Feed on
Posts
Comments

- ఎస్. సదాశివ

1971వ సంవత్సరం, వేసవి సెలవుల్లో ఐదుగురం మిత్రులం పత్తాలాడుతున్నాము. మా హెడ్‌మాస్టర్ గారు కూడా మాలోనే వున్నారు. అటెండర్ స్కూల్ పోస్టు పట్టుకవచ్చి హెడ్‌మాస్టర్ గారికిచ్చాడు, D.P.I ఆఫీసు నుంచి నాపేర ఒక కవరు వచ్చింది. D.P.I అంటె Director of Public Instruction. అప్పటికి School Education, Higher Education వేరుపడలేదు. నా పేర కవర్ రావటం అందరికీ వింతే. ఎవరో కవర్ విప్పి లెటర్ చదివి వినిపించారు. Nationalized Text Booksలో నేను ఐదవ తరగతి తెలుగు వాచకం రాయాలట. అంగీకారమో కాదో తెలియజేయవలసిందని రాసినారు. “ఇదంతా ‘నామ్ కే వాస్తే’ వ్యవహారం, Text books రాస్తామని ఎందరో పైరవీలు చేసుకుంటారు. వాళ్లను కాదని తెలంగాణాలో మారుమూల ప్రాంతమైన అదిలాబాద్ లో వున్న సదాశివనెవరు రచయితగా నియమిస్తారు? పదిమందికి పంపినామని చెప్పటానికి కొందరికిలాటి ‘నామ్ కే వాస్తే’ లెటర్స్ పంపిస్తారు, ఇదీ అలాటిదే, రచయిత యెవరో ఈపాటికే నియుక్తుడై వుంటాడు. రచయితగా మీకింత పేరున్నది కనుక మీకూ ఒకటి పంపినారు” అని తేల్చి చెప్పినాడు అనుభవజ్ఞుడైన ఒక సహోపాధ్యాయుడు, అందరికీ అదే నిజమనిపించింది. నాకూ అలాగే అనిపించింది. అయితే, మా హెడ్‌మాస్టర్ మాత్రం “ఏది యేమైనా మీరు వెంటనే అంగీకారం తెల్పండి” అన్నారు. అంగీకారం తెల్పినాను. అందరం ఆ సంగతి మరిచిపోయినాము.

పదిహేను రోజుల తర్వాత పత్తాలాడుతుండగానే మళ్లీ ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ప్రకారం నేను రచయితగా నియమితుడయ్యాను. నా పుస్తకం సంపాదకులు తెనాలి కాలేజీ లెక్చరర్ కొండూరు వీరరాఘవాచార్యులు. ఏ తేదీన మీటింగుకు రమ్మంటే ఆ తేదీన D.P.I ఆఫీసుకు వెళ్లాలె. నా మిత్రులంతా సంతోషించినారు. నేను తెలుగువచనం చక్కగా రాస్తానని ఎప్పుడూ ప్రోత్సహించే సాహిత్యమిత్రులు, సహోపాధ్యాయులు ఎం.శంకరరావుగారు మరీ సంతోషించారు. వారు జిల్లా విద్యాశాఖాధికారిగా ఉద్యోగవిరమణ చేసి హైదరాబాద్‌లోనే వుంటున్నారు. కొండూరు వీరరాఘవాచార్యులు సాహిత్య కళను, శిల్పకళను, గుళ్ళు గోపురాలను, వేదాంతాన్ని గురించి రాసిన వ్యాసాలు చదివాను, వారి పద్యాలూ చదివి వున్నాను. మంచి పండిత కవి మార్గదర్శకుడైనందుకు సంతోషించాను.

నేనూ అప్పటికి ప్రదేశ్ సాహిత్య అకాడమీ కోసం ఐదు పుస్తకాలు రాసివున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ఒక పుస్తకం అనువదించి వున్నాను. అప్పటికే ఇరవయ్యేళ్లుగా భారతి మొదలైన మొదలైన పత్రికలకు ఎన్నో వ్యాసాలు రాసి వున్నాను. ఆచార్యులవారివేమీ చదువలేదు. నన్ను రచయితగా నియమించినందుకు వారికి దిగులు పట్టుకుంది. “మీ తెలంగాణాలో చాలామందికి తెలుగురాదని విన్నాను. ఆదిలాబాద్‌లో మరాఠీ ఉర్దూభాషల ప్రాబల్యముందని విన్నాను. మీరక్కడి వారే అనీ విన్నాను. మీ తెలుగెలా వుంటుందో తెలియదు. మీ శబ్దప్రయోగమెలా వుంటుందో, మీ వాక్య విన్యాసమెలా వుంటుందో నేను తెలుసుకోవాలి. కాబట్టి రెండు పాఠాలు రాసి వెంటనే పంపండి” అని ఆదేశిస్తూ ఒక లేఖ పంపినారు. ఐదవ తరగతి వాచకం ఎలా రాయాలో class room experience వున్న నాకు తెలుసు. డిగ్రీ కాలేజీలో లెక్చర్లిచ్చే ఆచార్యులవారికే తెలియదని కూడా నాకు తెలుసు. తెలంగాణా వాన్నయినందుకు వారు నన్ను కావాలని కొట్టిన దెబ్బ. అలాటి దెబ్బలు అంతకుముందే తిని వున్నాను.

1954లో నేను సిర్పూర్ కాగజ్‌నగర్ లోని Upgraded High Schoolలో తెలుగు చెప్తున్నాను. పర్యవేక్షణ చేయటానికి ఆదిలాబాద్‌ నుంచి జిల్లా విద్యాశాఖాధికారి వచ్చారు. హెడ్‌మాస్టర్ గదిలో ఆయన కూర్చుని వుండగా పోస్టు వచ్చింది. A.I.R హైదరాబాద్‌ నుంచి నాకొక లెటర్ వచ్చింది. ఆఫీసర్ గారే కవర్ చించి లెటర్ చదివినారు, అలా చదవటం తప్పు. ఆదిలాబాద్ జిల్లా వింతలు-విశేషాల గురించి మాట్లాడవలసిందిగా హైదరాబాద్‌ రేడియో స్టేషన్ వాళ్లు నన్నాహ్వానించారు. ఆఫీసర్‌గారు నన్ను గదికి పిలిపించి, “మీరీ ప్రాంతం వారేనట గదా! రేడియోలో తెలుగు ప్రసంగం చేయగలరా?” అని ప్రశ్నించినారు. “అయ్యా! నేనిక్కడి పిల్లలకు తెలుగే చెప్తున్నాను” అని మనవి చేశాను. “మీ హెడ్‌మాస్టర్ ముస్లిం. అతడు చెప్పమన్నాడు కనుక చెప్తున్నారు. ఇక్కడ మా ప్రాంతం వాళ్లు కూడా వున్నారుగదా. వాళ్లను కాక A.I.R వాళ్లు మిమ్మల్నే ఎందుకు ఆహ్వానించారు?” అని ఇంకో ప్రశ్న సంధించారు. “అది A.I.R వాళ్లనడుగవలసిన ప్రశ్న” అని గదిలోంచి వెళ్లిపోయాను. అదొక దెబ్బ. ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే రేడియో స్టేషన్ కు వెళ్లాలనిపించలేదు. “నేను రాలేను” అని జాబు రాసినాను. అప్పటి జిల్లా కలెక్టర్ ఇ.వి.రామి రెడ్డి, I.A.S.గారు ఆ ప్రసంగం చేసినారు, వారూ తెలంగాణా వారే.

1950లో లక్షెట్టిపేట Upgraded High Schoolలో తెలుగు చెప్తున్నాను. అప్పటి జిల్లా విద్యాశాఖాధికారిగారు కూడా ఆంధ్రప్రాంతం వారే. నేను తెలుగు చెప్తున్న క్లాసుకు వస్తూ వరండాలో హెడ్‌మాస్టరుతో జరిపే సంభాషణ నాకూ పిల్లలకూ వినిపిస్తూనే వున్నది.

“తెలుగు బోధిస్తున్న ఈ టీచర్ మన ప్రాంతం వాడేనా?”

“కాడు, ఈ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం వాడు.”

“ఇతడు తెలుగేమి చెప్పగలడు? మన ప్రాంతం టీచరుతో చెప్పించలేక పోయారా?”

“మన ప్రాంతం టీచర్ ఇంగ్లీషు చెప్తున్నాడు. తెలుగుచెప్పే టీచరు లేడు. ఇతడుబాగానే చెప్తాడు”

విద్యాశాఖాధికారిగారు క్లాసులో ప్రవేశించి వ్యాకరణం ప్రశ్నలు మొదలు పెట్టినారు, టెక్స్ట్ బుక్ చూస్తూ ప్రశ్నిస్తున్నారు.

“యణాదేశసంధి అనగానేమి?”

ముగ్గురు పిల్లలు సరిగా చెప్పలేదు. Next, Next, అంటూ నాలుగవ అబ్బాయినడిగితే అతడు సరిగానే చెప్పినాడు, Next, అన్నారు అధికారిగారు, “ఏమి సార్! నేను సరిగా చెప్పలేదా?” అని ఎదురు ప్రశ్న వేసినాడా అబ్బాయి. అధికారిగారు బిత్తరపోయినారు. “నువ్వు చెప్పింది కరక్టే, కూర్చో” అన్నాను నేను. ఇక ప్రశ్నలు సాగలేదు. అధికారిగారు క్లాసులోంచి వెళ్లిపోతూ నన్ను వెంటరమ్మన్నారు. హెడ్‌మాస్టరుగారు వెంటే వునారు. “ఆ అబ్బాయి చెప్పింది కరక్టేనా?” అని అధికారిగారు నన్నడిగారు. “ఔను” అని యణాదేశసంధిని వివరించి చెప్పినాను. పడుచువాన్ని, ఆ దెబ్బ సహించలేక పోయినాను, “తేలు మంత్రం రానివాడు పాముపుట్టలో వేలు పెట్టినట్లు మీకే తెలుగు రాదు, వ్యాకరణం ప్రశ్నలెందుకడిగినారు?” అన్నాను. “ఈ టీచర్ ఆఫీసర్ తో ఎంత తలబిరుసుగా మాట్లాడుతున్నాడో విన్నారా హెడ్‌మాస్టర్ గారూ! మనవాన్ని పంపిస్తాను వెంటనే ఇతన్ని రిలీవ్ చెయండి” అంటూ వెళ్లిపోయినారు జిల్లా విద్యాశాఖాధికారిగారు. నా తబాదిలా అయింది.

నేనింకా కొన్ని దెబ్బలు తిన్నాను. గాయాలు మానలేదు. యాదికి వస్తూనే వుంటయి. వీరరాఘవాచార్యుల ప్రసక్తి వదిలిపెట్టి నా గాయలను కదుపుకున్నాను. మళ్లీ అసలు విషయానికి వస్తాను. ఆచార్యులవారి ఆదేశాన్ని పాటించలేదు. రెండవ ఆదేశం వచ్చింది, దాన్నీ పాటించలేదు. సెలవుల్లో దగ్గరి మిత్రులంతా పత్తాలాడుకుంటుంటే ఇంట్లో కూర్చుండి పాఠాలు రాయాలని ఎలా అనిపిస్తుంది? ఇంతలో D.P.I లెటర్ వచ్చింది; “ఫలానా తేదీన టెక్స్ట్ బుక్ కమిటీ మీటింగుకు రావాలె” అని. గబగబా రెండు పాఠాలు రాసుకున్నాను. ఆచార్యుల వారి ఆదేశపత్రం ఇంకా కఠినంగా వచ్చింది, “నేను రెండు జాబులు రాసినా మీరు ఖాతరు చేయలేదు, మీటింగు తేదీ గూడా వచ్చింది. మీటింగులో మిమ్మల్ని రచయితగా తొలగించవలసిందని D.P.I గారికి చెప్తాను” అని.

రేపు మీటింగు అనగా నేను హైదరాబాద్‌ వెళ్లినాను, అప్పట్లో నాంపెల్లి రైల్వే స్టేషన్ కు ఎదురుగా వున్న చిన్నలాడ్జీలలో దిగేవాన్ని, (నేను దిగిన లాడ్జీ పేరు నయీదియా లాడ్జి) రాయల్ హోటల్ పక్కన వుంటుంది. దాని పేరు తరువాత సూపర్ హోటలయింది. ఇప్పుడేదో కొత్తపేరు కనిపిస్తున్నది. దాని ఎదుట మూల మీద దుర్గావిలాస్ అనే పెద్ద హోటలుండేది, (అదిప్పుడు కనిపించటంలేదు) మర్నాడు తొమ్మిది గంటలకు టిఫిన్ చేయటానికి దుర్గా విలాస్‌కు వెళ్లినాను. నా టిఫిన్ పూర్తయిన తరువాత లేవబోతుండగా అప్పుడే ట్రెయిన్ దిగి వచ్చిన ఒక పెద్దమనిషి టిఫిన్‌కు ఆర్డరిచ్చి కూర్చున్నాడు. ఇంత రద్దీ వుండేది కాదప్పుడు నగరంలో. ఆ వచ్చిన పెద్దమనిషి పొందూరు ధోతి కట్టి, ఖద్దరు షర్టు తొడిగి, పండితుల మాదిరి శాలువా కప్పుకొనివున్నాడు. నా సిక్స్త్‌సెన్స్ ఎందుకో అతడే కొండూరు వీరరాఘవాచార్యులని సూచిస్తున్నది. దగ్గర కూర్చుండి “అయ్యా! తమరెక్కడినుండి వస్తున్నారు?” అని అడిగాను. “తెనాలి నుండి” అని ముక్తసరిగా జవాబిచ్చినారు. “తమ నామధేయం?” అన్నాను, మీకెందుకు అన్నట్లు నావైపు చూసి “నన్ను కొండూరు వీరరాఘవాచార్యులని అంటారు” అన్నారు. “నేను ఆదిలాబద్ నుంచి వచ్చిన సదాశివను” అని పరిచయం చేసుకున్నాను. వారు కోపంగా “ఏమయ్యా! ఎన్ని జాబులు రాసినా జవాబియ్యవు, పాఠాలు పంపవు. నీ గురించి మీటింగులో ఏం మాట్లాడాలి?” అని ఝాడింపు మొదలుపెట్టినారు.

(సశేషం)

14 Responses to “తెలంగాణా వాళ్ళకు తెలుగు రాదా?”

  1. 1
    డిస్కవర్ తెలంగాణ Says:

    NOTE : This article was published long back in some Telugu News paper, whose where abouts are unknown to us. We will really appreciate if someone can share more details with us, about the incident or the year & Name of the News Paper it was published.

    If any one can also share more details about any part of the incident are most welcome. If you have any such interesting stories / incidents to share please email us to discover.telangana[at]gmail.com

  2. 2
    రానారె Says:

    మీరు ఆకాశవాణిలో ప్రసంగించివుంటే మీ సత్తా అందరికీ తెలిసేది. అందరి నోళ్లూ మూతపడేవి. వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకున్నారు.

  3. 3
    Srinivas Nagulapalli Says:

    చెప్పితేనే కాని తలపులు ఇతరులకు తెలియవు. మాట్లాడితేనే కాని భావాలు వ్యక్తపరచలేము. చెప్పకుండా, మాట్లాడకుండా అపోహలను తొలగించడం ఎట్లా సాధ్యం? ఫలానా వాళ్ళు మాత్రమే ఫలానాది బాగా చెబుతారు, చేస్తారు అని అనుకోవడం ఒకరకమైన అజ్ఞానమే అవుతుంది. అయితే ఒకరి అజ్ఞానానికి నొచ్చుకొని, మనం నిర్భయంగా స్వేచ్చగా మనదైన రీతిలో సొంత ప్రతిభను వ్యక్తపరచకపోవడం పొరపాటు కాకపోయినా సమర్థనీయము మాత్రం కాదనే అనుకుంటాను. దేశం కాని దేశం లో, విదేశాలలో సైతం విదేశీ కంపెనీలలో, విశ్వవిద్యాలయాలలో ఎంతటివారితోనైనా పోటీ పడి నెగ్గుకు వచ్చే ఎందరో భారతీయులు ఇలా అనుకుని కుంచించుకొని కూర్చుంటే నేడు చూసే ప్రగతి సాధ్యమయ్యేనా అని అనిపిస్తుంది. రాపిడి తోనే పదునుతేరుతుంది కత్తి.
    ఇటువంటి అపోహలు ఎదుటివారిలో ఉన్నంతకాలం, మీవంటి వారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీ ప్రతిభను బహిర్గతం చేయడానికి ఉద్యమించాలి అని మనవిచేస్తూ
    విధేయుడు
    శ్రీనివాన్ నాగులపల్లి

  4. 4
    abhi Says:

    ఈ రాజకీయాలు ప్రతీ చోటా ఉండేవే. మీలాంటి అమాయకులు బలి అవుతుంటారన్నమాట. మన సత్త్తా మనకి తెలిసినంత కాలం ఎవడినీ ఖాతరు చెయ్యనక్కరలేదండి. మీకు మీరే సాటి.

  5. 5
    కేశవా చారి Says:

    ఇన్నాళ్ళూ తిన్న దెబ్బలకి ఇప్పుడు మీరు కొట్టే దెబ్బ ఏమిటో చెప్పండి?

  6. 6
    ప్రసాద్ Says:

    మీరు పడిన బాధ అర్థం చేసుకోగలను.
    అవతలి వాడిని అనుమానించడం మానవ నైజం! ఇది ఒక ఆంద్రా వాళ్ళకే పరిమితమైంది కాదు. దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు, ప్రాచ్య వాళ్ళని పాశ్చాత్యపు వాళ్ళు…
    –ప్రసాద్
    http://blog.charasala.com

  7. 7
    Sowmya Says:

    ఇంతకీ పత్తాలాడటం అంటే ఏంటండి?

  8. 8
    laxman Rao,Gandra Says:

    గౌరవ నీయులైన సదాశివ గారికి, తెలంగాణ వారికి తెలుగు రాదా వ్యాసము ఎన్నో విషయాలను తెలుపుతుంది. వారి మాటలలొ మంచి ఆకర్షణ ఉంది. విషయము ఉంది. వారు తెలిపిన అనుభవాలు అందరూ ఆలొచించ దగినవి. ఇట్లా గాయాలు తాకిన వారే సురవరం , కాళోజిలు. ఇంకా ఎందరో ఉన్నా అందరూ సవాలుగా తీసుకోలేదు.ఈ రచన పూర్తిగా రావాలి.సదాశివ గారికి , ఇది పంపిన వారికి ధన్య వాదములు.
    లక్ష్మణ రాఫు , కరీంనగర్.

  9. 9
    Rakesh Says:

    ఇది చదువుతుంటే, ఎన్నో దశాబ్దాల మునుపే SRR College(Karimnagar) లో జరిగిన ఓ సభలో మా తాత వేంకటరాజన్న అనర్గళ ఉపన్యాసం విన్నాంక, అప్పటి/అక్కడి Principalగా ఉన్న విశ్వనాథసత్యనారాయణ “తెలంగాణలో ఇంత బాగా మాట్లాడేవారున్నారా?” అని ఆశ్చర్యం (వ్యంగ్యం?) ప్రకటించారంటే, ఈ భాషా/యాసాహంకారం, భావదారిద్ర్యం ఈనాటివి కాదనీ, ఎన్నో ఏళ్లుగా వాండ్ల నరనరాల్లో తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకతా/చిన్నచూపూ వున్నయనీ తెలుస్తది.

    “మన మంతా వొక్కటయితె, మన భాషే ప్రచురిస్తె………
    తిరుగులేదు.. , తిరుగులేదు..
    ఎప్పటికీ మనకెదురులేదు!!!!”

  10. 10
    chandra sheker chilappa Says:

    ఆంధ్ర పాలకుల, పెత్తందారి విధానాలకు మనము తరతరాలుగా అనుభవిస్తున్నా, మన పాలకులకు ఇంకా బుద్ధి రాలేదు, దయచేసి పాలకుల కళ్లు ఇప్పుడైనా తెరుచుకుంటే, పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం వుద్యమం చేస్తరు, అని నేను భావిస్తున్నను.

  11. 11
    Srinivas Says:

    పత్తాలాట అంటే పేకాట

  12. 12
    srinivas Says:

    మీరు పత్తాలాడుకుంటా కాలయాపన చేసె బదులు మీ అవకాశాలని సద్వినియోగం చేసుకోవలసింది.అన్నీ తెలంగాణా కు ముడి పెట్టొద్దు.

  13. 13
    ramulu Says:

    1950 ప్రాంతంలోనే మీవంటి వాళ్ళను అంతగా అవమానపరచి, మానసికంగా గాయపడి క్రుంగిపోయేలా చేసినవాళ్ళ గురించి పదిమందికీ చెప్పుకోవడానికి,తెలియజేసుకోవడానికి అవకాశం లేక పోబట్టే మీతరం వాళ్ళంతా ఏకం కాలేకపోయారు. ఏకం కాలేకపోయారు కాబట్టే 1956లో తెలంగాణను ఆంధ్రలో కలుపుతుంటే మీతరంవారు తగినంత బలంగ/శక్తివంతంగ ఎదిరించలేక పోయారు. దాని ఫలితంగా ఇప్పటి తరంవారు తెలంగాణ్లో అన్ని దారిద్ర్యాలతో బతుకాల్సి వస్తున్నది.
    వ్రుధాగ తెలంగాణ విముక్తికై మరో పోరాటం చేయాల్సి వస్తున్నది.
    తరువాత జరిగింది కూడా దొరికించుకొని ప్రచురిస్తే మరింత బాగుంటుంది.
    ___రాములు

  14. 14
    Kanth Says:

    “గాయాలు మానలేదు. యాదికి వస్తూనే వుంటయి”

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com