తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రాజకీయాలు
నవంబర్ 25th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- ఎం. కోదండరాం, కె. సీతారామారావు
తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అనుసరించవలసిన వ్యూహాలు ఎత్తుగడలపై తెలంగాణవాదుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. 1968లో తెలంగాణ ఉద్యమ పంథా విషయంలో ఇంతటి చర్చ జరిగిన దాఖలాలు లేవు.1968లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వివిధ ఉద్యోగ, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో మొదలయిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి ఉద్యమంలో ప్రవేశించి నాయకత్వం వహించిన అనంతరం ఉద్యమానికో రాజకీయ వ్యక్తీకరణ వచ్చింది. అప్పుడు ఉద్యమం ప్రజాసమితి నేతృత్వంలో సాగింది. తెలంగాణా ప్రజాసమితి కాక ఉద్యమం నిర్వహించే వేరొక సంస్థ ఏది లేకపోవడంతో ఉద్యమం అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడలకు సంబంధించి చర్చకు ఆస్కారం కలుగలేదు. కాని నేటి ఉద్యమ స్వభావం వేరు, ఇవ్వాళ సాగుతున్న ఉద్యమంలో అనేక పార్శ్యాలున్నాయి. వివిధరకాల ప్రజా సంఘాలు తెలంగాణా వాదాన్ని, భావజాలాన్ని రాష్ట్ర ఆవశ్యకతను విస్తృతంగా వ్యాపింపచేసిన తర్వాత తెరాస ఆవిర్భవించి ఉద్యమానికో రాజకీయ వ్యక్తీకరణ నిచ్చింది. ప్రజాసంఘాలు, పుట్టి పనిచేసిన తర్వాత పార్టీ పుట్టింది. తదనంతర దశలో తెరాసతో పాటుగా అనేక ప్రజాసంఘాలు చేసిన కృషికి రాజకీయ పార్టీగా తెరాస ఒక రాజకీయ వ్యక్తీకరణను స్పష్టంగా ఇవ్వగలిగింది. అందువలన తెలంగాణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా మారి కొనసాగుతున్నది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలేవైనా తెలంగాణా డిమాండ్‌ను విస్మరించలేని స్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నది. అయితే తెరాస ఏర్పాటుతో ప్రజాసంఘాలు 1968లో మాదిరిగా అంతరించిపోలేదు. అవికూడా తమదైన శైలితో ఉద్యమ రాజకీయాలను కొనసాగిస్తున్నాయి.
ఈ రాజకీయ వైవిధ్యతకు, సంక్లిష్టతకు కారణం లేకపోలేదు. 1969 తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చల్లారిన తర్వాత ఈ ప్రాంతంలో నక్పల్బరీ ఉద్యమం తలెత్తింది. దాని ప్రభావంతో ఎన్నో ప్రజాసంఘాలు ఏర్పడినాయి. పార్టీల నుండి విడిగా ప్రజలను ఆయా సమస్యలపై కదిలించడానికి కృషిచేసి ఆ సంఘాలు ఎదో ఒక రూపంలో నిలదొక్కుకున్నాయి. తమ కార్యకలాపాల ద్వారా ఉద్యమానికి చేయూతనిచ్చాయి. ఆ తరువాత ‘గుర్తింపు’/ ‘అస్తిత్వ’ ఉద్యమాలు వచ్చి పార్టీలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ప్రజాసంఘాల ఏర్పాటుకు కారణమయ్యాయి. ఈ చారిత్రక అనుభవం కారణంగానే తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో తెరాస ఏర్పడినా ప్రజాసంఘాలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాలకు, రాజకీయ పార్టీకి ఒక వ్యత్యాసం ఉంటది. ప్రజాసంఘాలు సమస్యలపై ప్రజలను కదిలించి చైతన్యపరచగలవు. తద్వారా రాజకీయ మార్పులకు దోహదపడుగలవు. అయితే అవి ఆయా వర్గాల రాజకీయ ప్రయోజనాలకు వ్యక్తీకరణను ఇవ్వలేవు. రాజీకయ వ్యక్తీకరణను ఇచ్చేది రాజకీయ పార్టీలు మాత్రమే. కనుక ప్రజాసంఘాలు ఎంత కృషిచేసినా వాటికి స్వచ్చందంగా తమకు తాము విధించుకొన్న రాజకీయ పరిమితులుంటాయి కాబట్టి అంతిమంగా రాజకీయ ప్రక్రియను నడిపించేది పార్టీలే. అందువల్లనే తెరాస పైన అందిరి దృష్టి ఉన్నది. ఆ పార్టీ రాజకీయ కార్యాచరణను ప్రతి ఒక్కరు నిశితంగ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వివిధ ప్రజా సంఘాలు చేసే శ్రమ రాశికి రావాలన్నా కృషి ఫలించాలన్నా తెరాస వ్యూహం, ఎత్తుగడలు సక్రమంగా ఉండాలి. సరిఅయిన దిశతో నడవాలి. ఈ కారణం చేతనే తెరాస రాజకీయ కార్యాచరణ చర్చలకు కేంద్ర బిందువైంది.
ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం తెరాస రాజకీయ కార్యచరణను, ప్రజాసంఘాల ఉద్యమ స్ఫూర్తిని నిర్హేతుకంగా, లక్ష్యరహితంగా విమర్శించడం కాదు. తెరాసతో పాటు వివిధ ప్రజాసంఘాలు తమ కార్యచరణను ఆత్మ విమర్శతో పరిశీలించుకోవడానికుపయోగపడే సైద్ధాంతిక ఛట్రాన్ని, వాస్తవిక రాజకీయ నేపథ్యాన్ని అందివ్వడం. దీనితో పాటు రాజకీయ పార్టీ, ప్రజాసంఘాల మధ్యనుండాల్సిన సంబంధాల పట్ల ఒక అర్థవంతమైన చర్చను లేవనెత్తి స్పష్టమైన అవగాహనకు దోహదం చెయ్యడం కూడా ఈ వ్యాస లక్ష్యం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రెండు మార్గాల్లో ఏకకాలంలో నడుస్తున్నది. ఒకటి తెరాస ఉద్యమంతో పాటు నడిపే రాజకీయ ప్రక్రియలను కలిపి అనుసరిస్తే, రెండవది వివిధ ప్రజాసంఘాలు తమ కార్యక్రమాల ద్వారా ఆందోళనల ద్వారా ప్రజలను చైతన్యీకరించి భావజాల వ్యాప్తిని కలిగించే ఉద్యమ ప్రక్రియను మాత్రమే అనుసరిస్తున్నది. అయితే ఈ రెండు ప్రక్రియలు ఒకదానికొకటి పరస్పరం వ్యతిరేకాంశాలు కావు. ఒకవేళ వైరుధ్యాలేమన్నా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన అంశం వరకు అవి పూర్తిగా మిత్ర వైరుధ్యాలే, ఎందుకంటే ఈ రెంటికి లక్ష్య సారూప్యత ఉన్నది కాబట్టి వాటిని చర్చ, విమర్శ, ఆత్మ విమర్శల వంటి ప్రక్రియల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ వాస్తవిక రాజకీయ నేపథ్యం నుండి, సైద్ధాంతిక దృక్పథం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొనసాగుతున్న తెరాస రాజకీయ కార్యచరణను, వివిధ ప్రజా సంఘాల ఉద్యమ ప్రక్రియలను వీటి మధ్యనున్న సంబంధాన్ని, పరస్పర ప్రభావాలను, విరుద్దాంశాలను అవగాహన చేసుకోవాలి.
II
తెరాస రాజకీయ కార్యాచరణలో లోపాలు దొర్లినప్పుడల్లా చర్చ తీవ్రమవుతున్నది. తెరాస తన వ్యూహంలో ఉద్యమ ప్రక్రియ కన్న ఎక్కువ ఎన్నికలకు ప్రాధాన్యతనిస్తున్నది. ఆ అంశం ఆధారంగా ప్రజలను సమీకరిస్తే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి తెలంగాణను సాధించుకోవచ్చునన్నది తెరాస ప్రధాన రాజకీయ వ్యూహం. ఈ వ్యూహానికనుగుణంగానే తెరాస తన రాజకీయ కార్యాచరణను రూపొందించుకుంటున్నది. ప్రస్తుతం నడుస్తున్న సంకీర్ణ రాజకీయాలలో ప్రతి పార్టీకి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ విధానాన్ని, రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చునని తెరాస భావిస్తున్నది. ఈ రాజకీయ వ్యూహంతో ఎవరూ పూర్తిగా విభేదించాల్సిన అవసరం లేదు. కానీ తెరాస వ్యూహంలో ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగి ప్రజలను కదిలించి సమస్యలపై ఆందోళన చేసే కార్యక్రమాలకి ప్రాధాన్యత తగ్గింది. అందువలన పార్టీలో ఆధిపత్యపోరు తీవ్రతరమైంది. ఈ ఆధిపత్యపోరు కొన్నిసార్లు పార్లమెంటరీ రాజకీయాల క్రమశిక్షణా పరిధులను దాటి ప్రజాస్వామిక విలువలను అపహాస్యం చేసే స్థితికి చేరుకొన్నది.
ఈ పరిణామాలకు కారణం లేకపోలేదు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి విధానాల ఫలితాలు కోస్తాంధ్ర సంపన్న వర్గాలకే దక్కినాయి. తెలంగాణాలో మాత్రం అసమ అభివృద్ధి, అభివృద్ధి అసమానతల ఫలితాలు స్థిరపడి ప్రాంతం ఆంధ్ర పెట్టుబడిదారుల అంతర్గత వలసగా మారింది. తద్వారా రాజకీయ వ్యవస్థపై ఏర్పడిన పెత్తనంతో తెలంగాణను వలసగా మార్చుకొని పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తెచ్చుకొన్నారు. ఆంధ్ర వలస పాలకవర్గం 1990 దశకం నుండి రాజకీయ వ్యవస్థపై బలపడిన పట్టుతో రాష్ట్ర ఆర్థిక విధానాలను తమకనుగుణంగా సవరించుకున్నది. ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చాలమటుకు వదులుకున్నది. పెట్టుబడిదారులకు కావలసిన వనతులను కల్పించడమే ప్రభుత్వం తన ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నది. అందువలన ప్రజల సమస్యలను తీర్చగల విధానాలను తయారుచేసే అవకాశాలు పూర్తిగ సన్నగిల్లినయి.
మరోవైపు ఇదే సమయంలో తెలంగాణతో పాటు అణగారిన వర్గాలు కూడా ఆధిపత్య శక్తుల నియంత్రణ నుండి బయటపడి స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించినయి. ఈ మార్పులు 1970ల తర్వాత క్రమంగా పెరుగుతు వచ్చినయి. అయితే భావజాలపరంగా సంఘటితమైన ఈ వర్గాలకు బతుకుదెరువు కల్పించడానికి కావలసిన కనీస సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. మొత్తం వనరులను, ‘పానకాలస్వామి బెల్లంపాకం తాగినట్టు’ కోస్తాంధ్ర సంపన్న వర్గాలు స్వాహచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించడానికి అనుసరించే పద్ధతులు మారిపోయినయి. రాజకీయాలు, రాజకీయ ప్రక్రియ స్వభావం పూర్తిగా మారిపోయింది. వివిధ కమిటీల ద్వారా డబ్బు పంపిణీ చేయడం, ఆదాయాలను పొందగల మార్గాలను చూపి ఓట్లు సమీకరించే పద్ధతి మొదలైంది. ప్రజల సమస్యలను చర్చించడానికి వేదికలు లేకుండా పోయాయి. రాజకీయాధికారం డబ్బు, ఆస్తుల సంపాదనకు మార్గమయింది. ఎక్కడైన బలహీన వర్గాలు సంఘటితమైతే ఆ నాయకులకు ఆశచూపి, కొని లోబర్చుకొని, ఇముడ్చుకునే ప్రయత్నం చేస్తున్నది పాలక వర్గం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఈ సాధారణ రాజకీయ సంస్కృతి తెరాసలోని ఆధిపత్య పోరును ప్రభావితం చేసిందినడానికి సందేహించాల్సిన అవసరం లేదు. తెరాస ఉద్యమ పార్టీ అయినప్పటికీ పార్లమెంటరీ రాజకీయాలు నడిపే ఇతర రాజకీయ పార్టీల వలనే అదికూడా ఒక రాజకీయ పార్టీ అని మరువకూడదు. వివిధ రాజకీయ పార్టీల రాజకీయ కార్యాచరణను విశ్లేషించి అర్థం చేసుకోవడానికి ఉపయోగించే సైద్ధాంతిక చట్రమే, తెరాసను కూడా అర్థం చేసుకోవడానికి, కొద్దిపాటి అటు ఇటు తేడాలతో ఉపయోగపడుతుందనడానికి అనమానపడనక్కర్లేదు.
III
ఒకే లక్ష్యం కోసం పనిచేసే రాజకీయ పార్టీ, వివిధ ప్రజాసంఘాల మధ్యనుండాల్సిన సంబంధాలు ఎంతో సున్నితంగా సంక్లిష్టభరితంగా ఉంటాయి. ఈ రెండింటి రాజకీయ కార్యాచరణ మధ్య సరిహద్దులు లేకపోవడం ఎంత నష్టదాయకమో, పరిధులు, పరిమితులులేకపోవడం కూడా అంతే ప్రమాదకరం. రాజకీయ పార్టీ, ప్రజాసంఘాల మధ్య నున్న సరిహద్దులు, సంబంధాలు పరస్పర ప్రజాస్వామిక చర్చకు చోటివ్వని ప్రతిబందకాలైతే ఉద్యమం కొన్నిసార్లు సమాంతర దిశల్లో కొనసాగితే మరికొన్ని సార్లు వ్యతిరేక దిశల్లో కొనసాగే ప్రమాదమున్నది. దీనివల్ల ఉద్యమాన్ని, రాజకీయ ప్రక్రియను ఐక్యీకరణచేసి సమన్వయపరచడం కష్టసాధ్యమవుతుంది. అదే విధంగా ఏకలక్షితమైన రాజకీయ పార్టీ, ప్రజాసంఘాల కార్యాచరణ మధ్య సరిహద్దులు అగుపడనంతగా చెరిగిపోతే ప్రజాసంఘాలు లేవనెత్తి చర్చించే ప్రజా సమస్యలకు న్యాయబద్ధత, విశ్వసనీయత, ప్రజామోదం తగ్గే అవకాశాలెక్కువవుతాయి. కాబట్టి ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ, ప్రజాసంఘాల మధ్య సంబంధాలను నెలకొల్పి నిర్వహించాల్సిన బాధ్యత రాజకీయ నాయకత్వానిదే. రాజకీయ పార్టీ నాయకత్వం ఎంతో దూరదృష్టితో, స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టియందుంచుకొని ఇటువంటి సున్నితమైన, సంక్లిష్టమైన సంబంధాలను అత్యంత జాగరూకతతో నిర్వహించాల్సి ఉంటుంది. ఏవిధంగానైతే ప్రజాసంఘాలు తమ రాజకీయ పరిధిని, పరిమితిని గుర్తెరిగి వ్యవహించరాలో, అదేవిధంగా రాజకీయ పార్టీ తన అవగాహన పరిమితులను పరిగణించి ప్రజాసంఘాలు లేవనెత్తిన సమస్యలను తమ తక్షణ రాజకీయ ప్రయోజనాల పరిధికి కుదించకుండా, విశాల ప్రజాప్రయోజన దృక్పథంతో, ప్రాధాన్యతా క్రమంలో, సరిఅయిన సమయంలో, సరిఅయిన వ్యూహంతో వాటికి ఒక సమగ్ర రాజకీయ వ్యక్తీకరణనివ్వాలి.
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ప్రజాసంఘాలు కదులకపోయివుంటే 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంఘాలు తెచ్చిన ప్రభావం ఎక్కువ కాలం నిలువలేదు. ఇవ్వాళ మళ్ళీ యధావిధిగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విషయానికొస్తే తెలంగాణా వాదాన్ని, ఉద్యమాన్ని అణచడానికి, విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కుటిలనీతిని, ఎన్నో దుష్ట పన్నాగాలను ప్రయోగించింది. తమతమ బలహీనలతలకు అమ్ముడుపోయిన తెరాస నాయకులను కొని, పార్టీని చీల్చి ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపాలని ప్రయత్నించింది. తెలంగాణా వాదాన్ని వ్యతిరేకించే మీడియా వర్గాలు తెరాస నాయకుల బలహీనతలను తెలంగాణా ఉద్యమానికి ఆపాదించి, ప్రజల న్యాయసమ్మతమైన, ప్రజాస్వామిక ఆకాంక్షను కేవలం ”సెంటిమెంట్”కు కుదించి తెలంగాణ ఉద్యమ వ్యతిరేక దుష్ప్రచారం పనిగట్టుకొని నిర్వహించి, అదే సమయంలో ఆంధ్రపాలక వర్గ కుటిల నీతిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ సంకీర్ణ రాజకీయ ధర్మ ఉల్లంఘనను కప్పివుచ్చే ప్రయత్నం చేసాయి.. ఈ నేపథ్యంలో ఉద్యమాలలో పాల్గొని వాటిని రాజకీయ ప్రక్రియకు అనుసంధానించే తెరాస వంటి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యూహాలను తెచ్చి ఆచరణలో పెట్టాలి. ప్రజాసమస్యలను లేవనెత్తి వాటికి రాజకీయ వ్యక్తీకరణనిచ్చి వాటి పరిష్కారం దిశగా ప్రజలను సమీకరించి కదిలించాలి. ప్రజాపంఘాలు లేవనెత్తిన వివిధ ప్రజా సమస్యలను సంయమనంతో పరిశీలించడమేకాక, ఉద్యమ అవసరాలరీత్యా ప్రజాసంఘాలను, వాటి కార్యాచరణను సమన్వయపరిచే గురుతర బాధ్యత ఉద్యమ పార్టీ అయిన తెరాసాదే. తెలంగాణాలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజలను సమీకరించి కదిలంచడానికి తెరాస ఒక వినూత్నమైన రాజకీయ కార్యాచరణను, వ్యూహాలను రూపొందిస్తే గాని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విజయవంతం గాదు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెరాస ఏక కాలంలో బహుముఖమైన రాజకీయ వ్యవహారం నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవైపు తెలంగాణా వ్యతిరేక శక్తులను ఏకాకిని చేస్తు వివిధ రాజకీయ పార్టీల్లోని అనుకూల శక్తులను లక్ష్యసాధనకై కలుపుకొని రావాల్సి ఉంటుంది. మరోవైపు ప్రజాసంఘాలు అధ్యయనం ద్వారా లేవనెత్తిన ప్రజాసమస్యలకు సరిఅయిన రాజకీయ వ్యక్తీకరణ నివాల్సి ఉంటుంది. దీనితో పాటు పార్టీ నిర్మాణాన్ని, ఉద్యమ నిర్మాణాన్ని పటిష్ఠపరుచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు తెలంగాణా ఉద్యమంలో భాగం కాని వివిధ సామాజిక వర్గాలను తెలంగాణా వాదం పట్ల ఆకర్శించి ఉద్యమోన్మఖులను చేయాలి. తెలంగాణా ఉద్యమాన్ని, రాష్ట్ర సాధనకు సంబంధించిన రాజకీయ ప్రక్రియను (లాబీయింగును) సమర్థవంతంగా సమన్వయించాల్సిన బాధ్యత తెరాసాదే. శక్తివంతమైన లాబీయింగుకుపయోగపడేది పటిష్ఠమైన ప్రజా ఉద్యమ పునాది. తెలంగాణా రాజకీయాల్లో ఈ అంశాన్ని విస్మరిస్తే రాష్ట్ర సాధన ఆకాంక్షకు, ప్రక్రియకు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులేర్పడే ప్రమాదమున్నది. ప్రజాభిప్రాయం ఉద్యమాల ద్వారానే నిర్మితం కావాల్సిదే తప్ప, దానికి మరో దగ్గరి మార్గం లేదు. తెలంగాణా ఉద్యమానికి ప్రధాన సాధనమైన రాజకీయ పార్టీని గ్రామస్థాయి నుండి ప్రజాస్వామ్యయుతంగా పునర్నిర్మించాల్సిన బాధ్యత కూడా తెరాసాదే.
IV
1990వ దశాబద్దం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవహరశైలి, సంస్కృతి పూర్తిగా మారిపోయింది. ప్రజలకు వనరుల నిర్వహణాధికారాన్ని బదలాయించే బదులు, రాజకీయ కార్యకర్తలకు వనరుల నిర్వహణ ద్వారా ఆదాయం పొందే మార్గాలను అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్వేషించి అమల్లో పెట్టినవి. ఈ ఆదాయ లబ్ధికి అలవాటుపడ్డ జిల్లా, మండల, గ్రామస్థాయి రాజకీయ నాయకులు అధికార పార్టీకి ”ఓట్ల వేటగాళ్ళు”గా మార్చబడ్డారు. ఈ కింది స్థాయి నాయకులు తిన్నది పోగా మిగిలింది ప్రజలకు (నిజమైన లబ్ధిదారులకు) ఎంతో కొంత దక్కింది. ఒక రైతు మాటల్లో చెప్పాలంటే ”పైకెల్లి ఎగచల్లితే కింద ఏరుకతినే” రాజకీయ సంస్కృతి ప్రభలి పోయింది. ప్రజా సమస్యల ఆధారంగా ప్రజాస్వామికమైన ప్రత్యామ్నాయ రాజకీయ సమీకరణ పద్ధతులు ఉనికిలోకి రాలేదు. ఒకవేళ ఎదో ఒక స్థాయిలో వచ్చిన అవి ప్రధాన రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోనయి ఆయా ప్రజాసంఘాల నాయకత్వంలోబర్చుకోబడ్డది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల డిమాండ్లను పట్టించుకొనే స్థితిలో లేవు. ప్రజా ఉద్యమాలు నడుపుతున్న పార్టీలకు స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథంగాని, పటిష్ఠమైన పోరాట వ్యూహంగాని లేవు. ఈపరిస్థితిల్లో అన్ని ప్రజా ఉద్యమాల, రాజకీయ పార్టీల సంక్షోభ స్వభావం దాదాపు ఒకే తీరుగ ఉన్నది. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయాలను వెతుక్కోవాల్సిన అవసరమున్నది. అట్ల చేయాలంటే ప్రధాన రాజకీయ పార్టీలు నెరుపుతున్న రాజకీయాల పరిమితులను అవగాహన చేసుకోవాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ నూతన రాజకీయ సమీకరణ వ్యూహాలను, పద్ధతులను, నిర్మాణాలను రూపొందించుకొని అమల్లో పెట్టాలి. ఈ నూతన రాజకీయ పద్ధతులకు, వ్యూహాలకు ప్రజా సమస్యలను లేవనెత్తి పరిష్కరించగల శక్తితో పాటు సామాజిక సంబంధాలను ప్రజాస్వామ్యీకరించగల లక్ష్యం ఉండాలి. అన్ని వర్గాల ప్రజలకు వనరుల్లో న్యాయ సమ్మతమైన వాటా, విధాన నిర్ణయంలో భాగస్వామ్యం కల్పించడానికి ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉపయోగపడాలి.
తెలంగాణా ఉద్యమం 1990లో ప్రారంభమైనప్పటి నుండి వివిధ ప్రజాసంఘాలతో పాటు తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకమైన పాత్ర నిర్వహించింది. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రవేశపెట్టడానికి తెవివే చెప్పుకోదగ్గ కృషి చేసింది. స్థానికంగా నున్న ప్రజా సమస్యలనధ్యయనం చేసి, ప్రజలను కదిలించి రాజకీయ నాయకత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. తెరాస పూర్తిగా ఢిల్లీకి, లాబీయింగుకు పరిమితమైనప్పుడు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ప్రజలను జాగృతం చేసింది. ఉద్యమాన్ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేసింది. వివిధ రకాల ప్రజా సమీకరణ పద్ధతుల ద్వారా కరీంనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో క్రియాశీలకంగా పొల్గొన్నది. ప్రజాసంఘాలు నిర్వహించిన కార్యక్రమాల (సైకిల్ మోటార్ ర్యాలీలు, తెలంగాణా ధూంధాం నిర్వహణ) ఊపువల్ల కరీంనగర్ ఉప ఎన్నిక ఒక ఉద్యమంగా సాగింది. 610 జీవో అమలు లోపాలు లేవనెత్తి ”క్విట్ తెలంగాణా” ధర్నాల ద్వారా, సూక్ష్మ సేద్య పద్ధతుల లోగట్టును విశ్లేషించడం ద్వారా ఉద్యమ స్వభావాన్ని మార్పుకు లోనుచేసింది.
ఇప్పటికీ తెలంగాణా ఉద్యమంలో ఎన్నో ప్రజాసంఘాలు ఎన్నోరకాల ఉద్యమాలను క్రియాశీలకంగా, నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం తెలంగాణ పౌర సమాజం ప్రజాసమస్యలపై అర్థవంతంగా, చైతన్యవంతంగా ప్రతిస్పదించే లక్షణాలున్న సమాజం. ఈ ప్రాంత ప్రజాసంఘాలు నిర్వ్యాపకత్వంగా, నిస్తేజంగా ఉండవు. గత అర్థ శతాబ్దంగా తెలంగాణావాదాన్ని, ఉద్యమ చైతన్యాన్ని సమాజంలో, ప్రజల్లో సజీవంగా నిలిపి ఉంచిన ఘనత ఈ ప్రజా సంఘాలదే. తెలంగాణ ఉద్యమం కీలకదశకు చేరుకున్న ఈ పరిస్థితుల్లో తెలంగాణా ఉద్యమంలో ప్రజాసంఘాల బాధ్యత మరింత పెరిగింది. ఇప్పటికీ లోతుగా అధ్యయనం చేయాల్సిన ప్రజాసమస్యలు ఇంకా చాలానే ఉన్నయి. తెలంగాణాలోని అన్ని సామాజిక వర్గాలను తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో కలుపుకు రావాల్సిన రాజకీయార్థిక వ్యూహాన్ని రూపొందించి, సమన్వయపరిచి, అమలుపరచాల్సిన అవసరం ఇంకా మిగిలే ఉంది. తెలంగాణా భావజాల వ్యాప్తి విషయంలో ఇంకా కొన్ని సామాజిక వర్గాల్లో వేగంగా ప్రచారం చేయాల్సిన అవసరమున్నది. ఏక కాలంలో రాజకీయార్థిక, సాంస్కృతిక ఉద్యమాలు నిర్మించి తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు, తదనంతరం సమాజ పునర్నిర్మాణానికవసరమైన నిర్మాణాలను పటిష్ఠపరచడం ఈనాటి తెలంగాణా ఉద్యమం అవసరం. ఇటువంటి సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజాసంఘాలు ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. తమతమ రాజకీయ పరిమితులను, పరిధులను గుర్తెరిగి ఉద్యమ నాయకత్వంపై ‘మెత్తటి ఒత్తిడి’ (soft pressure) క్రమంగా పెంచుతూ పోవాలి. ఈ ఒత్తిడి పెంచే క్రమంలో అసలు లక్ష్యానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజాసంఘాల పాత్ర ఎంత కీలకమో అంత సున్నితం, సంక్లిష్టం కూడా. రాజకీయాల్లో ప్రజా సంఘాలు లక్ష్యించిన మార్పులు ఒక్క రోజులో రావు. అందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. విలువైన పమయాన్ని వృదా చేసే విమర్శలు పక్కనపెట్టి ఎక్కడికక్కడ ప్రజాసంఘాలు కదలగలిగితే తెరాస పైన ఒత్తిడి పెట్టడం సాధ్యమవుతుంది. స్థానికంగా ప్రజాసమస్యల పైన కదిలినప్పుడే, ఆ ఆచరణ నుండి తెరాస పైన సద్విమర్శ సాధ్యం. అటువంటి ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగిస్తే ప్రజాసమస్యల ఆధారంగా రాజకీయ రంగంలో మౌలికమైన, ప్రజాస్వామికమైన మార్పులు ప్రవేశపెట్టబడుతాయి. ప్రజలను చైతన్యపరిచే కొత్త రాజకీయాలకు తెరలేపవచ్చు. తెలంగాణాలో నూతన రాజకీయాలు ప్రవేశపెట్టడానికి ఎంతో ఓర్పుతో కూడిన కృషి చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజాసంఘాలదే.





