Feed on
Posts
Comments

- కె. శ్రీనివాస్‌

జూన్‌ 21, 2007 నాటి ‘శ్రీకాలమ్‌’లోని అభిప్రాయాలూ వ్యాఖ్యలపై కంటె, అందులో ఆయన ప్రస్తావించిన చరిత్రాంశాల గురించి చర్చించడమే ఈ లేఖావ్యాసం ఉద్దేశం. ఉద్యమంలో దిగడానికి ముందు కెసిఆర్‌ తెలంగాణ హద్దుల గురించి, చరిత్రగురించి,పేర్ల గురించి తెలుసుకుని ఉండవలసిందని శ్రీరమణగారు అన్నారు. చాలా మంచి సలహా. కెసిఆర్‌కు నిజంగానే కొన్ని వివరాలు తెలియదు. ఉదాహరణకు క్వీన్‌ ఎలిజెబెత్‌ ఎన్నడూ హైదరాబాద్‌ రాలేదు. ప్రిన్స్‌ వేల్స్‌, లార్డ్‌ కర్జన్‌ వంటివారు వచ్చారు. వలసవచ్చినవారు తొలిరోజుల్లో చెప్పులతోవచ్చారా, చెప్పులు లేకుం డా వచ్చారా వంటి అంశాలపై కెసిఆర్‌ చర్చించడం అనవసరం.

ఉత్తరాన షాజహాన్‌ కొలువులోనూ, దక్షిణాన శ్రీరంగరాయల కొలువులోనూ తెల్లవారు ప్రాధేయపడి, దేబిరించి వర్తకపు అనుమతులు పొందారని గుర్తు చేసుకున్నంత మాత్రాన ఆత్మసంతృప్తి తప్ప ఏమి ఒరుగుతుంది? ‘రేగడివిత్తులు’ నవలలో వలసరైతు రామనాథం మొదట నేలమీద చతికిలపడినా, తరువాత అతనిదే రాజ్యంకదా? కెసిఆర్‌ చారిత్రక అజ్ఞానం అటుంచితే, ‘శ్రీకాలమ్‌’ రచయిత కూడా తప్పులకుప్పగా తేలుతున్నారు. కాల్వలకింద వ్యవసాయా న్ని నేర్పించడానికి ఏడో నిజాం కోస్తాంధ్ర రైతులను ఆహ్వానిం చింది 1916 ప్రాంతంలో కాదు. 1930 తరువాత. నిజాం సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం 1924లో ప్రారంభమై, 1931లో ముగిసింది.

కాల్వల వ్యవసాయంలో అనుభవమున్న కొందరురైతులను నిజాం సాగర్‌ ఆయకట్టు కిందకు రప్పించి, స్థానిక రైతులకు వారు నమూనాగా ఉండేట్టు చూడాలన్నది నాటి నిజాం ఉద్దేశం. అయితే, పొగాకు, మిర్చి, పత్తి లాంటి వాణిజ్యపంటలను ప్రోత్సహించడం కోసం ఆ పనిచేయలేదు. ఆ మూడు పంటలూ ఇప్పుడు కూడా తెలంగాణలోని ఆయకట్టు భూముల్లో పండించడం లేదు. నిజాం సాగర్‌ కింద చెరుకు పండించినా, ఆయకట్టు కింద ప్రధానమైన పంట వరే. ఇక పత్తి తెలంగాణలో ఎప్పటినుంచో ఉన్నదే. అందువల్లనే వరంగల్‌ ప్రాంతంలో అన్ని స్పిన్నింగ్‌ మిల్లులు ఉండేవి. హైదరాబాద్‌- కాజీపేట మధ్య రైలుమార్గం ఏర్పడడానికి ఆనాటి కార ణం పత్తి, నూలు తరలింపు కోసమే.

అమెరికన్‌ పొడుగుపింజ పత్తిని మెడోస్‌ టేలర్‌ 1850లలోనే రాయచూర్‌లో ప్రవేశపెట్టినా, అది మరో శతాబ్దం తరువాత కానీ అక్కడా, నడిగడ్డ ప్రాంతం లోనూ విస్త­ృతంగా వ్యాప్తిలోకి రాలేదు. కాల్వ కింద వ్యవసాయం అయినా, పాలమూరు కొత్త పత్తిసాగు అయినా మూలం తెల్లదొరలే. మరి, తెల్లవారు రాకముందు తెలుగువారికి వ్యవసాయం రాదని ఒప్పుకుందామా? ఇక, తెలంగాణలో మెట్ట వాణిజ్యపంటలు మొదటినుంచి ఉన్నాయి. పత్తిపంట ఎంత లేకపోతే గద్వాల, నారాయణపేట, పోచంపల్లి వంటి కేంద్రాలు చేనేతకు విశ్వవిఖ్యాతి చెందుతాయి? పారిశ్రామిక వినియోగం ఉన్న ఆముదాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే హైదరాబాద్‌ రాజ్యం ద్వితీయస్థానంలో ఉండేది.

ఇక నిజాం పాలనలో ఉర్దూ మాత్రమే ఉండేదనడం అతివ్యాప్తి ఉన్న అలవోక ప్రకటన. ఉర్దూకు ప్రోత్సాహం, ప్రాధాన్యం ఉండిన మాట నిజమే కానీ, తెలుగు పండితులే లేని పరిస్థితి లేదు. తెలుగుకు నిలువనీడ లేని స్థితి ఏమీ లేదు. హైదరాబాద్‌లో తెలుగుచదువులే లేకపోతే, 1918లోనే రాయప్రోలు సుబ్బారావు రవీం ద్రనాథ్‌ ఠాగూర్‌ సిఫార్సుతో నిజాం కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా ఎందుకు చేరినట్టు? మిడిల్‌స్కూల్‌ స్థాయిని దాటి శిక్షణ పొందిన తెలుగుపండితులు తగినసంఖ్యలో కావలసిన అవసరాన్ని గుర్తించిన తెలంగాణ పెద్దలు ఆంధ్రసారస్వతపరిషత్తు స్థాపించి, 1944 తరువాత విస్త­ృతంగా విద్యావ్యాప్తి, పరీక్షల నిర్వహణ జరిపారు. పోలీసుచర్య తరవాత మద్రాసురాష్ట్రంనుంచి వచ్చిన ఆంధ్ర ఉద్యోగుల తీరుతెన్నుల గురించి తెలియాలంటే కాళోజీ నారాయణరావు రాసిన ‘లంకాపునరుద్ధరణం’ కథను చదవాలి.

నాడు తెలంగాణలో తెలుగుపండితులు లేకపోవడం వల్ల కోస్తా ఆంధ్ర ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో వచ్చారన్నది అర్ధసత్యం కాగా, శేషాద్రిరమణ కవులు అట్లా వచ్చినవారని చెప్పడం పూర్తి అసత్యం. ఆ జంటకవులలో దూపాటి వెంకటరమణాచార్యులు మాత్రమే తెలంగాణకు వలసవచ్చారు, అదీ 1920 ప్రాంతంలో. వైదీకి, నియోగి కాట్లాటలతో అట్టుడుకుతున్న గుంటూరుజిల్లాలో తనబోటి శ్రీవైష్ణవునికి ఆదరణ లేదని భావించి, తెలంగాణలో గౌరవం దొరుకుతుందని తెలిసి ఆయన వలసవచ్చారు. వలసవచ్చిన తరువాత మనసావాచా కర్మణా తెలంగాణ కోసం శ్రమిం చారు. తెలంగాణ సాహిత్యాన్ని పరిశోధించే క్రమంలో ఆంధ్రప్రాంత పండితులతో తగాదాపడ్డారు.

తెలంగాణలో కవులు లేరని వెటకరించినవారికి సమాధానం చెప్పిన సురవరం ప్రతాపరెడ్డికి తన పరిశోధనతో సహకారం అందించారు. తమ వికాసం కోసం కృషిచేసిన కోస్తాంధ్ర ప్రాంతీయులైన మాడపాటి హనుమంతరావును కానీ, శేషాద్రిరమణకవులనుకానీ, ఉన్నవ వెంకటరామయ్య ను కానీ, కొమర్రాజు లక్ష్మణరావును కానీ తెలంగాణవారు ఎన్న డూ పరాయివారిగా భావించలేదు. అసలు 1948 కంటె ముందు తెలంగాణకు వచ్చి స్థిరపడినవారి విషయంలో పెద్ద సమస్య ఏనా డూ లేదు. ఇక పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసినవారిలో అయ్యదేవర కాళేశ్వరరావు లేరు, వీబీరాజూ లేరు.

మరీ ఇన్ని తప్పులా? 1956 నాటి ఆ ఒప్పందం ఇప్పుడు విస్త­ృతంగా అందుబాటులో ఉన్నది కూడా. అద్దమూ ముఖమూ రెండూ సిద్ధంగా ఉన్నా, అందులోని ప్రతిబింబం ‘శ్రీకాలమ్‌’ ఆశించినంత సానుకూలంగా ఉండదు. జోనల్‌ స్థానికేతరులను తరలించడం గురించి మాత్రమే 610 జీవో మాట్లాడుతోంది. పెద్దమనుషుల ఒప్పందాన్ని రంగం మీదకు తెస్తే, వ్యవసాయభూముల క్రయవిక్రయాల నియంత్రణ గురించి, 12 సంవత్సరాల స్థానికత గురించి కూడా అనివార్యంగా మాట్లాడవలసివస్తుంది. కాబట్టి, చరిత్రలో మరీ వెనక్కి వెడితే ప్రమాదమే తప్ప వారు ఆశించే ప్రయోజనమేమీ దక్కదు.

(ఆంధ్రజ్యోతి జూన్ 22 2007 సౌజన్యం)

* * *

ఆయన అజ్ఞానం ముందు ఆకాశం చిన్నబోయింది!

- శ్రీరమణ

‘ఏం చేస్తే పోతారో… మీరే చెప్పండి’ అంటూ ఆంధ్ర ఉద్యోగులను కెసిఆర్‌ సూటిగా ప్రశ్నించారు. ఆ హక్కు ఆయనకెవరు యిచ్చారో కాసేపు పక్కనపెట్టి ‘వెళ్లకుంటే ఏమి చేస్తారో మీరే చెప్పండని’ అడుగుతున్నా ను. నిజమే, ఆంధ్రాప్రాంతం వాళ్లకు చెప్పులు వేసుకునే తాహ తు, సంస్కారం లేదు. ఆరుగాలం శ్రమించడమే వాళ్లకు తెలు సు. చెప్పులు వేసుకుని నాగళ్లు దున్నడం ఆంధ్రా రైతన్నలకు తెలియదు. చెప్పులు తొడుక్కుని ఏతం వేయడం వాళ్లకు తెలియదు. టోపీలు, షేర్వానీలు ధరించి పశువులను మేపడం వారికి తెలియదు. ‘అప్పట్లోనే క్వీన్‌ ఎలిజబెత్‌ ఇక్కడకు వచ్చారు’ అని విశేషంగా చెప్పుకున్నారు. సి.పి.బ్రౌన్‌కి ఓనమాలు దిద్దించిన గురువులు ఆంధ్రప్రాంతం వారే. కెసిఆర్‌ అజ్ఞానం ముందు ఆకాశం లుంగీ పరిమాణంలో కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క సంగతి చాలా స్పష్టంగా గ్రహించాలి. కెసిఆర్‌ సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల అభిప్రాయంగా భావించరాదు.

తెలుగుదేశం వేవ్‌లో యన్‌టి ఆర్‌ దయవల్ల కెసిఆర్‌ పేరు అచ్చులోకి ఎక్కింది. తర్వాత అనేకానేక మెలికలు తిరిగి, తెలంగాణ సాధనకు కంకణం కట్టుకున్నారు. కంకణధారి అయినప్పటినుంచి, ఇప్పటిదాకా జరిగిన ఘట్టాలు అందరికీ తెలిసినవే. గత కొద్ది నెలలుగా అగ్రనేతల మీద రకరకాల ఆరోపణలు రావడం, నరేంద్ర వేరుకుంపటి రాజెయ్యడం అందరూ చూసిన చోద్యమే. నరేంద్ర ఎపిసోడ్‌ నెంబర్‌ రెండు సిడిని విడుదలచేస్తానని కూడా వూరిస్తున్నారు. 610 జీవో అమలు నేపథ్యంలో మరో రెండు ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేసి, తడి ఆరకుండానే వాటిని రద్దు చేశా రు. మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ వైయస్‌తో పోలిస్తే గొప్ప మేధావి అని పలువురు ఈ సందర్భంగా అభివర్ణించారు. ఈ మధ్య ఇతరేతర కారణాల వల్ల కనుమరుగై, వినమరుగైపోయిన చం ద్రశేఖరరావు ఉన్నట్టుండి ఆంధ్రాప్రాంతంవారి మీద నోరు చేసుకున్నారు.

కెసిఆర్‌ ఈ ఉద్యమంలో దిగడానికి ముందు, తెలంగాణ హద్దులు, కొద్దిగా చరిత్ర, కొన్ని పేర్లు తెలుసుకుని ఉంటే బావుండేదని చాలామంది భావిస్తున్నారు. 1916 ప్రాం తంలో కాల్వకింద వ్యవసాయం నేర్పించడానికి, ఆనాటి నవా బు దండోరా వేసి కోస్తా రైతులను రప్పించారు. వారికి కావాల్సిన నేల, వసతి, అన్నీ ఏర్పాటు చేశారు. కాటన్‌ దొర పుణ్య మా అని అప్పటికే కోస్తా రైతులకు కాల్వ వ్యవసాయం అచ్చిం ది. పొగాకు, మిర్చి, పత్తిలాంటి వాణిజ్య పంటలు తెలంగాణలో విస్తరింపచేయాలన్నది నాటి ఏలిక అభీష్టం. అప్పటికి తెలంగాణలో వర్షాధార పంటలైన వరి, జొన్న, రాగి లాంటివే ఎక్కువగా ఉండేవి. అన్నీ ఆకర్షణీయంగా ఉండ టం, పైగా కోరి రమ్మనడంతో సన్నకారు రైతులు వచ్చారు. చెప్పులు లేకుండానే వచ్చి ఉండవచ్చు. వాళ్లు పుట్టు గొప్పవారు కాదు.

కష్టార్జితంతో తాము బతికి, నలుగురిని బతికించిన వాళ్లు మా త్రమే. 1944లో రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డిఎస్‌) కింద తుంగభద్ర నీళ్లను గద్వాల్‌ అలంపూర్‌ తాలూకాలకు మళ్లించారు. ఆ తాలూకాలు అప్పట్లో రాయచూర్‌ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ నిజాం పాలనలో ఉర్దూ మాత్రమే ఉండేది. 1948- 49లో తెలుగుని పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు కోస్తా ఆంధ్ర నుంచి తెలుగు పంతుళ్లను ఆహ్వానించారు. ఎందరో పండితులు భాషా సేవకు కాకపోయినా బతుకుతెరువు కోస మే అయినా తెలంగాణకుతరలివచ్చారు. అలా వచ్చిన ప్రముఖులలో శేషాద్రి రమణ కవులు ఉన్నారు. నిజమే, వారికి చెప్పులు ఉండి ఉండకపోతే ఆశ్చర్యం లేదు. అది న్యూనత కాదు.

ఆంధ్రా ప్రాంతానికి వసంత నాగేశ్వరరావు, హరిరామజోగయ్య ప్రాతినిధ్యం వహించడం లేదు. ఏమైనా అజ్ఞాన సంపద ఉంటే మీరుమీరు పంచుకోండి. జనసామాన్యాన్ని ఇందులోకి తీసుకు రాకండి. ఆంధ్రాలో ఎనభైశాతం మందికి తెలంగాణతో సంబంధం లేదు. అలాగే తెలంగాణలో ఎనభైశాతం మందికి ఆంధ్రాతో పనిలేదు. రాజకీయ లబ్ధికోసం ప్రాంతాలమధ్య చిచ్చు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ‘లుంగీ కట్టు’ మహమ్మదీయ సోదరుల మతకట్టు. దానిని హీనంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ‘షేర్వానీ’ చాలా గొప్ప డ్రెస్సు కావచ్చు. అమెరికాలో, ఇంగ్లండులో సూట్లు వేసుకుంటారు. కెసిఆర్‌ లాంటి నేతలు టోపీలు పెట్టుకోనూగలరు, పెట్టాగలరు. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు, బి.వి. రాజు, అయ్యదేవర కాళేశ్వరరావు, గౌతు లచ్చన్న, నీలం సంజీవరెడ్డి లాంటి ప్రముఖుల ఆధ్వర్యంలో పెద్ద మనుషుల వొప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖం ఉంది, అద్దం ఉంది. మధ్యలో అవకాశవాదుల ప్రమేయంగాని, వక్రభాష్యాలతోగాని పనిలేదు.

వారి ఛీత్కారాలను సహించడానికి ఆంధ్రావారుగాని, రాయలసీమవారుగాని సిద్ధంగా లేరు. స్నేహపూర్వక వాతావరణంలో విడిపోవడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు కేవలం ఆయా ప్రాంతాల నాయకులది కాదు. ప్రజలది. ఎవరేమన్నా అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలేగాని, ఆ ప్రాంతపు ప్రజానీకపు మనోగతాలు కావు. దీనిని సామాన్య ప్రజలు అనుక్షణం గుర్తించుకోవాలి. ఎవరూ పరాన్నభుక్కులు కారని, లేరని కెసి ఆర్‌ గ్రహిస్తే శ్రేయస్కరం. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా, దండుకుందామా అని వేయి కళ్లతో కాచుకు కూచునే పెద్ద మనుషులెవరో మూడు ప్రాంతాలవారికీ క్షుణ్ణం గా తెలుసు. కెసిఆర్‌ ఒక్కమాట తూలితే, అవతల నుంచి వెయ్యి మాటలు తూటాల్లా దూసుకువస్తాయని గమనిం చండి. చెప్పులు లేకపోవచ్చు, నోట్లో నాలుకలున్నాయి.

(శ్రీకాలమ్, ఆంధ్రజ్యోతి జూన్ 21, 2007 సౌజన్యం)

* * *

Share/Save/Bookmark

One Response to “అద్దమూ ముఖమూ”

  1. 1
    ramulu Says:

    ఫ్రియ తెల ంగాణ వాదులకు,
    శ్రీరమణ వంటి పత్రికారచయితలకు మన శ్రీనివాస్ వంటి తెలంగాణ్ జర్నలిస్టులే సరైన సమధానమ్ చెప్ప్గగలరని టిడి ఫ్్ చర్చల్లో ఆయన రచన చదవక ముందే రాశాను . రమన వంటి వారు చేస్తున్న కొందరి వితండవాదాలు చేస్తున్నవారికి అర్ధమ్ కావడానికి నేను మరికొంత జత చేస్తున్నాను . నిజాం కాలంలో ఆంధ్ర రైతులను (వ్యవసాయ పరిజ్ఞానం కూడా అప్పటికే వారిలో ఎక్కువ ఉంటే ఉండవచ్చు)ప్రాజెక్టు కాలువల క్రింద అనుభవం ఉన్న కారణంగా పిలిపించి ఉండవచ్చు.నిజాం సాగర్ ప్రాజెక్టు క్రింది రైతులకు శిక్షణ కొరకు అట్ల వచ్చిన వారు ,అదేకాలం లో అక్కడి పరిస్థితులు తమ వ్యాపార,వాణిజ్యాలకు అనుకూలంగా ఉన్నాయని భావించి తరువాతకాలం లో అక్కడ స్థిరపడిఉంటారు. అదికూడా మనం తప్పుపట్టడం లేదే!

    ఇక మరోవిషయం ఏమిటంటే ఇప్పుడు ఎందరో (1956 తరువత వచ్చిన వలస పాలకులు)తమవారిచేతిలోవున్న అధికరం తోడుతో అన్ని రకాల అనైతిక,అక్రమ విధానాలతో, దాదాగిరితో,గూండాగిరితో దోపిడీచేస్తూ తాము తెలంగాణలో వేల కోట్లలో ఆస్తులు సంపాదించుకున్నారు.అట్ల సంపాదించిన ఉద్యోగాలన్ని ,భూములన్ని,సొమ్ములన్ని,కంపెనీలన్ని,సంస్తలన్ని,ఆస్తులన్ని,సంపదలన్ని తాము ఇట్లా వ్యవసాయంలో ,ఇతర రంగాలలో నైపుణ్యం ఉండి కాలక్రమం లో సంపాదించుకున్నవని వాదిస్తూ తమసంపదకు న్యాయంగా సంపాదించుకున్నామనే ముద్రవేయించుకుందామని చూస్తున్నారు.
    ఐతే బయటికిచెప్పకున్నా ,మన వాదనల్ని సమర్ధించకున్నా వాస్తవాలు అట్లా అక్రమంగా సంపాదించని వారికి(ఆంధ్ర-సీమలనుండి బయటికి రాకుండ తమ ప్రాంతంలోఉండే సంపాదించుకుంటున్నవారికి)

    వీరివేషాలు బాగా తెలుసు. నిజానికి న్యాయంగా తమ ప్రాంతాల్లో ఉండి సంపాదించుకుంటున్న వారు ఈఅక్రమార్కులతో వేగలేక పోతున్నారని తెలుస్తున్నది.ఇక్కడికి వచ్చి మనల్ని ఎట్ల ముంచి,మభ్యపెట్టి,మోసం అన్యాయం చేసి సంపాదించుకుంటున్నరో అక్కడివారికి తెలియజెప్పాల్సి ఉంది.దానికొరకు టిడిఫ్ వారు ప్రచురించిన “వలస ఫాలనలో తెలంగాణ” పాకెట్ బుక్ను మరియు మనకు జరిగిన,జరుగుచున్న అన్యాయాలను వివరించగల సిడి,క్యాసెట్లను అక్కడివారికి చేరేటట్లు చూస్తే బాగుంటుంది. నాఈసలహాపై మీరంతా టిడిఫ్ కు సూచనలు చేయండి.

    - రాములు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com