Feed on
Posts
Comments

- డా. మలయశ్రీ

ఒక జాతి జన జీవన విశ్లేషణ - వివరణ చరిత్ర, అది దేశచరిత్ర, ప్రాంతీయ చరిత్ర ఏదెనా కావచ్చు. చరిత్రలో రాజకీయాల కథనం ప్రధాన భాగమైనా, అదే సమగ్ర సంపూర్ణ రచన కాదు. పాలకుల వివరాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రజల జీవన సంస్కృతుల వివరణకు కూడ ఇవ్వాలె. అది న్యాయం.

భారతదేశంల ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం. ఇది ఉత్తర దక్షిణ భారతదేశ - ఆర్య ద్రవిడ నాగరికతల సంగమ స్థానం. ఈ రాష్ట్రంలో ఉత్తరంగా ఉన్న పదిజిల్లాల మన తెలంగాణదే ఓ విశిష్ట స్థానం.

తెలుగు మాట్లాడే మనం అందరం తెలుగువాళ్లం - ఆంధ్రులమే అయినా రాజకీయ కారణాల వల్ల కొంత ప్రాంతీయ బేదం చోటుచేసుకుంది. పూర్వం నుంచి ఈ ప్రాంతం అనేక భాగాలుగా రాష్ట్ర - రాష్ట్రేతర వివిధ రాజుల పాలన కింద ఉంది. శాతవాహనుల కాలాన్ని వదలితే ఒక ఒరుగల్లు కాకతీయ చక్రవర్తుల కాలంలనే తెలుగునేల అంత ఒకే పాలనల ఉంది.

ఇటీవల ఓ రెండు వందలేండ్ల పూర్వం నైజాం ముస్లిం పాలకుల రాజకీయ కారణాల వల్ల ఆంగ్లేయులకు ధారాదత్తం చేసినందువల్ల కోస్తాంధ్ర మద్రాసు / తమిళనాడు రాష్ట్రంతోటి కల్సి ఉంటే, తెలంగాణ ప్రాంతం మరికొన్ని కర్ణాటక మహారాష్ట్ర జిల్లాల్తోని కలిసి నైజాం పేర, హైదరాబాద్‌ నిజాం పాదుషాల ముస్లిం పాలనల ఉంది. కోస్తాకు ఆంగ్లేయుల పాలన, అందుచేత ఆంధ్ర - తెలంగాణ ప్రాంతాలమధ్య భాషా సాహిత్యాల - కళా సంస్కృతుల, విద్యా ఉద్యోగాది రంగాల ఎంతో భేదం వచ్చింది.

15 అగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడే తమిళ ప్రాంతంతో పాటుగా కోస్తాంధ్ర స్వతంత్రం పొందింది. అప్పుడు తెలంగాణల రజాకార్ల అల్లరులు, దౌర్జన్యాలు, స్థానిక తెలుగు పౌరుల ప్రతిఘటన భీకర పోరాటాల తర్వాత, మరో ఏడాదికి, కేంద్ర ప్రభుత్వ సైనిక చర్యవల్ల 17 సెప్టెంబర్‌ 1948 నాడు నైజాం నుంచి - తెలంగాణకు విముక్తి లభించింది. ఆంధ్ర ప్రాంతం వారికి ఇక్కడి వారి అప్పటి బాధలు తెలియవు.

కోస్తాంధ్ర తమ ప్రత్యేక అస్తిత్వం - గుర్తింపు కోసం మద్రాసు నుంచి విడివడి, రాయలసీమతో కల్సి, కర్నూలు రాజధానిగా 1 అక్టోబర్‌ 1953న ‘ఆంధ్రరాష్ట్రం’గా ఏర్పాటయ్యింది. అప్పటిది శ్రీబాగు ఒప్పందం. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహారదీక్ష అప్పటిదే. దానికి తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు.

1 నవంబర్‌ 1956 న ‘ఆంధ్రరాష్ట్రం’ (కోస్తా రాయలసీమ) హైదరాబాద్‌ స్టేట్‌లోని ‘తెలంగాణ’తో కల్సి (అప్పటి ఎనిమిది జిల్లాలు ఇప్పుడు పది) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. ఇక్కడిది పెద్ద మనుషుల ఒప్పందం, అయితే రాజకీయ సామాజిక ఆధిపత్యం, అణచివేత, దోపిడి - కారణాల వల్ల రెండు మూడు సార్లు (1956, 69…) ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు నడిచినై. ఇప్పటి టిఆర్‌ఎస్‌ పోరాటం వేర్పాటు కోరికతోనే కదా. ప్రత్యేక తెలంగాణ వాదం రగులుతున్న కుంపటి. విడిపోవుడు తప్పకపోవచ్చు.

ఆంధ్రుల అతిచతురతవల్ల తెలంగాణ అన్ని రంగాల్ల దగా పాలయింది. అది నిజమని అంకెల వారిగా చూపవచ్చు. మనం మన ప్రత్యేక అస్తిత్వం నిలుపుకోవలె.

ఆంధ్రుల ఆధిక్యత ప్రదర్శన తెలంగాణ ప్రాంతంపైన ఉపేక్ష, చరిత్ర రచన విషయంల కూడ జరిగింది. అది ఎవరివల్ల, ఎందుకు, ఎట్లా? అనే వివరాలకు పోను. ఏం తప్పులు జరిగినై, అవి ఎట్లా సరిదిద్దుకోవాలె, అనే విషయాలనే కొన్ని వివరాలు చూపుతున్న, తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ విషయంగా కొన్ని సూచనలను అందిస్తున్న.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర రచయితలు తెలంగాణకు తగిన విలువ ఇవ్వలేదు. నాటి ముస్లింలు నేటి ఆంధ్రులు అంతే. అది నిజం. అది ఈ కింది మూడు విధాల సాగింది.
1. తెలంగాణ విషయాల విస్మరణ - ఉపేక్ష లేదా వదలివేత.
2. సంగ్రహ ప్రస్తావన
3. వక్రీకరణ

అందుకు ఎన్నో ఉదహరణాలు చూపవచ్చు. మచ్చుకు కొన్ని అంశాలను మాత్రమే చూపుతున్న, చదవండి.

1. రాతియుగ ఆది మానవ నివాస స్థావరాలు కోస్తాకంటే మన తెలంగాణలనే ఎక్కువ. లోహయుగ ప్రారంభకాల బృహచ్ఛిలా సమాధులు (కైరనులు) కూడ ఈ ప్రాంతంలనే ఎక్కువ. అయినా మన ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర రచయితలు వీటిని పట్టించుకోరు.

పురాణాల కాలపు షోడశ మహాజనపదాల లోని ‘అశ్మక’ రాజధాని పోతన / పోతలి నగరం. అది మన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. అయితే అశ్మక ఒరిస్సా గంజాం జిల్లా ప్రాంతం అన్న రచయితలూ ఉన్నారు.

కంద పద్యం పుట్టుక కరీంనగర్‌ జిల్లా కురిక్యాల శాసనంల క్రీ.శ. 946 పంపకవి సోదరుడు కవితాగుణార్ణవుడైన జినవల్లభుడు శాసన కవి. ఈ శాసనం తెలిసినా ఎవరూ ఆ విషయం చెప్పలేదు. నా ‘కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ లోనే మొదలు పేర్కొన్నది.

విశాలాంధ్ర ప్రచురించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దర్శిని’ 1998 ప్రచురణ గ్రంథం, బాల సాహిత్య వ్యాస రచయిత ఏ ఒక్క తెలంగాణ రచయితనూ పేర్కొనలేదు. ఇట్లాంటివెన్నో -

2. రాసిన చారిత్రకాంశాలపైనా వివరంగా రాయరు. క్లుప్తంగా ముగిస్తరు. తెలుగు విశ్వవిద్యాలయంవారు ప్రచురించిన ‘విజ్ఞాన సర్వస్వం’ సం.2 లో - చరికొండ ధర్మన కవి, శ్రీ కృష్ణదేవరాయల కాలాన, గజపతుల సామంత ప్రభువు, సిత్తాప్‌ఖాన్‌ / సీతాపతి (ఖమ్మం - ఓరుగల్లు) ఆశ్రితుడని ఉంది. నిజానికి సీతాపతికి సామంతుడు కరీంనగర్‌ జిల్లా ధర్మపురి ప్రభువు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు. ఈయన ఆస్థాన కవిగా చరికొండ ధర్మన రాసిన ‘చిత్రభారతం’ కావ్యస్థ సాక్ష్యం. ఆ వివరాలు వారికి పట్టవు.

18వ శతాబ్ధి ధంసా గురించి రాస్తూ జగిత్యాల, నిర్మల, కోస్తా ప్రాంతాలను పేర్కొని, అతడు ప్రధానంగా ఏలుబడి కావించిన ఎలగంద కోట ప్రస్తావన లేదు. అతడు హైదరాబాద్‌ ఆసఫ్జాహీ రాజోద్యోగి.

3. చరిత్ర వక్రీకరణలు సైతం అనేకం

అ) మంజీరదేశం - తెలంగాణ గోదావరి నదికి మంజీర ఉపనది. మెదకు జిల్లా మంజీరా దేశం కావలె. కృష్ణా ముఖద్వార ప్రాంతం మంజీరికా దేశమని వారల వివరణ.

ఆ) బావరి ముని నివాస స్థానం - అశ్మక నిజామాబాద్‌ కరీంనగర్‌ జిల్లా ప్రాంతం. తన 16 గురు శిష్యులను బుద్ధుని వద్దకు పంపిన బావరి అశ్మక గోదావరి తీరవాసి అని బౌద్ధ సుత్తనిపాత పారాయణ పగ్గ పేర్కొంది. అది గోదావరి ద్వీప ‘బాదనకుర్తి’ గ్రామమని నేను (మలయశ్రీ), ఠాకూర్‌ రాజారాంసింగు గారు గుర్తించినం. కోస్తా రచయితలు ఇంకా ఈ సత్యాన్ని గమనించక తమ పాత ఊహలనే రాస్తున్నారు.

ఇ) కరీంనగర్‌ కోటి లింగాల శాతవాహనులకు పూర్వాంధ్ర చక్రవర్తుల రాజధాని అని పురాచరిత్ర పరిశోధకుల నిర్ణయం. కోస్తా చరిత్ర రచయితలకు ఆంధ్రులే శాతవాహనులు. శాతవాహనులు ఆంధ్రులు కారు. వారు ఆంధ్ర భృత్యులు. ఆంధ్రరాజుల తర్వాత పాలనకు వచ్చిన వారు అనే సత్యం వారికి తెలిసేది ఎన్నటికో. శాతవాహనాంధ్ర చక్రవర్తులనేది పాత పురాణాల బాట.

ఈ) శాతవాహన తొలి చక్రవర్తి సిముఖుని రాజధాని కోటిలింగాల. అతడు జైనుడట. శాతవాహన రాజ్యం పుట్టుక తెలంగాణ అయితే (కోటిలింగాల, కొండాపురం) వారికి ఇంకా అమరావతి - ధాన్యకటకమేనట.

ఉ) జైన-బౌద్ధ నిర్మాణాలు వివరించే వ్యాసకర్తలు కూడ ఆంధ్రప్రాంత స్థలాలకు విలువిస్తున్నారు తప్ప తెలంగాణ క్షేత్రాలను పేర్కొనరు. ఇవి వారికి తెలువవు. తెలుసుకోరు. మాది గొప్ప మీది తుప్ప అనే భావన.

ఊ) భాగవత కవి బమ్మెర పోతనది వరంగల్లు జిల్లా పాలకుర్తి - గూడూరు చారిత్రక గ్రామాల నడుమ ఉన్న నేటి బొమ్మెర వాసి. అయితే అతనిది కడప జిల్లా ఒంటిమిట్ట అని వితండవాదన. ఏకశిలానగరం - ఓరుగల్లు ఒంటిమిట్ట ఎట్లయితదో తెలువదు. ఒంటిమిట్ట రఘువీరుని గొల్చెద అని పోతన అన్నది మడికొండ మెట్టురామప్పను గురించి అని నా అభిప్రాయం.

ఎ) ఇక్కడ స్థానిక వీరులైన రాణి శంకరమ్మ, బల్మూరి కొండల రాయుడు, సర్వాయిపాపడు, జగన్నాథ ధర్మారావు, కొమరం భీం మొదలగు వారి గాధలు వారికి పట్టవు.

ఇంకా వివరాలకు పోతే తెలుగు సాహిత్యంల మొట్టమొదటి స్వతంత్ర కావ్యం, శతకం, రామాయణం, సంకలన గ్రంధం, యక్షగానం, అచ్చ తెలుగు ప్రబంధం తెలంగాణల పుట్టినవి. తొలి చారిత్రక గేయం కాకతి రెండవ ప్రోలుని మంథని యుద్ధ విజయం పాట ‘ఆగుండీ గుండు…’. ప్రముఖ జానపద అద్భుత గాధలు సత్యవతి పాముపాట (ధర్మపురి), బాలనాగమ్మ, మాయలఫకీరు కథ (పానుగల్లు) ఇక్కడివి.

సంస్కృతిపరంగా చూస్తే తెలంగాణ ప్రజలు శ్రమజీవులు, నిష్కపటులు, ప్రేమ స్వరూపులు. ఎంతటి అమాయకులో అంతటి వీరులు. ఇక్కడి బతుకమ్మ పండుగ, బోనాలు, కాముని పున్నమి జాజిరి పాటలు, వన భోజనాలు ఈ ప్రాంతానికే పరిమితం. ఇది మన ప్రత్యేకత. తెలంగాణ స్త్రీల - పురుషుల గోచీకట్టు వస్త్రాలది (చీరే - ధోతి) ఓ వింత సోయగం. అందం హుందాతనం కలబోత. ఈ వస్త్రధారణ ఉత్తర దక్షిణ భారతదేశ సంగమ స్థానం.

భాష : తెలంగాణ భాష తెలుగు క్రమ పరిణామ స్వరూపం. కోస్తాంధ్ర అనవసర దీర్ఘాలు, యాసలు ఇక్కటి మాటల్ల లెవ్వు. ఇది అందమైన అర్ధవంతమైన అచ్చ తెలుగు పలుకుబడి. అయినా పాలకులు, ప్రభుత్వాధికారులు, పత్రికలు, ప్రచురణకర్తలు అక్కడివారై ఇక్కడి రచయితలకు - భాషకు తగిన గుర్తింపు లేదు. విధిగా కోస్తా భాషకు మారవలసి వస్తున్నది. మన భాషను కాపాడుకోవాలె. ఇక్కడి ఎన్నో వాడుక తెలుగు పదాలు నిఘంటువుల్ల లేవంటే అది వాటి కూర్పరుల నేరం. వాళ్లు కోస్తా వాళ్లు. ఇప్పుడు మన తెలంగాణ చరిత్ర మన మాండలిక భాషలనే రాయాలె. మాండలికం అంటే గ్రామ్యం కాదని గుర్తుంచుకోవాలె. ఒక ప్రాంత విద్యావంతుల వ్యవహార భాష ఆ ప్రాంత మాండలికం.

మరొక ముఖ్యాంశం - మనవాళ్లకు కొందరికి కులమత ప్రాంత సంకుచిత దృక్పథం, దురభిమానం జాస్తి. మనం వాటి నుంచి బయట పడాలె. మనది కులాల మతాల చరిత్రకాదు. ఇది జన జీవన చరిత్ర, సత్య విషయ సంగ్రహం. ఇది ప్రగల్భాలకు స్పర్ధకుకాక ఈ ప్రాంత నిజ స్వరూప ప్రదర్శనకు కావిస్తున్న పరిశోధనాత్మక రచన అని మనం గుర్తుంచుకోవలె. ధైర్యంగా ముందుకు సాగుదాం. విజయం తప్పక సాధించుతం.

చివరి మాట - మొన్నటి (4 జూన్‌ 2006) హైదరాబాద్‌ ఫతేమైదాన్‌ క్లబ్‌లో జరిగిన తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ చర్చా సమావేశంల చక్కని చరిత్రావగాహన కలిగిన పెద్దలు, యువకుల ప్రసంగాలు విని చాలా ఆనందించిన. వారి తోడ్పాటుతోని మన ప్రాంత చరిత్ర మీరు రాయవచ్చు, ఆరంభశూరులు, ప్రగల్భాల దగాకోరులు మీకు కొందరు తారసపడవచ్చు. గుణమెరిగి గుర్తించి వారిని దూరముంచండి. కొందరు చేయరు చేయనివ్వరు. అటువంటి వారి మాటలు వినకండి. ఈ ‘తెలంగాణ చరిత్ర’ రచయితల బృందంల నేను చేరలేకున్నా మీకు అవసరమైన సలహాలను అందిస్తనని హామీ ఇస్తున్న.

మీ పూనికకు ఉదాత్త ఆశయానికి ఆత్మాభిమానానికి నా ధన్యవాదాలు. సెలవిప్పటికి, స్నేహమెప్పటికీ!

[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com