Feed on
Posts
Comments

- యం.డి. యాకుబ్‌పాషా

Aelay Laxman Potrait‘అబ్బ అదిరింది గురూ. హాలివుడ్‌ బ్రోచర్‌లా ఉంది. ఎక్కడ డిజైన్‌ చేయించావు? అమెరికాలోనా?’ అంటూ ఒకాయన ‘సత్య‘ సినిమా బ్రోచర్‌ చూస్తూ రామ్‌గోపాల్‌వర్మని ఆసక్తిగా అడిగాడు.

‘నీలాగే చాలామంది అడిగారు. కాని ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్పనా …దీన్ని డిజైన్‌ చేయించింది అమెరికాలో కాదు, హైదరాబాద్‌లో. అక్కడ ఒక చిన్న అపార్ట్‌మెంట్‌ ఉంది. అందులో ఒక చిన్న సెల్లారు ఉంది. ఆ సెల్లార్‌లో ఎప్పుడూ బొమ్మలు వేసే ఒక ఆర్టిస్ట్‌ ఉంటాడు. ఆయన దగ్గరే వేయించాను’ అన్నాడు వర్మ కొంత నాటకీయంగా. ఆ ఆరిస్టే లక్ష్మణ్‌ ఏలె. రామ్‌గోపాల్‌వర్మకు ఇష్టమైన పబ్లిసిటి డిజైనర్‌ లక్ష్మణ్‌ ఏలె.

మనీ మనీ, అనగనగా ఒకరోజు, సత్య, రంగీల, దెయ్యం…మొదలైన వర్మ సినిమాలకు లక్ష్మణ్‌ ఏలె పబ్లిసిటి డిజైనర్‌గా పని చేశారు. చిత్రమేమిటంటే చిత్రసీమలో ఆయనకు చేతినిండా అవకాశాలు వస్తున్నా వాటికి దూరంగా జరిగి చిత్రరచనలోనే కొనసాగడం.

లక్ష్మణ్‌ ప్యాలెట్‌ను తేరిపార చూసిన వారికి అందులో ముతకరంగులైన జాజు, సున్నం, ఎర్రబొట్లు మాత్రమే కాదు పల్లెసంగీతం కూడా పసందుగా వినిపిస్తుంది.

తన కుంచెను ఒక వాయిద్యంగా మలుచుకున్న ఈ చిత్రకారుడు దేశ,విదేశాల్లో కదిరేనిగూడెం చిత్రరాగాలను కమ్మగా వినిపిస్తున్నాడు.

‘సాధన చేయనిదే చేయి తిరగదు. కష్టపడనిదే ఫలితం దక్కదు’ అని చెబుతున్న లక్ష్మణ్‌ ఏలె ఫెయిల్యూర్‌ స్టోరీ ఈ వారం:

* * *

Aelay Laxman Paintingభువనగిరికి ఇరవైఅయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే కదిరేనిగూడెం మా ఊరు. మా నాయిన మగ్గం నేసేవాడు. అమ్మ కూలీకి వెళ్లేది. మా పెదనాయినకు పిల్లలు లేకపోవడంతో చిన్నప్పుడే నన్ను సాదుకున్నారు.
చదువులో నేను ఎప్పుడూ వెనకబెంచీ స్టూడెంటునే.
ఎప్పుడూ అత్తెసరు మార్కులతోనే పాసయ్యేవాడిని.
నేను ఎవరితో కలిసేవాడిని కూడా కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడిని. అందరూ ఆటలు ఆడుతుంటే నా లోకంలో నేను ఉండేవాడిని. మాకు నాలుగైదు బర్లు ఉండేవి. వేసవికాలంలో నేనే వాటిని కాసేవాడిని. మోదుగాకులు కోసుకొచ్చేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే ఆడపిల్లలు ఇంట్లో చేసే పనులన్నీ నేనే చేసేవాడిని.

మా ఇంట్లో నాయినమ్మ ఫోటో ఒకటి ఉండేది. గోడకు తగిలించిన ఆ ఫోటో చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆ ఫోటోను చూసినప్పుడల్లా ఎందుకోమరి బొమ్మలు గీయాలనే ఆలోచన వచ్చేది. తలకు కొబ్బరినూనె రాసుకునేవాళ్లం కదా…ఒక తెల్లకాగితాన్ని తలకు రుద్దేవాడిని. అది ట్రాన్స్‌పరెంట్‌గా తయారయ్యేది. దాన్ని వేరే బొమ్మల మీద పెట్టి ట్రేసింగ్‌ చేసేవాడిని. అలా బొమ్మలు వేయడం అలవాటైంది.
నా చేతిరాత కుదురుగా ఉండడం, బొమ్మలు వేస్తుండడంతో నాకు స్కూల్లో మెల్లమెల్లగా గుర్తింపు రావడం ప్రారంభమైంది. తోటి విద్యార్థుల నోటుబుక్స్‌ మీద పేర్లు రాయడం మొదలు టీచర్లకు సైన్స్‌బొమ్మలు వేసివ్వడం వరకు చేసేవాడిని.

* * *

పదవతరగతి చదవడం కోసం భువనగిరికి వచ్చాను. అక్కడే రూమ్‌ తీసుకొని ఉండేవాడిని. మా రూమ్‌కు దగ్గర్లో ఒక ఆర్టిస్ట్‌ బొమ్మలు గీస్తూ ఉండేవాడు. ఆయన ఎలా గీస్తున్నాడో చూద్దామని భయభయంగా తొంగిచూసేవాడిని.
‘ఏయ్‌ ఎవడ్రా అది’ అని ఆయన అరవగానే పరుగెత్తుకు పారిపోయేవాడిని.
రూమ్‌కు వచ్చి ఆ ఆర్టిస్ట్‌ ఎలా గీస్తున్నాడో అలా గీయడానికి ప్రయత్నించేవాడిని.
మగ్గం నేసే వాళ్ల గురించి ఒక మాట చెబుతారు. ‘నేస్తేనే బువ్వ’ అని.
మగ్గం బతుకులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లది ఎప్పుడూ దుఃఖపు రాతే. కొద్దిరోజుల తరువాత ఆర్థిక ఇబ్బందులతో మా నాయిన నాకు డబ్బులు పంపించలేని పరిస్థితి వచ్చింది.
‘ఇప్పుడెట్లా?’ అని ఆలోచించాను.

చదువు మానెయ్యలేను. అలా అని అప్పు కూడా చేయలేను. చేద్దామన్నా ఇచ్చేవారు కూడా లేరు. అప్పుడు నా దోస్తు కుంచె గుర్తుకు వచ్చింది.

‘నా దగ్గర కాస్తో కూస్తో బొమ్మలేసే పనితనం ఉన్నది. నాయిన డబ్బులు పంపకపోతే ఏంది? ఆ డబ్బుల్ని నేను సంపాదించుకోలేనా?’ అనుకున్నాను. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. బ్యానర్లు, సైన్‌బోర్డ్‌లు రాయడం మొదలుపెట్టాను. నా ఖర్చు వరకు నేను సంపాదించుకోగలిగాను. కాలేజి బోర్డ్‌ రాసిపెట్టినందుకు ఇంటర్‌లో ట్యూషన్‌ ఫీజు మాఫ్‌ చేసారు ప్రిన్సిపాల్‌గారు.
ఇంటర్‌లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ అంటుండె- ‘అరె భయ్‌ కార్టూన్లు గీసుడు నేర్చుకో. మంచి లైఫ్‌ ఉంటది’ అని.
ఆయన చెప్పినట్లే కార్టూన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించాను. గీసిన కార్టూన్లన్నీ ప్రతికలకు పంపేవాడిని.కాని ఒక్కటి కూడా ప్రచురితమయ్యేది కాదు. దీంతో నాకు విసుగొచ్చి- ‘ఇదేదో మనకు పనికొచ్చే విషయం కాదు’ అని కార్టూన్స్‌ గీయడం వదిలేసాను.
ఇంటర్మీడియేట్‌ తరువాత డిగ్రీ కోసం హైదరాబాద్‌కు వచ్చాను.

* * *

ఆర్ట్స్‌ కాలేజిలో బి.కాంలో చేరాను. నిజానికి ఇంటర్‌లో నాది బైపిసి. బియస్సీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని, పార్ట్‌టైం ఉద్యోగం చేసే అవకాశం ఉండదని భయపడి బి.కాంలో చేరిపోయాను.

డిగ్రీలో చేరడానికి ముందు హైదరాబాద్‌లోని ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరాను. రోజు అయిదు రూపాయల కూలీ. మల్కాజిగిరిలో ఫ్రెండ్‌ గదిలో ఉండేవాడిని. డ్యూటీ అయిపోయేసరికి రాత్రి రెండయ్యేది. కెమికల్‌ ఫ్యాక్టరీ ఉన్న నాచారం నుంచి మల్కాజిగిరికి నడిచేవెళ్లేవాడిని. చుక్కలు కనిపించేవి!

నడవడం అయ్యేపని కాదు అనుకొని ఊరి నుంచి సైకిల్‌ తెచ్చుకున్నాను. సై కిల్‌ను తెచ్చుకోవడానికి అయ్యే ట్రాన్స్‌పోర్ట్‌ డబ్బులు లేకపోవడంతో దాని మీదే హైదరాబాద్‌కు వచ్చాను. కంపెనీలో రోజూ పెద్ద పెద్ద డబ్బాలు మోయాల్సి వచ్చేది. నరకం కనిపించేది!
ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు ఒక షాపులో సైన్‌బోర్డులు రాసే పనికి కుదిరాను. రోజు అయిదారు రూపాయలు ఇచ్చేవాళ్లు.
నేను డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా ‘లే అవుట్‌ ఆర్టిస్ట్‌లు కావలెను’ అని ఈనాడులో ఒక ప్రకటన చూశాను. వెంటనే అప్లై చేశాను. ఇంటర్వ్యూలో-
‘డిగ్రీ చదువుతున్నాను. బొమ్మలు గీయడం వచ్చు. అక్షరాలు బాగా రాయగలను’ అని చెప్పాను. గీసి చూపించమంటే చూపించాను.
‘బొమ్మలు బానే ఉన్నాయిగానీ నువ్వు చదువుకుంటున్నావు కదా. నీకు ఉద్యోగం ఎందుకు? వెళ్లి బుద్దిగా చదువుకో’ అన్నారు ఇంటర్వ్యూ చేసిన చలసాని ప్రసాదరావుగారు.

‘చదువుకోవడానికి డబ్బులు లేవు సార్‌. ఎలాగైనా సరే ఉద్యోగం ఇప్పించండి సార్‌’ అన్నాను. పాపం ఆయన నా మొర ఆలకించి ఉద్యోగం ఇప్పించారు. చదువు, ఉద్యోగం…రెండు పడవల మీద ప్రయాణం మొదలైంది. నా ఆర్థిక ఇబ్బందులు తెలుసు కాబట్టి కాలేజికి రెగ్యులర్‌గా వెళ్లకపోయినా లెక్చరర్లు చూసీ చూడనట్లు వదిలేసేవారు.

అప్పటివరకు ఏది పడితే అది గీయడమే కాని ఆర్ట్‌ గురించి నాకు ఏమీ తెలియదు. చలసాని పరిచయంతో ఆర్ట్‌ గురించి రకరకాల విషయాలు తెలుసుకున్నాను. చిత్రకళ మీద ఆయన రాసిన పుస్తకాలు చదివేవాడిని.

‘బావిలో కప్ప తాను ఉన్నదే లోకం అన్నట్లు ఇప్పటి వరకు నాకు తెలిసిందే ఆర్ట్‌ అనుకున్నాను. అసలు ఆర్ట్‌ గురించి నాకు ఏమీ తెలియదు. చాలా తెలుసుకోవాలి’ అనుకున్నాను. ఆర్ట్‌ మీద వచ్చిన ఏ వ్యాసాన్ని, పుస్తకాన్ని వదిలేవాడిని కాదు. చివరికి మిర్చీలు కట్టిన పేపర్‌ను కూడా వదిలేవాడిని కాదు. అందులో ఏదైనా బొమ్మ ఉంటే ‘ఒక పట్టు పట్టి చూద్దాం’ అని ప్రాక్టీస్‌ చేసేవాడిని.
సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లి పాత పుస్తకాలను తీసి అందులో ఉన్న బాపు బొమ్మలను ప్రాక్టీస్‌ చేసేవాడిని. ప్రతి ఆదివారం బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌కు వెళ్లి నా స్కెచ్‌బుక్‌ నిండా బొమ్మలు గీసేవాడిని.

మనసులో ఒక తపన…ఆర్ట్‌లో బాగా పేరు తెచ్చుకోవాలి అని. అందుకే నా సర్వస్వం ఆర్టే అయింది. చాలాకాలం వరకు నేను పెళ్లయిన బ్రహ్మచారిని. నాకు డిగ్రీ మొదటి సంవత్సరంలోనే పెళ్లయింది. నాకు వచ్చే జీతంతో నేను బతకడమే కష్టం. ఇంకా భార్యను ఎక్కడ తెచ్చుకుంటాం అనుకునేవాడిని. అందుకే ఆమె ఊర్లోనే ఉండేది. నా జీతం వెయ్యిరూపాయలు అయిన తరువాత ‘హమ్మయ్య ఇప్పుడు బతికేయొచ్చు’ అని ఆమెను నా వెంట తెచ్చుకున్నాను.

* * *

Aelay Laxman painting

ఆర్ట్‌ గురించి ఇంకా… ఇంకా తెలుసుకోవాలనే తపనలో భాగంగా ఫైన్‌ ఆర్ట్స్‌ చదవాలనే కోరిక కలిగింది. మొదటిసారి రాసినప్పుడు సీటు రాలేదు. రెండోసారి మాత్రం స్కల్‌ప్చర్‌, పెయింటింగ్‌, కమర్షియల్‌ ఆర్ట్‌లో సీటు వచ్చింది. పెయింటింగ్‌ను ఎంచుకున్నాను.
నా ఆఫీసు డ్యూటీ పది నుంచి ఐదు వరకు. కాలేజి పది నుంచి మూడు వరకు. సెకండ్‌ షిప్ట్‌ ఇవ్వమని ఆఫీసులో అడిగితే కుదరదని చెప్పారు. ఉద్యోగమో, చదువో రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగం అక్కర్లేదు. నాకు ఇష్టమైన ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుదామంటే సంసారాన్ని ఎలా నెట్టుకు రావడం? అప్పటికి నాకు ఒక కూతురు కూడా.

ఈ డైలామాలోనే ఒక పెద్ద ఆర్టిస్ట్‌ను ‘ఏం చేయమంటారు?’ అని సలహా అడిగాను.

‘ఫైన్‌ ఆర్ట్స్‌ చేసి మేము ఊడబొడిచింది ఏమీ లేదు. చదివి నువ్వు కూడా ఊడబొడిచేదేమీ లేదు. బుద్దిగా ఉద్యోగం చేసుకోవడమే మంచిది’ అన్నాడు.

ఏ ఉద్దేశంతో అలా అన్నాడోగానీ నాకు ఆయన సలహా ఏ మాత్రం నచ్చలేదు. ఫైన్‌ ఆర్ట్స్‌ చేయాలనే పట్టుదల మరింత పెరిగింది. ఏదైతే అదవుతుంది అనుకొని ఉద్యోగం మానేసాను. ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరిపోయాను. కొద్దిరోజులకు అదృష్టవశాత్తు కిరణ్‌ యాడ్స్‌లో పార్ట్‌టైం ఉద్యోగం దొరికింది. కాలేజి పూర్తయిన వెంటనే ఆఫీసుకు వెళ్లి వర్క్‌ చేసేవాడిని. చదువు- ఉద్యోగం-సంసారం… ఇంక చెప్పేదేముంది. పనిలో భాగంగా నిద్రలేని రాత్రులు కూడా చాలానే గడిపేవాడిని. ఇంత ఒత్తిడిలోనూ బ్రష్‌ అందుకుంటే చాలు మనసు దూది పింజలా తేలిపోయేది. కొంత కాలం తరువాత నేనే సొంతంగా ‘ఏలె డిజైన్‌ గ్రూప్‌’ మొదలు పెట్టాను.

* * *

సినీ నటుడు ఉత్తేజ్‌ నాకు బంధువు. అతని ద్వారా రామ్‌గోపాల్‌వర్మ పరిచయమయ్యాడు. ఆయన తీసిన చాలా సినిమాలకు పబ్లిసిటి డిజైనర్‌గా పనిచేశాను. వేరే సినిమాలకు కూడా బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. హ్యాపీగా ఆ పని చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. కాని ‘నేను చేయాల్సిన పని ఇది కాదేమో’ అనుకోవడంతో అవకాశాలు వచ్చినా వాటికి దూరంగానే జరిగాను. పెయింటర్‌గా రాణించాలనేది నా లక్ష్యం. దాని కోసమే పనిచేయాలనుకున్నాను.
నేను ఎప్పుడూ కవులు, రచయితలతో టచ్‌లో ఉండేవాడిని.అలా పోస్ట్‌మోడర్నిజం ధోరణుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. స్త్రీ, దళిత వాదాలు అవగాహనకు వస్తున్న కాలంలో నాలో ఒక అంతర్మధనం.

Aelay Laxman paintingనేల విడిచి సాము చేయరాదు అనేది ఒక సామెత. మరి నా నేల ఎక్కడుంది? నా మూలాలు ఎక్కడున్నాయి? అనే ఆలోచన బయలుదేరింది.కదిరేనిగూడెంలోనే నా మూలాలు ఉన్నాయి. ఈ జ్ఞానంతోనే నా ఊరికి బయలుదేరాను. చిత్రమైన విషయం ఏమిటంటే అప్పుడు నా ఊరు నాకే కొత్తగా కనబడింది. అడుగడుగునా కళాత్మకత కనబడింది. ముత్తాదుకు(గీతకార్మికులు నడుముకు కట్టుకునే పట్టి) లొట్లు పెట్టుకొని గౌడు పొలం వెంట నడుస్తుంటాడు… గొల్లోల్ల బుచ్చయ్య తనదైన ఆహార్యంలో అందంగా కనిపిస్తాడు. ముసలవ్వ తన్మయంగా సుట్ట తాగుతూ కనిపిస్తుంది. ఇసుర్రాయి సంగీతం వినిపిస్తుంది. ఇలా నా ఊళ్లో ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా కళే కనిపించింది. ఇక అది మొదలు నా కుంచె నా వేళ్లను తడమడం మొదలుపెట్టింది.

1999లో రవీంద్రభారతిలో ‘ఇమేజెస్‌ ఆఫ్‌ కదిరేనిగూడెం’ అని నా చిత్రప్రదర్శన పెట్టడానికి ముందు జరిగిన సంఘటన ఇది: నేను గీసిన పెయింటింగ్స్‌ను చూపించడానికి ఒక ఆర్ట్‌ కలెక్టర్‌ దగ్గరికి వెళ్లాను. ఆమె పెయింటింగ్స్‌ను చూసి ‘బ్యూటిఫుల్‌’ అన్నారు. అంతలోనే ఒక పెద్ద ఆర్టిస్ట్‌కు ఫోన్‌ చేసి నా గురించి ఏదో అడిగారు. అప్పటివరకు ‘బ్యూటిఫుల్‌’ అన్న వ్యక్తి మాట మార్చింది. తరువాత చూద్దాంలే అంది. తరువాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే నా చిత్రాల గురించి అభిప్రాయం అడిగినప్పుడు ఆ పెద్ద ఆర్టిస్ట్‌ ‘బేకార్‌ హై జీ…అవి కూడా బొమ్మలేనా?’ అన్నాడు అని. రెండు మూడు రోజుల వరకు కోలుకోలేదు నేను. ఇంకా కొందరైతే ‘లక్ష్మణ్‌ పెయింటర్‌ కాదు. కార్టూనిస్ట్‌, ఇలస్ట్రేషన్లు వేసేవాడు’ అని చెవులు కొరికారు. ఒకసారి నా వర్క్సును చూపెట్టడానికి ఒక ఆర్ట్‌గ్యాలరీకి వెళితే ‘యూ హ్యావ్‌ అపాయింట్‌మెంట్‌?’ అని ముఖం మీదనే తలుపులేసారు. ‘కాలమే నా చిత్రాల గురించి చెబుతుందిలే’ అని చాలా ఓపికగా భరించాను. నా నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు ఆర్ట్‌లో అంతర్జాతీయస్థాయిలో నాకంటూ గుర్తింపు ఉందని సగర్వంగా చెప్పగలను. నా బొమ్మల్లో సత్తా లేకపోతే, జీవం లేకపోతే నా బొమ్మలు చూసి ఇష్టపడిన ఒకతను ఎక్కడో స్విట్జర్లాండు నుంచి నన్ను వెదుక్కుంటూ హైదరాబాద్‌ రాడు కదా! అనేక దేశాల్లో నా చిత్రాలు అమ్ముడుపోవు కదా!!

(ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫెయిల్యూర్ స్టోరీ, 27 మే 2007 సౌజన్యం)

2 Responses to “లక్ష్మణ్‌ ఏలె : చిత్రకారుడు”

  1. 1
    ramulu Says:

    ఏలే గురించి చెప్పడానికి నావద్ద తగినంత మాటల చతురత లేదు. ఏలే మానల్ల్గొండ జిల్లవాడైనందుకు , తెలంగాణకు ఒక ముద్దుబిడ్డను మాజిల్ల ఇవ్వగలిగినందుకు ఎంతోసంతోషంగా ఉంది. ఏలే పడిన కష్టాలు కష్టపడుతున్న ,పైకి పోవాలని తపించే ఎందరికో మార్గదర్శ కంగా ఉంటాయనడంలో సందేహంలేదు. ఇలాంటి మన తెలంగాణ లోని గొప్పవాళ్ళ గురించి ఇలాగే పరిచయం చేస్తూ మరుగున పడిన మాణిక్యాలను వెలికి తీయండి.
    రాములు

  2. 2
    Telangana Rajanna Says:

    ఏలె లక్ష్మణ్ లాంటి చిత్రకారుడు మన తెలంగాణాలో పుట్టడం మన తెలంగాణాకు గర్వ కారణం.
    తను అంతటి కష్టాలను అనుభవిస్తూ కూడ చిత్రకళ పై ఆయన చూపిన అభిమానం చిత్రకళలో నిలదొక్కుకోవాలనుకునే వారికి ఒక ఆదర్శం. నేతి తెలంగాణ యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని అభిరుచి ఉన్న రంగంలో ముందుకు సాగాలని, ఉన్నత స్థానాన్ని అందుకోవాలని మన తెలంగాణా ఉనికిని కాపాడాలని ఆకాంశిస్తూ మీ …. తెలంగాణా రాజన్న, పాలమూర్ జిల్లా.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com