– సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాకంటకంగా సాగిన నిజాం పాలనను పొగడటం ద్వారా తెలంగాణ విముక్తి పోరాటాన్ని కేసీఆర్ అవమానించారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. “నిజాం పాలన 20వ శతాబ్దకాలంలో ఉండకూడనిది. పౌరహక్కులు లేకుండా వెట్టిచాకిరీ, దోపిడీ వ్యవస్థతో కూడిన ఆ దుర్మార్గ పాలనపై ప్రజలే తిరుగుబాటు చేశారు. నిజాంను పొగడ్తలతో ముంచెత్తి మైనారిటీల ఓట్లు దండుకోవాలనే చౌకబారు ఎత్తుగడ కేసీఆర్‌ది. నిజాం వ్యతిరేక పోరాటంలో ముస్లింలు కూడా చురుగ్గా పాల్గొన్న సంగతి మరిచిపోయినట్లున్నారు” అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ (నరేంద్ర) ప్రధాన కార్యదర్శి గోవింద్ గిరి కూడా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. “మహిళలను బట్టలూడదీసి బతుకమ్మలు ఆడించినందుకు నిజాంను పొగిడారా? శిస్తు బకాయిల పేరిట పేద రైతులపై బండలు మోపినందుకు పొగిడారా? జమీందార్లు, పెత్తందార్లు, దొరలకు రాజ్యం అప్పగించినందుకు పొగిడారా?” అని ప్రశ్నించారు. నిజాం నవాబుల వర్ధంతికి కేసీఆర్ హాజరు కావడమే తప్పని తెలంగాణ సంఘర్షణ సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ప్రధాన కార్యదర్శి యోగానంద్, ఎర్ర జాన్సన్ మాదిగ అన్నారు. కేసీఆర్ వైపు ఉంటారో, తెలం గాణ ప్రజాస్వామిక ఉద్యమాల వైపుంటారో తెలంగాణ మేధావు లు తేల్చుకోవాలని కోరారు.