Feed on
Posts
Comments

- అల్లం నారాయణ

నిజామ్‌కు మొక్కుమంటవా !
దొరా !
నీబాంచెన్.
నిజాం ఏడేడు తరాలకు
దండేసి దండం పెట్టమంటవా !

ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్ చెయ్యమంటవా! ఎన్నేండ్లు మొక్కమంటవు. ఎన్నేండ్లు బాంచెగిరి చెయ్యమంటవ్.

నిజాంది.. నీదీ, నీవెనకటి జాగీర్దార్లది దొరలది ఒకే జాతి గద. దొరా ! తెలంగాణ రాకముందే మేమేందో? ఎలాన్ జేసినవ్. మంచిది. కానీ…
మావీపుల మీద బండలెత్తి, నొసట వెట్టిరాతలు రాసి గోళ్లూడ గొట్టి పన్నులు వసూలు జేసి, ఇజ్జత్ పజీతజేసి, రాసిరంపానబెట్టి, బరిబాత బతుకమ్మలాడిచ్చి, తల్లి సన్నుపిండి పాలు మురుక చూసిన నిజామూ, నువ్వూ, ఆరారు పదారుమంది దొరల జాతికి ఈ గులామ్ గిరీ ఎన్నొద్దులు చెయ్యమంటవ్.
ఎన్ని కాలాలు. ఎన్ని శతాబ్దాలు.

నిజాం మంచోడె. మమ్ముల్ని నిలువునా ముంచిన దొరలూ మంచోళ్లె. కని దొరా! ఆర్ట్స్ కాలేజీకి రాళ్లెత్తిన కూలీలకు గిట్టిందెంత? పోగొట్టుకున్నదెంత? నిజాం కట్టిన నీటి ప్రాజెక్టుల కింద పొందిందెంత ? పోగొట్టుకున్నదెంత ? నిజామ్ అట్టహాసాల, ఆడంబరాల, విలాసాలముందు వెలతెల బోయిన జీవనమెట్టిది? నిజామ్ వారసులయిన నీ జాతి కచ్చడాల ముందు ఉరికిన సాకలి, మంగలి ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆయాసం కొలమానం ఎంత! అవమానం పాలెంత?

తెలంగాణ అంటె ఏంది. ఒక ఒడవని కత. ఒక తెలియని చరిత. విస్మరించిన గతం, విధ్వంసమయిన వర్తమానం. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర నీది కాదు. మాది కాదు, నిజమే. ఒప్పుకుంట. ఆ మాట కొస్తే ఈ భూమి పుత్రుల, మూలవాసుల చరిత్రను మాయజేసి, మతుపరిచ్చిండ్రు. నిజమేనంట.

ఎవడి పులగం పడి ఈ తెలంగాణ పొందిచ్చిండో, ఎవడివేలు ఈ తెలంగాణ జాతికి దారి చూపిచ్చిందో? ఎవరి రక్తమాంసాలు ఈ తెలంగాణ కోసం తండ్లాడినయో, చరిత్ర లేదు. ఒక తప్పుడు చరిత్ర తెలంగాణ అస్తిత్వాన్ని కబళించిందీ నిజమే. కానీ.. నీ బాంచెన్. నిజాంను ఒప్పుకొమ్మంటే ఎట్లా ఒప్పుకుంట. ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుల నీలినీడలు మరచిపొమ్మంటే ఎట్లంట? కొన్ని నెత్తుటి కాల్వలు పారిచ్చి గదా నిజాం పంటకాల్వలు పారిచ్చిండు.

కొన్ని కొనవేటి గోళ్లూడగొట్టికదా నిజాం నగిషీలు చెక్కిన ఆ భవంతులు కట్టిచ్చిండు. ఏభాషను ఉద్దరిచ్చిండని, ఏ సంస్కృతిని బతకనిచ్చిండని. ‘దక్కానీ’ల మీద ‘లక్నోవీ’ ల పెత్తనం. తెలంగాణం మీద రాజభాష పెత్తనం. వలసపాలకుల నమ్మిన బంటుగా అటు తెల్లదొరలను, ఇటు తైనాతీలను మా మూపుల మీద నిలబెట్టికదా ఆ రాచరికపు గుంటనక్క తెలంగాణనేలిండు. అంతర్గత వలసలకు ఆయన కారణం కదా! ముల్కీలకు ముందు అంగ్రేజి నేర్చిన ఉద్యోగులను తెచ్చింది ఆ నిజాం కాదా? ఏది మూలం? తెలియదా? నిజాం రాజ్యాన్ని ముక్కల కింద ముష్కరులకు రాసిచ్చిందెవరు? వలస పాలకులకు వంగి వంగి దండాలు పెట్టి గులాంగిరీ చేసి సలామ్ చేసిందెవరు? చెరువులు తవ్విండు సరే! ఆ చెరువుల కింద బండలైన బతుకులెవరివి? ఏ కాస్తు కింద, ఏ కిస్తీలకింద ఏ సర్ఫెఖాస్‌ల కింద ఎవరు రాజ్జెమేలిండు? తెలంగాణను ఎన్నేండ్లు ఎనకకు మళ్లించిన ఒక తరతరాల బూజునెట్లా తలకెత్తుకొమ్మంటవు.

నిజామ్ ఒకవ్యక్తికాదు గదా.. ఒక వ్యవస్థ కదా. నిజమే. త్యాగాల బాట… తండ్లాటయ్యింది. విశాలాంధ్ర, ప్రజారాజ్యం… అంతర్గత వలసల అడ్డదారి అయింది. అస్తిత్వం వెదుకులాటలో అన్నీ సక్రమమే కావొచ్చు. అస్తిత్వం అంటే మూకుమ్మడి మూడున్నరకోట్లమంది ఉద్వేగ, ఆకాంక్షల సమాహారమూ నిజమే. మనదిగాని మన చరిత్ర. విస్మరించిన చరిత్ర వక్రీకరించిన నూరు అబద్ధాల అడ్డగోలు చరిత్ర ధిక్కరణా కావాల్సిందే. కానీ… తెలంగాణల తండ్లాడింది మేము. తెలంగాణల డొల్లాడింది మా నెత్తురు. పారాడింది మా మూలాలు. నిజాంనెందుకు తెస్తవు నా నెత్తుటి ఆశ్వాసాల ముందుకు. తెలంగాణ ఒక నెత్తుటి పువ్వు. నిత్య పోరాటాల నవయవ్వన ఝరి. నిత్యగాయాల నది. త్యాగాల చాలు బోసిన ఒక బొడ్డుతాడు సంబంధం. గతానికీ, వర్తమానానికీ కత్తుల వంతెన కట్టిన ఓ వికసించిన విద్యుదుత్తేజం. ‘తీగలను తెంపిన’ ముసలినక్కల మీద ‘చుట్టుముట్టిన’ దండోరా ప్రతిధ్వని. నాకీ నిజామ్ చుట్టరికమెందుకు.

వలసపాలనపై కోఠీలో గుండుపేల్చిన తుర్రెబాజ్ ఖాన్, ఆబిడ్స్‌ల నవాబుల రాక్షససేనపై కలం కత్తిదూసిన యోధుడు షోయబుల్లాఖాన్, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల గల్లాపట్టి పోరాట పతాక ఎత్తిన బందగి చిందిన రక్తం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, అంతర్గత వలస పాలనపై దండెత్తి గుండ్లకు గుండెలొడ్డిన ఎన్నం ఉపేందర్ సహా 370 మంది అమరవీరులు, హుస్నాబాద్ స్థూపం మీది పేర్లు- ఈ నెత్తుటి వారసత్వం ఒక చరిత్ర. అది తెలంగాణలో నిటారుగా నిలుచున్న మూడుస్థూపాల వారసత్వం. రేపటి తెలంగాణ పుడమితల్లి వారసత్వం. దొరా! ఇంగ నావల్ల కాదు. మేర్సె నహిహోతా. నిజామ్‌కు నేను హర్కిస్ మొక్కలేను. ఇగ ఇవ్వాల్టితో నీకు సాగిలపడలేము. మన్నించు దొరా. మా తెలంగాణ వేరయిపోయింది. షోయబుల్లాఖాన్ వారసులం, బందగి ప్రేమికులం, ఎన్నం ఉపేందర్ సహచరులం, పక్కా తెలంగాణవాదులం చెప్తున్నం. జరవిను.

One Response to “‘నాతోని గాదు’”

  1. 1
    keerthi srinivas Says:

    చాల్ భాగుంధి. ఈనాదు తెలణ్గానకొసం అంధ్రు క్రుషి చెయాలని కొరుథున్నను

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com