- బి.ఎస్.రాములు
ఆరు దశాబ్దాల క్రితం రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాతకూడా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం (స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్- ఎస్సార్సీ) నేర్పాటు చేయలేదు. మొదటి ఎస్సార్సీ నివేదిక ననుసరించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అయితే హైదరా బాద్ రాష్ట్ర రద్దు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మొదటి ఎస్సార్సీ నివేదిక సూచనలకు వ్యతిరేకం. ఇటీవల కొందరు రెండో ఎస్సార్సీ వేయాలని డిమాండ్ చేస్తు న్నారు. మొదటి ఎస్సార్సీ సిఫారసులను పాటిస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదే కాదు. ఇప్పుడు మొదటి ఎస్సా ర్సీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తిరిగి హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సిన అవ సరమెంతైనా ఉంది. ఇలా చేయడం, యాభై సంవత్సరాల తరువాతైనా మొదటి ఎస్సార్సీని గౌరవించి నట్టు అవుతుంది.
మొదటి ఎస్సార్సీ ప్రకారమే హైదరాబాద్ రాష్ట్రాన్ని తిరిగి ఏర్పాటు చేసి దానికి తెలంగాణ అని పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు గత నాలుగు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఏ ఎస్సా ర్సీ ప్రకారం బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది? కమ్యూ నిస్టులు, ఆంధ్ర వలసవాదులు, నిజాం కాలంలో హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వారు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను కోరడం వెనుక ఆంధ్ర ప్రాంతీయుల విస్తరణ వాదం పొంచివుందని పండిట్ నెహ్రూ ఆనాడే అన్నారు. ఆంధ్ర, తెలంగాణలను విలీనం చేయడం ఒక తుంటరి పిల్లవాడికి ఒక అమాయకురాలిని ఇచ్చి పెళ్ళిచేసినట్టుగా ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీయే మొదటి నుంచి ద్రోహం చేస్తూ వస్తున్నది. అదే కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సార్సీల ప్రమేయం లేకుండా 1960 నుంచి అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంకా అనేక రాష్ట్రాలు ఏర్పడవలసివుంది. ఏర్పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ 16 కోట్ల జనాభాతో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. దానిని నాలుగైదు రాష్ట్రాలుగా విభ జించాల్సిన అవసరముంది. అలాగే మధ్యప్రదేశ్‌ను కూడా మూడు నాలుగు రాష్ట్రాలుగా పునర్వ్య వస్థీకరించాల్సివుంది. మన దేశం నడిమి ప్రాంతాల్లో నివసిస్తోన్న గిరిజన తెగలవారికి ప్రత్యేక రాష్ట్రాల నేర్పాటు చేయవలసివుంది. గిరిజనుల ప్రాంతాలు ఆయ రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలుగా ఉండటంతో అవి అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్నాయి. శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా కొనసాగిన గోం డ్వానా పేరుతో గోండ్వానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గిరిజనులు ఆశిస్తున్నారు. నిత్య క్షామంతో అల్లాడిపోతున్న విదర్భ (మహారాష్ట్ర) ప్రాంత ప్రజలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన దినం నుంచే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే ఇప్పటికే ఉన్న రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు తెలంగాణ కంటే చిన్నవవుతాయి. పెద్ద రాష్ట్రాలు వెనుకబాటుతనానికి నిదర్శనం. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రంగా ఉండటం వలనే వెనుకబడి పోయింది. కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మొదలైన రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉండటం వలనే ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. సింగపూర్ అనే నగరం ఒక దేశంగా ఎంతగా అభి వృద్ధి చెందిందో మనకు తెలుసు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధిని వేగవంతం చేస్తుందనడంలో సందేహం లేదు. స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన, స్వంత అస్తిత్వం, సొంత భాష, స్వంత సంస్కృతి కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఎంతో అవసరం. ఆ విధంగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయో చూడండి: గుజరాత్ (ఆవిర్భావం 1960 మే 1); నాగాలండ్ (1963 డిసెంబర్ 1); హర్యానా (1966 నవంబర్ 1); హిమాచల్‌ప్రదేశ్ (1971 జనవరి 25); త్రిపుర (1972 జనవరి 21); మణిపూర్ (1972 జనవరి 21); మేఘాలయ (1972 జనవరి 21); సిక్కిం (1975 మే 16); అరుణాచల్‌ప్రదేశ్ (1987 ఫిబ్రవరి 20); గోవా (1987 మే 30); ఢిల్లీ (1991); ఛత్తీస్‌గఢ్ (2000 నవంబర్ 1); ఉత్తరాంచల్ (2000 నవంబర్ 9); జార్ఖండ్ (2000 నవంబర్ 15). 1956 తరువాత ఎలాంటి ఎస్సార్సీ లేకుండా ఏర్పడిన 15 రాష్ట్రాలివి. అవి ఎలా ఏర్పడ్డాయో పార్లమెంటు తీర్మానాలు, రాష్ట్రపతి ఉత్తర్వులను పరి శీలిస్తే తెలుస్తుంది. మొదటి ఎస్సార్సీ నివేదిక చదవని వారే రెండో ఎస్సార్సీ కావాలని కోరుతారు.
( 11 జనవరి 2007, ఆంధ్రజ్యోతి )