తెలంగాణ కథల్లో వైవిధ్యం
జులై 5th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- సుజాతారెడ్డి ముదిగంటి
తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ కథ పెద్దపీటనే ఆక్రమించింది. ఒకప్పుడు తెలంగాణలో కవులే లేరన్నట్లు తెలంగాణలో కథ ఎక్కడిది? అని విమర్శకులు, కథా సంకలనాల సంపాదకులు అనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ కథ తెలుగులో కథ పుట్టినప్పుడే పుట్టిందని మిగతా ప్రాంతాల కంటే అధికంగానే బాధ్యతగా సామాజిక చరిత్రను చిత్రించేదిగా గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ కథా సాహిత్యానికి తెలంగాణ కథకుల యోగదానం (కంట్రిబ్యూషన్) అప్పుడూ ఎప్పుడూ బలంగానే కొనసాగుతున్నది. ఒకప్పుడు పత్రికలు తెలంగాణ కథను అచ్చువేయడానికి జంకేవి. ప్రచురించదలచుకున్నా భాషను మార్చమనేవాళ్ళు. అదే ఇప్పుడు ఒక్కొక్క పత్రికలో ఒక్కొకసారి రెండు, మూడు తెలంగాణ కథలను వేయటానికి వెనుకాడటం లేదు.
తెలంగాణలో విమోచనానంతరం అక్షరాస్యత పెరిగిన తర్వాత అన్ని వర్గాల నుంచి తమ అనుభవాలు, జీవితాలను చిత్రించే కథలు వస్తు వైవిధ్యంతో అనేకం వస్తున్నాయి. కర్రె ఎల్లారెడ్డి మూడు నాలుగేండ్ల నుంచి తెలంగాణ కథా వార్షికలు వేస్తున్నాడు. ఆ వార్షికకు నేను, అంపశయ్య నవీన్ గౌరవ సంపాదకులుగా ఉన్నాం. ప్రతి సంవత్సరం పత్రికల్లో అచ్చయ్యే తెలంగాణభాష గాని జీవితం గాని ఉన్న కథల నుంచి కొన్నిటిని కథా వార్షికకు ఎంపిక చేస్తున్నాం. వార్షిక సైజు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఉత్తమ కథలను పక్కన పెట్టవలసి వస్తున్నది. దాన్ని చూసే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఎన్నో కథలు మంచివి వైవిధ్యంతో వస్తున్నాయని నేను చెప్పగలుగుతున్నాను.
తలంగాణ కథలు - వైవిధ్యం గురించి 1990 నుంచి వస్తున్న తెలంగాణ కథా సాహిత్యాన్ని తీసుకునే రాస్తున్నాను. అయితే తెలంగాణలో కథ 1912లో అచ్చయిన మాడపాటి హనుమంతరావు ‘హృదయశల్యము’ తోనే ఆరంభమైంది. ఆ కథ గురజాడ కథ తెలుగులో మొట్టమొదటి కథగా గుర్తింపు పొందిన ‘దిద్దుబాటు’ అచ్చయిన ‘ఆంధ్రభారతి’ పత్రికలోనే అచ్చవడం విశేషం. తర్వాత మాడపాటి ‘నేనే’ అనే అచ్చమైన సాంఘిక కథ రాశారు. 1912 నుంచి మొదలుకొని 1956లో విశాలాంధ్ర ఏర్పడేంతవరకు తెలంగాణలో చారిత్రక పరిస్థితులు బ్రిటిషు ఆంధ్రలో కన్నా భిన్నంగా ఉన్నాయి. ఆ చారిత్రక నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యేకమైన సాహిత్య సృష్టితో తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తెలుగు సాహిత్య చరిత్రకారులు తెలంగాణ సమకాలిక చారిత్రక భౌగోళిక సందర్భాన్ని బట్టి ఆనాటి సాహిత్య సృజన జరిగింది. కాబట్టి ఆ సాహిత్యాన్ని ప్రత్యేకంగా అంచనా వేయవలసి ఉంది. అట్లా అంచనా వేసినప్పుడు అక్కడ నిజాం పాలనలో తెలుగు భాషకున్న నిరాదరణను లెక్కలోకి తీసుకుంటే పరిస్థితులను అధిగమించి ఎంతో మంది కవులు, రచయితలు పుట్టారు. ఎంతో గొప్ప సాహిత్య సృజన చేశారు. అలా ‘కథ’ ప్రక్రియ గురించి చెప్పాలంటే పాట, కవిత్వం తర్వాత తెలంగాణలో ‘కథ’యే ఎక్కువ అభిమానం పొందిన ప్రక్రియగా కనిపిస్తున్నది.
ఎందరో రచయితలు, కవులు ఆ రోజుల్లో తెలంగాణలో కథలు రాశారు. తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న ఉద్యమనేతలు మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజి, అవధాని, కాంచనపల్లి చినవెంకట రామారావు, పొట్లపల్లి రామారావు, అయోధ్యారామకవి, కె.ఎల్.ఎన్. నందగిరి ఇందిరాదేవి, యశోదారెడ్డి, ఇల్లిందల సరస్వతీదేవి వంటి వారెందరో కథలు రాశారు. వారు రాసిన కథలన్నీ ఆనాటి తెలంగాణ జీవితాన్ని, ఉద్యమాలు, పోరాటాలను ప్రతిబింబిస్తున్నాయి. బ్రిటిషు ఆంధ్రలో కథా రచనకు బెంగాలీ సాహిత్యం, ఇంగ్లీషు సాహిత్యం ప్రేరణ అయితే తెలంగాణలో అభ్యుదయ రచయిత ప్రేమ్‌చంద్ ప్రధాన ప్రేరణగా నిలిచాడు. అందుకే పుట్టుకతోనే తెలంగాణ కథ అభ్యుదయ వాసనలతో పుట్టింది. అభ్యుదయ సాహిత్యం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అందుకే తెలంగాణ కథలు ప్రారంభకాలం నుంచి 1956 వరకూ ప్రజల భాషలో తెలంగాణ మాండలికంలో వచ్చాయి.
1939లోనే పూర్తిగా తెలంగాణ మాండలికంలో రాసిన కథ వచ్చింది. ఈ చారిత్రక భౌగోళిక నేపథ్యంతో వచ్చిన తెలంగాణ కథను తరువాత రచయితలు విమర్శకులు విస్మరించారు. 1956 తరువాత తెలంగాణ నుంచి వచ్చిన చాలామంది రచయితలు తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, మాండలికాన్ని మరచిపోయి ప్రధాన స్రవంతిలో భాగంగానే కథలు రాశారు. అవీ ఎక్కువ సంఖ్యలో రాకపోవటం చేతనో ఏమో తెలంగాణ కథకు గాని కథకులకు గాని ఎక్కువ గుర్తింపు రానేలేదు. విశాలాంధ్ర ఏర్పడగానే తెలంగాణ రచయితలు తమదైన గుర్తింపును కోల్పోయి దిక్కుతోచని విధంగా మౌనవ్రతం వహించారు. నెల్లూరి కేశవస్వామి, బూర్గుల రంగనాథరావు, కాంచనపల్లి వంటి రచయితలు తమ కథల సంపుటాలను 1960, 70 దశకాల్లో అచ్చువేసుకున్నారు.
1964లో ‘గడ్డిపూలు’ అనే కథల సంకలనం వచ్చినా ఈ తెలంగాణ కథకుల గొంతు ప్రధాన సాహిత్య స్రవంతిలో విన్పించలేదు. 1956 నాటి వట్టికోట ఆళ్వారుస్వామి ‘పరిసరాలు’ కథల సంకలనం తర్వాత తెలంగాణ కథ తన ప్రత్యేక ఉనికిని కోల్పోయి అజ్ఞాతంగా ఉండిపోయింది. స్మరణశక్తి కోల్పోయిన వ్యక్తిలాగా తన అస్తిత్వాన్ని విస్మరించింది. మళ్లా కథకులు చాలా కథలు రాయటం ప్రారంభమైంది. మళ్లా తెలంగాణలో కథ పుంజుకుంది. విప్లవం, పోరాటం, జనజీవిత వ్యథలను తిరుగుబాటులను చిత్రిస్తూ చాలామంది కథకులు తెలంగాణ నుంచి వచ్చారు. అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, ఉప్పల నరసింహం, బి.ఎస్. రాములు, పి.చంద్, తాడిగిరి పోతరాజు, దేవరాజు మహారాజు, పులుగు శ్రీనివాస్, బోయ జంగయ్య, భూపాల్ మొదలైన రచయితలెందరో తెలంగాణ జీవితాన్ని చిత్రించటమేకాక బలంగా తెలంగాణ మాండలిక భాషల్లో రాశారు. కొన్నిసార్లు ఆ కథలను మామూలు వ్యాపార పత్రికలవాళ్ళు అచ్చువేయటానికి నిరాకరించినా ఆ కాలంలో తెలంగాణ కథకు మంచి గుర్తింపు వచ్చింది.
తెలంగాణలో 1956కు ముందు వచ్చిన కథలు పూర్తిగా ఉపేక్షకు గురై, విస్మృతమై అస్సలు తెలంగాణలో కథారచన విప్లవోద్యమంతోనే ఆరంభమైంది అన్నంతగా పేరు వచ్చింది. కథా సంకలన కర్తలు సైతం తెలంగాణ కథలను 1970 నుంచి వచ్చిన వాటినే గుర్తించారు. దాంతో కథా సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు తెలంగాణలో కథ అనేది 1970 దశకంలోనే పుట్టిందన్నట్లుగా భావించారు.
అయితే, ఇప్పుడు తెలంగాణ కథ చరిత్ర వెలికి వచ్చింది. దాని పునాదులు, భవన నిర్మాణాలు ఎక్కడ ఎట్లా ఉన్నాయో అందరికీ తెలిసింది. తెలంగాణ తొలితరం కథలు రెండు భాగాలుగా రావటం తెలంగాణ కథల పట్టిక ‘దస్తూర్’ అచ్చవటంతో 1956కు పూర్వం ఉన్న తెలంగాణ కథాసాహిత్యం పునర్నిర్మాం జరిగింది. తెలంగాణ తొలితరం కథల స్వరూపం వైవిధ్యం ఎలాంటిదో అందరికీ తెలిసింది.
అయితే, ఈ వ్యాసంలో 1956కు పూర్వంగాని, తర్వాతగాని ఇంకా 1970, 80 దశకాల్లో వచ్చిన విప్లవ కథను గురించి కాని వాటి వైవిధ్యం గురించి గాని చెప్పటం లేదు. కేవలం వైవిధ్యం గురించి వాదాల ధోరణుల వైవిధ్యాన్ని, స్వరూపం గురించి మాత్రమే మాట్లాడదలచుకున్నాను. తెలంగాణ కథల్లో ఉన్న వైవిధ్యం కేవలం ఆధునిక తెలంగాణ కథల్లో గత దశాబ్దంనర కాలంలో ఎట్లా ఉన్నదో చెప్పటమే నా ప్రధానోద్దేశం.
1990 దశకం ఆరంభంలో కవిత్వంలో గాని కథల్లో గాని పరాయీకరణం విషయం కన్పిస్తున్నది. గ్రామాలకు దూరం కావటం, గ్రామీణ జీవితం వాటి మధుర స్మృతులు, నగరాలు, పట్టణాలకు వలసలు, పట్టణంలో ఏకాకితనాన్ని అనుభవించటం, భూమి వ్యసాయం మీద మమకారం విడవకుండా ఉండటం, మట్టివాసనలు వెంటాడటం వంటి వస్తువుతో కథలు, కవిత్వం వచ్చాయి. క్రమంగా ప్రపంచీకరణం ప్రవేశంతో, ప్రభావంతో పరాయీకరణ భావజాలమే తమ మూలాల మీద అభిమానంగా ఏర్పడింది. తమ భాష సంస్కృతుల మీద ప్రేమ కలిగింది. సామ్రాజ్యవాదుల, వలసవాదుల పెత్తనం వలెనే ఒక ప్రాంతం మీద మరో ప్రాంతం పెత్తనం చేయటం ముందుకు వచ్చింది.
భౌగోళిక కారణాల వల్ల అభివృద్ధి చెందిన ప్రాంతం అభివృద్ధి చెందని ప్రాంతం మీద పెత్తనం, అధికారం చూపటం, అక్కడి భాషా సంస్కృతులను ఉపేక్షించటం, వివక్షచూపటం జరిగింది. దాంతో తెలంగాణ ప్రాంతం వారూ తమ మీద జరిగే అన్యాయాలను, దోపిడీలను, వివక్ష ఉపేక్షలను గుర్తించారు. ప్రపంచీకరణంలో ఎట్లా అయితే ప్రపంచంలో ప్రతి దేశం ప్రతిజాతి తమ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడుకోవాలని జాగృతులయ్యారో అలాగే తెలంగాణలో తమ చరిత్ర, భాష, సంస్కృతులంటే స్పృహ ఏర్పడింది. దాని గొప్పతనాన్ని తెలుసుకొని సంరక్షించుకోవాలని తాపత్రయపడ్డారు.
ఈ సృహ, తపనలే తెలంగాణలో 1990 దశకం నుంచి వచ్చిన సాహిత్యంలో ప్రతిబింబించాయి. తెలంగాణ ప్రాంతీయ అస్మిత అస్తిత్వవాద భావజాలాన్ని చిత్రిస్తూ కవులు, రచయితలు కవితలు, కథలు రాశారు. కవిత్వంలో ‘మత్తడి, పొక్కిలి’ వంటి కవితా సంకలనాలు వచ్చాయి. ఇవేగాక కవులెందరో తమ కవితా సంపుటాలను ప్రచురించారు. కవిత్వంతోపాటు దీర్ఘకవితలు, పాటలు తెలంగాణ ప్రాంతీయవాదాన్ని ప్రతిబింబిస్తూ వచ్చాయి. అలాగే కథా సాహిత్యం విస్తృతంగా వచ్చింది. కొన్ని నవలలూ వచ్చాయి. కథలను రచయితలు తెలంగాణ ప్రాంతీయ మాండలికం యాసల్లోనే రాసి తమ భాష మీద అభిమానాన్ని చూపారు. తెలంగాణ భాష విషయంలో ఏర్పడుతున్న వివక్షను అలా ఎదుర్కొని తమ భాష అస్తిత్వాన్ని నిలుపుకున్నారు.
గ్రామాలు విధ్వంసం కావటం, అక్కడి వృత్తిపనులు నశించటం, నగరాలకు వలసలు, జీవనోపాధిని వెతుక్కుంటూ బొంబాయి, షోలాపూర్, దుబాయిలకు వలస పోవటం, అక్కడి వ్యథలు, వ్యవసాయం శిథిలం కావటం, రైతుల కష్టాలు, ఆత్మహత్యలు, నగరీకరణ, అభివృద్ధీకరణలో ప్రజలు వ్యవసాయ భూములను కోల్పోయి కూలీలుగా, కార్మికులుగా, బిచ్చగాళ్ళుగా మారటం యాంత్రికీకరణతో ప్రజలు జీవనోపాధి కోల్పోవటం, పర్యావరణం సమస్యలు మొదలైన ఎన్నో సమస్యలను చిత్రిస్తూ 1990 దశకం నుంచి తెలంగాణ రచయితలు కథలు రాస్తున్నారు. 1970, 80ల్లో విప్లవం, తిరుగుబాటు భూమి సమస్య మాత్రమే కథల్లో వస్తువు కాగా ఇప్పుడు అభివృద్ధీకరణ, వ్యాపార వినిమయ సంస్కృతిలో మ్‌ారుతున్న మానవ విలువలను చిత్రిస్తూ తెలంగాణ కథకులు వైవిధ్యంతో కూడిన కథలు రాస్తున్నారు.
హైదరాబాదు రాజధాని నగరం తెలంగాణలో ఉండటంతో అభివృద్ధీకరణలో వారు ఎదుర్కొంటున్న భూమి సమస్యలను తెలంగాణ రచయితలు ప్రత్యేకంగా వైవిధ్యంతో చిత్రిస్తున్నారు. బి.ఎస్.రాములు, కాలువ మల్లయ్య, నవీన్, బోయ జంగయ్య, పెద్దింటి అశోక్‌కుమార్, ముదిగంటి సుజాతారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, జూకంటి జగన్నాథం, పంజాల జగన్నాథం, బోధనం నర్సిరెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, సిధారెడ్డి, బెజ్జారపు రవీందర్, బెజ్జారపు వినోద్‌కుమార్, దేవేంద్రాచారి, ఎన్.కె. రామారావు, బి.వి.ఎన్. స్వామి, కె.వి. నరేందర్, దీవి సుబ్బారావు, ఎలికట్టె శంకర్రావు, చిన్నయ్య, యెన్నెం ఉపేందర్, అంబల్ల జనార్దన్, జింబో, ఆమన్, దార్ల రామచంద్ర, నల్లాల లక్ష్మీరాజ్యం, ఐతా చంద్రయ్య, పులుగు శ్రీనివాస్, జాతశ్రీ, వరిగొండ కాంతారావు, గూడ అంజయ్య మొదలైన రచయితలెందరో కథలు రాస్తున్నారు. గ్రామీణ, రైతుల సమస్యలను, నిజాం కాలంలోని భూ సమస్య కన్నా భిన్నమైన భూమి సమస్యలను చిత్రిస్తూ కాలువ మల్లయ్య, పెద్దింటి అశోక్‌కుమార్, ముదిగంటి సుజాతారెడ్డి కథలు రాశారు.
ఈ మధ్య ఒక కథా విమర్శకుడు తెలుగులో ఇప్పటి వరకు ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారం చిత్రిస్తూ కథలు రాలేదని రాశారు. ముదిగంటి సుజాతారెడ్డి ‘అడవి రాజ్యం, మింగుతున్న పట్నం, వ్యాపార వియ్యం, వైరస్, ప్రపంచీకరణమా ఎక్కడ నువ్వు’ కథల్లో భూమి వ్యాపారం, దగా, మోసాల గురించి రాశారు. ఇక ప్రభుత్వం రైతుల భూములను సేకరించడంతో రైతులు నిరాశ్రయులయ్యే వృత్తాంతాలతో గుడిసెలు-గుడిసెలు, న్యూ ఆనంద్ హోటల్, రాజకీయ మంటలు, ఆక్రమణం, సీతయ్య చెల్క మొదలైన కథలు రాశారు.
పర్యావరణం, వృత్తిపనులు కోల్పోయిన వ్యథలను చిత్రిస్తూ బెజ్జారపు రవీందర్, ఎలికట్టె శంకర్రావు, జాతశ్రీ కథలు రాశారు. వలసలను చిత్రిస్తూ అంబల్ల జనార్దన్ కథలు రాశాడు. మానవ సంబంధాలను చిత్రిస్తూ బి.ఎస్ రాములు, కె.వి. నరేందర్ కథలు రాశారు. బోజకథలు, కాలువ మల్లయ్య కథలు, పాలు, వైపని, కిర్రుచెప్పులు, మింగుతున్నపట్నం, మట్టివాసనలు, బొండిగె, సంకరవిత్తులు, ఆరు కార్మికుల కథలు, జారుడుబండ, ఎల్లమ్మ కథలు, ఊటబాయి, చలివేంద్రం, యుద్ధం, అంబల్లబండ, నాలుగు దృశ్యాలు, తిరుగు ప్రయాణం, వ్యాపార మృగం, వలస బతుకులు, మమతలు - మానవ సంబంధాలు వంటి ఎన్నో కథల సంపుటాలు ఈ దశాబ్దంలో అచ్చయ్యాయి.
తెలంగాణలో 1980 దశకంలో విప్లవం బలహీనం కావటం, అది అనుకున్నంత విజయాన్ని సాధించకపోవటం కొందరు విద్యార్థి యువకుల్లో అశాంతిని సృష్టించింది. వాళ్ళు విప్లవం మీద ప్రేమను విడవలేకపోయారు. ఇంకోవైపు విప్లవం విశ్వవిద్యాలయాల్లో పట్టును కోల్పోయి క్యారియరిజం చోటుచేసుకోవటం ఆ యువకులను చాలా వ్యథకు గురిచేసింది. అలాంటి అశాంతి, హృదయ విధ్వంసాలను చిత్రిస్తూ కాసు ప్రతాపరెడ్డి - కొన్ని ప్రేమలు, లవ్ 2020, అంతిమం, యాక్సిడెంట్ వంటి కథలు రాశాడు. బి.ఎస్.రాములు యజ్ఞం, కాలువ మల్లయ్య భద్రత వంటి కథలు రాశారు.
ప్రపంచీకరణాన్ని ఏ ప్రాంత రచయితలూ చిత్రించనంతంగా తెలంగాణ రచయితలు చిత్రించి కథలు రాశారు. బి.ఎస్.రాములు వేపచెట్టు, కాలువ మల్లయ్య గ్లోబలి, ముదిగంటి సుజాతారెడ్డి నిశ్శబ్దం నిశ్శబ్దం, కాసుల ప్రతాపరెడ్డి దగ్ధం వంటి ఎన్నో ఉత్తమ కథలు వచ్చాయి. తెలంగాణ భాషా సౌందర్యం గురించి చరిత్రను చిత్రిస్తూ బెజ్జారపు వినోద్‌కుమార్ నిత్యగాయాలనది, బి.వి.ఎన్. స్వామి కుంపటి, పద్మలత భాషా సౌందర్యం కథలు వచ్చాయి.
తెలంగాణ నుంచి రావలసినంత, కావలసినంత స్త్రీవాద సాహిత్యం రాలేదని అంటారు. కాని తెలంగాణలో రాడికల్ ఫెమినిజం చోటుచేసుకోలేదు. కాని స్త్రీ స్వేచ్ఛ, సమానతలు, సమానావకాశాలను కోరుతూ స్త్రీల వ్యథలను శ్రమదోపిడీని చిత్రిస్తూ గీతాంజలి, ముదిగంటి సుజాతారెడ్డి, అనిశెట్టి రజిత కథరు రాశారు. బచ్చేదాని, విసుర్రాయి, మట్టిబంధం వంటి కథల సంపుటాలు వచ్చాయి. ఇంకో విశేషమేమిటంటే దళిత స్త్రీవాదంలో స్త్రీ స్పృహను, వ్యథలను చిత్రిస్తూ జాజుల గౌరి, గోగు శ్యామల, జె.సుభద్ర వంటి రచయిత్రులు తెలంగాణ మాండలికంలో బలమైన కథలు రాశారు. జాజుల గౌరి మన్నుబువ్వ అనే దళిత స్త్రీ జీవితాలను చిత్రిస్తూ కథల సంపుటిని ప్రచురించారు. స్త్రీ దళిత స్పృహను చిత్రిస్తూ ఇతర ప్రాంతాల నుంచి కథలు రాలేదు. తెలంగాణా నుంచే వచ్చాయి. అలగే ముస్లిం స్త్రీవాదంలో స్త్రీల వ్యథలను షాజహానా కవిత్వంలోనే కాక కథల్లోనూ చిత్రించింది. ఇట్లా ముస్లిం స్త్రీల వ్యథను చిత్రించే కథా సాహిత్యం ఇతర ప్రాంతాల నుంచి రాలేదు.
తలంగాణ నుంచి కావలసినంత దళిత సాహిత్యం రాలేదని అభిప్రాయం ఉంది. కొంత వరకు దీనిలో సత్యముందేమో. అంతేకాక ఇక్కడ్నుంచి వచ్చిన దళిత సాహిత్యంలో ఇతర ప్రాంతాల్లోని దళిత సాహిత్యంలో వ్యక్తమైన కసి, కక్షలు కన్పించవు. దానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. తెలంగాణలో మనువాదం బలంగా కనపడదు. అంతేగాక ఇక్కడ వచ్చిన ఆర్యసమాజం ఉద్యమం కులకక్షలను నిర్మూలించింది. మానవ అసమానతను నిరోధించింది. ఆర్యసమాజాన్ని స్వీకరించినవాళ్ళు వైదిక మంత్రాలను నేర్చుకొని స్వయంగా హోమం చేసుకునే క్షమతను కలిగించింది. తరువాత ఆర్యసమాజంలో పౌరోహిత్యం మంత్రాలు తెలిసినవాళ్ళెవరైనా పౌరోహిత్యం నిర్వహించవచ్చు. తెలంగాణలో న్‌ిమ్నవర్గం వాళ్ళెందరో పౌరోహిత్యం చేసేవాళ్ళు. తెలంగాణలో దళిత సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ ఆర్యసమాజాన్ని స్వీకరించాడు.
ఆర్యసమాజంవాళ్ళు తెలంగాణలో నిజాంకాలంలో శుద్ధికార్యక్రమం నడిపి మహమ్మదీయులుగా మార్చబడిన బడుగువర్గాలవారిని హిందూమతంలోకి తెచ్చారు. ఈ ప్రభావం వల్లో ఏమో తెలంగాణ నుంచి వచ్చిన దళిత సాహిత్యంలో పై వర్ణాల మీద ‘కసి’ కన్పించదు. కేవలం వాళ్ళ నికృష్టజీవితాలు, వ్యథలను చిత్రించి చదువు, విజ్ఞానంతో తమ వ్యథలను దూరం చేసుకోవచ్చునని చిత్రించారు. బోయ జంగయ్య, వేముల ఎల్లయ్య, యెన్నెం ఉపేందర్ మొదలైన వాళ్ళ దళిత కథలను నవలలను రాశారు.
తలంగాణ నుంచి ఈ దశాబ్దంలో ముస్లిం వాదం బలంగా విన్పిస్తూ ఉంది. ఇతర ప్రాంతాల్లో ముస్లి రచయితలున్నా వాళ్ళు ప్రధాన స్రవంతి మార్గంలోనే రాశారు. కొందరు ఈ మధ్యకాలంలో రాయలసీమ, దక్ష్‌ిణ కోస్తా నుంచి ముస్లింల జీవితాలను చిత్రిస్తూ కథలు రాశారు. కాని తెలంగాణ నుంచే ముస్లిం సాహిత్యం వాదం రూపాన్ని ధరించి కన్పిస్తున్నది. ‘గుజరాతు గాయం’ తో ముస్లింవాదం రూపుదిద్దుకున్నదని చెప్పవచ్చు. అంతకు ముందు బహుజన వాదంలో భాగంగానే ముస్లింల గొంతు విన్పించింది కాని ప్రత్యేకంగా విన్పించలేదు. తెలంగాణలో బహుజనవాదం కూడా బాగానే వేళ్ళూనుకుంది. బహుజనవాదంలో బీసీల గొంతు బలంగా విన్పించింది. జూలూరు గౌరీశంకర్ బీసీల వ్యథలను చిత్రించే ‘వెంటాడే కలాలు’ అనే కవితా సంపుటాన్ని వెలువరించాడు. వృత్తి పనుల వాళ్ళ వ్యథలు, ఆత్మహత్యలు ఈ కవిత్వంలో, కథల్లోనూ విన్పిస్తుంది. గౌరీశంకర్, బి.ఎస్. రాములు నేరెల్ల శ్రీనివాస్‌గౌడ్, జాతశ్రీ, రంగు సత్యనారాయణ బహుజనుల వ్యథలను విన్పించారు.
ముస్లింవాదం ‘వతన్’ కథల సంపుటి ప్రచురణతో బలంగా సాహిత్యంలో ప్రతిష్ఠితమైంది. ‘జల్‌జలా, అజా’ వంటి కవితా సంపుటాలు కూడా వచ్చాయి. అటు ముస్లిం సంప్రదాయవాదుల నుంచి ఇటు హిందూత్వవాదుల దాడులను ఎదుర్కొంటూ ముస్లింలు నలిగిపోతున్నారు. ఇతర ముస్లిం దేశాల వాళ్ళు భారతీయ ముస్లింలను అచ్చమైన ముస్లింలుగా గుర్తించకపోగా తమతో సమానస్థాయిని కల్పించటానికి ఇష్టపడలేదని ఉద్యోగాల కోసం దుబాయి వంటి దేశాలకు వలసపోయిన వాళ్ళు గుర్తించారు. అంతేగాక కాశ్మీరు వంటి సమస్యలతో, ముస్లింలు ఉగ్రవాదులు అనే ఆరోపణను ఎదుర్కొంటున్నారు.
అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేత ముస్లింలను అభద్రతలోకి నెట్టివేసింది. ఆ వ్యథలను, సమస్యలను, అభద్రతలను ముస్లిం రచయితలు, కవులు కథల్లో, కవిత్వంలో బలంగా వ్యక్తీకరిస్తున్నారు. ముస్లిం హిందూ సఖ్యతను కోరుతున్నారు. సంప్రదాయవాదులను ఎదిరిస్తున్నారు. ప్రాంతీయ అస్తిత్వవాదంలో, స్త్రీవాదంలో, దళిత వాదంలో రచయితలు, కవులు తమదైన భాషశైలిని వ్యక్తీకరణలను ఏర్పరుచుకున్నట్లుగానే ముస్లింవాదంలో ఒక ప్రత్యేకమైన భాష నుడికారాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. ముస్లివాదంలో అఫ్సర్, అన్వర్, స్కైబాబా, మహమ్మద్, గౌసొద్దీన్, ఖాజా, అలీ, యాకూబ్ వంటి కథా రచయితలు ఎన్నో గొప్ప కథలు రాశారు.
నవలల గురించి చెప్పాలంటే, ఈ దశకంలో ప్రధాన స్రవంతి సాహిత్యంలోనే నవలారచన తగ్గుముఖం పట్టింది. తెలంగాణాలోనూ అదే జరిగింది. అయినా కొన్ని చెప్పుకోదగిన నవలలు తెలంగాణా నుంచి వచ్చాయి. తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వవాదంలో భాగంగా లోకేశ్వర్ ‘సలాం హైదరాబాదు’ నవల 2005లో వచ్చింది. గత ముప్ఫై నలభై సంవత్సరాల సాహిత్య సాంస్కృతిక తెలంగాణ ఉద్యమం సంఘటనలను లోకేశ్వర్ నాటకీకరణం చేసి ఒక నవలగా రూపొందించాడు. దీనిలో తెలంగాణ ప్రజా జీవనం, సంస్కృతులు ప్రతిబింబిచాయి. బి.ఎస్.రాములు ‘బతుకుపోరు’ కాలువ మల్లయ్య ‘చదువు’ నవలలను బీసీల జీవితాలను చిత్రిస్తూ రాశారు. ‘బతుకుపోరు’లో బీడీ కార్మికుల జీవితాలు సజీవంగా చిత్రించారు. బొగ్గు కార్మికుల జీవితాలను చిత్రిస్తూ పి.చంద్ ‘శేషగిరి’ తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘నల్లవజ్రం’ అనే నవలలు రాశారు. వీటిల్లోనూ తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల జీవితాలు చిత్రితమయ్యాయి.
అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’, ‘ఊరు’ వంటి నవలలు తెలంగాణ గ్రామీణ జీవితాల్లో వ్‌ిప్లవోద్యమ పరిణామాలను చిత్రికలు పట్టాయి. విప్లవోద్యమ స్ఫూర్తితోనే అల్లం రాజయ్య, సాహు కలిసి ‘కొమురం భీం’ నవలలు వెలువరించారు. వసంతరావు దేశ్‌పాండే ‘అడవి’ నవల గిరిజన జీవితాల్లోని ఆందోళనకరమైన జీవితాలను చిత్రించారు. అంపశయ్య నవీన్ ‘అంపశయ్య’, ‘ముళ్లపొదలు’, ‘అంతస్స్రవంతి’ వంటి నవలలు తెలంగాణలోని మధ్యతరగతి జీవితాలను చిత్రించాయి. ‘ముళ్లపొదలు’ నవలలో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రేఖామాత్రంగా కనిపిస్తుంది. తెలంగాణలోని విప్లవోద్యమ జీవితాలను చిత్రిస్తూ ‘వసంతగీతం’ ‘సరిహద్దు’ నవలలు వచ్చాయి.
ఇరవయ్యో శతాబ్దం చివర ఇరవయ్యొక్క శతాబ్దారంభంలోనూ తెలంగాణ విమోచనోద్యమానికి సంబంధించిన నవలలు రావటం విశేషం. తెలంగాణ విమోచనోద్యమం ఇంకా తెలంగాణ రచయితలకు రచనా ప్రేరణను ఇస్తున్నది. ముదిగంటి సుజాతారెడ్డి 1994లో ‘మలుపుతిరిగిన రథచక్రాలు’ నవలలో ఒక దొర కూతురు సరళదృష్టి కోణం నుంచి తెలంగాణ పోరాటాన్ని చిత్రించారు. దీనిలో 1946-86 మధ్యకాలం నాటి తెలంగాణ రాజకీయ చరిత్ర ప్రతిబింబించింది. ఈ నవలలో రమేష్ అనే పోరాట వీరుడు ప్రధాన పాత్ర. అతడు జన జీవన స్రవంతిలోకి రావటంతో నవల ముగుస్తుంది. సుజాతారెడ్డి 1994లోనే ‘సంకెళ్ళు తెగాయి’ నవలను అచ్చువేశారు. దీనిలో నారాయణ అనే మంగలి యువకుడు చదువుకోవాలని ఆసక్తితో ఉంటాడు. పరిస్థితులను పరిసరాలను జయించి చదువుకొని ఐ.ఏ.ఎస్. పరీక్ష పాసవుతాడు. దీనిలో తెలంగాణ గడీల జీవితం, గ్రామీణ జీవితం చ్‌ిత్రితమయ్యాయి.
బోయ జంగయ్య ‘జగడం’ (2003) నవలలో ఒక దళిత యువకుని దృష్టికోణం నుంచి తెలంగాణ రజాకార్ల ఉద్యమాన్ని చిత్రించాడు. నవల కథానాయకుడు రత్నం దళితుడు. తెలంగాణ విమోచనానంతరం చదువుకొని లాయరై దళితుల ఉద్ధరణకు తన జీనితాన్ని అంకితం చేస్తాడు. నవీన్ 2002లో ‘కాలరేఖలు’ నవలలో తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించాడు. రాజు అనే మధ్య తరగతి పాత్ర దృష్టికోణం నుంచి తెలంగాణ విమోచనోద్యమాన్ని విశాలాంధ్ర ఏర్పడేంత వరకూ చిత్రించాడు. నవీన్ కాలరేఖలకు సీక్వెల్‌గా ‘బాంధవ్యాలు, చెదిరిన స్వప్నాలు’ (2003) నవలలు రాశాడు. వేముల ఎల్లయ్య ‘కక్క’ ‘సిద్ధి’ అనే దళిత నవలు రాశాడు. అచ్చమైన దళితభాషతో దళితుల జీవితాలు, వ్యథలను చిత్రిస్తూ ఎల్లయ్య ఈ నవలలు రాశాడు. నల్లగొండ దళితుల భాషలో ఉన్న ‘సిద్ధి’ నవలను ఈ మధ్య ప్రామాణిక భాషలోకి అనువదించారు. ఇలా జరగటం ఇదే మొదటిసారి.
(తెలుగు పీపుల్ డాట్ కామ్ సౌజన్యంతోటి)





