Feed on
Posts
Comments

- కె. జితేంద్రబాబు

The future is dark, the present burdensome; only the past, dead and finished, bears contemplation. Those who look upon it have survived it. They are its product and its victors. No wonder, therefore, that men concern themselves with history. The desire to know what went before, the desire to understand the passage down time. These are common human attributes.

వర్తమానం వెలుగులో గతాన్ని అధ్యయనం చేయటానికి చేసే ప్రయత్నమే చరిత్ర. ఆ చరిత్ర రచనలో వ్యక్తి గత దృక్పథం తప్పని సరిగా ఉంటుంది. గతంలోని అంశాల్ని అధ్యయనం చేస్తున్నపుడు చరిత్రకారుల మధ్య కూడా ఆ అంశాలు పరావర్తనాన్ని చెందుతూనే ఉంటాయి. వాస్తవాలు, ప్రాధాన్యతలు చరిత్రకారుని భావజాలాన్ని బట్టి మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా చరిత్రకారుడు తన సమకాలీన చరిత్ర రచనకు సంబంధించిన అంశాల్ని రచించేటప్పుడు తన దృక్పథం తప్పనిసరిగా ఆ రచనలో ప్రతిబింబిస్తూనే ఉంటుంది. సామాజిక కార్యచరణలో భాగస్వాములైన వ్యక్తులు రచించిన చరిత్రలోని ప్రతిఘట్టంలోనూ, వాస్తవాల ప్రాధాన్యతలోనూ, వారి వ్యక్తిగత దృక్పథం కొన్నిసార్లు ఎక్కువగా చొప్పించే అవకాశం కూడా ఉంది.

సామాజిక అభివృద్ధి చోదకశక్తుల, నిరోధక శక్తుల వ్యక్తిగత పాత్రల ప్రాధాన్యత కూడా చరిత్ర అధ్యయనంలో భాగమే. వారే చరిత్రకారులైతే ఆ చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి? వారు రచించిన చరిత్రలోని వాస్తవాలను ఎలా గుర్తించాలి? సమకాలీన అంశాల్లో సంఘటన అభివృద్ధిలో, ఉద్యమాల్లో, రాజకీయాల్లో వివిధ పరిధుల్లో, పరిమితుల్లో తమ పాత్రను పోషించిన వారే ఆ చరిత్ర రచనకు ఉపక్రమిస్తే ఆ చరిత్రను మనం ఏ మేరకు వాస్తవ చిత్రీకరణగా గుర్తించాలి? వారు వాస్తవాల్ని గూర్చి ప్రత్యక్ష, పరోక్ష విశ్లేషణలు చేస్తూ తమ సమకాలీన చరిత్రను రచిస్తే వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్మించటానికి ఆ చరిత్ర ఏ మేరకు దోహదపడుతుంది? ఆ చరిత్ర వాస్తవాలను విశదీకరిస్తే ఆ చరిత్ర వాస్తవాలను ప్రకటించినప్పటికీ అది చరిత్ర అవుతుందా?

ఈలాంటి ఎన్నో అనుమానాలు మనం తెలంగాణలో జరిగిన సాయుధ పోరాట చరిత్రను గూర్చి రచించిన నాలుగు పుస్తకాలు అధ్యయనం చేస్తుంటే వస్తాయి. తెలంగాణలో 1944లో ప్రారంభమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం, ఫ్యూడలిజాన్ని, భూస్వామ్యవిధానాన్ని బలపరిచిన కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం 1951 వరకు సాగింది. ఈ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు, పాల్గొననివారు, పర్యవేక్షించినవారు, పోరాట ఫలితాల్ని స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించినవారు, పోరాటాన్ని, అనుభవాల్ని, జ్ఞాపకాల్లో, చరిత్రను గ్రంథస్తం చేసారు. వారు తమతమ గ్రంథాల్లో తమ భావజాలానికి అనుగుణంగా, తమ రాజకీయాలకు అనుగుణంగా వివిధ రకాలైన విశ్లేషణలను చేస్తూ, తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాల్ని, అందించారు. తెలంగాణ ప్రజలు సాయుధ పోరాట రూపాల్ని స్థానిక పరిస్థుతులనుగుణంగా, సృష్టించుకొని కొనసాగించిన విషయాన్ని విస్మరించి తమ గ్రంథాల్లో తమ పాత్రను, ఉద్యమ స్వరూపాన్ని, విశ్లేషించబూనుకొని నాయకత్వ స్థానాల్ని పదిల పరుచుకోజూశారుగాని వాస్తవాల్ని చిత్రించ ప్రయత్నించలేదు. తాము తీసుకున్న తప్పుడు విధానం, కార్యాచరణ ఫలితంగా వచ్చిన ఆటు పోట్లను విశ్లేషించలేదు. తమ అనుభవ లోపం వల్ల ఉద్యమానికి వచ్చిన నష్టాన్ని వివరించలేదు.
తెలంగాణలో ప్రజలు జరిపిన పోరాటం భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, దేశముఖ్‌లకు వ్యతిరేకంగా, వారి దౌర్జన్యాలను ప్రతిఘటిస్తూ వారి లక్షల ఎకరాల భూమిని వ్యవసాయ కూలీలను, పేద రైతులకు పంచుతూ జరిపిన వ్యవసాయక విప్లవం గాని నిజాం రాజ్యంలో కాంగ్రెస్‌ రాజ్యాన్ని స్థాపించడానికి జరిపిన పోరాటం కాదని గుర్తించలేదు. ఈ గ్రంథాలు రచించిన వారందరు దాదాపు నిజాం పాలనపోయి కాంగ్రెస్‌ పాలన రావాలని కోరిన వారు గాని వ్యవసాయ కూలిలతో, కార్మికులతో, ప్రజా ప్రభుత్వ ఏర్పడాలని కాంక్షించిన వారుగాదు.

తెలంగాణ సాయుధ పోరాటం పై వచ్చిన గ్రంథాలను సంక్షిప్తంగా పరిశీలించిన మొదటి గ్రంథం చండ్రపుల్లారెడ్డి 1969లో ‘మహత్తర వీరోచిత తెలంగాణ పోరాటం’ అను పేరుతో రచించాడు. ఇతనికి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికి, ప్రధాన పాత్ర పోషించనప్పటికి, తాను 1969 తర్వాత ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ (మా.లె) స్థాపనకు అనుగుణంగా, తన భావజాలాన్ని, రాజకీయాలను స్థీరీకరించుకొనే సందర్భంలో రచించాడు.

ప్రజా యుద్ధంలో సాయుధ వ్యవసాయక విప్లవ పోరాటం ప్రధాన పోరాటంగా ఉంటుందని తెల్పటానికి ఈ గ్రంధం రచించాడు. తరువాత వచ్చిన గ్రంథం పుచ్చలపల్లి సుందరయ్య 1972 డిసెంబరులో రచించిన ‘తెలంగాణ పీపుల్స్‌ స్ట్రగుల్‌ అండ్‌ ఇట్స్‌ లెసన్స్‌’. ఈ గ్రంథం మే 1973లో ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు’ అను పేరుతో తెలుగులో అనువదించబడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయబడింది.

ఈ గ్రంథ రచనకు కొంత నేపథ్యం ఉంది. 1968లో ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణించి పాశవికమైన దాడులతో ఉద్యమాన్ని అణచ ప్రయత్నించాడు. 1968లోనే మర్రి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునివ్వడంతో పాటు ఆరు సంవత్సరాలు ఎన్నికలలో పోటికి అనర్హుడైనాడు. సుప్రీం కోర్టునాశ్రయించిన చెన్నారెడ్డికి అక్కడ చుక్కెదురవడంతో రాష్ట్రంచేరి ‘తెలంగాణ ప్రజా సమితి’ అధ్యక్ష పదవి చేజిక్కించుకున్నాడు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు 14 స్థానాలకు గాను 10 స్థానాల్లో విజయం సాధించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ బలీయమైన శక్తిగా అవతరించటంతో చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెసులో విలీనం చేసినాడు. 1972 శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు ఇందిరాగాంధీ పి.వి. నరసింహారావుకు ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ప్రత్యేక ఉద్యమం తీవ్రంగా సాగుతూ తెలంగాణ అంతా అగ్నిగుండంగా ఉన్నప్పుడు ‘విశాలాంధ్ర’ నినాదంతో సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీకి నైతిక మద్దతు ఇచ్చి అండగా నిలిచాయి. ప్రతిఫలంగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టు పార్టీ నాయకులను పిలచి మీరు తెలంగాణలో సాయుధ పోరాట పిలుపిచ్చి 25 సంవత్సరాలవుతుంది. మీరు తెలంగాణ సాయుధ పోరాట రజతోత్సవాలను జరుపుకుంటే ఖర్చును భరిస్తానని హామి ఇవ్వటంతో పాటు, కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులతో, మీరందరూ తెలంగాణ సాయుధ పోరాటయోదులే గదా! మీరందరూ మీ మీ అనుభవాలను ఎందుకు గ్రంథస్థం చేయరు అని కోరింది. ఇందిరాగాంధి అలా కోరడంలో ప్రయోజనం ప్రత్యేక తెలంగాణ నినాదం 1971 లోక్‌సభ ఎన్నికల్లో బలంగా పనిచేసింది. 1972 శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు ప్రధాన ప్రతిపక్షమైన సి.పి.ఐ మరియు సి.పి.ఎం.లు విశాలాంధ్ర నినాదంతో తన అభిప్రాయానికి అనుగుణంగా నిలిచారు కాబట్టి వారిని జోకొట్టడమే! 1972 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 219 స్థానాలు గెలుచుకొని, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగితే సి.పి.ఐ.కి ఏడు స్థానాలు, సి.పి.ఎం.కు ఒక స్థానం మాత్రమే వచ్చాయి.

విశాలాంధ్ర నినాదంతో ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు నష్టపోయినప్పటికి మూడు స్పష్టమైన ప్రయోజనాలు ఆశించి ఆనాడు తెలంగాణ పోరాట రజతోత్సవాలతో పాటు గ్రంథ రచనకు ఉపక్రమించారు పుచ్చలపల్లి సందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావులు, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డిలు. మొదటి ప్రయోజనం భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టులో 1968లో చీలిక ఏర్పడి, బెంగాల్‌ నక్సల్బరి శ్రీకాకుళములలో రైతాంగ పోరాటాలు ప్రారంభమై వ్యవసాయక విప్లవం యొక్క అవసరాన్ని గుర్తు చేయటంతో దాన్ని వ్యతిరేకించడం. రెండవ ప్రయోజనం, విశాలాంధ్ర నినాదాన్ని బలపరుస్తు తెలంగాణ సాయుధ పోరాటాన్ని సమైక్యంగా ఆనాడు నిర్వహించినట్లు చెప్పటానికి ప్రయత్నం చేయడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని నమ్మబలకటం, మూడవ ప్రయోజనం తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ముందుకు వచ్చిన వ్యవసాయక విప్లవంను కొనసాగించలేకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ, అతివాద పంధాలో కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నుండి బయటకు వచ్చిన విప్లవకారుల సిద్ధాంతాలను, అభిప్రాయాలను పరోక్షంగా ఎండగట్టటంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ పాత్రను స్థిరీకరించుకోవడం.

ఈ ప్రయోజనాలను ఆశించే తెలంగాణ పోరాట రజతోత్సవాలను ఘనంగా జరిపి తమ గ్రంథాలను చాలా జాగ్రత్తగా రచించి తెలంగాణ పోరాటయోధుల పాత్రలను మరుగున పరిచి సహకార దృష్టితో పోరాటానికి సహాకారం అందించిన వారే పోరాటానికి నాయకత్వం వహించినట్లు చెప్పుకొనే స్థాయికి ఎదిగారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంనుండి కొనసాగుతున్న అభిప్రాయబేధాలు 1962లో చైనా భారతదేశం పై చేసిన దాడి నాటికి తీవ్ర స్థాయికి చేరి 1964 ఏప్రిల్‌ 11న జరిగిన జాతీయ సమితి సమావేశంలో వాకౌట్‌ చేసి బయటకు వచ్చిన 32 మంది సభ్యులు సి.పి.ఐ. (యం) ను ఏర్పరిచారు. దానిలో సుందరయ్య ప్రధాన పాత్ర పోషించాడు. భారతదేశంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించడానికి ఆనాడు సి.పి.ఐ.(ఎం)ను ఏర్పరిచారు. 1964 చీలిక తర్వాత సాయుధ పోరాట ప్రారంభానికి ఏమీ చర్యలు చేపట్టక పోయేసరికి బెంగాల్‌లో 1967 మే నెలలో ‘నక్సల్బరి’లో స్థానిక సి.పి.ఐ.(ఎం) పార్టీ నాయకులు రైతాంగ తిరుగుబాటును లేవదీశారు. వారు మరొకసారి చీలిక కమ్యూనిస్టు పార్టీ (మా.లె.) ఏర్పరుచుకొన్నారు. బెంగాల్‌ ప్రభుత్వం పాశవికంగా ఆ తిరుగుబాటును అణిచినప్పటికి భూస్వామ్యవర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయాల్సిన అవసరాన్ని మార్క్సిస్టు పార్టీలోని కొందరు సభ్యులు గుర్తించి భారతదేశంలో ఇతర ప్రాంతాల్లోను అదే విధమైన తిరుగుబాట్లకు ప్రయత్నించారు.

దేశవ్యాప్తంగా సి.పి.ఐ.(ఎం) లోని అసంతృప్తివాదులు నాయకత్వంపై అంతర్గత పోరాటం ప్రారంభించారు. ముందుగా చారుమజుందారు బెంగాల్‌లోని డార్జిలింగు జిల్లాలో ప్రత్యక్ష చర్యలకు పూనుకొని భూ పోరాటాలకు, పంటల స్వాధీనానికి పూనుకొన్నాడు. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీలో సీనియర్‌ నాయకులు తరిమెల నాగిరెడ్డి, చండ్రపుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావులు కేంద్ర నాయకత్వంతో విభేదించారు. 1968 జనవరిలో పాలకొల్లులో జరిగిన ప్లీనరీలో వారు మధురై తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ‘దేశాన్ని పరిపాలిస్తున్న బడా బూర్జువా వర్గం కాంప్రాడార్‌-బ్యూరోక్రటిక్‌ తత్వంకల వర్గం’ అని పై నలుగురు నాయకులు చేసిన సూత్రీకరణలను అంగీకరించేందుకు సి.పి.ఎం తిరస్కరించింది. మధురై సమావేశంలో సి.పి.ఎం. వారు చేసిన ‘సోషలిజంలోకి పరివర్తన రూపాలు (ఆన్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ట్రాన్సిషన్‌ టు సోషలిజమ్‌)’ అనే భావనను ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులు వ్యతిరేకిస్తూ సి.పి.ఎం. కేంద్ర కమిటి ‘శాంతియుత పార్లమెంటరీ పంధాను’ దుయ్యబట్టారు. 1968 జూన్‌ 16న వీరిని పార్టీనుంచి బహిష్కరించారు. 1968 జూన్‌ 29,30 తేదీలలో విజయవాడలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్యలు సమావేశమై తమని కమ్యూనిస్టు విప్లవకారులుగా ప్రకటించుకొని తొమ్మిది మంది సభ్యులతో నాగిరెడ్డి సమన్వయకారుడుగా ఆంధ్రరాష్ట్ర సమన్వయ సంఘం ఏర్పడింది. మావో ఆలోచనలే తమ మార్గదర్శకమని ప్రకటిస్తూ 1944-51 నాటి తెలంగాణ పోరాటం మాదిరి త్వరలో మరో తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం జిల్లాలను కార్యక్రమ ప్రాంతాలుగా ఎంచుకొన్నారు.

శ్రీకాకుళంలో, తెలంగాణలో సాయుధ పోరాట కేంద్రాలు వృద్ధి చెందాయి. ఎత్తుగడల విషయంలో నాయకత్వంలో విభేధాలు ఏర్పడినాయి. నాగిరెడ్డి, దేవులపల్లి చట్టబద్దంగానూ, చట్టం వెలుపలా సంఘర్షణలు జరపాలనీ, ఆర్థిక పోరాటాల ద్వారా సుదీర్ఘమైన సన్నాహాలు చేసి పూర్తి స్థాయి పోరాటాన్ని మొదలుపెట్టాలని భావించారు. శ్రీకాకుళం ప్రాంతంలోని విప్లవకారులు వెంటనే ఆయుధాలు చేపట్టాలని భావించారు. 1968 అక్టోబరులో చారుమజుందారుతో శ్రీకాకుళ ప్రాంత నాయకులు చౌదరి తేజేశ్వరరావు సంబంధాలు ఏర్పరుచుకొని, 1968 అక్టోబరులో శ్రీకాకుళం జిల్లా సమన్వయ సంఘం బొడ్డపాడులో సమావేశమై సాయుధ పోరాటాని తక్షణం ప్రారంభించాలని తీర్మానించింది. 1968 నవంబరు 24న బొడ్డపాడు దగ్గర గరుడభద్ర గ్రామంలోని ధనిక భూస్వామి పంటలను స్వాధీనం చేసుకోవడంతో సాయుధ పోరాటానికి తిరిగి నాంది జరిగింది. 1969 జనవరి నుండి 1969 ఆగస్టు వరకు 86 సంఘటనలు జరిగాయి. శ్రీకాకుళ పోరాటం చారుమజుందారు చేతుల్లోకి వెళ్లింది. 1969 ఫిబ్రవరి 19,20,21 తారీఖుల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండ బిలంలో శ్రీకాకుళ పోరాటంలో పాల్గొంటున్న చౌదరీ తేజేశ్వరరావు, పంచాది కృష్ణమూర్తి, కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి, మామిడి అప్పల నరిసింహంలతో పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల నుంచి అనేకమందితో చారుమజుందారు సమావేశమైనాడు. వారు కొత్తగా కమ్యూనిస్టు విప్లవకారుల ఆంధ్రరాష్ట్ర సమన్వయ సంఘంగా ఏర్పడ్డారు. పాత సమన్వయ సంఘంతో సంబంధాలు తెంచుకున్నారు. వీర తెలంగాణ విప్లవ వీరులు తమ జీవితాల్ని వృధా చేయలేరని ఆ తరహాలోనే పోరాడాలని నిర్ణయించారు.

1969 మార్చి 11న తరిమెల నాగిరెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత 1969 ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు కృష్ణ జిల్లా కంధంపాడు గ్రామం దగ్గర నిమ్మతోటలో రహస్యంగా సమావేశమై ‘తక్షణ కార్యక్రమం’ (ఇమిడియేట్‌ ప్రొగ్రామ్‌) పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్ధేశించుకొన్నారు. తక్షణమే వ్యవసాయక విప్లవాన్ని ప్రారంభించాలని భావించి ‘ మన కార్యక్రమాన్ని (అనగా భూమిని పునః పంపిణి చేసే వ్యవసాయక విప్లవాన్ని) అమలు జరపడం మొదలుపెట్టగానే, ప్రభుత్వ సాయుధ పోలీసుల నుంచి దాడులు మొదలవుతాయి, దాంతో మన విరోధం కూడా అమలు జరపాలి’ అని ప్రకటించారు.

తర్వాత విజయవాడలో సమావేశమై ఖమ్మంలోని పగిడేరు, పాల్వంచ ప్రాంతాలలో వెంటనే పోరాట చర్యలు ప్రారంభించాలని నిశ్చయించారు. 1969 ఏప్రిల్‌ 16న పగిడేరులో భూస్వాముల వద్ద నాలుగు తుపాకులు లాక్కున్నారు. ములుగు ప్రాంతంలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో భూస్వామి ఇంటి పై దాడి చేశారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలో గెరిల్లా దళాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణలో యూనియన్‌ సైన్యాలు ప్రవేశించిన తర్వాత ఏ ప్రాంతాల్లో అయితే నల్లగొండ వరంగల్లు పోరాట యోధులు కేంద్ర స్థానం చేసుకొని 1948-51 సంవత్సరాల్లో యూనియన్‌ సైన్యాలను ఎదుర్కొన్నారో ఆ ప్రాంతాల్లోనే ఈ శిక్షణ, దాడులు కేంద్రీకరించారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో కూడా సాయుధ తిరుగుబాట్లు ప్రారంభమైనాయి.

1969 డిసెంబరు నెలలో నాగిరెడ్డి, దేవులపల్లి, వెల్మరెడ్డి, గోపాలరెడ్డి, చల్లపల్లి శ్రీనివాసరావు, మండ్ల సుబ్బారెడ్డి, వసంతాడ రామలింగాచారి, సుంకరి లక్ష్మినరసయ్యలు మద్రాసులో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తుండగా అరెస్టు అయి హైదరాబాద్‌ కుట్రకేసులో జైలు పాలయ్యారు.
1970 జులైలో నీలం రామచంద్రయ్య, రామనర్సయ్య, చండ్రపుల్లారెడ్డిలు మరొక రాష్ట్ర కమిటి ఏర్పాటు చేసి ‘ఆంధ్రప్రదేశ్‌ రివల్యూషన్‌రీ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి గోదావరి లోయలో తమ దృష్టిని కేంద్రీకరించారు. శ్రీకాకుళ పోరాటం 1968లో ప్రారంభమై 1971 వరకు నిలదొక్కుకుని వేల మంది నిర్భందించబడటం, దాదాపు 300 మంది అమరులవడం, గోదావరి లోయలో తిరిగి పోరాటాలు ప్రారంభమతుండడం, అందరూ వ్యవసాయిక విప్లవాన్ని కొనసాగించడానికి ప్రయత్నించడం, ఈ దశలో విప్లవాన్ని, సాయుధ పోరాటాలనకు కొనసాగించలేము అని చెప్పటానికి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, రాజేశ్వరరావు, తమ గ్రంధాలు రచించారు. వారు ఆ సంప్రదాయాల్లో పోరాటం ప్రారంభించినప్పటికి ఉద్యమాన్ని కొనసాగించలేక పోవటానికి కారణాలను విశ్లేషిస్తు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, విశాలాంధ్ర దృష్టితో, తమ దృక్పధానికి అనుగుణంగా విశ్లేషించబూనుకున్నారు.

సి.పి.ఐ., సి.పి.ఎం. వారు తమ గత వర్తమాన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ సాయుధ పోరాటానికి మితవాద, సంస్కరణవాద రంగును పూయటానికి ప్రయత్నించారు. ఆనాడు సి.పి.ఐ. (ఎం.ఎల్‌.) భారత విప్లవానికి తెలంగాణ సాయుధ పోరాటం నుండి గుణపాఠాలు తీసుకొని పునః నిర్మించడానికి ప్రయత్నిస్తే వీరు తిరోగమించ ప్రయత్నించారు.

ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు పార్టి కమిటి 1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ నాటికి తెలంగాణలో 1944 నుంచి జరుగుతున్న సాయుధ పోరాట ఘట్టాలు, ముండ్రాయి, ధర్మాపురం, ఎర్రపాడు, బేతవోలు, బక్కవంతులుగూడెం, మల్లారెడ్డిగూడెం, మేళ్లచెర్యు, అల్లీపురం, తిమ్మాపురం, ములకలగూడెం, నాసికల్లు గ్రామాల్లో ఆంధ్రమహాసభ ‘సంఘం’ తరుపున జరిగిన ప్రధాన ఘట్టాలను చాలా సంక్షిప్తంగా సుందరయ్య తన గ్రంథంలో వివరించాడు. 8వ ఆంధ్రమహాసభ తర్వాత ఆంధ్రమహాసభ ఉద్యమాన్ని రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మినరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు తమ నాయకత్వంలోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు గాని, తెలంగాణలో లక్షలాది ఆంధ్రమహాసభ కార్యకర్తలను సంఘటితపరిచి, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా కదిలించడానికి చేసిన ప్రయత్నాలు గాని ఏవీ గ్రంథంలో వివరించలేదు. 1945 నాటికి ఆంధ్ర మహాసభ సభ్యత్వం తెలంగాణలో 7.5 లక్షలుంటే ఆంధ్రలో 10 వేలు దాటలేదు. వారు ఎందుకు ఇంత మహోద్యమాన్ని ఆంధ్ర, రాయలసీమల్లో నిర్మించలేంది, వారిని పోరాటాల వైపు కదిలించలేకపోయింది ఈ గ్రంథంలో వివరించలేదు.

ఈ వ్యాసంలోనే నక్సలైటు ఉద్యమాన్ని గూర్చి రాస్తూ ‘అతివాద దుందుడుకు వాదులున్నారు. ప్రస్తుతం వీరిని నక్సలైట్లు అంటున్నారు. కొత్తగావారు నాటి తెలంగాణ పోరాటానికి అప్పటి నాయకత్వం వెన్నుపోటు పొడిచిందని ఇప్పుడు ప్రేలటం మొదలుపెట్టారు. ఈ నిందనే చైనా కమ్యూనిస్టు పార్టీకూడా తన రచనలలోనూ, వ్యాసాలలోనూ వల్లిస్తుంది. సత్యం మీద, నీజాయితీ మీద విశ్వాసం ఉన్నావాడెవడైనా ఇంత తప్పుడు కూత కూసేందుకు కొంచెమైనా జంకుతాడు. నాయకత్వాన్ని సవాలక్ష, అతివాద, మితవాద లోపాలకు, ఇంకా ఇతర లోపాలకు నిందించవచ్చు. కానీ, ఈ ఐదేళ్లపాటు పోరాటం సాగించిన నాయకత్వాన్ని మాత్రం ఒక్క విషయంలో శత్రువులు కూడా వేలెత్తి చూపలేరు. (ఒక్క చదలవాడ పిచ్చయ్య, తన గ్రంథం ఆంధ్ర ‘కమ్యూనిస్టుల నగ్న స్వరూపం’ 1948లో తప్ప) ఈ పోరాట కాలమొత్తంలో వారు (ఇతనిని కలుపుకోలేదు) మొక్కవోని పట్టుదలను దీక్షను, పోరాటం యెడల అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. కాగా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో పెద్ద పెద్ద ప్రముఖుల నుండీ కూడా ఆనాడు వచ్చిన విమర్శ, పిరితనమని, ఉద్యమానికి ద్రోహమని, ప్రతికూల పరిస్థితులలో కూడా, ఎప్పుడో క్రమబద్ధంగా తప్పుకోవలసిన సమయంలో సహితం పోరాటాన్ని చాలా కాలం సాగదీశారన్నదే. కనుక తెలంగాణ పోరాటాన్ని నాడు ముందుండి నడిపిన నాయకత్వంపై కుత్సుత బుద్ధితో సాగిస్తున్న ఈ నిరాధారమైన నిందా ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, ఇంకా పెద్దగా చెప్పనక్కరలేదు. ఈ పెడత్రోవపట్టిన ‘ఉగ్రవాదులు’ నాటి తెలంగాణ పోరాట సాంప్రదాయాలను ప్రశ్నించ వీలులేదు. వారసులు తామే అయినట్లు, తాము ఆ సాంప్ర దాయాలను నిలబెట్టనున్నట్లు నాటి అనుభవం గుణపాఠాలు తమ సొత్తు అయినట్లు చాటుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. భారతదేశ కమ్యూనిస్టులకు, శ్రామిక విప్లవాలకు ఈ తెలంగాణ పోరాటం ఎన్నో వెలగట్టలేని గుణపాఠాలను అందించింది. అవి మాత్రం నేర్చుకునేందుకు ఉగ్రవాదులు సిద్దంగా లేరని’ (పే. 21) అని సూత్రీకరించుకుంటూ వచ్చాడు. ‘ఈ గుణపాఠం నేర్చుకునేందుకు నక్సలైట్లు మొండిగా నిరకారిస్తున్నారు. అందువల్లనే అన్ని రకాలైన పిల్ల చేష్టలు, మూర్ఖపు పనులు చేస్తున్నారని ప్రతి రైతాంగ పోరాటాన్ని అదెంత చిన్నదైనా, ఏ ఆర్థిక సమస్యపై నడపడబడుతున్నా, ఆ పోరాటాన్ని ‘విముక్తి పోరాటమని’ యెంతో కొద్ది ప్రాంతంలో జరిగినా అది ‘విముక్తి పోరాటమని’ యెంతో తక్కువ మంది ఈ పోరాటంలో పాల్గొన్నా వారిని ‘విముక్తి సైన్యం’ అని డబ్బా వాయించుకొంటున్నారు’ అని 1968 తర్వాత వచ్చిన రైతాంగ పోరాటాలను వ్యతిరేకరించడమే గాక ప్రత్యేక రాష్ట్రోద్యమాన్ని అణచడంలోనూ, రైతాంగ పోరాటాలను అణచడంలోను ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయాలకనుగుణంగా వ్యవహరించి తెలంగాణ సాయుధ పోరాట రజతోత్సవాలు నిర్వహించారు. ఈ గ్రంథంలో ‘తెలంగాణ పోరాట గుణపాఠాలా? దివాళాకోరు రాజకీయ సూత్రీకరణలా?’ అను పేరుతో చండ్ర రాజేశ్వరరావు రాసిన ‘చారిత్మాక తెలంగాణ పోరాటం’ అను పుస్తకం రావి నారాయణరెడ్డి రచించిన ‘వీర తెలంగాణ, నా అనుభవాలు-జ్ఞాపకాలు’ పైన రాసిన విమర్శ అయినా ప్రధానంగా రాజేశ్వరరావు పుస్తకం పైన ఎక్కువగా దాడి చేశాడు. ఆ వ్యాసంలోని వాద వివాదాలన్నీ వారి అభిప్రాయాలకు సంబంధించినవి మాత్రమే. ‘అతని కంటే ఘనుడు అచంట మల్లన్న’ ‘రాజేశ్వరరావుకు వత్తాసుగా రాజశేఖరరెడ్డి’ అను వ్యాసాన్ని నీలం రాజశేఖరరెడ్డి 10-10-1972 లో ‘విశాలాంధ్ర’ పత్రికలో రాసిన ప్రతి విమర్శకు సమాధానం. దీనిలోనూ వారి అభిప్రాయా బేధాలనే వివరించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరించలేదు. విశ్లేషించలేదు. 1946-1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన డాక్యుమెంట్లో ముఖ్యంగా ‘తెలంగాణ పోరాటంపై భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకటన, తెలంగాణ సాయుధ గెరిల్లా పోరాట విరమణకు కారణాలను వివరిస్తూ పుచ్చలపల్లి సుందరయ్య, తాను (సర్క్యిలరు 3/51) హైదరాబాదు స్టేట్‌ కమ్యూనిస్టు కమిటీ పేరున రాసింది. ఈ సర్క్యులర్‌ నందు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్యలు, గెరిల్లా పోరాటమనే దిక్కులేని భారత విప్లవోద్యమానికి చుక్కానిగా కనుగొన్నట్లు ప్రకటించుకొని, తామే ప్రశ్నలు వేసుకొని కారణాలు చెపుతూ తెలంగాణ పోరాట విరమణ సర్క్యులర్‌ రూపొందించారు. దేవులపల్లి వెంకటేశ్వరరావుకు సంబంధం లేనప్పటికి అతని పేరుకూడా ఈ సర్క్యులర్‌ నందు చేర్చి పార్టి సభ్యులకు విడుదల చేశారు. ఈ విషయాన్ని దేవులపల్లి వెంకటేశ్వరరావు తన ‘భారత విప్లవ పంథాను చూపిన తెలంగాణ సాయుధ పోరాటం’ (పే. 64-65)లోనూ పుచ్చలపల్లి సందరయ్య తన స్వీయచరిత్ర ‘విప్లవ పధంలో నాపయనం’ (రెండవ భాగం పే. 61) లోను అంగీకరించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని పుచ్చలపల్లి సందరయ్య, బసవపున్నయ్యలు విరమించేటట్లు ప్రకటన చేసి సాయుధ పోరాటం కొనసాగించాలనుకున్న తెలంగాణ నాయకులను కొనసాగించటానికి వీలు లేని పరిస్థితి కల్పించి, విరమణను వ్యతిరేకించిన వారిని 1952 ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా జాగ్రత్త పడి వీరు మాత్రం పోటీ చేశారు. పార్టీలో ఆనాడున్న పరిస్థితిని అనుసరించి తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్న నాయకులను సంప్రదించకుండా, పార్టీ పేరున గాకుండా వ్యక్తుల పేరిట డాక్యుమెంట్లు, ప్రకటనలు వెలువడే సాంప్రదాయాన్ని ఏర్పరిచి సాయుధ పోరాట విరమణ ప్రకటించి వందలాది దళాల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పరిచారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణపై చర్చను నిరవధికంగా వాయిదా వేస్తూవచ్చారు.

ఈ గ్రంధంలో మాకినేని బసవపున్నయ్య కొన్ని డాక్యుమెంట్లతో పాటు ‘రావినారాయణరెడ్డి 1949లో వెలువరించిన ‘తెలంగాణ నగ్నస్వరూపం’ అన్న గ్రంథాన్ని ప్రచురించి దానికి విశాలాంధ్ర కమిటి పేరున బసవపున్నయ్య, సుందరయ్యలు రచించిన ‘సమాధానాన్ని’ కూడా ప్రచురించాడు. ఆ సమాధానంలో రావి నారాయణరెడ్డి లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పకుండా రావి నారాయణరెడ్డిని పోరాట ద్రోహిగా చిత్రించడానికి చేసిన ప్రయత్నమే ఎక్కువగా ఉంది. ఆనాడు రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంపై ఆంధ్ర నాయకత్వాన్ని ఎదుర్కొన్నాడు. ఈ గ్రంథంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన వివరాలకంటే భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడిని ఎక్కువగా చేశారు.

స్వీయచరిత్రల రూపంలో 1972 సెప్టెంబర్‌ నందు రావి నారాయణరెడ్డి ‘వీర తెలంగాణ నా అనుభవాలు-జ్ఞాపకాలు’ ఆరుట్ల రామచంద్రారెడ్డి ‘తెలంగాణ పోరాట స్మృతులు’ అను గ్రంథాలు వెలువడ్డాయి. ఆరుట్ల రామచంద్రారెడ్డి సాయుధ పోరాటానికి సంబంధించి తన స్మృతులను తాను నెమరేసుకొన్నాడు గాని రావి నారాయణరెడ్డి అనుభవాలు జ్ఞాపకాలతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వ్యతిరేకతను తన గ్రంథంలో ప్రస్తావించాడు. ‘చీలికవాదం తెలంగాణ ప్రయోజనాలకే హానికరం’ అని భావించి ‘వీర తెలంగాణ నాది - వేరు తెలంగాణ కాదు’ అను అధ్యాయంతోపాటు తన విజ్ఞప్తిన ప్రచురించి ‘విశాలాంధ్ర’ నినాదాన్ని బలపరిచాడు. తన కారణాలను తాను వివరించాడు. ఆ తర్వాత తెలంగాణ పోరాటంపై అనేక గ్రంథాలు వచ్చాయి. అని తమ అనుభవాలు, జ్ఞాపకాలుగా రాస్తూ వచ్చినవారే. చరిత్రగా దేవులపల్లి వెంకటేశ్వరరావు గ్రంథం వచ్చినా అసంపూర్తిగా ప్రచురణ అయింది. తెలుగులో ప్రచురితమైన 42 గ్రంథాలతోపాటు తెలంగాణ పోరాటంపై బర్రి పావియర్‌ చేసిన పరిశోధనాత్మక వ్యాసం ధనిక రైతాంగవాదం ‘ది తెలంగాణ మూవ్‌మెంట్‌ 1944-51′ జి.ఎస్‌. రావు రచించిన ‘పెసెంట్‌ మూవ్‌మెంట్‌ అండ్‌ ఆర్గనైజేషన్స్‌ ఇన్‌ తెలంగాణ రీజన్‌’ అనేక వ్యాసాలతో పాటు, ప్రచురించబడని పరిశోధనలు కూడా ఉన్నాయి.

  1. కె. శ్రీనివాస్‌, జెఎన్‌యు, చేసిన ‘తెలంగాణ పెసెంట్‌ మూవ్‌మెంట్‌ అండ్‌ చేంజ్‌ ఇన్‌ ది అగ్రరేరియన్‌ స్ట్రక్చర్‌. (ఎ కేస్‌ స్టడీ ఆఫ్‌ నల్లగొండ డిస్ట్రిక్ట్‌).
  2. Ian Bedford అనునతను ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటిలో చేసిన పరిశోధన The Telangana Insurrection : A study in the causes and development of the Communist Insurrection in Rural India 1946-51.
  3. బొబ్బిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసిన “Agrarian Relations in Telangana 1911-48.
  4. జి. మధుమోహన్‌ చేసిన “A study of the Land Reform Legislations in Telangana Region of A.P.”

ఇనుకొండ తిరుమాలి చేసిన పరిశోధన ‘ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ అగ్రేరియన్‌ రిలేషన్స్‌ ఇన్‌ తెలంగాణ 1928-48′ లాంటి అనేక పుస్తకాలు వచ్చాయి వాటి పరిధులు వాటికున్నాయి. కాని ఉద్దేశాలు-దురుద్ధేశాలు ఆ గ్రంధ రచనల్లో లేవు. ఈ వ్యాసంలో ప్రస్తావించిన సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావినారాయణరెడ్డిలు రజతోత్సవ సందర్భంగా 1972లో ప్రచురించిన పుస్తకాలు రెండు ముఖ్యలక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రచించారు. ఒకటి విశాలాంధ్ర నినాదంను బలపరిచి ప్రత్యేక రాష్ట్రోద్యమాన్ని వ్యతిరేకిస్తూ రాయడం. రెండవది శ్రీకాకుళంలోను తెలంగాణలోను ప్రారంభింప ప్రయత్నించిన వ్యవసాయక విప్లవాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ ఉద్యమాలకు ఉన్న సంబంధాన్ని వ్యతిరేకించి ఈ రెండు ఉద్యమాల అణిచివేతకు ప్రభుత్వంతో సహకరించడం.

ప్రత్యేక రాష్ట్రోద్యమం తిరిగి విజృంభిస్తున్న దశలో మార్క్సిస్టు పార్టీ వారి ‘ప్రజాశక్తి’ ప్రచురణాలయం వారు 60 సంవత్సరాల తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు, జరుపుతూ అనేక నూతన గ్రంథాలు, ఫోటో అల్బంలు, ప్రభుత్వ పత్రాలు ప్రచురిస్తున్నది. ‘విశాలాంధ్ర’ నినాదాన్ని బలపరుస్తూ ప్రత్యే రాష్ట్ర నినాదాన్ని వ్యతిరేకిస్తూ తాము తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని తీర్పు ప్రకటించటానికా? చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఏదైనా కొత్త కుట్రకు పూనుకొన్నారా?

[ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com