మరుగున పడేసిన చరిత్ర మర్మం చెబుదాం!
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- సంగిశెట్టి శ్రీనివాస్
మన ఘన చరిత్రకు మసిబూసి, మరుగున పడేసి మీరు చరిత్ర హీనులు, కాదు కూడదంటే హీనచరిత్రులు అని ఎక్కిరించిన రాతలకు సోయి తెచ్చుకున్న తెలంగాణ మూతోడ్ జవాబ్ ఇచ్చేందుకు కలాన్ని గళాన్ని కదను తొక్కిస్తోంది. ఎన్కటి సంది ఈ సాలు అట్లనే వస్తుంది. గోలకొండ పత్రికల ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని విమర్శిస్తూ వ్యాసం రాసిండు. దీంతోటి కడుపు మసిలిన సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, శేషాద్రి రమణ కవులతో కలిసి 350కి పైగా తెలంగాణ కవులతోటి ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రచురించి అందరి నోర్లు మూయించిండు. ఇట్ల ఆంధ్రప్రదేశ్ పీడ మనమీద పడకముందు తెలంగాణ నుంచి వచ్చిన పుస్తకాల్లో నికార్సయిన చరిత్ర రికార్డయింది. సరోజిని రేగాని, సజన్‌లాల్ లాంటి చరిత్రకారులు పూనుకొని హైదరాబాద్ ఫ్రీడమ్ స్ట్రగుల్ పుస్తకాన్ని నాలుగు భాగాల్లో రికార్డు చేసిండ్రు. అప్పట్నించి ఇప్పటిదాకా ఇక్కడి చరిత్రను ఇడమర్సి చెప్పిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ పీడ మనకు సుట్టుకున్నప్పట్నించి తెలంగాణ చరిత్రకు, వైభవానికి గ్రహణం పట్టింది.
”ఒక్కొక్క కవిని 10-15 శతాబ్దముల మధ్య వెనుకకు ముందుకు లాగి బీభత్సము చేసినారు. వాడు మా ప్రాంతము వాడే యనియు, మావాడే యనియు ముప్పుతిప్పలు పడి గోవలు గోవలువడ వ్రాసి అచ్చుకొట్టి పెట్టినారు. పాపము ఓరుగల్లు పోతన్నను లాగుకొని పోయి కడప మండలములో స్థాపించినారు. మహబూబునగరు అప్పకవిని గోదావరిలో వేయుదమా కృష్ణలో ముంచుదమా, లేక గుంటూరులో నిశ్చయము చేయుదమా, అని తగవులాడినారు. బిక్కనవోలు (దోమకొండ) సంస్థానము కవియగు మల్లారెడ్డిని లాగుకొనిపోయి గోదావరిలో పడవేసినారు” అని గోలకొండ కవుల సంచిక సంపాదకీయంలో తెలంగాణకు ఆంధ్రులు చేస్తున్న అన్యాయాన్ని సురవరం ప్రతాపరెడ్డి లెక్కగట్టి చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం వహించిన కొమర్రాజు లక్ష్మణరావు పిఠాపురములో 1922లో జరిగిన ఆంధ్రపరిశోధక మండలి పంచమ వార్షిక సభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ ” ఆంధ్రదేశము గుఱించియు, నాంధ్రరాజుల గుఱించియు, నాంధ్ర వాఙ్మయము గుఱించియు నెక్కుడు పరిశోధనలు చేసి క్రొత్త క్రొత్త వింతలను కనుగొనదలచిన వారికి హైద్రాబాదు రాజ్య మందలి తెలుగు భాగమొక బంగారము వంటిది. బ్రిటిషు ప్రభుత్వమందలి తెలుగుదేశమును, నైజాములోని తెలుగుదేశమును ఒకటికి నొకటి తగిలి యున్నను ప్రభుత్వములు భిన్నములగుటచే నుత్తర సర్కారులోని తెలుగువారికి హైద్రాబాదు రాజ్య మందలి తెలుగుదేశమొక యండమాను దీవివలె దోచుచున్నది. కాని నైజాము రాజ్యమందలి మన బాంధవులను గుఱించి మనమింత భయపడవలసిన పనియు లేదు. ఇంత యౌదాసీన్యముగా నుండుటయు న్యాయము కాదు” అని పేర్కొన్నాడు. 84 ఏండ్ల తర్వాత కూడా నేటికీ ఆ మాటలకు అంతే రిలవెన్స్ ఉంది. దీంతోటి ఆంధ్రులు తెలంగాణ చరిత్ర పట్ల అంతే ఉదాసీనత, అణచివేత వైఖరి నేటికి కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఉస్మానియాతో సహా ఆంధ్రదేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగినా (ముఖ్యంగా తెలుగు విభాగాల్లో) తెలంగాణకు సంబంధించిన అంశాలు, ఉప’సంహరణ’కు గురికావడమో కాదంటే ఉప శీర్షికలోనో, అనుబంధంలోనో చోటు చేసుకోవడం పరిపాటయింది. అలవాటుగా మారింది. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. 1927లో రాయప్రోలు సుబ్బారావుతో ప్రారంభమయిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో ఆ తర్వాతి యాభై ఏండ్ల వరకు ఒక్క తెలంగాణ వాడు కూడా హెడాఫ్ ది డిపార్ట్‌మెంట్ కాలేక పోయాడు. పరిశోధన అంశాలు కూడా తెలంగాణకు సంబంధంలేని అంశాలపైనే ఎక్కువగా జరిగాయి. ఆంధ్రప్రాంతంలో పరిశోధకులు తమ ప్రాంతానికి సంబంధించిన అంశాలపై పరిశోధన కొనసాగించగా తెలంగాణలో అలా జరగలేదు. దీనికి ‘గైడ్స్’ సూచనలు కూడా కారణం. అలాగే మౌలికమైన సమాచార లభ్యత కూడా ఆంధ్రప్రాంతం వారిపైనే అధికం కావడంతో వారిపైనే పరిశోధనలు జరిగాయి. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రాంత కవులు, అంశాలపై పరిశోధనలు చేశారు. తెలంగాణ విషయానికి వస్తే ఈ ప్రాంత కవుల రచనలు అందుబాటులో లేకపోవడం. గ్రంథాలయాల్లో అలభ్యం, ఆర్గనైజ్డ్‌గా లేకపోవడం కూడా ఒక కారణం. ఇక్కడి గ్రంథాలయాల్లో తిష్టవేసిన ఆంధ్ర ప్రాంతీయులకు స్థానికుల గురించి తెలియకపోవడం, తెలుసుకోవాలని ప్రయత్నం చేయకపోవడం మరో కారణం.
కాకతీయ యూనివర్సిటీ పూర్తిగా తెలంగాణ విశ్వవిద్యాలయమైనప్పటికీ విశ్వనాథ, కొడవటిగంటి వారి వాఙ్మయ సూచికలు, అలాగే వేటూరి వాఙ్మయసూచి ప్రచురించారు. కాని సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి సాహితీవేత్తల వాఙ్మయసూచీలు ఇప్పటికీ తయారు కాలేదు. అలాగే ఆంధ్రప్రాంత రచయితలు తమకు తెలియకపోవడమంటే ‘లేదు’ అని దానికింద నిర్ధారించి చరిత్రను అణచివేయడమనేది తరచూ జరుగుతోంది. వాళ్ళు చెప్పిందే పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకుంటుంది. వారి తెలియని తనాన్ని లేని తనంగా మార్చడం తెలంగాణ చరిత్రకు ద్రోహం చేయడమే తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబ (1226-1300) విషయంలో ఇదే జరిగింది. రంగనాథరామాయణము రాసిన గోన బుద్ధారెడ్డి కూతురైన కుప్పాంబ మహబూబ్‌నగర్ జిల్లాలోని వర్ధమానపురము రాజధానిగా ఏలిన మల్యాల దండనాథుని భార్య. ఈయన కాకతీయ రుద్రమదేవి సేనాధిపతి. కుప్పాంబ రాసిన సాహిత్యం తెలంగాణ పరిశోధకుల పరిశ్రమల ఫలితంగా ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.
1990వ దశకంలో వచ్చిన తెలంగాణ సోయితోటి చరిత్రను క్రమపద్దతిలో రికార్డ్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ పత్రికారంగంపై ఒక దశాబ్దపు పరిశోధనను ‘షబ్నవీస్’ పుస్తకంగా ‘కవిలె’ తరపున 2003లో తీసుకురావడం జరిగింది. ఇందుకోసం ఎంత ప్రయత్నించినా నీలగిరి, తెనుగు పత్రికలు కేవలం ఒక యేడాది సంచికలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అలాగే గోలకొండ పత్రికలు ఇప్పటికీ మైక్రోఫిల్మింగుకు నోచుకోక దుమ్ము, ధూళి కొట్టుకొని ఎవరికీ పట్టని బిడ్డలాగ తయారైంది. అయితే ఆంధ్రప్రాంతానికి చెందిన ఆంధ్ర, కృష్ణా పత్రికలు పూర్తిగా మైక్రోఫిల్మింగు చేయబడి అర్కయివ్స్, ప్రెస్‌అకాడెమీ లాంటి ప్రదేశాల్లో నిక్షిప్తం చేయబడ్డాయి. అవి అందుబాటులోకి రావడంతో వాటిలో ఉన్న విషయాలు, సంపాదకీయాలు, సాహిత్యంపై పరిశోధనలు బాగానే జరిగాయి. సుప్రసిద్ధ సాహితీవేత్త అడివిబాపిరాజు హైద్రాబాద్ నుంచి నాలుగేళ్ళు సంపాదకుడిగా ఉండి నడిపించిన ‘మీజాన్’ పత్రిక ప్రతులు ఇప్పుడు కేవలం స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో మాత్రమే కొన్ని ప్రతులు దొరుకుతున్నాయి. అవికూడా ఆలనా పాలనా లేకుండా పాడయిపోతున్నాయి. ఈ పత్రికల్లో ఆనాటి ఆంధ్రమహాసభ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం కొన్ని వేల పేజీలకు సరిపడా నిక్షిప్తమై ఉంది. అడివి బాపిరాజు హైద్రాబాద్‌లో పనిచేసిన పాపానికి గాను ఆయన్ని ఆంధ్రులు కూడా అంతగా పట్టించుకోలేదు. ఆయన రాసిన నాటకాలు, వ్యాసాలు, కథలు, పాట కథలు, గేయాలు, సేకరించిన జానపద గేయాలు ఇప్పటికీ వెలుగు చూడలేదు.
ఢిల్లీలోని సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్‌ట్రస్ట్, హైద్రాబాద్‌లోని తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయాలు ప్రచురించే జీవిత చరిత్రలు, సాహిత్య రచనల్లో ప్రస్తుతం తెలంగాణకు, వారి రచనలకు ఏ మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఇంత వరకు ఆళ్వారుస్వామి, ఆదిరాజు వీరభద్రరావు, దాశరథి, భాగ్యరెడ్డివర్మ, సంగెం లక్ష్మిబాయి, సదాలక్ష్మి, బద్దం ఎల్లారెడ్డి, అరిగె రామస్వామి, గడియారం రామకృష్ణశర్మ, కృష్ణస్వామి ముదిరాజ్ మొదలైన తెలంగాణ వైతాళికుల జీవిత చరిత్రలు ప్రచురితం కాలేదు. వారి గురించి దేశ వ్యాప్తంగా తెలవాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించిన వ్యాసరచనల సూచీ, రచయితల రచనలు పుస్తకాల్లో తెలంగాణ సమాచారం ఒక్క శాతానికి మించదు. ఇంత అన్యాయం సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. తెలంగాణ నుంచి రచనలు వెలువరించిన రచయితల గురించి ఇందులో వివరాలు లేకపోవడం విచారకరం. అలాగే తర్వాతి కాలంలో భారతి సూచి ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం అంతే ప్రామాణికంగా హైదరాబాద్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన సుజాత పత్రిక గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. తెలుగు అకాడెమీ వెలువరించిన ‘తెలుగు సాహిత్యం కోశం’ కూడా తెలంగాణను విస్మరించింది. తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ ‘తెలుగు వెలుగులు’లో తెలంగాణ వాటా దిగదుడుపే. ఇంత అన్యాయం జరుగుతున్నా నిలదీయడం ఎక్కడా జరగడం లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ హిస్టరీ సొసైటీ నిర్మాణం తక్షణావసరమయింది. తెలంగాణ తన చరిత్రను తానే పునర్మూల్యంకనం చేసుకొని అట్టడుగు వర్గాలనుంచి సమాజ చరిత్రను, సాహిత్య, సాంస్కృతిక చరిత్రను తిరగరాసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. మన చారిత్రక వారసత్వ కట్టడాలు కనుమరుగుకాకుండా కాపాడుకునేందుకు ఉద్యమాలు నడిపేందుకు సన్నద్ధం కావాలి. ప్రాంతేతరులు పక్షపాతంతో రచించిన అసత్యాలను, అర్ధసత్యాలను వెలికితీసి అసలైన చరిత్రకు చిత్రిక గట్టాలి. తెలంగాణకు సంబంధించి ఎక్కడ ఏ పరిశోధన జరిగిన అది అందరికీ అందుబాటులోకి వచ్చేలా, అందుకు తగిన ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టాలి. అనాది నుంచి ఇప్పటివరకూ తెలంగాణ చరిత్రలో ప్రముఖమైన తేదీలను ప్రకటించి ఆ యా తేదీల్లో వాటి ప్రాధాన్యతకు తగ్గట్టుగా ఉత్సవాలు, వర్ధంతులు, జయంతులు, స్మరణలు, నిర్వహించి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. తెలంగాణ వ్యక్తులకు సంబంధించిన జీవిత కోశాన్ని ఒక నిరంతర ప్రాజెక్టుగా చేపట్టి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సహాయ సహకారాలతో దాన్ని విజయవంతం చేయాలి. ఆనాది నుంచి తెలంగాణలో విస్మృతికి గురైన విశిష్ఠ వ్యక్తుల్ని గుర్తించి జీవిత చరిత్రల ప్రచురణ సంక్షిప్తంగానైనా నిరంతరం కొనసాగించాల్సిన అవసరముంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ యేడాది మరణించిన వ్యక్తుల్ని ఈ కోశానికి జత పరుస్తూ సరైన సూచికను విడుదల చేసినట్లయితే జయంతులు, వర్ధంతులు నిర్వహించుకోడానికే గాకుండా వారి ప్రతిభను భావి తరాల వారికి అందజేసిన వారమవుతాము. తెలంగాణ పత్రికల వ్యాసరచనల సూచీలు, రచయితల రచనలు, తెలంగాణ సాహితీ కోశం, ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టేందుకు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీలపై వత్తిడి తీసుకు రావాల్సిన అవసరముంది.
సాహిత్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక చరిత్రలో మరుగునపడేసిన మన ఘన చరిత్రను తవ్వి తట్టలకెత్తుకోవాలి. అందులో దొరికిన మణులు, వజ్రాలను తెలియని వారికందరికీ తెలియ జెప్పాలి. ఈ పని ఎంత తొందరగా చేసినట్లయితే తెలంగాణకు అంత మేలు చేసినవారమవుతాము. తెలంగాణ చరిత్ర పట్ల ఆసక్తిని, అవగాహనను కల్పించేందుకు ‘చారిత్రక స్థలాల పర్యటనలు’ ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మగౌరవ పోరాటంలోంచి వచ్చిన అస్తిత్వ ఉద్యమాలకు చరిత్ర దారి చూపిస్తుంది. గర్వంగా చెప్పుకోదగ్గ గతం మనకుంది. ఆ గతం ‘స్వగతం’ కాకుండా గళమెత్తి అందరితో పంచుకోవాలి. ఆంధ్రులు ప్రయత్న పూర్వకంగా మరిచిన మన చరిత్ర మర్మాన్ని విప్పి చెబుదాం. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నిద్దాం.
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]





