తెలంగాణ - బాబ్లీ ప్రాజెక్ట్
జూన్ 16th, 2007 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలు తీరుస్తోన్న శ్రీరాంసాగర్, బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల 18 లక్షల ఎకరాల ఆయట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందంటున్న రఘువీర్
తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తెచ్చేవి ప్రస్తుతం అతి వేగంగా నిర్మితమవుతున్న బాబ్లీ, పోతిరెడ్డి ప్రాజెక్టులేనని రాజకీయ నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్రకు లాభం చేకూరిస్తే, పోతిరెడ్డిపాడు కడపకు లబ్ది చేకూరుస్తుంది. ఆయా ప్రాంతా లకు లబ్ది చేకూర్చే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తేనున్నాయి. అందులో బాబ్లీ ప్రాజెక్ట్ తెలంగాణకు మరణ శాసనంగా మారనుంది. ఎంతో కొంత సాగునీటిని అందిస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కే ఎసరుపెడుతుంది. తాగునీటి సౌకర్యం పేరుతో బాబ్లీ ప్రాజెక్ట్ చేపట్టినా, దానికి గేట్లు నిర్మించి ఏకంగా 60 టిఎంసీల వరకు కొట్టేసే యత్నాలు చేస్తున్న మహారాష్ట్రపై రాష్ట్రంలోని అన్ని పార్టీలూ, అన్ని ప్రాంతాల నేతలు, ఇంజనీరింగ్ నిపుణులూ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర నేత శరద్‌పవార్ కోసం తెరాస నేత కెసిఆర్ మొదట మెతక వైఖరి అనుసరించినా, పార్టీలో ఒత్తిడి రావడంతో చివరికి ఆయన కూడా సుప్రీం కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. విపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాబ్లీపై రెండేళ్లుగా ఆందోళనలు చేయిస్తున్నా, ఆయన హయాంలోనే ఈ బాబ్లీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన అంశానికి ఆయన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. బాబ్లీతో పొంచి ఉన్న ప్రమాదాన్ని అధికారంలో ఉండగా గుర్తించలేని టిడిపి, విపక్షంలోకి వచ్చాక గగ్గోలు పెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఇకపోతే వైఎస్ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో పోరాటం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పరిష్కరించే పరిస్థితిలో లేదు. బాబ్లీ వద్ద టిడిపిి లాఠీ దెబ్బలు తిన్నా, ఢిల్లీలో ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏకంగా టిడిపి వైఖరినే తప్పుపట్టారు. మొత్తంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ నేతల పరస్పర విమర్శలు, మరో పక్క ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం మహారాష్ట్ర దూకుడుకు అవకాశం కల్పించింది. ప్రజలు నీళ్ల రాజకీయాన్ని అర్థం చేసుకుని స్వతహాగా పోరాటం ద్వారానే బాబ్లీ అక్రమాలను నియంత్రించ వచ్చు. బాబ్లీపై ప్రస్తుత పరిస్థితులను ఈ వ్యాసంలో వివరించాను.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డ్యాం పనులకు 1964లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. నిర్మాణ వ్యయం (2005 నాటికి) రు. 2,900 కోట్లు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నిలువ సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్) 1091 అడుగులుగా నిర్దేశిస్తూ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 1975, అక్టోబర్ 6న ఒక అంగీకారం కుదిరింది. ఈమేరకు మహారాష్ట్ర గోదావరిపై పైథాన్ డ్యాం స్థలం వరకూ, పూర్ణా నదిపై సిద్ధేశ్వర డ్యాం వరకూ నీటిని ఉపయోగించుకోవచ్చును. గోదావరి బేసిన్‌లో గోదావరిపై పైథాన్ డ్యాం స్థలానికి దిగువనా, పూర్ణానదిపై సిద్ధేశ్వర డ్యాంకు దిగువనా, మంజీరా నదిపై నిజాంసాగర్ డ్యాంకు దిగువనా, గోదావరిపై పోచంపాడు (శ్రీరాంసాగర్) డ్యాం వరకూ మహారాష్ట్ర 60 టి.ఎం.సి.ల నీటి వినియోగం వరకు కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ 1091 ఎఫ్.ఆర్.ఎల్., 1093 ఎం.డబ్ల్యూ.ఎల్.తో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించుకొని, డ్యాంవద్ద లభ్యమయ్యే మిగులు నీటిని యథేచ్ఛగా వినియో గించుకోవచ్చు. పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భూమి, కట్టడాల స్వాధీనతకు మహారాష్ట్ర తగు చర్యలు తీసుకోవాలి. అలా స్వాధీన పరుచుకున్న ఆస్తులకు ఆంధ్రప్రదేశ్ నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా మహారాష్ట్ర జయక్వాడి (పైథాన్) డ్యాం నుంచి శ్రీరాంసాగర్‌కు ఎగువగా ఐదు ప్రాజెక్ట్‌లను నిర్మించింది.
అవి 1) మాజల్‌గాబ్ (12.4 టి.ఎం.సి), 2) దూద్నా (14 టి.ఎం.సి), 3) మంజీరా (11.2 టి.ఎం.సి), 4) తెర్నా (11 టి.ఎం.సి), 5) విష్ణుపురి (11.4 టి.ఎం.సి) లు మొత్తం 60 టి.ఎం.సి లు. ఒప్పందం ప్రకారం 60 టి.ఎం.సి ల నీటిని మించకుండా మహారాష్ట్ర వినియోగించ వలసి ఉండగా, ఈ ఐదు ప్రాజెక్ట్‌లను 60 టి.ఎం.సిల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించటం గమనార్హం. అంటే మహారాష్ట్ర వాస్తవంగా వినియోగిస్తున్నది 90 టి.ఎం.సిలు (10 టి.ఎం.సిల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌లో 15 టి.ఎం.సిల నీటిని వినియోగిస్తారన్న ప్రమాణం ఆధారంగా). విష్ణుపురి ప్రాజెక్ట్‌ు దిగువన మహారాష్ట్ర 11 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. వీటికి కేంద్ర జల సంఘం అనుమతిలేదు. నీటి కేటాయింపులు లేవు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ అనధికారి కంగా, అక్రమంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల వివరాలు : 1) అందూరా (0.32 టి.ఎం.సి), 2) డిగ్రాస్ (1.70 టి.ఎం.సి), 3) మూలీ (0.32 టి.ఎం.సి), 4) ముద్గల్ (0.36 టి.ఎం.సి), 5) ధాలేగాన్ (0.42 టి.ఎం.సి), 6) లోనీసాంగ్వీ (1 టి.ఎం.సి), 7) రాజాతక్లీ (0.83 టి.ఎం.సి), 8) మాంగ్రూస్ (0.83 టి.ఎం.సి), 9) జోగ్లాదేవి (0.32 టి.ఎం.సి), 10) అప్పీగాఁవ్ (0.24 టి.ఎం.సి), 11) బాబ్లీ (2.74 టి.ఎం.సి) - మొత్తం 9.08 టి.ఎం.సిలు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ డ్యాం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనే ఉంది. శ్రీరాంసాగర్ జలాశయం వరకూ 126 కిలోమీటర్లు పొడవునా 90 టి.ఎం.సిలకు పైగా గోదావరి జలాలనిల్వలు ఉంటాయి. ఇందులో 71 కిలోమీటర్ల దూరం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండగా, 55 కిలోమీటర్ల దూరం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. బాబ్లీ బ్యారేజీ 1070 అడుగుల ఎత్తున నిర్మిస్తున్నారు. దీని పూర్తి జలస్థాయి 1109 అడుగులు. అంటే బాబ్లీ ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ జలాశయంలోకి చొచ్చుకుపోవడం వల్ల 1070 అడుగుల నుంచీ 1091 అడుగుల వరకూ జలాశయం నీటిని మహారాష్ట్ర ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. శ్రీరాంసాగర్ జలాశయంలో 1091 అడుగుల దాకా ముంపునకు మహారాష్ట్ర ఒప్పుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని మహారాష్ట్ర తీసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకోవడం ఆంధ్రప్రదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని, తద్వారా ట్రిబ్యునల్ నిర్ణయాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా జలాశయంలో మరో ప్రాజెక్ట్ నిర్మించటం చట్ట వ్యతిరేకం. 1093 అడుగుల వరకు ముంపును మహారాష్ట్ర అంగీకరించి, నష్టపరిహారం తీసుకొని, శ్రీరాంసాగర్ జలాశయం లోపల డ్యాంని కట్టడం అంతర్‌రాష్ట్ర ఒప్పందాల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య. 1956 నాటి అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టానికి పూర్తిగా వ్యతిరేకం.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయం
తెలంగాణ ప్రాంతానికి వరప్రసాదిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజల సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాల ను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తీరుస్తోంది. బాబ్లీ నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతంలోని 18 లక్షల ఎకరాల ఆయట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వరదనీరు ఎక్కువ వచ్చి బాబ్లీ నుంచి నీరు విడుదల చేసినా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో వరద జలాలు నిలువచేసుకు నేందుకు స్థలం ఉండదు. ఎందుకంటే బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయ భాగంలోనే ఉంది. బాబ్లీ దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఉంది. బాబ్లీ గేటు మూసేస్తే శ్రీరాంసాగర్‌లోకి నీళ్లు రావు. బాబ్లీ గేట్లు తెరిస్తే మాత్రం శ్రీరాంసాగర్‌లోని నీళ్లు బాబ్లీలోకి వెళతాయి. బాబ్లీ ప్రాజెక్ట్ సామర్థ్యం 2.7 టి.ఎం.సిలని చెబుతున్నా వాస్తవానికి ఇక్కడ నుంచి వాడుకునే నీరు దాదాపు 60 టి.ఎం.సిల కంటే ఎక్కువగా ఉంటుంది. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉంటే బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ల వద్ద సుమారు 18 అడుగుల మేర నీరు ఉంటుంది. కావాలనుకున్నప్పుడు ఈ నీటిని వాడుకునేందుకు మహారాష్ట్ర కు అవకాశం ఉంటుంది. ఇందువల్ల మనకు రావల్సిన నీటిని అక్రమంగా పొందే సౌకర్యం మహారాష్ట్రకు ఏర్పడుతుంది. శ్రీరాంసాగర్ ఇన్‌ఫ్లో ఆధారంగా అక్టోబర్ 28 తరువాతే బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసి వేయాలి. ఇది సాధ్యపడే విషయమేనా?
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంపై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం (ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్, జస్టిస్ జి.కె. జైన్, జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్) ఈ ఏడాది ఏప్రిల్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల వివరాలు : ‘బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగించు కోవచ్చు. అయితే తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ప్రతిపాదిత 13 గేట్లు ఏర్పాటు చేయకూడదు. ఈ రిట్‌పై తదుపరి నిర్ణయం తీసుకు నేంతవరకు నదీ జలప్రవాహానికి మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకూడదు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం నదీ జలాల్లో తన వాటా (ఈక్విటీ) కోరకూడదు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం.’ అని తెలిపారు
తెలుగుదేశం ప్రతిస్పందన
బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. మధ్యంతర తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. బాబ్లీ ప్రాజెక్ట్‌కు గేట్లు పెట్టకపోయినా తెలంగాణ ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే గోదావరి జలాలు నిలిచిపోవడం ఖాయం. మహారాష్ట్ర గోదావరి నది ఎగువ భాగాన ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని లాగేసుకొంటోంది. ఈ లిఫ్ట్‌లు పెట్టకుండా నిరోధిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించి బాబ్లీ వివాదాన్ని న్యాయపరమైన దృష్టితో పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో కోర్టు వెలుపల పరిష్కార మార్గాన్ని కనుగొని ఉంటే ఈ ప్రమాదం నుంచి బయటపడి ఉండేవాళ్లం. మహారాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష ధోరణీ, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణీ, రాష్ట్ర ప్రభుత్వ అలక్ష్యం తెలంగాణ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో ఆందోళన కొనసాగించి బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని, గోదావరి నదిపై మహారాష్ట్ర ఎత్తిపోతల పథకాలను నిలుపు చేసేంతవరకూ ఉద్యమాన్ని కొనసాగించి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం.
మంత్రి పొన్నాల స్పందన
సాధారణంగా జరిగే నదీ ప్రవాహానికి అడ్డురావద్దని, సుప్రీంకోర్టు ఒక అంశంలో పేర్కొంది. రెండోది గేట్లు అమర్చడానికి వీలు లేదు. మళ్లీ ఆర్డర్ వచ్చేంతవరకు అమర్చరాదు. మూడవది ఇప్పటివరకు కట్టడానికి ఖర్చులుగానీ, నీళ్లుగానీ, ఈక్విటీగాని అడగరాదు. ఒరిజినల్ సూట్ ఫైనలైజ్ అయ్యేంతవరకు, అంటే నది లోపల నదీ ప్రవాహానికి ఎటువంటి కన్‌స్ట్రక్షన్ ఉండరాదు. గేట్లు అమర్చకూడదు. అంటే గేట్లు అమర్చితే తప్ప అక్కడ నీళ్లు నిలవవు. ఇది మన వాదనలకు అనుగుణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ జడ్జిమెంట్ ప్రకారం మహారాష్ట్ర ఒక్క నీటి చుక్కను కూడా తీసుకుపోయే అవకాశం లేదు. సాధారణ ప్రవాహానికి అడ్డుకట్ట వేయరాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాంపెన్సేషన్‌గానీ, నీళ్లు గానీ తీర్పు ఫైనలైజ్ అయ్యేంతవరకు అడగడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా గానీ లేదా ఉత్తర్వుల వల్లగానీ ఒక్క నీటి చుక్కను తరలించు కుపోవడానికి వీలులేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద బురదవేయడం, రాజకీయ లబ్ది పొందడం కోసమే. చట్టపరంగా, ఒప్పందాల పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలకు అనుగుణంగానే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాల మేరకు ఇది ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా, అప్రజా స్వామికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు పట్ల ఒక ప్రజాస్వామ్య రాష్ట్రప్రభుత్వం తమ నిరసన తెలియజేసిందే తప్ప మరో విషయం కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పరాశరన్ వాదనలు
బాబ్లీ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే శ్రీరాంసాగర్ నీరు రివర్స్ ఫ్లోలో వెనక్కు వెళ్లిపోతాయి. 1980 జులై 26న వెలువడిన గోదావరి జలవివాద ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా బాబ్లీని నిర్మిస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను ఒరిజినల్ సూట్‌లో పొందుపరిచాం. ఈ కేసుపై తుది తీర్పు వెలువరించేంతవరకు ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగించకుండా, నీరు నిల్వ చేయకుండా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలి. ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు లేవు. బాబ్లీ గేట్లు అక్టోబర్ తర్వాతే తెరుస్తామని మహారాష్ట్ర చెబుతోంది. అయితే శ్రీరాంసాగర్‌లో మార్చ్ వరకు 1076 అడుగుల మేర నీరు ఉంటుంది. దీనివల్ల రివర్స్‌ఫ్లోలో మహారాష్ట్ర ఈ నీటిని వాడుకునే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఆంధ్రప్రదేశ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించింది. ఇప్పుడు దాని జల విస్తృత భాగం (వాటర్ స్ప్రేడ్ ఏరియా)లో మహారాష్ట్ర అక్రమంగా నిర్మాణం చేపట్టింది. అది బ్యారేజో, మరో మినీ ఆనకట్టో కాదు. అది వాస్తవానికి ఒక మినీ రిజర్వాయర్. ఆంధ్రప్రదేశ్ అనుమతి లేకుండా ప్రాజెక్ట్ పరిధిలో రిజర్వాయర్‌ను ఎలా ఏర్పాటు చేస్తారు? శ్రీరాంసాగర్ కింద ముంపునకు గురయ్యే మహారాష్ట్ర భూ భాగానికి ఇప్పటికే రు. 4.5 కోట్లు పరిహారం చెల్లించాం. సొంత ఖర్చుతో రోడ్లు, వంతెనలు నిర్మించి ఇచ్చాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బెడ్ లెవెల్ 1069 అడుగులైతే, బాబ్లీ బెడ్ లెవెల్ 1073 స్థాయిలో ఉంది. ప్రాజెక్ట్ ఎత్తు 1109 అడుగుల వరకు ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగుల వరకు ఉంటుంది. కానీ బాబ్లీ గేట్లు 1073 అడుగులపై నుంచి ఉంటాయి. అంటే శ్రీరాంసాగర్ నుంచి 60 టి.ఎం.సి ల వరకు నీటిని మహారాష్ట్ర సులభంగా లాగేసుకోవచ్చు. తాగునీటి పేరుతో ఇలా శ్రీరాంసాగర్ నీటిని తోడుకోవడానికి మహారాష్ట్ర ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర తాగునీటి అవసరాలకు కావలసింది కేవలం 0.1 టి.ఎం.సి ల నీరే. కాగా మహారాష్ట్ర 2.7 టి.ఎం.సి.ల సామర్థ్యంతో కడుతోంది. ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1.9 టి.ఎం.సిల స్థాయికి తగ్గించినట్టు మహారాష్ట్ర చెబుతోంది. 1.9 టి.ఎం.సిల నీటిని తీసుకోవడానికి 13 గేట్లు అవసరం లేదు కదా. బాబ్లీ ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం సాంకేతిక సమితి కూడా నిర్ధారించింది. 2006 ఏప్రిల్ లో సిడబ్ల్యూసి సాంకేతిక మండలి ప్రాజెక్ట్‌ను సందర్శించి యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఒక నివేదిక కూడా ఇచ్చింది. మహారాష్ట్రకు తాగునీరు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఆ పేరుతో బ్యారేజీ కట్టి 60 టి.ఎం.సిల నీటిని వాడుకోవడానికి మాత్రం అంగీకరించం.
న్యాయవాది రామకృష్ణారెడ్డి వాదనలు
ఏ రాష్ట్రమూ మరో రాష్ట్ర ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణం చేపట్ట కూడదు. మరీ ముఖ్యంగా అది మరో రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపేదిగా ఉండకూడదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. బాబ్లీ ప్రాజెక్ట్‌కు ప్లానింగ్ కమిషన్ నుంచి గానీ, కేంద్ర జలసంఘం నుంచి గానీ మహారాష్ట్ర అనుమతుల కోసం ప్రతిపాదించలేదు. ఏకపక్షంగా కట్టుకుంటూ పోతోందని కాంగ్రెస్ ఎంపి మధుయాష్కి తరఫున వాదిస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. బాబ్లీ బ్యారేజ్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఇప్పటి వరకూ కొంత భాగం మాత్రమే నిర్మించాం. బ్యారేజ్ నిర్మాణం 326 మీటర్ల మేర భూ ఉపరితలం మీద మాత్రమే పూర్తయింది. దీనివల్ల గోదావరి నదీజల సహజ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకీ ఉండదు. ఆంధ్రప్రదేశ్‌కు జలనష్టం ఉండదు. గేట్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేంతవరకు జలప్రవాహానికి ఎలాంటి అడ్డంకీ ఉండదు. ముంపు ప్రాంతానికి ఇంతకుముందే పరిహారం చెల్లించామని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనల్లో నిజం లేదు. పరిహారం చెల్లించడం గానీ, భూసేకరణగానీ, సహాయ పునరావాస చర్యలుగానీ జరగలేదు. 2009 డిసెంబర్ వరకు గేట్లు పెట్టబోమని హామీ ఇస్తున్నాం. ఉభయరాష్ట్రాల ఉమ్మడి ముంపు ప్రాంతం నుంచి బాబ్లీ ప్రాజెక్ట్‌లోకి వచ్చే నీరు 0.6 టి.ఎం.సి.లు మాత్రమే. ఆ నీటిని ఉమ్మడి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టడానికి మహారాష్ట్ర సిద్ధంగా ఉంది. మహారాష్ట్ర చూపిన మూడు పరిష్కార మార్గాలు ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా తిరస్కరించింది. గోదావరి జలాల్లో 60 టి.ఎం.సి.ల పైన వచ్చే నీటినంతా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాష్ట్ర సరిహద్దుల్లోని నీటిని వాడుకునే అధికారం మహారాష్ట్రకు ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ దీన్ని వక్రీకరించి చెబుతోంది. బాబ్లీ వద్ద మహారాష్ట్ర కడుతున్నది డ్యాం కాదు. కేవలం బ్యారేజీ మాత్రమే. రబీలో ఏడు వేల హెక్టార్లకు సాగునీరు, 54 గ్రామాలకు తాగునీరు అందించడమే
ఈ బ్యారేజీ లక్ష్యం. కరువు కాలంలో తాత్కాలిక నీటి వినియోగం కోసం ఈ బ్యారేజ్‌ను చేపడుతున్నాం. ప్రాజెక్ట్ గేట్లు 11 మీటర్ల నుంచి 7.5 మీటర్లకు తగ్గించడానికి గతంలో కేంద్ర జలవనరుల సంఘం వద్ద జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు అంగీకరించారు. ఇంజనీర్లు సూచించిన ఈ పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2009 తర్వాత బ్యారేజ్‌కు పెట్టే గేట్లను ప్రతి సంవత్సరం అక్టోబర్ 28 తర్వాతే తెరుస్తాం. దీనివల్ల మహారాష్ట్రకు వచ్చే నీరు 0.6 టి.ఎం.సిలు మాత్రమే ఉంటుంది. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టడానికి మహారాష్ట్రకు అభ్యంతరం లేదు.
(వీక్షణం, జూన్ 2007 సౌజన్యంతో)





