తెలంగాణ గురించి తెలియని నిజాలు
మే 19th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- జి. వెంకటరామారావు
తెలంగాణ ఖ్యాతిని తెలుసుకోలేని వారికి ఈ సంఘటన ద్వారా కనువిప్పు కలుగుతుంది.
1945 జనవరి 18వ తేదీన మద్రాసు నగరంలోని రసికరంజని హాల్‌లో ఆంధ్రారాష్ట్ర మహిళా జాతీయ విద్యామహాసభను శ్రీమతి సరోజినినాయుడు ప్రారంభించారు. శ్రీమతి పొణక్ నరసమ్మ (పొణక్ కనకమ్మ?) గారు అధ్యక్షత వహించారు. శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు స్వాగత వచనలు పలికారు. మహామహులైన రైట్ ఆనరబుల్ శ్రీనివాసశాస్త్రి, రాజాజీ, బులుసు సాంబమూర్తి, రెడ్డి, నాయుడు మొదలైనవారు పాల్గొన్న ఈ సభలో సరోజినినాయుడు మాట్లాడుతూ ఇలా అన్నారు.
”నేను మన దేశమునకు ఐతే మా ఇంటి ఆడపడుచుననీ, తెలంగాణకి వస్తే మా ఇంటి కోడలని అంటారు. కాని ఈ రెండు భాషలలోను చక్కగా మాట్లాడలేని శోచనీయస్థితిలో నేనున్నందుకు విచారిస్తున్నాను. కనుక నాకు ఇంగ్లీషులోనే మాట్లాడే దౌర్భాగ్యం ఏర్పడింది. నేను తెలంగాణ వాసిని. నిజమైన తెలంగాణ మాదే. మాది కూడా తెలంగాణ భాషనే. తెలంగాణ ప్రతిష్ట అపూర్వమైనది, అచట శిల్పములు, శాసనములు అసమానమైనవి. వరంగల్ శిథిలములు, శిల్పములు మానవుడు సాధించిన వాటిలో అత్యుత్తమమైనవి. చరిత్ర ప్రసిద్ధమైన ఈ శిల్పములు, సంప్రదాయములు భావి ఉత్తమ గతికి ఉత్తేజకరణములు. మా ప్రాంతమున చాలా మంది తెలుగువారు నివసించుచున్నారు. హైదరాబాద్‌లో ఆంధ్ర మహిళా సమాజము కూడా స్థాపించారు. మా మహిళా సమాజమునకు ప్రఖ్యాత అధ్యక్షరాండ్రలలో ఒకరైన శ్రీమతి రంగమ్మ ఓబుళ్‌రెడ్డి గారికి ఈ వార్శికోత్సవాలకు అధ్యక్షురాలిగా వరించి గౌరవించినారు. సమాజము వారి విద్యాభివృద్ధికి చక్కని కృషి చేస్తున్నారు. మా పూర్వుల ప్రతిభ మహిమోపేత మైనది, మా తెలంగాణ మహిళలు కూడ భారత దేశ మందలి ఏ ప్రాంతపు మహిళలకు ఆవంతయు తీసిపోరని చెబుతున్నాను.” తెలంగాణను సరోజినినాయుడు అంతటి గొప్ప వ్యక్తి కీర్తించినా మనమింకా వెనుకబడి ఉన్నామని అనుకోవడం అవివేకం. (ఈ వార్త ఆనాటి ఆంధ్రపత్రిక నుంచి).
‘ఇక్కడి తెలుగు వాళ్లు బయటి తెలుగు వాళ్లలోనే గాక, ఏ రాష్ట్ర ప్రజలలోను వెనుకబడిలేరు. ఒక విద్యా విషయంలో తప్ప. అనేక పాఠశాలలు, ఘనమైన విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలలెన్నో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలలో విద్యా ప్రచారం ఎక్కువ సాగలేదు. ఈ కొరతను తీర్చడానికే బూర్గుల ప్రభుత్వం చివరి రోజుల్లో ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, సిద్దీపేట ఇత్యాది ప్రాంతాలలో నూతన కళాశాలలను స్థాపించింది. వరంగల్ కాలేజిని 1953లో అప్ గ్రేడ్ కాలేజిగా మార్చారు. విద్యావిషయకంగా బూర్గుల గారి మంత్రి వర్గం సాధించిన ఘనతను తెలంగాణ వాసులు మరువలేరు.’
‘దాదాపు రెండు వందల సంవత్సరాల నవాబు పాలనలో ఉంటూ, మహారాష్ట్ర జిల్లాలతో స్నేహం చేసినప్పటికీ ఇది (తెలుగు) సిరిసంపదల్లో, జీవన గతిలో అచ్చముగా తెలుగు భూభాగముగానే మిగిలింది. తెలుగు ప్రాధాన్యతను తెలంగాణ ఎన్నడూ విస్మరించి ఎరుగదు. సంస్కృతిని, సభ్యతను, జీవితంలోని ప్రతికదలికలో కాపాడుకుంటు వచ్చింది. కాని బహుళ విద్యావ్యాప్తి జరుగని కారణంగా ఇక్కడి ప్రజలు బయటి తెలుగు వాళ్ల కన్న వెనుకబడి ఉన్నారు. ఐతే ఉద్యోగాల విషయంలో కొంత భయం ఏర్పడింది. విద్య తరువాత ఇక్కడి యువకుల్లో, విద్యార్థుల్లో దాగిన పెద్ద భయం నిరుద్యోగం. అసలు ఈ భయమే కొంత వరకు విశాలాంధ్రకు వ్యతిరేకంగా పనిచేసింది. ఆంధ్రలో చదువుకున్న వారు హెచ్చు. కనుక అన్ని ఉద్యోగాలు తమ చేతుల్లో నుండి జారిపోతాయనే ఆదుర్దా. ప్రస్తుతం ప్రతి శాఖలో బయటి వాళ్లే కనిపించడం ఇవన్ని కలిసి బలంగా విద్యార్థులనాకర్షించాయి. (గోలకొండ పత్రిక - 1955 నవంబర్ 4 నాటి సంపాదకీయం).
ఎన్టీరామారావు ప్రభుత్వం తెలంగాణలో పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దుచేసింది. దీన్ని వెనుకటి హైదరాబాదు ప్రభుత్వం 1950లోనే రద్దు చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆనాటి వివరాలు ‘సంస్థాన గ్రామాలు శిస్తులను వసూలు చేయడం, భూముల రికార్డులు ఉంచడం మొదలైన రెవెన్యూ పనులన్ని అనాది కాలంనుంచి వంశ పారపర్యంగా చేస్తువున్న పటేల్, పట్వారీలను (కరణం, మునసబు) శాశ్వతంగా తొలగించి వారి స్థానే పై కార్యాలను నెరవేర్చడానికి మోడల్ గ్రేడు హోదాలలో ఉద్యోగాలను నియమించాలని హైదరాబాద్ ప్రభుత్వం వారు 1950లోనే ఆలోచించారు. అందుకుగాను చిత్తు ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వం పరిశిలించినట్లు కూడ ప్రచారాలు జరిగాయి. ఈ ప్రణాళిక ప్రకారం 15 వేల రూపాయల శిస్తు వసూలయ్యే గ్రామాల్ని చేర్చి ఒక యూనిట్‌గా చేస్తారని, ఇటువంటి ప్రతి యూనిట్‌కు ఒక ఉద్యోగి, అతనికి సహాయకునిగా ఒక బంటు (సేత్ సింధీకి బదులుగా) ఏర్పాటు చేయగలుగుతారని తెలిసింది. ఈ ఏర్పాటు మూలంగా ఒక ఉద్యోగి ఆధీనంలోకి మూడు, నాలుగు గ్రామాలు కూడా వచ్చే అవకాశం ఉంది. భూ సంస్కరణల అమలు చేయడానికి పూనుకున్నట్లే, లోపభూయిష్టంగా ఉన్న గ్రామ పరిపాలనా విధానాన్ని కూడ సంస్కరించాలని ఆలోచిస్తున్నారు. ఈ విధానం అమలులోకి వచ్చి ఉండి ఉంటే హైదరాబాద్ సంస్థాన మందలి గ్రామ పరిపాలన విధానంలో అత్యంత అభివృద్ధి కరమైన అధ్యయనం కాగలదని చెప్పవచ్చు. అప్పుడు రెవెన్యు మంత్రిగా ఉన్నది బూర్గుల రామకృష్ణ రావే కదా.’ (తెలుగు స్వతంత్ర నుంచి). ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే దీని గురించి ఆలోచించడం మానేశారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్’ అనే సంస్థను స్థాపించింది. దాని యాజమాన్యం క్రింద నాలుగు బట్టల మిల్లులు, బోధన్ చక్కెర కర్మాగారం, సిర్పూరు కాగితం ఫ్యాక్టరీ, వజీర్ సుల్తాన్ సిగరెట్ ఫ్యాక్టరీ, రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆల్విన్, ప్రాగాటూల్స్, ఇంజనీరింగు సంస్థలు, హైదరాబాద్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వంటి పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. బ్రిటిష్ పెట్టుబడితో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యాన బొగ్గు పరిశ్రమ ప్రారంభించారు. తెలంగాణలో ఇనాముల రద్దు శాసనం 1954లో (బూర్గుల మంత్రివర్గంలో) వస్తే ఆంధ్రలో 1956లో వచ్చింది.
తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, ఇతర రాష్ట్రాలలోని నిర్వివాదమైన తెలుగు ప్రాంతాలు అంటే, మధ్యప్రదేశ్‌లోని చాందా, బస్తర్ ప్రాంతాలు, భద్రాచలంలోని కొంత ప్రాంతం కలిపి తెలంగాణ రాష్ట్రం నిర్మించాలని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫజల్ అలీ కమిషన్ కిచ్చిన నివేదికలో విజ్ఞప్తి చేసింది.
ఇప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా ప్రచారం ఉన్న గోదావరి లోయ ప్రాజెక్ట్ పథకం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రారంభమైంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లు జిల్లాల్లో ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరందించే పథకాలు వేసుకున్నారు. ఆనాటి ప్రణాళిక ప్రకారం ఈ ప్రాజెక్టు కింద విద్యుచ్ఛక్తి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. నదిపైన వివిద కాలువలపైన మొత్తం పది ప్రదేశాలలో హైడ్రో ఎలక్ట్రిక్ స్కీంలను ఏర్పాటుచేయవచ్చు. వాటన్నిటి ద్వారా ఒక లక్ష డెబ్భైఅయిదు వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి తయారవుతుంది. దగ్గరనే అధికంగా దొరుకు బొగ్గు ఆధారంగా రామగుండం వద్ద ఒక లక్ష యాబ్భై వేల కిలో వాట్ల థర్మల్ స్టేషన్లు మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల కిలో వాట్ల ఎలక్ట్రిసిటీని తయారుచేస్తుంది.
గోదావరి నదిలోయలో ఎక్కువగా ఉన్న సహజ సంపద అభివృద్ధి పరచడానికి రామగుండం చుట్టుపక్కల నున్న బొగ్గు, సిర్‌పూర్ పేపరు మొదలైన పరిశ్రమల ఆధారంగా ఇతర పరిశ్రమలు నెలకొల్పటానికి పథకాలు వేసుకున్నారు. రామగుండం వద్ద పెద్ద పారిశ్రామిక నగరాన్ని నిర్మించాలని ప్లానులో ఒక భాగం. ఇచ్చట సిమెంటు, ఆయిల్, వనస్పతి, సిరమిక్సు, టెక్స్‌టైల్స్, రేయాన్, కాల్షియం కార్బొరెట్, ఆల్కహాల్, ప్లాస్టిక్స్ మొదలైన పరిశ్రమలే గాక దగ్గరలో దక్షిణ బస్తరులో విస్తారంగా ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా నిర్మిచవచ్చునని అంచనా. ఈ ప్రాజెక్టకు సంబంధించిన డ్యాములు, కాలువలు, విద్యుచ్ఛక్తి నిర్మాణానికి మొత్తం అరవై ఐదు కోట్ల ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ఒక ప్రాజెక్టే కాదు, ఇలాగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి వినియోగించే పెద్ద డ్యాములను పెన్గంగ మీద, గోదావరి పై ఇచ్చంపల్లి వద్ద కట్టవచ్చునని హైదరాబాద్ పరిశోధనల వల్ల తేలింది.
తెలంగాణకు ఎక్కువగా ఉపయేగపడే కృష్ణ నది ప్రాజెక్ట్‌లు నందికొండ (నాగార్జునసాగర్) ముఖ్యమైనది. దీని పథకాలను 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తయారు చేసుకున్నాయి. తెలంగాణ వాటా కింద ఈ పథకం ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఎకరాలకు నీరు లభిస్తుందనే ఉద్దేశ్యం, పులిచింతల ప్రాజెక్టులపై ఆ రోజుల్లోనే హైదరాబాద్ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. వాటి వల్ల తెలంగాణ వైపు భూమి ఎక్కువ మునిగి పోతుందని హైదరాబాద్ ప్రభుత్వ వాదన. తెలంగాణ ప్రజలు ఆనాడే కోరినట్లు తెలుగు ప్రత్యేక రాష్ట్రం లభించి వుంటే వారి కోరికలు నెరవేరేయే. గతజల సేతు బంధనం.
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]





