‘బాధితుల’ చరిత్రను రికార్డ్ చేయాలి
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- జె. సుభద్ర
తెలంగాణ హిస్టరీ సొసైటీ ఒక అయిదారుగురు కల్సి 4-6-2006న ఫతేమైదాన్ క్లబ్‌లో పెట్టిండ్రని తెలిసి ఆ మీటింగుకి వెళ్లడం జరిగింది. తెలంగాణ సంస్కృతికి, భాషకు ఇక్కడి వ్యవసాయానికి ఇక్కడి ఉద్యమాలకు, ఇక్కడి రాచరిక చరిత్రలకు, సాహిత్యానికి రచయితలు, రచయిత్రులకు సంబంధించి, పత్రికలు ఇట్లా చాలా విషయాలకు సంబంధించిన చరిత్రనే కనిపించదు. తెలంగాణ ఈపై వాటన్నింటితో ప్రత్యేకమైన చరిత్ర సంస్కృతులు కలిగినగడ్డ. ఇప్పటికైనా కొద్దిమంది ఈ ప్రయత్నానికి ఆయువు పోస్తున్నట్టు బైటకొచ్చి మీటింగు పెట్టడం, ఆహ్వానించడం చాలా సంతోషము.
చారిత్రకంగా తెలుగు ఆంధ్రపేరుతో తెలంగాణ ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక, సామాజిక రంగాల విశిష్టతలు అణగదొక్కబడిన అంశాలన్ని బైటికి తీయాల్సిన అవసరముంది.
పాలకుల చరిత్రనా పాలితుల చరిత్రనా అనేది కాన్షియస్‌గా ఉండాలి. ఆ పాలితుల్లో బాధితుల పక్షాన వుండే కాన్షియస్ వుండాలనే అభిప్రాయంతో ఉండడం చరిత్రలో కింది వర్గాలకన్యాయం జరగకుండా ఉండేది. పిఠాపురం రాజావారు కాకతీయుల చరిత్ర బైటకు తీయడానికి చాలా డబ్బు వెచ్చించాడు. ఈ కాకతీయులు నాలుగవ జాతికి చెందిన వారని తేలింది. ఈ విషయం మహబూబ్‌నగర్ శాసనంలో కూడా ఉంది.
అయితే నాలుగవ తరగతి అనే శూద్రజాతికి చెందిన కాకతీయులు నెల్లూరు నుంచి తిక్కన సోమయాజిని ఎందుకు పిలిచినట్టు? శూద్రుల్ని క్షత్రియులుగా మార్చుకునేందుకు, లేక హిందూ ధర్మాలనేమైనా ప్రతిష్టించడానికా అనేది తెలియదు.
తెలంగాణ ప్రాంతపు జెండర్ విశిష్టత ప్రత్యేకమైంది. ఇతర ప్రాంతాల జెండర్ వివక్షకు స్త్రీ పురుషుల సంబంధాల్లో తేడా సమస్యల్లో కూడా ఉంది. ఈ జెండర్ తేడాలు ఇక్కడ ఇంకో రకంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా దళిత సంస్కృతి పునాదిగా విరాజిల్లిన ప్రాంతం తెలంగాణ. కులాలమధ్య గుర్తు పట్టగలిగినంత వ్యత్యాసాలు సంస్కృతిలో కనిపించవు. ఒక బ్రాహ్మణ కులాలు తప్పితే కాపు నుంచి ఆఖరి కులాల దాక ఆడవాల్లు ఆకుచుట్టలు తాగుతరు. కాపు నుంచి చాకలి దాకా ఆడోల్లు ఇంట్లోనే చుట్టలు తాగుతారు. అదే మాలమాదిగ కిందికులాల్లో ఆడమగ కల్సి సుట్టలుతాగుతారు. ఎదురెదురుగా సుట్టలు కలిసి అంటిబెట్టుకొని తాగుతారు. ఇది బి.సిలో చాలా తక్కువ.
ఇక కల్సి కల్లు దాగుడు పైనుంచి కింది దాక ఆడమగ, పిల్లపిస్క అంత కల్సి కల్లు తాగుతరు. ఇది వేరే ప్రాంతాల్లో మహాతప్పు.
ఇక్కడ కుల చరిత్రలు అవి చెప్పే కులాలు ఇంకా ఉన్నాయి. ఇంకా కొన్నాల్లకు ఇవి బతుకుతాయో లేదో కష్టమే. ఇవి రికార్డు చేయాలి. దీంట్లో తెలంగాణ సంస్కృతి చాలా ప్రతిబింబంగా ఉన్నది. కాకిపడుగులోల్లు, పిచ్చుకుంట్లోల్లు, డక్కలి, చిందు, బుడిగెజంగాలు వీళ్లందరు చెప్పే కథల్లో తెలంగాణ చారిత్రక సామాజిక సంపదలున్నాయి. అవి కాపాడుకొని నిక్షిప్తం చేయాలి. ఇక లిఖితాలు సేకరించాలి. వీటిని సంపాదించడానికి ఎన్ని లైబ్రరి గనులు తవ్వితీయాలో. ఒక్క వాక్యంకోసం, పదంకోసం గ్రంధాలయాలన్ని బోర్లించాలి. ఒక్క పదం దొరికినా దాని చుట్టున్న రాజకీయ, ఆర్థిక ప్రాంతాల సంస్కృతిని నిర్మించొచ్చు. యాభై ఏళ్ల కిందటి నుంచే మనప్రాంతం మనకు కాకుండా పోయింది. యాభై ఏళ్ల కింద ఎట్లా మాయమైంది ఎట్లా, ఎలా, ఎక్కడా అనేది పరిశోధించాలి. యాభై ఏళ్లు అంటే మాటలు కాదు. ఒక రెండు తరాల వ్యత్యాసం. 1950కి ముందున్న తెలంగాణ వ్యవసాయం, పరిశ్రమలు నీటి వనరులు, ఖనిజ వనరులు, రాజకీయాలు, ఆర్థికాలు సామాజికాలు, చదువులు, భాష (సంస్కృతి) తిండి, కళలు సాహిత్యం పత్రికలు, ప్రాచీన రచనలు కవులు, సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్రోద్యమాలు, మత సంస్కరణోద్యమాలు ఇట్లా చాలా విషయాల్ని వెలికి తీయాల్సిన అవసరముంది. వీటన్నింటిలో తెలంగాణకు ఒక విశిష్టమైన ప్రత్యేకతవుంది.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ‘మతం’ అనేది ఇప్పుడున్న హిందూమతంగా లేదు. కులానికో తీరు గ్రామదేవతల నమ్మకాలు తప్ప దేవాలయత్వ హిందూ మతం లేదు. వైదిక మంత్రాలతో, పూజాది కర్మలకొదిగిన హిందూమతంలో ఈ ప్రాంతమతం యిమడదు. ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక గుడి అనేది కూడా ఉండది. (ఏవో కొన్ని జిల్లాలు తప్పితే) ఇంట్ల ఎవరికన్నా బాగలేకుంటే కొబ్బరికాయ గొట్టిమొక్క ఆ కొబ్బరికాయను గూడ ‘పలారముల్లో’ అని పంచుతారు. పంటలు మొదలయ్యే కాలంలో వర్షాకాలంలో పురుగు పుట్రా లాంటి బ్యాక్టీరియా పెరిగే కాలంలో సామూహికంగా బోనాలు చేయాలనేం లేదు. కలిగినోల్లు బోనామండి పోషమ్మకు, మైసమ్మకు వండిపెడ్తరు. అట్లా ఒక ఆర్గనైజ్డ్ మతం అంటూ ఏమీలేదు. అదీ హిందూ మతమని కూడా నిర్దిష్టంగా చెప్పలేం. వీరి పద్దతులు హిందూమతంకు యిమడనివి. ఒక జాతర సంస్కృతి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికుంది. గడిచిన దినాల్లో ఒక సమూహం కోసం ఒక జాతి కోసం మంచి పనులు చేసిన వాళ్ల పేరు మీద జాతర్లు జరుగుతాయి. ప్రతి జాతరకు ఒక చరిత్ర ఉంది, తీయగలిగితే సమ్మక్క జాతర నుంచి నాగోబ జాతర వరకు ప్రతి జాతరను ఒక గొప్ప పోరాట చరిత్ర ఉంది. అవన్ని తవ్వి తీయాల్సిన అవసరముంది. ‘ఎవనికి పుట్టినవు బిడ్డా’ అంటే ఎక్కెక్కి పడేడ్సే పరిస్థితి తెలంగాణకు కనీసం భవిష్యత్తులో నన్నా రాకుండేట్లుగా ప్రయత్నించాలి.
- తెలంగాణ విశిష్టత కేవలం చరిత్ర సంస్కృతినే కాక భౌగోళికంగా కూడా భిన్నమైందే. ఈ ప్రాంతం యొక్క మౌలిక అవగాహన తో పాటు వృత్తి చరిత్రకారులైతే బాగుంటుంది. అంతే కాక సాహిత్య, సంస్కృతి, సమాజం పట్ల వారికి అవగాహన కలిగి ఉండాలి. ‘తెలంగాణ హిస్టరీ సొసైటీ’లో ఒక ప్రస్థావన కూడా చేయడం జరిగింది. ఏ ప్రాతిపదికలతో, ఏ ప్రతిపాదనలతో చరిత్రను నిర్మించుకోవాలి? అని
- చరిత్ర అనేది ఎమోషన్‌ల్ గాఉండది. అది నిర్దిష్ట సాక్ష్యాధారాల్తో ఏర్పాటు చేసుకునేది.
- తెలంగాణ ఒక మౌఖికం ఫోక్ నిర్దిష్టత విస్తృతంగా ఉంది. దీని పట్ల దృష్టి పెట్టాలి.
- బాధితుల చరిత్రనా, పాలకుల చరిత్రనా వెతికి తీసేది అనే దాని మీద చర్చ జరగాలి.
- కొత్త వక్రీకరణలకి వెళ్లగూడదు.
మౌఖిక చరిత్ర, జీవిత చరిత్రలు, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక ‘జెండర్ చరిత్ర’లు సేకరించాలి. - ఇష్టం లేని వాటిని తక్కువజేసి ఇష్టమున్న వాటిని ఎక్కువ జేయడం చరిత్రలో ఎక్కువగా కనబడ్తుంది. వీటిని అధిగమించాలి.
- తెలంగాణ చరిత్ర అనేటప్పటికి ఒక కాకతీయులే కన్పిస్తారు. కాని ఎన్ని శిథిల చరిత్రలున్నాయి. ఎన్ని శిథిల సామ్రాజ్యాలున్నాయో పరిశోధించాలి.
- జిల్లాల చరిత్రలు
- జిల్లాల పాటలు, సంకలనాలు, వ్యవసాయ కుల చరిత్రలు, సూచికలు, శాసనాలు, సాహిత్యం
- కళలు, పత్రికలు ఇవన్నీ శోధించాలి.
- తెలంగాణ ప్రత్యేకత దళిత బహుజనుల పునాదుల్తో ఉన్న సంస్కృతి సంపద ఉంది. ఇది అవగాహనలో ఉంచుకుంటే మనకు తెలంగాణ పునాదుల చరిత్ర అర్ధమవుతుంది. మతం, కళలు, కథలు, భాష, తిండి, శ్రమ, వ్యవసాయం, జెండర్, కులాలు ఇవన్ని నిర్మింపక మౌఖికంగానే ఉన్నాయి. తెలంగాణకే ఎక్కువగా మౌఖిక సంప్రదాయ సంపత్తి కోకొల్లలుగా ఉంది.
- పాలితుల, బాధితుల చరిత్ర, సంస్కృతికి ఎక్కువ గౌరవం, విలువలతో కూడిన అవగాహనతో వెలికి తీయాలి. పాలకుల చరిత్ర పాలితుల చరిత్రను ఒకే కోణం నుంచి చూడకుండా ఉండాలి.
- తెలంగాణలో కుల చరిత్రలు, చాలా వరకు కింది ప్రజల చరిత్ర మౌఖికంగా ఉన్న దాన్ని కుల చరిత్రలు చెప్పే కాటి కాపర్లు, సిందు మందెచ్చులోల్లు, గొల్లకథలు, డక్కలి, బుడిగె జంగాల, కాటికాపరులు మొదలగు వాళ్ల దగ్గరికెళ్లి వాళ్లు చెప్పే కథలన్నింటిని రికార్డు చేయాలి.
- ఇది గొప్ప సంపద. కల్తీ లేని తనానికి, చరిత్రకు సామాజిక కులాంశాలకు ఇది చాలా ఉపయోగపడ్తుంది. తెలంగాణ హిస్టరీ సొసైటి ఇది పరిగణలోకి తీసుకోవాలి. మాతృస్వామిక విలువలు పునాదిగా ఈ కథలు పెట్టని చారిత్రక సంపదలు. కనక వీటిని రికార్డు చేసుకోవాల్సిన తక్షణావసరముంది. తద్వారా ముందు తరాలకి ఒక గొప్ప ప్రజాస్వామిక సంస్కృతిని అందించిన వాల్లమవుతాం.
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]





