- ఆర్ చందా
పొద్దంత కష్టించి ఓరన్నా!
పోస్తావు తాగుడుకు ఏందన్నా!
పిల్లలేదడిగినా ఇసురుకుంటావు,
పెండ్లమేదడిగినా కసురుకుంటావు!
తాగెటందుకు నీవు ఖర్చు చేస్తావు,
తప్పతాగుతు నీవు తైతక్కలాడ్తావు!
తాగుడు మానితే ఓరన్నా !
నువ్వు గొప్పోనివౌతావు కూలన్నా!
కల్లుదాగితె నీవు కోతివై పోతావు,
కల్తి కల్లుతోని కష్టాలు పడతావు!
పావుబోయిస్తెనే పనిజేస్తనంటావు,
కైపెక్కితే నీవు ఐపులేకుంటావు!
ఇల్లుగుల్లై పోతదీ ఓరన్న!
ఒల్లుగుల్లైపోతదీ రైతన్న!
అదుపు దప్పితాగి ఆలినే కొడతావు,
అదుపు తప్పితె నీవు హత్యలే చేస్తావు!
ఓట్ల పండగొస్తే తాగి ఊగుతావు,
ఓట్లెవనికేస్తవో కానకుండుంటావు!
తెలివితో ఉండాలి రోరన్నా!
తెలంగాణా దెచ్చు కోరన్నా!
* * *
ఈపాట తాగుడును మానిపించడానికి ఒక ప్రయత్నం మాత్రమే.
ఒకప్పుడు దూబగుంటలో మల్లాది సుబ్బమ్మ వంటివారు మద్యవ్యతిరేకోద్యమం చేపట్టి కుళ్ళిపోతున్న సమాజానికి కొంత మంచి పని చేయగలిగారు.ఇటివల రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ జయప్రకశ్ నారాయణ్ గారు మద్యవ్యతిరేకోద్యమానికి కోస్తాంధ్రలో మళ్ళి శ్రీకారం చుట్టారు. మంచి ఎవరు చేసినా మనమంతా ఆహ్వానించాలి. ఆయన కూడా ఇతర ఆంధ్ర నాయకుల మాదిరి తెలంగాణకు వ్యతిరేకమేనని మనకు తెలుసు. ఆకారణంచేత ఆయనకు ఆయన పార్టీకి మన తెలంగాణవాళ్ళము మద్దత్తు ఇవ్వకున్నా, ఓట్లేయకున్నా మద్యవ్యతిరేకతలో మాత్రం మద్దతు తెలపడం మంచిది. మద్యం తెలంగాణలో తాగుడుగా పిలవబడుతుంది. తెలంగాణా వెనకబడి ఉండడానికి ఈ తాగుడుకూడా ఒక బలమైన కారణమే. మద్యవ్యతిరేకోద్యమం తెలంగాణలో వ్యాపింపజేయాలి. అందుకు తెలంగాణ నాయకులన్న పూనుకోవాలి లేదా అంతో ఇంతో పేరున్న శ్రీజయప్రకాశ్ గారికే దాన్ని ఒప్పజెప్పలి.
( ఈ కవితల రాసినాయి కవి వ్యక్తిగత ఆలోచనలు మాత్రమ )
August 23rd, 2008 at 3:30 am
మంచిగ చెప్పినవు అన్న