‘సురవరం’ రచనలకు గ్రహణం వీడేదెన్నడు?
మే 28th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- సంగిశెట్టి శ్రీనివాస్
స్మృతిపథం నుంచి చెరిగిపోయిన చరిత్రకు జీవంపోసి, తెలుగువారి ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర సృజనశీలి, అభ్యుదయవాది సురవరం ప్రతాపరెడ్డి. (మే 28న ఆయన జయంతి). తెలంగాణ పునర్వికాసోద్యమంలో సాహిత్య, సాంస్కృతిక, చారిత్రిక రంగాల్లో పనిచేసిన ఈయన రచనలకు ఇంకా గ్రహణం వీడలేదు. తన సంపాదకత్వంలో 25 యేండ్లు నడిచిన గోలకొండ పత్రిక ప్రతులు కనుమరుగవుతున్నాయి. దానితోపాటే విలువైన తెలంగాణ సాహిత్యం కూడా సమాధి అయ్యే ప్రమాదముంది. గోలకొండ కవుల సంచికతో మొత్తం తెలంగాణ కవిత్వానికి విశేషమైన గుర్తింపు తెచ్చిన ప్రతాపరెడ్డి స్వీయ కవిత్వం ఇప్పటికీ పుస్తక రూపానికి నోచుకోలేదంటే అది తెలుగు సాహిత్యానికి తీరని లోటే. ఆయన ‘స్వవిషయ సంగ్రహం’ పేరిట రాసుకున్న స్వీయ చరిత్ర కూడా ముద్రణకు నోచుకోలేదు.
అంతెందుకు ఇంతవరకు సురవరం సమగ్ర రచనల సూచీ తయారు కాలేదు. రాయలసీమ ఉయ్యాలవాడకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి గురించి రాసిన సుదీర్ఘ వ్యాసం సీరియల్‌గా 1943లో గోలకొండలో అచ్చయింది. ఇది ఆయన్ని స్వయంగా చూసిన వ్యక్తుల నుంచి సేకరించి రాసిన గాథ. ఇదికూడా పుస్తక రూపంలో ముద్రణకాలేదు. ఈ లోటుపాట్లను సరిదిద్దుకుని ప్రతాపరెడ్డి సాహిత్యమంతా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముంది. 1917నుంచీ రాస్తూ వచ్చిన ప్రతాపరెడ్డి సమగ్ర రచనలు ఇప్పటికే పాఠక లోకానికి అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. 20 యేండ్ల క్రితం ‘సురవరం సాహిత్య వైజయంతి’ పేరిట అరడజనుపైగా పుస్తకాల్లో ఆయన రచనల్ని సురవరం కొడుకు ఎస్. ఎస్. రెడ్డి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి పూనికతో వెలువరించినప్పుటికీ అవి అసమగ్రం, ఇప్పుడలభ్యం.
ఆయన బతికున్న కాలంలోనే లుప్తమైన శుద్ధాంతకాంత (నవల) చంపకీ భ్రమరం (కావ్యం) మినహా మొదట్నుంచీ వివిధ పత్రికల్లో వెలువరిస్తూ వచ్చిన ఆయన రచనల్ని, ఇదివరకే పుస్తకరూపంలో వచ్చిన వాటిని ఒక ప్రణాళిక ప్రకారం ప్రచురించాల్సిన అవసరముంది. అచ్చులో దాదాపు పదివేల పుటల్లో ఇమిడే ఆయన రచనల్ని ఒక్క దగ్గరకు తీసుకురావడం యజ్ఞం వంటిది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టనట్లయితే భవిష్యత్‌లో అసాధ్యమయ్యే ప్రమాదముంది. సంగ్రామసింహ, యుగపతి సింహ, చిత్రగుప్తుడు, మిత్రగుప్తుడు, భావకవి రామమూర్తి, వెర్రి వెంగలప్ప, పండిత చిదంబర శాస్త్రి ఇలా అనేక మారుపేర్లతో ప్రతాపరెడ్డి రాశా డు. విన్నారా? విజ్ఞానవర్ధిని, కవిలె కట్టలు శీర్షికన గోలకొండ పత్రికలో వెలువరించిన రచనలు అందరికి తెలియాలి.
గోలకొండలోనే 1926లో దాని స్థాపన కాలంనుంచి 1948 వరకు, అంతకు ముందు ఆ తర్వాత ‘ప్రజావాణి’ తెలం గాణ, మీజాన్, ప్రబుద్దాంధ్ర, రెడ్డిరాణి, మాతృసేవ, సుజాత, శోభ, విద్యుల్లేఖ ఇలా చాలా పత్రికల్లో సాహిత్యం, రాజకీయం, సమాజం, సంస్కృతి, చరిత్ర తదితర అంశాలపై వివిధ ప్రక్రియల్లో రచనలు వెలువరించారు. ఇవన్నీ సమగ్ర సంకలనాల్లో చోటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సురవరం తెలుగు సాహిత్యానికి చేసిన సేవ, ఆయన వ్యక్తిత్వంపై సాధికారికంగా అంచనా వేయడానికి వీలుగాదు. సురవరంలాగానే పత్రికా సంపాదకుడుగా ఉంటూ వివిధ విషయాలపై రచనలు చేసిన నార్ల వెంకటేశ్వరరావు రచనల్ని పది సంపుటాల్లో ఆయన కుటుంబీకులు, అభిమానులు కలిసి సమగ్ర సంకలనంగా వెలువరించారు. అలాగే ఇటీవల కాలంలో సి. నారాయణరెడ్డి రచనలు 16 సంపుటాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలాగే సురవరం ప్రతాపరెడ్డి రచనలు కూడా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతాపరెడ్డి రచనలు అత్యధికంగా చోటు చేసుకున్న గోలకొండ పత్రికల సంపుటాలు ఒకటి రెండు ప్రదేశాల్లో మాత్రమే అదికూడా అసమగ్రంగా అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రెస్ అకాడెమీ లాంటి సంస్థలు పూనుకొని స్కాన్ చేయించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచినట్లయితే 1926 నుంచి నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాల, సాహిత్య, సామాజిక చరిత్ర కండ్లకు కట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికలు మైక్రోఫిల్ముల రూపంలో లభ్యమవుతున్నాయి. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడ్డ ప్రముఖ పత్రిక గోలకొండ అందుబాటులో లేని లోటు అధిగమించాలంటే వాటిని స్కాన్ చేయించాల్సిందే. ఈ వ్యాస రచయిత ఇప్పటికే ప్రతాపరెడ్డి రాసిన దండకాలు మినహా మిగతా కవిత్వమంతా సేకరించాడు. వాటి ని పుస్తక రూపంలో తేవడానికి, అలాగే ఆయన సమగ్ర రచనల సూచీ వెలువరించే ప్రయత్నంలో ఉన్నాడు. విజ్ఞులు, పండితులు, ప్రతాపరెడ్డి అభిమానులు తమ దగ్గర గల రచనల వివరాలు తెలియజేసినట్లయితే ఈ సూచీ సమగ్రం అయ్యేందుకు వీలుంది.
- సంగిశెట్టి శ్రీనివాస్ (సెల్; +91-98492-20321)
(ఆంధ్రజ్యోతి వివిధ, 28 మే 2007 సౌజన్యం)





