అమెరికాలోని షికాగో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణవారు నిరసన వ్యక్తం చేశారు. డెట్రాయిట్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణవారు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణ సమస్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్లకార్డులు ధరించి నిర్దేశిత ప్రదేశాల్లో నిలబడి వారు నిరసన వ్యక్తం చేశారు. ‘పోలవరాన్ని ఆపండి, తెలంగాణను రక్షించండి’, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి 610 జీవోను అమలు చేయండి’, సీమకు కృష్ణా, ఆంధ్రకు గోదావరి, తెలంగాణకు గుండుసున్నా’, ‘పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు వంటి అక్రమ ప్రాజెక్టులను ఆపండి’ వంటి నినాదాలు రాసి వున్న ప్లకార్డులను తెలంగాణ ఎన్నారైలు ప్రదర్శించారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించండి – తెలంగాణ బిల్లు పెట్టండి’, ‘తెలంగాణ ప్రజలారా! మా మద్దతు మీకుంది’ వంటి నినాదాలు రాసి వున్న ప్లకార్డులు కూడా దర్శనమిచ్చాయి.
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడియఫ్) షికాగో చాప్టర్ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనకు 50 మంది దాకా హాజరయ్యారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి ఇతర గ్రూపులు ఆసక్తి చూపినప్పటికీ ఆందోళనకారుల సంఖ్యను పరిమితం చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచించారు. దీంతో టిడియఫ్‌కు చెందిన వీరు మాత్రమే నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. చాలా మంది టిడియఫ్ టీ షర్టులు ధరించారు. నిరసనకు ప్రతీకగా విమల నల్ల డ్రెస్సు ధరించింది. తెలంగాణకు నీరు, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఇతర వనరుల విషయాల్లో న్యాయం జరిగే వరకు తమ పోరాటం సాగుతుందని టిడియఫ్ స్పష్టం చేసింది. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనకూడదని చాలా మంది తెలంగాణ ఎన్నారైలకు బెదిరింపులు వచ్చాయని టిడియఫ్ తెలియజేసింది. ఆటా, తానాలు కలిసి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని సన్మానించాయి. ముఖ్యమంత్రి సెయింట్ లూయిస్, బే ఏరియాలను సందర్శించినప్పుడు కూడా ఇటువంటి నిరసనలే తెలియజేయాలని టిడియఫ్ నిర్ణయించుకుంది.
(thatstelugu.com సౌజన్యం తోటి)
Click Here to see more pictures