Feed on
Posts
Comments

- పరవస్తు లోకేశ్వర్‌

ప్రజలను దోచుకునే వారే ప్రజల చరిత్రను కూడా దోచుకుంటారు.’ - సి.వి. సుబ్బారావు (సురా)

ఇప్పటి వరకు రాయబడిన చరిత్ర అంతా విజేతలచే రాయబడిన చరిత్రే. విజేతలు కేవలం తమ గురించి మాత్రమే తమ గొప్పతనాలు, ఘనమైన చరిత్ర గురించి మాత్రమే రచించి పరాజితుల గురించి, అణిచివేయబడిన వారి గురించి రాయాల్సివస్తే వక్రీకరణలు, వక్రభాష్యాలు, అపహాస్యాలతో ముగిస్తారు.

”ఈ వక్రీకరణ-చరిత్రకు కొత్తదేమి కాదు. ఆర్యులు మన దేశంలోకి వలసవచ్చి ద్రావిడుల మీద దండెత్తినప్పుడూ ఇదే ప్రచారం. ఇవే ఆధిక్యతాభావనలు. బ్రిటిష్‌ వారు వలసవచ్చిన రోజుల్లోనూ ఇవే ధోరణులు - మీరంతా అనాగరికులు మేం మిమ్మల్ని ఉద్ధరించటానికి వచ్చామని ” ఫోజులు”. అమెరికాలో రెడ్‌ ఇండియన్లపైనా, ఆస్ట్రేలియాలో అబోరిజిన్లపైనా, ఆఫ్రికాలో నీగ్రోలపైనా ఇదే జులుం. ఇదే దాడి. ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ స్థానికులపై వలసవాదుల పెద్దన్నల పెత్తనం ఇట్లాగే ప్రారంభమయ్యింది. ఇటీవల సెప్టెంబర్‌ 11 దాడి తర్వాత కూడా అమెరికాది ఇదే ధోరణి. It is a clash between two civilizations. ఇవన్నీ వలసవాద ఆధిక్యతాభావనలే. 1492లో కొలంబస్‌ అమెరికాను ఆవిష్కరించక ముందే వేల సంవత్సరాలకు పూర్వమే భారత దేశంలో నాగరికత, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆసియాలో నాగరికత అత్యున్నత శిఖరాలకు చేరుకుందన్న సంగతి అమెరికాకు తెలియదా? సరిగ్గా ఆంధ్ర వలస పాలకులది కూడా ఈ దోరణి. ప్రజలనకు దోచుకునే వాళ్ళే ప్రజల చరిత్రను కూడా దోచుకుంటారు. అసలైన సిసలైన నేల పుత్రుల చరిత్రను కాలనాళికలో పాతిపెట్టే ప్రయత్నాలు చేస్తారు. స్థానికుల చరిత్రను విస్మృతిలోకి నెట్టే ప్రయత్నాలను నిరంతరం చేస్తారు. అందులో ఒక భాగంగానే తెలంగాణా చారిత్రికంగా అన్ని రంగాలలోనూ వెనకబడి వుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. యూరపులో రాజకీయ విప్లవాలకు భూమికగా పునరుజ్జీవన ఉద్యమాలు, పునర్వికాస ఉద్యమాలు కొనసాగినట్లుగానే, మన దేశ స్వాతంత్య్ర సమరంలో అంతర్లీనంగా సంఘసంస్కరణోద్యమాలు, పునరుజ్జీవనోద్యమాలు కొనసాగినట్లుగానే వర్తమాన ప్రత్యేక తెలంగాణా పునరుజ్జీవనోద్యమం కొనసాగాలి. అప్పుడే ఈ ఉద్యమం పరిపూర్ణత్వంతో వేగవంతమౌతుంది.”

(వేయిన్నొక శేషప్రశ్నలు పుస్తకంలో ఒక భాగం)

ఈనాటి చారిత్రిక అవసరం, చారిత్రిక కర్తవ్యం ఏమిటంటే మన చరిత్రను మనమే తిరిగి రచించుకోవాలి. ఈ లక్ష్యంతోనే ”తెలంగాణా హిస్టరీ సొసైటీ” ప్రారంభించబడుతున్నది. అయితే ఈ చరిత్ర పునర్నిర్మాణం బహుముఖాలతో, అనేక కోణాలలో వివిధ అంశాలపై కొనసాగాలి. తక్షణ సమస్యల ప్రాతిపదికపై తక్షణ కర్తవ్యాలను రూపొందించుకోవాలి. మన మన వ్యక్తిగత అభిరుచులు, అభినివేశాలకు అనుగుణంగా ఆయా అంశాలపై పరిశోదనలు, రచనలు, ఉపన్యాసాలు కొనసాగించాలి. ఈ ప్రయాత్నాలన్నీ మన విముక్తి ఉద్యమానికి ఒక ‘తాత్వికభూమిక’గా ఉపయోగపడతాయి. కేవలం తెలంగాణా ప్రజలలో భావచైతన్యాన్ని పెంపొందించడమే గాక నిజాయితితో వివేకంతో ఆలోచించే కోస్తా, రాయలసీమ ప్రజలను, మేధావులను ఒప్పించి వారి సానుభూతి మద్దతు సంపాదించేటట్టు కూడా ఈ ప్రయత్నాలు ఉపయోగపడతాయి.

మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ‘కులం’ అనేది ఒక యదార్థసత్యం. అన్ని పార్టీల రాజకీయాలలో ఈ అంశాన్ని విస్మరించలేం, తక్కువగా అంచనా వేయలేం. ప్రముఖ సోషియాలజిస్టు శ్రీనివాసన్‌ చెప్పినట్లు భారత రాజకీయాలు ఆది నుండి నేటి దాకా ‘కులం’ అనే సాలెగూట్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ విషయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకూ మినహాయింపులేదు. కోస్తా వలస పాలన పెత్తనం, దోపిడీలో కమ్మ కులానిదే ‘సింహభాగం’.

ప్రత్యేక తెలంగాణను సిపిఐ కంటే సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సమైక్యవాదం విషయంలో అన్ని పార్టీల కన్నమిన్నగా ‘రాజును మించిన రాజభక్తి’ ని ప్రదర్శిస్తున్న, సిపిఎం పునాది తెలంగాణ క్యాడరే అయినా నాయకత్వం మాత్రం కోస్తానే గాక కమ్మకులం అన్నది జగమెరిగిన సత్యం. నానా రకాల వ్యాపార రంగాలలో లబ్దస్రష్టులైన వణిక్‌ ప్రముఖులందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారేనని అందులోనూ మొదటితరం వారందరూ మాజీ కమ్యూనిస్టు లేనన్న సంగతి అందరికీ తెలుసు. కావున బలమైన ఈ కుల అంశాన్ని పరిశీలిస్తే సిపిఎం తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తుందో నిజనిర్ధారణకు రావచ్చును. 1934లో కమ్యూనిస్టు పార్టీ అవిర్భావంతోనే ఆ కులం పాత్రను అధ్యయనం చేయాలి. (ది రోల్‌ ఆఫ్‌ కమ్మా కాస్ట్‌ ఇన్‌ ఒరిజిన్‌ ఆఫ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఇన్‌ 1934 బై ప్రొ. అజయ్‌ కుమార్‌ సిన్హా). 1964లో చీలిక తర్వాత సిపిఎంలో దాని ప్రభావం, నాయకత్వం పై దాని ఆధిక్యత, 1982లో టిడిపి అవతరణతో దాని అంతరంగిక సంక్షోభం, ఊగిసలాటలు, సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత కాలంలో చంద్రబాబుతో ఖుల్లంఖుల్లా దోస్తానాల వెనుక ‘కులం లాబీ’ వొత్తిడులు మొదలగు అంశాలను అధ్యయనం చేస్తే వారి తెలంగాణ వ్యతిరేకత యొక్క నిజస్వరూపం లోకానికి వెల్లడి అవుతుంది.

1948 పోలీస్‌ యాక్షన్‌ సందర్భంలో యూనియన్‌ సైన్యం రెండు తలల పాము - మిన్నాగు వలె ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసింది. ఒకటి కమ్యూనిస్టుల్ని అణిచివేయటం, మరొకటి రజాకార్లను అంతమొందిచే సాకుతో కనబడ్డ ప్రతి అమాయక ముస్లింను నిర్ధాక్షణ్యంగా కాల్చివేయటం. నాలుగు రోజుల యాక్షన్‌లో సుమారు రెండు లక్షలమంది ముస్లిం ప్రజలు ప్రాణాలు కోల్పొయారు.

అత్యాచారాలు, ఆస్తులు కొల్లగొట్టడం సరేసరి. మరి ఈ ఊచకోత గురించి కమ్యూనిస్టులు ఎందుకు మౌనం వహించారు? వారిని జవాబు చెప్పమని ఈనాడు మనం నిలదీయాలి. ఒకతరం చేసిన అన్యాయాలకు రెండవతరం వారు అన్యాయానికి గురైన వారికి క్షమాపణ చెప్పాలి. ఇంతే గాక ‘విశాలాంధ్రలో’ ముస్లిం ప్రజలకు ఎన్ని రకాలుగా నష్టం జరిగిందో తెలియచెప్పాలి. ఈ ప్రయత్నాల వలన కనీసం చదుకున్న మధ్యతరగతి మేధావి వర్గానికి చెందిన ముస్లింలను మనం మన ఉద్యమం వైపు ఆకర్షితుల్ని చేయవచ్చు. లేకపోతే వారు శత్రుశిబిరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సాహిత్యంలో నోబుల్‌ బహుమతి గ్రహీత ఒర్హాన్‌ పాముఖ్‌ మొదటి ప్రపంచ యుద్దం కాలంలో టర్కీలో ‘కుర్దు’ ప్రజలపై ఆ ప్రభుత్వం జరిపిన ఊచకోతను ప్రపంచానికి తన నవలల ద్వారా తెలియచేసిన ఈ వర్తమాన సందర్భంలో మనం 1948 పోలీస్‌ యాక్షన్‌లో అమాయక ముస్లిం ప్రజలపై సైన్యం చేసిన మారణకాండను లోకానికి వెల్లడి చేయలేమా?

నదీ జలాలు, నీళ్ల దోపిడి (వాటర్‌ పాలిటిక్స్‌) సరేసరి. హైదరాబాద్‌ను ఇతివృత్తంగా తీసుకొంటే, ‘భూమి’ సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తుంది. దీనికి పరాకాష్ట ఔటర్‌ రింగురోడ్డుల వ్యవహారం. దానికి మూలాలు ఎక్కడున్నాయి? రామోజీ ఫిల్మ్‌ సిటీ, రామానాయుడి స్టూడియోలు, జయభేరిలు, రాజుల ఇలాఖాల నడుమ హైదరాబాద్‌ దక్కన్‌ ఎట్ల ‘కాట్‌’ ఐపోయింది? ఆనాటి అత్రాఫ్‌ బల్దా (సబ్‌ అర్బన్‌ సిటీ లేదా ఈనాటి రంగారెడ్డి జిల్లా) లో ఉన్న సర్ఫేఖాస్‌ భూములు (నిజాం నవాబు స్వంత ఆస్తులు, భూములు) నామొనిషాన్‌ లేకుండ ఎట్ల గాయబ్‌ అయినాయో ఈనాటి తెలంగాణ చరిత్రకారులు కవిలె కట్టలు, దస్త్రాలు దులిపి కితాబులు తెరిచి హిసాబ్‌లు కట్టాలె. మన భూమి నుండి మనం ఎట్లా బేదఖల్‌ అయినమొ ఈనాటి చరిత్రకారులే చెప్పాలె.

‘చరిత్రను పునర్లిఖించడం అంటే చరిత్ర నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొనడమే’ అని తెలంగాణ హిస్టరీ సొసైటీ గాఢంగా విశ్వసిస్తుంది.

[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com