చరిత్ర రచన / నిర్మాణం
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
మనమిప్పుడు పునర్నిర్మాణ (డీకన్స్ట్రక్షన్) యుగంలో ఉన్నాం. నిరాఘాటంగా ముందుకు దూసుకెళ్లడానికి ఒకడుగు వెనక్కి వేయడం అవసరం. ఆ అడుగు బలమైన భూమిక మీద పడాలి. స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ దాదాపు ఇలాంటి మాటల్నే చెప్పి ఉన్నాడు. తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి.
దాదాపు నాలుగేళ్ల క్రితం తెలంగాణ సాంస్కృతిక వేదిక తరపున కాసుల ప్రతాపరెడ్డి సంకలనం చేసిన ‘తెలంగాణ తోవలు’ పుస్తకంలో తెలంగాణ సాహిత్య చరిత్రను రాయాలనే ఉద్దేశంతో ‘లెక్కదప్పిన తెలుగు సాహిత్య చరిత్ర’ అనే చిన్న వ్యాసం రాశాను. సంతృప్తినివ్వలేదు. చాలా అసమగ్రమనిపించింది. కె. శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్‌లు ‘కవిలె’ పేరుతో తెలంగాణ సమీపగత సాహిత్య సాంస్కృతిక చరిత్రను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదీ చాలదనిపించింది.
ఆధునిక తెలంగాణ కవిత్వాన్నంతటినీ ఒక్కచోట కుప్పపోసి చూపించాలనే ఉద్దేశంతో సురేంద్రరాజుతో కలిసి ‘మత్తడి’ కవితా సంకలం తెచ్చాను. అదీ అసమగ్రమే అనిపించింది. ఈ సంకలనం ముందుమాటలోనే చెప్పిన ప్రకారం తెలంగాణ ప్రాచీన కవిత్వాన్ని సంకలనం చేయడానికి రెండున్నర సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఎంతచేసినా ఇంకా ఏదో మిస్సవుతున్నదనే అనపిస్తుంది.
తెలంగాణ ఐక్యవేదిక, ఉస్మానియా చరిత్రశాఖ, తెలంగాణ రచయితల వేదిక తదితరులెందరో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రాజకీయ చరిత్రను, నిర్మించడానికి ప్రయత్నించారు.
ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా చేయాల్సింది ఎంతో ఉంది. అది పూర్తి చేయడం ఇలాంటి ప్రయత్నాల వల్ల సాధ్యంకాదేమోననిపిస్తున్న తరుణంలో తెలంగాణ చరిత్రను నిర్మించడమనే మహత్తర కార్యం సంఘటితంగా, ప్రణాళిక బద్దంగా చేస్తే తప్ప సాధ్యం కాదని అనిపిస్తున్న సమయంలో హిస్టరీ కాంగ్రెస్ తరహాలో ‘తెలంగాణ హిస్టరీ సొసైటీ సంస్థ ఏర్పడనున్నదని తెలిసి గొప్ప ఆనందం కలిగింది. తెలంగాణ రైటర్స్ కాలం తొలిసన్నాహక సమావేశాలకు ఎంతో ఉద్వేగంతో పాల్గొన్నాను. అంత ఉద్వేగంతో ఈ సన్నాహక సమావేశానికి వచ్చినాను.
ఇంతమంది (ఇక్కడికి రాని ఇంకెంతమందితో సహా) తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం పట్ల ఉద్విగ్న మనస్సుతో ఇక్కడి రావడం అందరికీ ఆనందం కలిగించే విషయమే గాక ఎవరికి వాళ్లం కర్తవ్యం నిర్ధేశం చేసుకోవాల్సిన సందర్భం. ఇంతమందిని ఇక్కడికి రప్పించడానికి చొరవతీసుకున్న కె. శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, ఎన్. వేణుగోపాల్, లోకేశ్వర్…లు, తెలంగాణ కవులకు ప్రాధాన్యాన్నిస్తూ తెలుగు సాహిత్య చరిత్ర రచించి సమావేశంలో ప్రధానోపన్యాసం చేసిన ముదిగంటి సుజాతారెడ్డిలు అభినందనీయులు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించే పనిలో ‘తెలంగాణ చరిత్ర సొసైటీ’ నిర్వహించాల్సిన విషయాల్ని కొన్ని ప్రస్తావిస్తాను.
‘మును మార్గకవిత లోకం
బున వెలయుగ దేశికవిత బుట్టించి తెను
గున నిలిపి రాంధ్ర విషయమున
జన చాళుక్య రాజు మొదలుగ పలువుర్…..’
నన్నెచోడుడి ప్రసిద్ధ పద్యం అందరికీ తెలిసిందే. ఇందులో నాల్గవ పాదంలో ‘జన చాళుక్య..’ అనే దానికి ‘జన సత్యాశ్రయని తొట్టి చాళుక్య నృపుల్’ అనే పాఠాంతరం ఉంది.
మొదటి పాఠం ప్రకారం తూర్పు చాళుక్యులే తెలుగు కవిత్వ ప్రేరకులుగా కనిపిస్తారు. రెండవ పాఠం ప్రకారం సత్యాశ్రయుడు ప్రేరకుడుగా కనిపిస్తాడు. కాని తూర్పు (వేంగీ) చాళుక్యులలో ఆరవ శతాబ్దికి చెందిన కుబ్జవిష్ణువర్ధనుడి (బాదామి చాళుక్యుడు
ఉదాహరణకు కొన్ని. కందుకూరి రుద్రకవి ప్రకాశం జిల్లాలోని కందుకూరి వాడనీ చింతలపాలెం అనే గ్రామాన్ని ఇబ్రహిం కుతుబ్‌షా (1550-1580) నండి అగ్రహారంగా పొందినవాడని వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరుద్ర మొదలైన పరిశోధకులు తేల్చినారు. కానీ నల్లగొండ జిల్లాలో దేవరకొండ సమీపంలో మరొక కందుకూరు ఉంది. ఈ కందుకూరులో కూడా జనార్ధనస్వామి దేవాలయం, సోమేశ్వరాలయం ఉన్నావి. ఈ కందుకూరుని జనార్ధన కందుకూరు అని కూడా పిలుస్తారు. రుద్రకవి జనార్ధనాష్టకం రాయడమే కాకుండా తన కావ్యాల్ని జనార్ధనస్వామికి, సోమేశ్వరుడికి అంకితమిచ్చినాడు. రుద్రకవి తను పొందిన అగ్రహారాన్ని ‘ద్వితింత్రిణి’ అని పేర్కొన్నాడు. ద్వితింత్రిణి అనగా రెండుచింతల లేదా రెంటచింతల. ఈ గ్రామం ప్రకాశం జిల్లాలో లేదు. అందువల్ల ద్వితింత్రిణిని ‘చింతపాలెం’ గా వ్యాఖ్యానించి రుద్రకవిది ఆ కందుకూరు అనే నిర్ణయించినారు. నిజానికి రెంటచింతల గ్రామం ఉంది. కాని అది గుంటూరు జిల్లాలో ఉంది. ఈ గ్రామం ప్రకాశం జిల్లా కందుకూరు కన్నా నల్లగొండ జిల్లా కందుకూరుకు చాలా సమీపంలో ఉంది. ఇబ్రహీంకుతుబ్షా దేవరకొండ దుర్గపాలకుడుగా ఉన్నపుడు పొందిన అగ్రహారమిది. అందువల్ల రుద్రకవి దేవరకొండ సమీపంలో కందుకూరి వాడని చెప్పవచ్చు. ఈ కవి కోస్తా జిల్లాలవాడుగానే పరిగణించ బడుతున్నాడు.
ఇక అప్పకవి గురించి. అప్పకవి తన తాత ‘అభినవ చూతపురి’లో నివాసమున్నాడని పేర్కొనగా, ‘అభినవ చూతపురి’ కి ‘మామిళ్లపల్లి’ అనే అర్థం చెప్పి ఆ గ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని మామిళ్లపల్లి అగ్రహారం గానీ కావచ్చనీ కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నాడు. తర్వాతి చరిత్రకారులు దానినే అంగీకరించి అప్పకవిని ఆ జిల్లా వాడనే నిర్ధారించారు. కాని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని ‘లేమామిడి’ అనే గ్రామానికి ‘అభినవ చూతపుర’ము సంస్కృతీకరణమని బూర్గుల రామకృష్ణారావుగారు నిరూపించినా ఇంకా అప్పకవి కోస్తా జిల్లాల వాడుగానే పరిగణింప బడుతున్నాడు. ఇలాగే అనంతామాత్యుడు, కృష్మమాచార్యులు, నూతన కవి సూరన మొదలగు చాలామంది గురించి తప్పుడు నిర్ధారణలు జరిగి ఉన్నాయి.
కొంతమంది తెలంగాణ కవుల్ని సాహిత్య చరిత్రల్లో పేర్కొనలేదు. ఉదాహరణకి ‘దాశరథి చరిత్ర’ అనే నిరోష్ఠ్యోత్తర రామాయణ గ్రంథకర్త పురుషకారి కేశవయ్య. ఈ కవిని గాని ఇతని గ్రంథమును గాని పూర్వ సాహిత్య చరిత్రకారులు, ఆధునిక సాహిత్యచరిత్రకారులు తమ గ్రంథాల్లో పరామర్శించలేదు. సమగ్ర ఆంధ్రసాహిత్యంగా పిలువబడే ఆరుద్ర గ్రంథంలో కూడా ఇతని గ్రంథప్రసక్తి లేకపోవడాన్ని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి పురుషకారి కేశవయ్య రాసిన దాశరథి చరిత్ర (నిరోష్ఠ్యోత్తర రామాయణం) పరిష్కరిస్తూ పేర్కొన్నాడు.
ఇట్లా చాలామంది కవుల గురించి తప్పుడు నిర్ధారణలు, అసలు పేర్కొనక పోవడం జరిగాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివెన్నో ఉన్నాయి. దాచేస్తే దాగని సత్యాలన్నీ బయటకు రావాలి. అప్పుడే తెలుగు సాహిత్యచరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర సంపూర్ణమవుతుంది. అందుకు తెలంగాణ చరిత్ర నిర్మాణ సంస్థలు పూనుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు పునర్నిర్మాణం కావాలి.
కాబట్టి ఉమ్మడి అనగా అందరికీ వర్తించే అనగా విశ్వజనీన, చరిత్ర ఉండదు అనేది గుర్తుంచుకోవాలి.
మాట్లాడే అంశాల మధ్యన మాట్లాడని (బిట్విన్ ది లైన్స్) అంశాలు వుంటాయి. చెలామణీ అయ్యే వాటి గర్భంలో చెలామణిలో లేని అంశాలు దాగి ఉంటాయి. వేమనలాగా, నాసరయ్యలాగా, వీరబ్రహ్మంలాగా… అలాంటిదే తెలంగాణ చరిత్ర.
అన్ని స్థిర నిర్మాణాల్ని నిరాకరించడమే పునర్నిర్మాణం (డీకన్స్ట్రక్షన్).
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]




జై తెలంగన జైజై తెలంగన