(ఆన్‌లైన్, సిటీబ్యూరో): ‘తరతరాల బూజు నిజాం రాజును కీర్తించడం కె.చంద్రశేఖరరావు అహంభానికి దర్పణం. అంతేగాక, వేలాదిమంది అమరవీరుల త్యాగాలను కించపరడమే’నని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక ప్రకటనలో విమర్శించింది. రాచరిక పాలనను ప్రశంసించడమంటే ప్రజల గోళ్లు ఊడగొట్టి వసూలు చేసే పన్నుల పద్ధతిని సమర్థించడమే అవుతుందని కమిటీ నాయకులు పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని వారు పేర్కొన్నారు.
నిజాం దోపిడీకి వ్యతిరేకంగా మహోన్నత త్యాగాలు చేసిన రాంజీగోండ్, తుర్రె బాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్, బందగీ, కొమరం భీమ్‌లను ఆదర్శంగా తీసుకుని ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నారని, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో అశువులు బాసిన పదివేల మంది అమరులకు గుర్తుగా స్థూపాలు నిర్మించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవేమీ పట్టకుండా గోల్కొండ ఖిల్లా కింద ప్రజలు ఘోరీకట్టిన నిజాంను తవ్వి, తిరిగి పట్టం కట్టచూపడం క్షమార్హం కాదని అన్నారు. శ్రమ జీవుల నాయకత్వం మరింత ఉధృతం చేసి తెలంగాణ ద్రోహుల బండారం బయటపెడతామని ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ పాశం యాదగిరి హెచ్చరించారు.
అమరవీరులను కించపరచడమే : తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపణ
Nov 26th, 2007 by డిస్కవర్ తెలంగాణ