మనవి
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
”తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాలలో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంధాలు, తటాకాలు, కోటలు, వీరగాధలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతే గాక ఏండ్ల తరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నాయి”. అంటూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు 1956లో ప్రచురించిన ‘తెలంగాణం’ వ్యాస సంపుటానికి ముందుమాటగా వట్టికోటి ఆళ్వారుస్వామి రాశారు.
అంత ఘనమైన చరిత్ర గల తెలంగాణ చరిత్ర ఆ తర్వాత యాభై సంవత్సరాలలో మరింతగా విస్మరణకు గురయింది. వివక్షకు బలి అయింది. వక్రీకరణకు వేదిక అయింది. అంతకు ముందరి శతాబ్దాల చరిత్రలో తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు సాధించిన అసాధారణ విజయాలన్నీ, నిర్మించిన వైభవోపేత చరిత్రంతా ఎక్కడా నమోదు కాని స్థితి వచ్చింది. నమోదయిన చోట అరకొరగా నమోదయింది. మేధోపూర్వకమైన వివరణ, చర్చ, విశ్లేషణ జరగకుండా పోయింది. ఇక 1956 తర్వాత గడిచిన యాభై సంవత్సరాలలోనయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పేరిట విద్యార్థులకూ, సమాజానికీ అందిన చరిత్రలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా దక్కనేలేదు. ఈ వివక్ష కారణంగా చరిత్ర రచనకు అత్యవసరమైన వనరుల, చారిత్రకాధారాల పరిరక్షణ కూడ పెద్ద సమస్యగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరిగిన వివక్ష గురించి చర్చ జరుగుతున్నది గాని చరిత్ర రచనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించేపని ఇంకా పూర్తిగా జరగడం లేదు.
ఈ అవగాహనతో, తెలంగాణ చరిత్రను తవ్వితీసి, పరిశోధించి, వెలుగులోకి తేవాలనే లక్ష్యంతో తెలంగాణ హిస్టరీ సొసైటీ ఏర్పరచాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాలలో భాగంగా 2006 జూన్ 4న హైదరాబాదులోని ఫతేమైదాన్ క్లబ్బులో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి నలభై మందికి పైగా చరిత్ర పరిశోధకులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, తెలంగాణ అభిమానులు హాజరయి, అక్కడి చర్చలను విజయవంతం చేశారు. సమావేశంలో పాల్గొన్న వక్తల ప్రసంగవ్యాసాలను ఇక్కడ సంకలనం చేస్తున్నాం. ఆ సమావేశంలో పాల్గొని విలువైన ప్రసంగాలు చేసిన ప్రొ|| కె.మధుసూదన్‌రెడ్డి, ప్రొ|| పి.హరనాథ్‌గార్ల పత్రాలు అందని కారణంగా ఇక్కడ ప్రచురించలేక పోతున్నాం. ఇతర వక్తల పత్రాలను యధాతథంగా ప్రచురిస్తున్నాం. పత్రాల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో సొసైటీకి ఏకీభావం ఉండనవసరం లేదు.
సొసైటీ ఏర్పాటు ప్రయత్నాలలో, ఈ పుస్తక ప్రచురణలో సహకరించిన మిత్రులందరికి కృతజ్ఞతలు. సొసైటీకి లోగో, ఈ పుస్తకానికి ముఖపత్ర రచన చేసిన దేవులపల్లి హనుమంతరావుగారికి, ఈ పుస్తక ప్రచురణకు తోడ్పడిన ‘శ్రేయోభిలాషి’కి ప్రత్యేక కృతజ్ఞతలు.
- తెలంగాణ హిస్టరీ సొసైటీ
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘ PDF ‘ ]





