Feed on
Posts
Comments

- కె. రామచంద్రమూర్తి

ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులకు అనేకమంది సలహాదారులు ఉంటారు. నాయకుడు అడిగితే సలహాలు చెప్పేవారు కొందరైతే అయాచితంగా సూచనలు చేసేవారు కొందరు. ఏ సలహాను స్వీకరిస్తారన్న దానిపైన నాయకుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఎంతమంది ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది నాయకులే. తమ నిర్ణయాలకు వారే బాధ్యత వహించాలి. నెపం మరొకరిపైన వేయడానికి వీలులేదు. అందుకే నాయకులు అందరి సలహాలూ పరిశీలించిన తర్వాత తమ మనసు చెప్పినట్టు నడుచుకుంటారు. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొన్ని బెడిసి కొడతాయి. ఇందిరాగాంధీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకునేవారని ప్రతీతి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కూడా ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. ఎం.సత్యనారాయణరావు, కేశవరావుల సూటిపోటి మాటలకు కినిసిన కేసీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయం ఈ కోవలోకి వస్తుంది.

పార్టీ సహచరులనో, పార్టీ వెలుపల మిత్రులనో విస్తృతంగా సంప్రతించి ఉంటే అటువంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యమయ్యేది కాదు. మనసుకు ఏది మంచిదని (గట్ ఫీలింగ్) అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా కరీంనగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. కేసీఆర్‌కు పెద్ద మెజారిటీ లభించడం వల్ల తెలంగాణ అంశంపై సందేహాలు నివృత్తి అయినాయి. తెలంగాణలోనే కాకుండా తక్కిన ఆంధ్రప్రదేశ్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ స్పష్టత ఏర్పడింది. నిజాంను ప్రస్తుతించాలన్న సంచలనాత్మకమైన నిర్ణయం కూడా పార్టీలో చర్చ జరిగిన తర్వాత తీసుకున్నది కాదు. దాదాపు ఒంటరిగా తీసుకున్నదే. కరీంనగర్ నిర్ణయం ఇచ్చినట్టు ఈ నిర్ణయం కూడా సత్ఫలితం ఇవ్వాలన్న నియమం లేదు. నిజాం వంశీయులు ఆహ్వానిం చడం, మీర్ ఉస్మాన్ అలీ సమాధిని కేసీఆర్ సందర్శించడం, అక్కడ నిజాం గురించి ప్రశంసాత్మకంగా మాట్లాడటం ఒక ప్రణాళిక అంటూ లేకుండానే జరిగినట్టు కనిపిస్తున్నది.

ఒకసారి నిజాంను పొగిడిన తర్వాత తన వైఖరిని సమర్థించుకోవడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తున్నాం. తెరాస నాయకులలో చాలా మంది ఈ విషయంలో అధినాయకుడి ఎదుట హర్షం ప్రకటిస్తున్నప్పటికీ వెనుక విమర్శిస్తున్నారు. తెరాస క్రమంగా బలం పుంజుకుంటున్నదనీ, కమ్యూనిస్టులు కూడా మెత్తబడుతున్నారనీ, బలపడుతున్న ‘తెలంగాణ సెంటిమెంటు’ ఫలితంగా రాబోయే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చుననీ భావిస్తున్న తరుణంలో ఇటువంటి వివాదాన్ని రే కెత్తిం చడం చెట్టెక్కి కొమ్మ నరుక్కోవడం వంటిదేనని సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. మంచి మాటకారి కనుకా, వాదనాపటిమ ఉన్న నాయకుడు కనుకా నిజాంపైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకోవడానికి కేసీఆర్ అంగీకరించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఏడవ నిజాం హయాంలో తెలంగాణ జనజీవనం గురించీ, భూస్వాముల, ఇనాందార్ల, దేశ్‌ముఖ్‌ల అరాచకాల గురించీ, వీరతెలంగాణ సాయు ధపోరాటం గురించీ, రజాకార్ల హింసోన్మాదం గురించీ, పటేల్ సైన్యం నిర్వాకం గురించీ మీడియాలో విస్తారంగా చర్చ జరిగింది.

కేసీఆర్ ప్రకటనపట్ల దళిత, ముస్లిం కవులు కొందరు హర్షం ప్రకటించగా వెనుకబడినవర్గాలకు చెందిన రచయితలు కొందరు నిరసన తెలిపారు. ఇదంతా రాబోయే ‘గ్రేటర్’ ఎన్నికలలో ముస్లిం ఓట్ల కోసమేనని కొందరు వ్యాఖ్యానిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం ఓట్లను సంపాదించే ఎత్తుగడ అని మరి కొందరు నిందిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా నిజాంను వేయిసార్లు పొగుడుతానంటూ కేసీఆర్ అంటున్నారు. వలసవాదులు రాసిన చరిత్ర చదువుకొని తెలంగాణ చరిత్రను అర్థం చేసుకోకూడదనీ, తెలంగాణ దృక్కోణం నుంచి చరిత్రను అధ్యయనం చేయాలనీ, హిందూ- ముస్లింలు తెలంగాణలో ఐకమత్యంగా సహజీవనం చేయాలంటే నిజాం పాలనను సరైన దృక్పథంలో సమీక్షించి అంచనా వేయడం అవసరమనీ ఆయన వాదన. రజాకార్ల ఘోరకృత్యాలను మినహాయిస్తే నిజాం పాలనలో తప్పుపట్టవలసింది పెద్దగా లేదని అనడం భూస్వాముల, పటేళ్ళ, దేశ్‌ముఖ్‌ల నేరాలను విస్మరించడమే అవుతుంది.

1911లో గద్దెనెక్కిన మీర్ ఉస్మాన్ అలీ సుమారు నలభై ఏళ్ళ పాలనలో ఒక విశ్వవిద్యాలయాన్నీ, ఒక ఆసుపత్రినీ, ఒక సాగునీటి ప్రాజెక్టునూ నిర్మించడాన్ని ఈ రోజున మనం విశేషంగా చెప్పుకోవడం విడ్డూరం. నాటి ప్రజల జీవన స్థితిగతులనూ, వారి బానిస బతుకులనూ, ఆకలిమంటలనూ, అమానవీయ పరిస్థితులనూ, జ్వలిత హృదయాలనూ పరిగణించకుండా నిజాం పాలనకు కితాబులు ఇవ్వడం తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నవారు చేయవలసిన పని కాదు. ప్రస్తుత పాలకులతో పోల్చి నిజాంను ప్రశంసించవచ్చును కానీ బేషరతుగా కీర్తించడం గొప్ప వ్యూహంగా కనిపించడం లేదు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి ముందు స్వతంత్రం ప్రకటించుకోవడానికి ఉస్మాన్ అలీ అమలు చేసిన వ్యూహాన్ని పరిశీలిస్తే అతడి అసలు రంగు తెలుస్తుంది. చరిత్రకారుడు రామచంద్రగుహ తాజా రచన ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’లో ఈ ఘట్టం వివరంగా రాశారు.

బ్రిటిష్ వలస పాలన దేశంలో వేళ్ళూనుకున్నప్పటినుంచీ హైదరాబాద్ నిజాంలు బ్రిటిష్ పాలకులకు గులాంలుగానే ఉన్నారు. సొంత సైన్యం లేకుండా సికిందరాబాద్ కంటోన్మెంట్‌లోని బ్రిటిష్ సైన్యం రక్షణలోనే ఉండేవారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం తో సంబంధాలు నెరపడానికి సర్ వాల్టర్ మాంగ్టన్ అనే ఖరీదైన న్యాయవాదిని ఉస్మాన్ అలీ పెద్ద ఫీజు చెల్లించి పెట్టుకున్నాడు. ప్రియురాలి సాంగ త్యం కోసం బ్రిటిష్ సింహాసనాన్ని పరిత్యజించిన ఏడవ ఎడ్వర్డ్‌కు వాల్టర్ మాంగ్టన్ సలహాదారు.హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయకుండా స్వతంత్ర దేశంగా ప్రకటించాలని బ్రిటిష్ పాలకులను ఒప్పిం చేందుకు మాంగ్టన్ శతవిధాల ప్రయత్నించాడు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమిం చారు. స్వతంత్ర దేశంగా ప్రకటించి ముస్లింల ప్రయోజనాలు పరిరక్షించేం దుకు ఖాసిం రజ్వీ రజాకార్లనే ప్రైవేటు సైన్యాన్ని నిర్మించాడు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఫ్యూడల్ విధానాలపైనా, భూస్వాములపైనా కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం తిరుగుబాటు చేసింది. ఈ దశలో హైదరాబాద్‌కు ప్రత్యేక దేశ ప్రతిపత్తిని సాధించడానికి నిజాం పావులు కదిపాడు. నిజాం న్యాయవాది మాంగ్టన్ కన్సర్వేటివ్ పార్టీ నేత కూడా. అందువల్ల నిజాంకు నాటి బ్రిటిష్ పార్లమెంటులో ప్రతిపక్షమైన కన్సర్వేటివ్ పార్టీ మద్ద తు లభించింది. పోలండ్‌ను హిట్లర్ మింగి కూర్చున్నట్టు హైదరాబాద్‌ను ఆక్రమించడానికి ఢిల్లీలోని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదంటూ కన్సర్వేటివ్ నాయకులు దుయ్యబట్టారు. సార్వభౌమాధికారం ఉన్న రాజ్యంగా ఒక సారి ప్రకటించిన తర్వాత దాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయకుండా చూడవలసిన బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వంపైన ఉన్నదని మాజీ ప్రధాని చర్చిల్ వాదించాడు. స్వతంత్రంగా ఉండాలన్న హైదరాబాద్ సంస్థానాధీశుడి అభీష్ఠాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించి బలపరచాలంటూ చర్చిల్ అంతేవాసి బట్లర్ వంతపలికాడు.

యూనియన్‌లో కలవాలంటూ హైదరాబాద్‌పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తే దేశంలోని పదికోట్లమంది ముస్లింలూ ఒక్కతాటిపై నిలిచి అత్యంత పురాతనమైన ముస్లిం రాజవంశం ప్రతినిధిని (నిజాంను) రక్షించుకుంటారని మహమ్మదలీ జిన్నా లార్డ్ మౌంట్‌బాటన్‌ను హెచ్చరించాడు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఎటువంటి సంబం ధాలు ఉన్నాయో అటువంటి సంబంధాలనే భారత ప్రభుత్వంతో పెట్టుకోవడానికి తనకు అభ్యంతరం లేదని ఉస్మాన్ అలీ 1947 నవంబర్‌లో వర్తమా నం పంపించాడు. భారత యూనియన్ తరఫున కెఎం మున్షి, నిజాం తరఫున లాయికలీ ఖాన్‌లు సమాలోచనలు జరిపారు. నిజాం ప్రభుత్వంలో హిందువులకు ఇతోధిక ప్రాతినిధ్యం ఇస్తామంటూ లాయికలీ ప్రతిపాదిం చారు. అది కాంగ్రెస్ పార్టీకి ఆమోదం కాలేదు. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనీ, ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలనీ కాంగ్రెస్ పట్టుబట్టింది. 1948 మార్చి కల్లా ఉస్మాన్ అలీ పెత్తనం అంతా ఖాసిం రజ్వీ కాజేశాడు.

రజ్వీ పది లక్షలమంది రజాకార్లను తయారు చేశాడు. దక్కన్‌లో ముస్లిం ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చివరి వరకూ పోరాడతామంటూ రజాకార్లు అందరూ అల్లా మీద ప్రమాణం చేశారు. వీపీ మీనన్, లాయికలీ చర్చలు విఫలమైనాయి. నిజాం స్వతంత్ర రాజ్యంపైనే పట్టుపడుతున్నాడంటూ మున్షీ ఢిల్లీకి నివేదిక పంపించాడు. పదవీ విరమణ చేయడానికి ముందు కూడా మౌంట్‌బాటన్ ఉస్మాన్ అలీకి ఉత్తరం రాశాడు. రాజీపడవలసిందిగా సలహా ఇచ్చాడు. మాజీ దివాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ హితవు సైతం అదే. నిజాం పెడచెవిన పెట్టాడు. 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు హైదరాబాద్‌లో ప్రవేశించాయి. నాలుగు రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆ నాలుగు రోజులలో నలభై రెండు మంది భారత సైనికులూ, రెండువేల మంది రజాకార్లూ చనిపోయారు. కమ్యూనిస్టులు తీవ్రంగా నష్టబోయారు (సైనిక చర్యలో ఎంతమంది మరణించారో, ఎన్ని అత్యాచారాలు జరిగాయో చర్చించాలన్న డిమాండ్ సమంజసమైనదే). సెప్టెంబర్ 17న ఉస్మాన్ అలీ హైదరాబాదీలను ఉద్దేశించి రేడియోలో ప్రసం గించాడు. రజాకార్లపైన నిషేధం విధించాడు.

భారత్ యూనియన్‌లోని ఇతర భారతీయులతో కలసి ప్రశాంతంగా జీవించవలసిందిగా తన ప్రజలకు ఉద్బోధించాడు. జరిగిన అనర్థాలకు రజ్వీని నిందించాడు. యూనియన్ సైన్యాలు హైదరాబాద్‌లో ప్రవేశించడానికి రెండు రోజుల ముందే పాకిస్థాన్ గవర్నర్ జనరల్ జిన్నా కన్నుమూశాడు. ఆయన హెచ్చరించినట్లు పదికోట్లమంది ముస్లింలు తిరుగుబాటు చేయలేదు కానీ కరాచీలో భారత్ హైకమిషన్ ఎదుట అయిదు వేలమంది నిరసన ప్రదర్శన జరిపారు. తమ జాతిపిత మరణించిన సమయంలో పిరికిపందల్లాగా భారత సైనికులు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నారంటూ నిప్పులు చెరిగారు. నైజాం భూభాగంలో పది శాతం నిజాం సొంతం. సంవత్సరానికి రూ. 2.5 కోట్ల ఐవేజు వచ్చేది. సంస్థానం కోశాగారం నుంచి సాలీనా రూ. 50లక్షలు ముట్టేవి. ఆ రోజుల్లో ఇది భారీ మొత్తం. నాడు ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు నిజాం. హిందువులలో, ముస్లింలలో కొందరు మాత్రమే నిజాం ప్రాపకంతో అధికారాన్నీ, సంపదనూ అనుభవించారు. తక్కిన ముస్లింలు హిందువుల వలెనే కార్మికులుగానో, కర్షకులుగానో జీవించారు.

సంస్థానంలో ఎనభై అయిదు శాతం మంది హిందువులే అయినప్పటికీ సైన్యం, పోలీసు, రెవిన్యూసర్వీసులలో ముస్లింలదే ఆధిపత్యం. తెలుగు మాధ్యమం కాకుండా ఉర్దూ మాధ్యమంలో విద్యాబోధన ఉండేది. స్థానిక ప్రజల సంస్క¬ృతీ సంప్రదాయాలకు విలువ ఉండేది కాదు. బ్రిటిష్ పాలన లో ఉన్న ఆంధ్ర ప్రాంతంలోని విద్యావకాశాలతో, పౌర హక్కులతో పోల్చితే హైదరాబాద్ సంస్థానం చాలా వెనుకబడి ఉండేది. విద్యాధికులైన సంస్థానాధీశులున్న మైసూరు, బరోడా వంటి ప్రాంతాలలో విద్య, ఆరోగ్య సదుపాయాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉండేవి. సుమారు తొంభై శాతం మంది ప్రజలు భారత యూనియన్‌లో విలీనం కావాలని ఆకాంక్షిస్తుంటే స్వతంత్రం ప్రకటించుకోవడంకోసం నిజాం విశ్వప్రయత్నం చేశాడు. హిందు వులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో, అత్యధికుల ఆకాంక్షలకు భిన్నంగా మైనారిటీపాలన కొనసాగించేందుకు ప్రయత్నించిన నిజాంకు సలాము చేయడం ఆత్మగౌరవం ఉన్నవారు చేయవలసిన పనేనా? జమీందార్లు, ఇనాందార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను పీడించడానికి నిజాం ఇచ్చిన అధికారమే కారణం.

ప్రజలను పీడించిన ఇతర రాజులు చేసిన మంచి పనులను చెప్పుకుంటున్నప్పుడు నిజాం మంచి పనులు చెప్పడంలో తప్పేమిటన్నది ప్రశ్న. నిజాం ఇటీవలివాడు. నిజాం పాలనలో కష్టాలు అనుభవించినవారు మన మధ్య ఉన్నారు. నిజాంకు వ్యతిరేకంగా, ఆయన ప్రతినిధులైన జమీందార్లూ, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన చారిత్రక పోరాటమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో సాగుతున్న పోరాటాలకు స్ఫూర్తి. నిజాంను మెచ్చుకుంటే ఆయన మనుమలూ, మనుమరాళ్ళూ సంతోషిస్తారేమో కానీ సాధారణ ముస్లింలు సంతోషించరు. సాధారణ ముస్లింల హృదయాలను గెలుచుకోవాలంటే వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎన్నికలు లేని సమయంలో కూడా పోరాడాలి. నిజాం పరిపాలనపై ఏకాభిప్రాయం లేదన్నమాట నిజం. ఎప్పటికైనా చర్చ జరగడం అవసరమే.

Share/Save/Bookmark

One Response to “నిజా(o) నిజాలు!”

  1. 1
    ramulu Says:

    రామచంద్రమూర్తిగారు,
    మీరు రాసిన వ్యాసం ఎంతో సమాచారాన్నిచ్చింది, కేసీఆర్ ప్రకటనలోని తప్పులను విశద పరిచింది. నిజామ్ కాలం లో ఉర్దూ మీడియం ఉండి తెలంగాణలో విధ్యాభివ్రుద్ధి ఏమాత్రం లేకుండా బోయింది.విధ్యలో వెనకబడిఉన్న తెలంగాణలో ఆంధ్ర-సీమ వారు అదునుగా/అలుసుగా తీసుకున్నారు, లెక్కలేనన్ని అక్రమాలు చేశారు,ఆటపట్టించారు. మొదట్లోనే విధ్యలో వెనకబడివున్న తెలంగాణ వాళ్ళను వెనకబడే ఉండడానికి తీసుకో గలిగిన చర్యలు, చేయగలిన కుట్రలు మరియు స్రుష్టించగలిగన అడలుంకులు వరసగా స్రుష్టించారు. తెలంగాణవారికి విధ్యలో జరిగిన అన్యాయాలే చాలా వరకు తరువాత ఉద్యోగాలు రాకుండా చేశాయి. 1969 తరువాత జరిగిన అక్రమాలు ,అన్యాయాలు ,ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్న/జరుగుతున్న అన్యాయాలు వేరు రాష్ట్రాన్ని సాధించకుండ తెలంగాణకు మనుగడే లేదని సుమారు 60% మంది తెలంగాణలో ప్రజలు అనుకునే స్థితికి తెచ్చాయి. 69 నుండి 2000 ల సంవత్సరం వరకు ప్రజలు కొంత నిర్లిప్తంగ,నిస్తేజంగ ఉంటే పాలకులు తమ పాలన సజావుగానే ఉంది, తెలంగాణ వాళ్ళు తెలివితక్కువ వాళ్ళు కాబట్టే తెలుసుకోలేక తమ పార్టీలను సమర్ధిస్తున్నారు ,అని అనుకున్నారు. ఇటివల తె-ఉద్యమం ఎంతో తీవ్రమైనప్పటికీ ఇప్పటికీ పాలకులు అసలు ఉద్యమాన్ని గుర్తించనట్లుగా ప్రవర్తిస్తున్నారు.
    తెలంగాణలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఎన్నోకష్టనష్టాలకు గురైనారు. ఆంధ్ర-సీమ సోదరుల అక్రమ పాలన వల్ల కుల,మత,విధ్య వంటి ఎన్నోభేధాలు కలిగిన తెలంగాణవాళ్ళు ఇటివలనే ఐక్యమౌతున్నారు. తెరాస ఇప్పటికైనా సాధారణ ముస్లింల ను కలిసివచ్చే విధంగా తన పార్టీ నియమాలను రూపొందించాలి,నిర్ణయాలు తీసుకోవాలి. ఐతే సాధారణ ముస్లిమ్లను కలుసుకోకుండా మజ్లిస్ అడ్డుపడుతున్నదని తెలుస్తున్నది,దాన్ని అధిగమించడానికి మరోమార్గమేదన్న కనిపెట్టాలి.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో