీయం” చేస్తున్నట్టే లెక్క. ఈ పార్టీలన్నింటికి తెలంగాణా పై ఉన్నది ఎన్నిక అవసర రీత్యా వచ్చిన ప్రేమేకాని నిజమైన చిత్తశుద్ధి కాదని స్పష్టంగా తెలుస్తునే ఉన్నది.

కరీంనగర్లో జరుగనున్న చతుర్ముఖ పోటీలో గెలుపుకు విస్తృత అవకాశాలున్న పార్టీ తెరాస. తెరాస ఏకైక లక్ష్యం తెలంగాణా రాష్ట్ర సాధన, దాని కనుగుణమైన రాజకీయ ప్రక్రియను వేగవంతం చేయడం. స్పష్టమైన ప్రచార వ్యూహంతో తెలంగాణా రాష్ట్ర సాధన రాజకీయాలను, ఉద్యమాన్ని ఉప ఎన్నికను అవకాశంగా తీసుకొని ముందుకు తీసుకపోవడానికి ప్రయత్నిస్తున్నది తెరాస. తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణకు కీలకమైన అంశం “ఏకాభిప్రాయ సాధన” దీన్ని మనం “విస్తృతాంగీకార సాధన” అని కూడ అనవచ్చు. రెండున్నర సంవత్సరాలుగా ఈ ఏకాభిప్రాయ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నదెవరు? సామాజిక రాజకీయ ప్రతిబందకాలేమిటి? ఖాళీలెక్కడున్నవి? వాటి నెట్లా పూరించాలి? ఈ ఏకాభిప్రాయ సాధన ఇంకెంత కాలం కొనసాగుతుంది? ఎప్పుడు పూర్తయితది? ఈ దిశలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏంచేయనున్నది? ఈ ప్రశ్నలన్ని తెరాసతో పాటు తెలంగాణా వాదులు నిరంతరం అడుగుతునే ఉన్నరు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టమైన జవాబులు లేవు, ఉన్నా చెప్పడానికి సిద్ధంగా లేదు కనుకనే ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నది. తెలంగాణా ఏ ఒక్కరి సొత్తు కాదు అనడంలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, తెలంగాణా పై నిర్ణయం, “ఆ పార్టీకి అనుకూలించే సమయంలోనే, ఆ పార్టీకి అనుకూలమైన నిర్ణయాన్ని ప్రకటిస్తందని అర్థం. అందుకే ఆ పార్టీలో తెలంగాణా పై ఉద్దేశపూర్వక అస్పష్టత కొనసాగిస్తున్నది”. కాంగ్రెస్ అధినాయకత్వం ఏకాభిప్రాయ సాధనకోసం ప్రయత్నిస్తున్నమంటరు. రాష్ట్ర పార్టీ నాయకులది తలొదారి, రెండో ఎస్సార్సికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని కొందరు, తెలంగాణా పై నిర్ణయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేతుల్లో ఉన్నదని కొందరు, అభివృద్ధి అవుతున్నది కాబట్టి తెలంగాణా అక్కర్లేదని మరికొందరు, తెలంగాణా రాష్ట్రం వచ్చిన్నాడు ఎలాగొస్తది అప్పటిదాకా “అభివృద్ధిని” ఎందుకు అపుకోవాలని ఇంకా కొందరు ఇట్ల రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికి తోచింది వారు, ఎప్పుడు ఎవరికి ఏది అనుకూలమైతే, వారు అప్పుడు అది మాట్లాడుతుంటరు. తమ పార్టీలోనే ఏకాభిప్రాయం లేక యుపిఎ భాగస్వామ్య పార్టీల మధ్య అంగీకారం కుదరలేదంటరు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో గెల్వడంకోసం తీసికొచ్చిన నినాదం “తెలంగాణా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం” అని. ఇదంతా తెలంగాణా ప్రజలు, ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజలు గమనిస్తలేరా? కాంగ్రెస్ నాయకత్వంలో తెలంగాణాపై ఇంత ఉద్దేశపూర్వక అస్పష్టత, గందరగోళం ఉన్నది కాబట్టే, తెలంగాణాను కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తున్నదనే భావన ప్రజల్లో లోతుగా, బలంగా పేరుక పోయింది. దీనివల్ల తెలంగాణా ఆకాంక్ష (సెంటిమెంట్), కాంగ్రెస్ మీద ఆగ్రహం ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రజల్లో రోజుకో డిగ్రీ పెరుగుతున్నదే కాని తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సెంటిమెంట్ను ధనంతో, మధ్యంతో, ఇతర ప్రలోభాలతో కొనడం అసాధ్యం. తెలంగాణా ప్రజలిప్పుడు తమ తల్లిని అమ్ముకొనే స్థితిలో లేరు.

కరీంనగర్ ఎన్నికల్లో తెరాస గెలిస్తే కెసిఆర్ గెలిచినట్టు కాదు. గెలిచేది తెలంగాణావాదం. అంటే అది ఓ దీర్ఘకాలిక ప్రజాస్వామిక ఆకాంక్ష, రాజకీయ చైతన్యం. అది కేవలం సెంటిమెంట్ ( ఏ దోహదం, ఆచరణ అవసరంలేని మనోభావం) కాదు. అభివృద్ధితో సహ అన్ని అంశాలపై ప్రజల నిర్ణయాధికారం, ఆత్మాభిమానం. తెరాస గెలిస్తే తెలంగాణా రాష్ట్ర సాధన ప్రక్రియ సుగమమయ్యే అవకాశాలెక్కువ. తెలంగాణా ప్రజల మానసిక ధైర్య, స్ధైర్యాలు కొండంత పెరుగతయి. తెలంగాణా కాంగ్రెస్ నాయకుల ధైర్యంతో పాటు, కాంగ్రెస్ అధినాయకత్వంతో రాజకీయంగా బేరమాడే శక్తి పెరుగుతది. అన్ని రాజకీయ పార్టీల్లో తెలంగాణా నాయకుల గౌరవ మర్యాదలు మరింత పెరుగతయి. తెలంగాణా పది జిల్లాలో, 462 మండాలాలో, 11 వేల గ్రామాల్లో తెలంగాణా వాదాన్ని, ఉద్యమాన్ని విస్తరించాల్సిన అవసరం, అవకాశం మరింత పెరుగతది. ఆంధ్ర వలస పాలన నుండి విముక్తికోసం గత యాబై ఏళ్ళుగా కొనసాగుతున్న తెలంగాణా స్వాతంత్య్ర పోరాటంలో కరీంనగర్ ఉప ఎన్నిక ఒక కీలకమైన ఘట్టం కాబట్టి పార్టీలు, జెండాలు పక్కన బెట్టి తెలంగాణా ప్రజలంతా ఐక్యమయి తెలంగాణా వాణిని ముక్త కంఠంతో వినిపించాల్సిన సమయమిది. అందుకే కరీంనగర్ ఉప ఎన్నికలో తెలంగాణా వాదాన్ని వినిపిద్దాం, తెరాసను గెలిపిద్దాం.

స్వేచ్చ, స్వాతంత్య్రం
స్వరాష్ట్రం స్వపరిపాలన
తెలంగాణా ప్రజల ఆశయం
ఈ ఆశయాన్ని నిర్మూలించే
ఆయుధమింకా అవతరించలేదు

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో