- కె. శ్రీనివాస్
తెలంగాణ చరిత్రను నిర్మించడం కానీ, పునర్నిర్మించడం కానీ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి అత్యవసరం. తెలంగాణ చరిత్రలో శూన్యంగా ఉన్న భాగాలు చాలా ఉన్నాయి. అక్కడ చరిత్రను నిర్మించాలి. తెలంగాణ చరిత్రలో చాలా వక్రీకరణలు, తప్పుడు వ్యాఖ్యానాలు, పొరపాటు అన్వయాలు ఉన్నాయి. అక్కడ చరిత్రను పునర్నిర్మించాలి. బాధిత అస్తిత్వంగా కానీ, సామ్రాజ్యశక్తిగా కానీ, సాంస్కృతిక నిక్షేపంగా కానీ, విశిష్ట ప్రాంతంగా కానీ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గతం ఉన్నదని గుర్తించి, ఆ పరంపరతో వర్తమానాన్ని రాజకీయంగా, సృజనాత్మకంగా అన్వయించినప్పుడే తెలంగాణవాదం సమగ్రం అవుతుంది. నిజానికి మలిదఫా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పూర్తిగా వ్యక్తం కాకమునుపే, తెలంగాణ ఒక ప్రశ్నగా, ఒక శోధనగా చరిత్రసీమలను పరామర్శించసాగింది. ఆత్మగౌరవానికి అన్వయించడానికి ప్రయత్నించింది. ఉద్యమం బలపడుతున్న కొద్దీ – తెలంగాణ చరిత్ర నిర్మాణ పునర్నిర్మాణాల మీద ఆసక్తి, ఉత్సాహం, ఆత్రుత సహజంగానే పెరిగిపోతున్నాయి. తెలంగాణ మొత్తంగా తనను తాను గతంతో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే, తెలంగాణ చరిత్ర రచన కూడా గతంలో జరిగిన ప్రయత్నాలకు తనను కొనసాగింపుగా మలచుకోవలసిన అవసరం ఉన్నది. గతంలో జరిగిన చరిత్ర పరిశోదనల స్వభావానికీ, పరిధికి నేటి అవసరాలకు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, నాటి అనుభవాల నుంచి నేర్చుకోవలసినది చాలా ఉన్నది. పొందవలసిన ప్రేరణ కూడా ఎంతో ఉన్నది. ఆ పరంపర ఎక్కడ భగ్నమైనదో, దానిలో కొనసాగించవలసినది ఏ మాత్రమో కూడా నిర్ధారణ చేయవలసి ఉన్నది.
తెలంగాణలో తెలుగువారి ప్రజాహిత కార్యక్రమాలకు ప్రారంభమనదగిన శ్రీకృష్ణదేవ రాయాంధ్రభాషానిలయం స్థాపన (1901) వెనుక చారిత్రక దృష్టి, అభినివేశం ముఖ్యపాత్ర నిర్వహించాయి. రాబర్ట్ సోవెల్ రాసిన హంపీ విజయనగర మహాసామ్రాజ్యా ప్రత్యక్ష కథనాలు వైభవగతాన్ని ప్రేరణగా ముందుకు తేగా, భాషాసాహిత్య పోషకుడిగా చెప్పుకుంటున్న శ్రీకృష్ణదేవరాయల పేరిట హైదరాబాద్‌లో గ్రంథాలయ స్థాపన జరిగింది. బ్రిటిష్ వారి పాలనలో సంస్కరణలను, విద్యావ్యాప్తిని చవిచూస్తున్న కోస్తా, రాయలసీమ ఆంధ్రులు ఒకవైపు, నిజాముల పాలనలో మధ్యతరగతీ, విద్యావకాశాలూ లేని తెలంగాణ వారు మరొక వైపు – ఉండగా, అందరికీ కలిపి ఒక సాంస్కృతిక వికాస ఎజెండాను రూపొందించాలన్న ఆలోచన చేసింది కొమర్రాజు వెంకటలక్ష్మణరావు, మునగాల రాజానాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు. ఈ ముగ్గురే హైదరాబాద్‌లో కృష్ణదేవరాయభాషానిలయాన్ని, హనుమకొండలో రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయాన్ని స్థాపించినవారు కూడా. వీరు స్థాపించిన విజ్ఞాన చంద్రికమండలి తొలినాటి తెలుగువికాసానికి దోహదం చేసిన సంస్థ. ‘పద్యకావ్యములు, నాటకములు, భాషా విషయిక చర్చలు, వాజ్మయవిషయిక చర్చలు భాషాభివృద్ధికి అత్యంత యావశ్యకంబులైనను ఈ విషయిక గ్రంథములు మేము ప్రస్తుతము వ్రాయను, వ్రాయించను తలచుకొనలేదు. 1. దేశచరిత్ర 2. మహాపురుషుల జీవితములు 3. ప్రకృతి లేక భౌతిక శాస్త్రములు, రాజకీయ ఆర్థిక శాస్త్రములు ఇంగ్లిషులోని సర్వోపయోగ కరంబులైన గ్రంథముల యొక్క భాషాంతరీకరణములను మాత్రమే ప్రచురించదలచినారము’ అని విజ్ఞానచంద్రిక తన ఎల్లలను నిర్దేశించుకున్నది. ఒక వికాసోద్యమానికి వచనం, అందులోనూ పరిజ్ఞానాన్ని అందించే వచనం ఎంత అవశ్యకమో విజ్ఞానచంద్రిక గుర్తించింది. తెలంగాణలో తొలినాటి వాంగ్మయంలో కూడా ఈ అవగాహన ప్రతిబింబించింది. నేటి తెలంగాణ ఉద్యమంలో కవిత్వం వెల్లువగా రావడం, జ్ఞానసంబంధమైన వచనం అతి తక్కువగా రావడం ఈ సందర్భంగా గమనించదగ్గది.
తెలుగువారి చరిత్ర రచనాకృషిలో భాగంగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలంగాణ పై చూపిన ఆదరం అనన్యమైనది. తెలంగాణను చరిత్రకు గనిగా గుర్తించడంలో మాత్రమే కాదు, చరిత్రరచనలో జరుగుతున్న అన్యాయాన్ని గమనించడంలో కూడా ఆయన ఎంతో ముందున్నారు. తెలుగువారి తొలినివాస ప్రాంతం తెలంగాణాయేనని ఆయన ఒక నిర్ధారణ చేశారు. త్రిలింగాల నుంచి తెలుగు అన్న మాట పుట్టలేదని, తెలుగు నుంచే త్రిలింగ పదకల్పన జరిగిందని ఆయన రాశారు. ప్రతాపరుద్రుని ఆస్థానపండితుడు విద్యానాథుడు మొదటిసారి పేర్కొన్న త్రిలింగ దేశానికి మూలమైన మూడు శైవక్షేత్రాలు కాళేశ్వరం, శ్రీశైలం, దాక్షారామం అనీ, కాళహస్తి అందులో లేదని కూడా ఆయనే స్పష్టం చేశారు. కాళేశ్వరం బదులు కాళహస్తిని పేర్కొనేవారి దృష్టిలో ఉన్నది బ్రిటీషాంధ్ర రాజకీయపటమే తప్ప చారిత్రక దృష్టి కాదని ఆయనే పరోక్షంగా సూచించారు. తెలుగువారి చరిత్రకు సంబంధించిన అనేక కీలకాంశాలు, ఖాళీలు తెలంగాణ పరిశోధనతో పరిపూర్తి అవుతాయని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన సాహచర్యంతో తెలంగాణ పరిశోధకులు ఆదిరాజు వీరభద్రరావు తరువాతి కాలంలో ఎంతో విలువైన పరిశోధనాకృషి చేశారు.
శేషాద్రిరమణ కవులలో ఒకరైన దూపాటి వేంకటరమణాచార్యులు గుంటూరు మండలం నుంచి వచ్చినవారైనప్పటికీ, మనసావాచా తెలంగాణను జన్మభూమిగా స్వీకరించినవారు. ‘నైజాము రాష్ట్రప్రశంస’ పేరుతో ఆయన తెలంగాణ ప్రాంత ఘనకీర్తిని, వర్తమాన అవసరాలను ప్రస్తావిస్తూ రాసిన పద్య సంపుటి తెలంగాణ అస్తిత్వాని కీర్తించిన ఆదికావ్యం. తెలంగాణ ఆంధ్రోధ్యమానికి అనుబంధంగా పనిచేసిన ఆంధ్రపరిశోధక సంఘంలో, లక్ష్మణరాయ పరిశోధకమండలిలో ఆయన పాలుపంచుకున్నారు. ముఖ్యంగా, తెలంగాణ సాహిత్యచరిత్రకు సంబంధించిన వక్రీకరణలను సవరించడంలో వెంకటరమణాచార్యుల కృషి చెప్పుకోదగ్గది. ‘.. పరిశోధకుల బ్రిటిషు ఆంధ్రదేశమునందే తమ దృష్టి ప్రసరింపజేసి చరిత్ర గ్రంథము ముగించుటచే నిజాము రాష్ట్రమునందలి చరిత్రమింత వరకు దుర్భేద్యముగా నుండెననుటలో సాహసములేదు’ అని ఆనాడే కుండబద్దలు కొట్టిన సాహసి ఆయన.
‘ప్రతి దుర్గరూపంబు పటమందు జిత్రించి పరిశోధకులకెల్ల బంపవలయు
చిక్కిన కావ్యంబు చేజారనీయక ప్రత్యంతరబులేర్పర్చవలయు
శాసనశిలలెల్ల చదరమైపోకుండ వలయు ప్రయత్నముల్ సలుపవలయు
పరిశీలనార్ధమై పరతెంచుయువకుల యెడల నన్నిటను దోడ్పడగవలయు
శక్తికొలదిగ మాతృభాషా సపర్య
తెనుగు మానిసి చేసియే తీరవలయు
జిన్ని సుతులార? యంచు నాశీర్వదింప
రాదే మమ్ముల నైజాము రాష్ట్రమాత!’
(నైజాము రాష్ట్ర ప్రశంస) అని సందేశమివ్వడమే కాకుండా, స్వయంగా వందలాది అలభ్యగ్రంధాలను సంపాదించి, ఆముద్రిత గ్రంధాలను పరిష్కరించి తెలంగాణ సాహిత్యచరిత్రకు వనరులను సమకూర్చిపెట్టారు. శేషాద్రిరమణకవులు, వరంగల్లులో దేవులపల్లి వేంకటాచలపతిరావు, తూము వరదరాజులు వంటివారితో కలసి స్థాపించిన కాకతీయ గ్రంథమాల వేంకటరమణాచార్యుల పరిశోధనాఫలాలను అనేకం ప్రచురించింది. ఒక్కొక్క విడత వందలాది మైళ్ల దూరం, పదుల సంఖ్యలో గ్రామాలు, స్థలాలు సందర్శించి శాసనాలను, కావ్యప్రతులను ఆయన సంపాదించారు. గోదావరి మండలంలోని లేములవాడ తప్ప మరొక వేములవాడ, గుంటూరు వేదాద్రి తప్ప యాదగిరిగుట్ట తెలియని బ్రిటిష్ ఆంధ్రులకు తెలంగాణలోని వేములవాడను, యాదగిరిగుట్టను పరిచయం చేశారు. ఇది కేవలం ప్రవృత్తితోనో, అభిరుచితోనో మాత్రమే చేసిన కృషికాదు. తెలంగాణ విశిష్టతను, ప్రాముఖ్యాన్ని పూర్తిగా గుర్తించి మమేకభావనతో జరిపిన ప్రయత్నం. తెలంగాణ భాష గురించి నాటికే వినిపిస్తున్న హేళనలను ఖాతరు చేయక ఆయన చెప్పిన మాటలు – ‘నిజాము రాష్ట్రమున బరిశుద్ధమగు నాంధ్రభాషా స్వరూపము ద్యోతకమగు తావులు కలవు. రయిలు మార్గము విడచి నాలుగైదు ఆమడల దూరమేగితిమేని సదాచార నిరతులై సీమోల్లంఘనము గావింపని జానపదులు గానవత్తురు. వారలుచ్చరించు ఆంధ్రభాష గ్రాంథికభాషా రహస్యములు వెల్లడింపగలదు. ఆంధ్రసూర్యరాయాంధ్ర నిఘంటువునకు వాడుక మాటల నేరుటలో బనిచేసిన పండితుని నిజాము రాష్ట్ర వ్యవహారాంధ్ర వాఙ్మయమును సంస్కరించి గ్రంథస్తము గావించుటలో బనిచేయించిన బాగుండెడిది’ (నిజాము రాష్ట్ర పరిశోధనోద్యమము, వ్యాసం. ఆంధ్రాభ్యుదయం మాసపత్రిక, 1924) పరిశోధనాకృషిని ఒక ప్రజా ఉద్యమం అవసరాలకు అనుగుణంగా నిర్వహించడం ఎలాగో ఆయనను, ఆదిరాజు వీరభద్రరావును చూసి నేర్చుకోవాలి.
ఆధునికతలోకి ప్రయాణించడానికి 20వ శతాబ్దారంభంలో తెలంగాణ వేసిన తొలి అడుగులో చరిత్ర పరిశోధన ఒకటికాగా, ఆ ప్రయత్నం రెండు రకాలుగా సాగింది. గతావశేషాల అన్వేషణ ఒకటి కాగా, వర్తమానం గురించిన అభివర్ణన, సమాచార క్రోడీకరణ మరొకటి. సామ్రాజ్యా వైభవాన్ని ఒక మార్గం ముందుకు తెస్తుండగా, స్థానిక చరిత్రలు మరొకవైపు వచ్చాయి. తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు పత్రికల్లో 1940ల దాకా స్థానిక కథనాలు, క్షేత్రకథనాలు అనేకం కనిపిస్తాయి. నైజాము ఆంధ్రజాతీయతను నిర్మించడానికి అవసరమైన చారిత్రక పరిశోధననీ, స్థానిక క్షేత్రకథనాలను, వర్తమాన సమాచార క్రోడీకరణను ముప్పేటగా కొనసాగించిన ఉద్యమ పరిశోధకుడు, చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు, లక్ష్మణరావు దగ్గర శిష్యరికం, పరిశోధనమండలి కార్యకర్తృత్వం, లక్ష్మణరాయపరిశోధకమండలి సారధ్యం, ఆయనను అవిశ్రాంత రచయితను చేశాయి. గొప్పశైలి, గొప్ప సృజనాత్మకత ఉన్న రచనలేమీ, ఆయన చేయలేదు. కానీ, తెలంగాణ గురించి ఆకాలానికి అత్యవసరమైన, అందరూ తెలుసు కోవలసిన సమాచారాన్ని ఆయన అందించారు. తెలంగాణ చరిత్ర కలిగిన ప్రతి స్థలాన్నీ ఆయన పరిచయం చేశారు. జీవితచరితావళి (రావిచెట్టు రంగారావుతో పాటు ముగ్గరు ప్రముఖుల జీవితచరిత్రలు), మాడపాటి హనుమంతరావు జీవితచరిత్ర, మన తెలంగాణము, ప్రాచీనాంధ్రనగరములు (12 తెలంగాణ ప్రాచీన నగరాలు చరిత్ర), షితాబుఖాను అను సీతాపతిరాజు, గుల్బర్గా జిల్లా కథనము, పాల్వంచ సంస్థానము, వేములవాడ తిరునాళ్లు, హైదరాబాద్ నగరచరిత్ర, హైదరాబాద్ నగర పరిసరములలోని చెరువులు, ఎల్లోరా, ఎలిఫెంటా గుహాలయములు, కరీంనగర్ జిల్లా కథనము, ఖమ్మం నాడు-నేడు, కోహినురు వజ్రము, వీరభద్రరావు రచనలలో కొన్ని మాత్రమే ఇవి. ఆయన వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, వందలాదిగా ఉంటాయి. అందరిలాగానే వీరభద్రరావు కూడా తన రచనావ్యాసంగాన్ని కవిత్వంతోనే ప్రారంభించారు. ఆదిపూడి సోమనాథరావు ప్రోద్బలంతో గద్యరచనంవైపు మళ్లారు. ‘(కొమర్రాజు లక్ష్మణరావుగారి).. ప్రవచనముతో ఆవేశము పొందినవాడనై, తెలుగువారి యభ్యుతయమునాకాంక్షించి, విపరీతవాదములకు గురియయిన ఇచ్చటి చరిత్రాంశములను బదిలపరచుటకు తెలంగాణలోని చరిత్రను పరిశోధన కార్యమును ముప్పదియేండ్ల క్రిందటనే ప్రారంభించితిని’ అని 1956లో రాసుకున్నారు.
ఆదిరాజు వీరభద్రరావు కానీ, దూపాటి వేంకటరమణాచార్యులు కానీ తెలంగాణ ఆంధ్రమహాసభలో కూడా క్రియాశీలంగా పాల్గొన్నారు. నైజాము ఆంధ్రోద్యమానికి తొలిరూపమైన ఆంధ్రజనకేంద్రసంఘం చెప్పుకున్న కర్తవ్యాలలో పరిశోధన ముఖ్యమైనది. నాడు సంకల్పించిన పనులు ఏడింటిలో అత్యధికం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించినవే కావడం గమనార్హం. అందులో నాలుగో కర్తవ్యం ”తాళపత్రగ్రంధాలను, శాసనాల ప్రతులను సంపాదించడం, పరిశోధించడం” ఉన్నది. ఆంధ్రజనకేంద్రసంఘం – ఆంధ్రమహాసభగా పరిణమిస్తున్న కాలం 1926 లోనే గొల్కొండ పత్రిక అవతరించింది. ఈ పత్రిక సంపాదకుడు, తెలంగాణ వికాసోద్యమంలో ముఖ్యపాత్రధారి అయిన సురవరం ప్రతాపరెడ్డి స్వయంగా పరిశోధకుడు. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ కేవలం తెలంగాణకే కాక, మొత్తం తెలుగుసీమలన్నిటికి విలువైన పరిశోధనాగ్రంధం. ‘మనము కూడ చరిత్రకెక్కదగినవారమే’ నని ఆయన అన్న మాటలు సుప్రసిద్ధాలు. ఆత్మగౌరవానికీ చరిత్రశోధనకీ ఉన్న ఆవేశపూరిత సంబంధాన్ని సూచించే మాటలు. ఆయన రాసిన రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవధర్మవీరులు – ప్రతాపరెడ్డి చారిత్రక దృష్టికి, హేతువాదానికి సూచికలు. తెలంగాణలో కవులు లేరనే నిందకు జవాబుగా సమకాలిక కవులనే కాక, ప్రాచీన కవుల రచనలను కూడా క్రోడీకరించిన ఉద్యమ పరిశోధకుడు ప్రతాపరెడ్డి.
ఇంకా చరిత్ర పరిశోధనలో ఎంతో అమూల్యమైన దోహదాలు చేసిన నాటి పండితులలో శిరుగూరిహనుమంతరావు, బూర్గుల రామకృష్ణరావు, తరువాతి కాలంలో గడియారం రామకృష్ణశర్మ, బిరుదురాజు రామరాజు మొదలైనవారు ప్రత్యేకంగా చెప్పుకోదగినవారు. చరిత్రకెక్కని తెలంగాణను కనుగొని ఆవిష్కరించిన పరిశోధకులు వారు.
అయితే, చరిత్ర పరిశోధన అంటే కేవలం శాసనాలు, పురాతత్వం, గత పాలకుల వివరాలు మాత్రమే కాదు, ఆలభ్యాలను కనుగొనడం, పరిష్కరించడం మాత్రమే కూడా కాదు. కానీ, ఆనాటి ఉద్యమ అవసరం – అది ముందుకు తెచ్చిన ఎజెండా తెలంగాణను సగౌరవంగా చరిత్రలో ప్రతిష్ఠించడం కావడం వల్ల నాటి పరిశోధన ఆ దిశలో జరిగింది. చరిత్రరచనలోని అనేక కొత్త పార్శ్వాలు, అంగాలు నాటికి ఇంకా అవసరంగా ముందుకు రాలేదు. అయిన్నప్పటికీ, ఆదిరాజు వీరభద్రరావు వంటివారు – సమకాలిక సమాచార వనరులను, ఇతర భాషల్లోని చరిత్ర గ్రంధాలను కూడా ఉపయోగించుకుని చరిత్రను నిర్మించే ప్రయత్నం చేశారు. తాళపత్రాలను భద్రపరచడం, చదవడం వంటి అంశాలను కూడా పాఠకులకు తెలియజెప్పడానికి ఆయన వ్యాసాలు రాశారు. నైజాము రాజ్యం ఘనతను గుర్తించడానికి వీలుగా అందులోని చారిత్రక ప్రదేశాలను, స్థానిక చరిత్రలను రాశారు. నైజామురాజ్యంలో వ్యాసాలు రాసినవారిలో మాడపాటి హనుమంతరావు కూడా ఉన్నారు. ఆంధ్రపత్రిక సంవత్సారాది సంచికల్లో తెలంగాణ గురించి ప్రచురితమైన మొదటి వ్యాసం (1913) మాడపాటి హనుమంతరావుదే. నిజాము రాష్ట్రంలో తెలుగువారి ప్రతిపత్తి గురించి గణాంకాలతో సహా రాసిన ఈ వ్యాసం బహుశా ఆయన వ్యాసాల్లో కూడా మొదటిది అయి ఉండవచ్చు. తెలంగాణ గురించిన సామాజికార్థిక కోణాలను వివరించే గద్యరచనలు కూడా అసంఖ్యాకంగా ఆనాడు వెలువడ్డాయి. వాటికి రకరకాల చరిత్ర గ్రంథాలు, పత్రికలు వనరులుగా ఉపయోగపడ్డాయి. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో కూడా సమాచారాత్మకమైన పరిశోధనలు, ఇటీవలి చరిత్ర గురించిన విశ్లేషణలు అసంఖ్యాకంగానే వచ్చాయి. అయితే, ఇంతకుముందే చెప్పినట్టు సృజనాత్మక రచనల, పరిమాణం, ఉధృతి, సమాచార, చరిత్ర రచనలకు లేవనే చెప్పాలి.
చరిత్ర పరిశోధన – ఇప్పుడు ప్రధానంగా సమీప చరిత్రపై కేంద్రీకృతం కావలసి ఉన్నది, అవతున్నది కూడా. ముఖ్యంగా గత రెండువందల సంవత్సరాల తెలంగాణ చరిత్రను పూర్తిగా పునర్నిర్మించవలసి ఉన్నది. వేరు వేరు రంగాలలో, వేరు వేరు చోట్ల, వేరు వేరు భాషల్లో హైదరాబాద్ రాజ్యం గురించి పరిశోధనలు జరిగాయి. మౌలిక సమాచారం కూడా ఉన్నది. వాటిని ఒకచోట సమీకరించడం, ఒక అన్వయంతో నిర్మించడం జరగాలి. మొదటి స్వాతంత్య్ర సమరం జరిగి నూటా యాభై ఏండ్లు పూర్తయి, దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరిగే సందర్భంలో – 1857లో తెలంగాణ నిర్వహించిన పాత్రను ఆవిష్కరించాలి. అలాగే, చివరి నిజాముల కాలంలో జరిగిన పరిణామాల గురించి నిస్పాక్షికమైన అంచనాలు వేయాలి. ఆధునికత స్పర్శకు దూరంగా ఉన్న తెలంగాణనుంచి ఏవైనా కొత్త మౌలిక భావనలు 19-20 శతాబ్దుల సంధిదశలో వ్యక్తమయ్యాయా- అన్వేషించాలి. తెలంగాణ ప్రత్యేకతను, విశిష్టతను మరింత బలంగా చూపే ఆకరాలను పట్టుకోవాలి. ఈ పనులు శాసనాలను వెదకడం కోసం చెట్లు పుట్టలు పట్టుకుని వెదకడం కన్నా కష్టమైనవి. ఎందుకంటే – తెలంగాణ ఇటీవలి చరిత్ర ఆధారాలు కూడా దుర్లభాలు. తొలిపత్రికలు హితబోధిని, నీలగిరి, తెనుగు – పూర్తి సంచికలు ఎక్కడా దొరకని దుస్థితిలో ఉన్నా గోల్కొండ పత్రిక ప్రతులు భద్రంగా ఉంటాయో లేదో చెప్పలేని నిస్సహాయత. తెలంగాణ ప్రముఖుల డైరెక్టరీలు, రచయితల డైరెక్టరీలు, గ్రంథసూచికలు, కాలక్రమణికలు – వంటి మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే కానీ యూనివర్సిటీ లలో కూడా ఈ అంశాలపై పరిశోధనలు జరిగే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ గురించి అన్ని శాస్త్రరంగాలలో జరిగిన అన్ని పరిశోధనలను ఒక చోటు నిధిగా సేకరించి, వాటినుంచి ఒక క్రమంలో అమర్చవలసిన సమాచారాన్ని గుర్తించడం పెద్ద బాధ్యత. వీటిలో అనేకం వ్యక్తులుగా చిన్న స్థాయిలో చేస్తున్నవారున్నప్పటికీ, సంస్థలుగా మాత్రమే పూర్తి ఫలితం సాధించగలం. ఆనాటి ఉద్యమం ఇచ్చినంత విలువ, నేటి రాజకీయ ఉద్యమం చరిత్ర నిర్మాణానికి ఇవ్వడం లేదు. చరిత్ర అవగాహనతో ముడిపడిన సీరియస్ అంశాలు కూడా రాజకీయవేదికల మీద శుష్కవాదనలుగా ప్రతిధ్వనిస్తున్నాయి. గట్టి పునాది మీద తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మించడం కాకా, సెంటిమెంటు మీద సవారీ చేయాలనుకునే ధోరణి కనిపిస్తోంది. తెలంగాణ పరిశోధకులు, ఈ విషయంలో స్వయంగా తమ పరిధిని, కర్తవ్యాన్ని నిర్వచించుకుని, ఏ ఆవిష్కరణ తెలంగాణను సమగ్రంగా, స్వతంత్రంగా అవిష్కరిస్తుందో ఆ దిశగా పనిచేయడమే చేయవలసిందీ, చేయగలిగిందీ కూడా.
[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download 'PDF' ]