Feed on
Posts
Comments

- సంగిశెట్టి శ్రీనివాస్

‘మీకు చరిత్ర లేదు. ఉంటే గింటే అది హీన చరిత్రే, చరిత్ర హీనులే’ అని యాభై ఏళ్ళుగా ఆంధ్ర వలసవాదులు రాస్తున్న పుస్తకాలు, చేస్తున్న విష ప్రచారం తెలంగాణ అంతటా పాఠ్యపుస్తకాలై విస్తరించాయి. ‘ప్రారంభం నుంచి చివరి వరకూ ఏ ప్రాంతీయ తేడాలు లేకుండా తెలంగాణ పోరాటం తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యునిస్టు కమిటీ నాయకత్వంలో జరిగిం’దని అబద్ధాల్ని అక్షరబద్ధం చేస్తున్నారు. ‘ఈ పోరాటంలో వీర తెలంగాణ రైతాంగమూ, ఈ రైతాంగ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించే బాధ్యతను స్వీకరించిన కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర రాష్ట్ర శాఖ అనుపమ త్యాగాలు చేశాయి’ అని ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం -గుణపాఠాలు’ పుస్తకం ఉపోద్ఘాతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య పేర్కొన్నారు. త్యాగా లు తెలంగాణవి పేరు విశాలాంధ్రది. భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా, భూమి కోసం ‘గుత్పల సంఘం’గా ప్రసిద్ధి చెందిన వామపక్ష భావాలు గల ఆంధ్రమహాసభ తరపున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్మితమయింది.


ఇది వాస్తవం. అయితే దీనికి విశాలాంధ్ర ముసుగు తొడిగి అబద్ధాలు ప్రచారం చేశారు. తాము ఎవరినైతే ప్రస్తుతం నాజీ, నియంత,నిరంకుశుడు, రాక్షసుడు అని నిందిస్తున్నారో ఆ ఏడో నిజాం మీర్ ఉస్మానలీఖాన్ ప్రభుత్వంతో కమ్యూనిస్టులు మిలాఖత్ కాలేదా? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పడ్డ కేంద్ర (నెహ్రూ) ప్రభుత్వం బూర్జువా, పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాస్తున్నదనీ దాన్ని కూలదోయాలనీ కమ్యూనిస్టులు పిలుపివ్వలేదా? మఖ్దుమ్ మొహియుద్దిన్, రావి నారాయణరెడ్డిలు మే నాలుగు 1948న నిజాం ప్రధాని లాయక్ అలీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమ్యునిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా, మఖ్దూమ్ మరో ఐదుగురు కమ్యునిస్టు నాయకుల పైన ఉన్న వారంట్లను కూడా నిజాం ప్రభుత్వం ఎత్తివేయడం నిజం కాదా? దీంతో రజాకార్లను కమ్యునిస్టులు ‘ప్రజా సైన్యం’గా అభివర్ణించారు.కమ్యునిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ ఈ సమయంలో ఒక తీర్మానం చేసి, ఎనిమిది పేజీల కరపత్రాన్ని కూడా ప్రచురించింది. ‘నిజాం రాష్ట్రం భారత యూనియన్‌లో చేరకూడదు. నెహ్రూ ప్రభుత్వం ధనిక వర్గ ప్రభుత్వం. పెట్టుబడి దారీ దోపిడిని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో సంస్థానాలను బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి’ అని అందులో పార్టీ పేర్కొంది. అంత వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ బహదుర్ గౌర్ హష్మతు గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ‘హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి, అది కమ్యునిస్టు పార్టీ విధానం’ అని ప్రకటించాడు. ఇవీ నిజాలు. ఈ చేదు నిజాలు ఎత్తుగడలో భాగంగా భావిస్తే రావి, మఖ్దూం, గౌర్ గౌరవాలకు ఎలాంటి లోటూ రాదు. 1948కి ముందు, ఆ తర్వాత వారు చేసిన త్యాగాలు చిన్నవేమి కావు. ఈ నిజాలకు ఇన్ని రోజులు పట్టిన బూజు వదలగొట్టాలని చూస్తే నిజాంపై మోజు అంటూ వెక్కిరిస్తున్నారు.

‘నిజాం రాజు జన్మ జన్మాల బూజు’ అన్న దాశరథి కృష్ణమాచార్యని పదే పదే వల్లిస్తున్నారు. అదే దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కూడా అన్నాడు. అది మాత్రం గుర్తుకురాదు. రైతాంగ సాయుధ పోరాటంలో నిమగ్నమై ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్న భీమిరెడ్డి నరసింహా రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులకు తెలియకుండానే, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య పోరాట విరమణ ప్రకటించారు. ఈ ఇద్దరూ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి, పోరాటం అండతో గెలిచారు. ఇదీ కమ్యునిస్టుల నిజ స్వరూపం. చరిత్ర ఇలా ఉంటే పోరాటం ముగిసిన పాతికేండ్ల తర్వాత తమకు అనుకూలమైన రీతిలో చరిత్రను వక్రీకరించి గ్రంథస్థం చేసి, అదే ప్రామాణికమైనదని బాకాలూదు తున్నారు. నిజాంని నెత్తికెత్తుకోకుండా, అణగదొక్కకుండా తిన్నగా నిలబెట్టి అంచనా వేయలేమా? ఇజాలు కప్పేసిన బూజు దులిపి నిజాలను చూడలేమా?

నిజాం జమానాలో ఇప్పటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కన్నా కొన్ని వందల రెట్లు మెరుగ్గా ఉన్న అంశాలను స్మరించుకుంటే తప్పేమిటి? తెలంగాణ తల్లి వాసనలు పట్టిచ్చే చార్మినార్‌ని హైదరాబాద్‌కు ప్రతీకగా కాకుండా హైటెక్ సిటీని చూపిస్తే ఎట్లా మనసొప్పుతుంది? అద్వానీ తాను పుట్టిన పాకిస్థాన్ వెళ్ళి జిన్నా సమాధిని సందర్శిస్తే చప్పుడు చేయని బిజెపి వారు కెసిఆర్ నిజాం సమాధికి నివాళి అర్పిస్తే నెత్తీ నోరూ మొత్తుకుంటున్నారు. నిజాం స్థాపించిన ఫ్యాక్టరీలు, చేసిన అభివృద్ధిని గుర్తిస్తూనే అవేమైనా ఇంటినుంచి తెచ్చాడా? తెలంగాణ ప్రజల చెమట, రక్త మాంసాలు అంటున్నారు. ఔను, ఒప్పుకుందాం. ఏ రాజైనా ఇంటినుంచి పైస తెచ్చి పబ్లిక్‌కు పెట్టిన చరిత్రుందా? శాతవాహనులు, కాకతీయులకు పన్ను ద్వారా కాకుండా పైకం ఎక్కడ్నించి వచ్చేది? అది కూడా ప్రజల రక్తమాంసాలే కద. మరి వాళ్లకు దక్కిన కీర్తి ప్రచారంలో నిజాంకు కొంతైనా ఎందుకు దక్కకూడదు? వాళ్లు ప్రజలను పీడించకుండా పన్నులు వసూలు చేసేవారని చెపుతున్నారు.

నిజాం ప్రభుత్వంలో కూడా రెండో ప్రపంచ యుద్ధం ముందు పీడన దౌర్జన్యం తక్కువే. వెట్టి చాకిరిపై నిషేధం ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భూమయ్య, కిష్టాగౌడ్‌ని ఉరితీస్తే ఆనాటి నిజాం ప్రభుత్వం ఉరిశిక్షను రద్దు చేసింది. జ్యూడిషియరీ, ఎగ్జిక్యూటివ్‌ని వేరు చేసిన మొట్టమొదటి సంస్థానం హైదరాబాద్. నిజాం సాగర్, పోచంపాడు, వైరా, పాలేరు ప్రాజెక్టు, రాజోలిబండ, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మొదలైన వేల కొలది చెరువులు, కుంటలు, నీటి వసతులు నిజాం కాలంలోనే పూర్తయినయి. నిజాం ప్రాంతంలో నడిచే రైల్వేలను ‘నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే’ పేరిట ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి అనుబంధంగా 1932లో ఆర్టీసి వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టింది నిజామే. హైదరాబాద్ సివిల్ సర్వీస్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. దేశ భాషల్లో (ఉర్దూ) బోధించే మొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించాడు. ఇప్పుడు ఉర్దూని ముస్లిముల భాషగా చూస్తున్నారు గానీ అప్పుడు ఉర్దూ అందరి భాష.

వైద్యంలో అన్ని స్పెషలైజేషన్ దవఖానాలు (ఆసుపత్రులు) హైదరాబాద్‌లో ఉండేవి. షాబాద్ సిమెంట్, సిర్పూర్ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, డి.బి.ఆర్. మిల్స్, ఆజాంజాహీ మిల్స్, మోజంజాహీ మార్కెట్, సింగరేణి అన్నీ అప్పుడు ప్రారంభమైనవే. గల్లి గల్లిల నల్లలుండేవి. అందరికీ ఫ్రీగా నీళ్ళందేవి. ఇప్పుడేమో నల్ల బిల్లు కట్టకుంటే మోరీ (డ్రైనేజ్)లు మూస్తామంటున్నారు. అరవై యేళ్ళుగా ఊదరగొడుతున్న విషయాలన్నీ ఒక్క క్షణంలో అబద్ధాలని తేలితే వాటిని జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. నిజాల్ని సావధానంగా అవలోకిస్తే నిజాంను సరిగ్గా అంచనా వేయగలం. హైకోర్టు నిర్మాణ సమయంలో ఒక మూలన ఉన్న చిన్న మందిరాన్ని అక్కడినుంచి తరలించి వేరే దగ్గర నిర్మిస్తామని అధికారులు సూచించగా, దానికి నిజాం సమ్మతించలేదు. మందిరాన్ని అక్కడి నుంచి తరలించడమంటే అన్యాయపు పునాదులపై న్యాయాలయాన్ని నిర్మించినట్లు అవుతుందని అన్నారు.

హిందూ దేవాలయాలైన అజంతా గుహల పరిరక్షణ కోసం ఇటలీ నుంచి ప్రత్యేకంగా ప్రొఫెసర్ సెక్కొనీ, ఒర్సినిలను పిలిపించి 1915లోనే దాదాపు 30 లక్షలు వెచ్చించి వాటిని కాపాడిన తీరు గుర్తింపుకు నోచుకోలేదు. అలాగే ఆంధ్ర మహాసభ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు ‘బాధ్యతాయుత ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయమని డిమాండ్ చేశాయి తప్ప కొంత మంది ప్రచారం చేస్తున్నట్టుగా నిజాంకు వ్యతిరేకంగా కాదు. అలాగే సురవరం ప్రతాపరెడ్డి నిజాంకు వ్యతిరేకమైనప్పటికీ తాను ప్రకటించిన గోలుకొండ కవుల సంచికలో నిజాంని కీర్తిస్తూ వచ్చిన కవితలకు స్థానం కల్పించాడు. శేషాద్రి రమణ కవులు ‘నైజాం రాష్ట్ర ప్రశంస’ అనే పుస్తకాన్ని వెలువరించారు. 1938-1948 మధ్య కాలంలో ఆయన చేసిన పనికి (చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉన్నందుకు) తెలంగాణ ప్రజలు చెల్లించిన మూల్యాన్ని లెక్కగట్టలేము. రెవెన్యూ, పోలీసు, అబ్కారీ అంతా బ్రిటీషధికారుల చేతిలో ఉండేది. ఆయా శాఖలను నిజాం ప్రభుత్వం సరిగ్గా నియంత్రించలేకపోవడంతో వారి ఇష్టా రాజ్యమై ప్రజలు కష్టాల పాలయ్యారు.

దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, జమిందార్లు, సంస్థానాధీశులు, రజాకార్లు వడిగట్టిన దుర్మార్గాలకు ఒక్క నిజాంనే ద్రోహిగా చిత్రించడం విడ్డూరం. ఈ దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, జమిందార్లే 1952 ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయి తమ దోపిడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నాయకులయ్యే సరికి వారి పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తమయినట్లు వాళ్లనెవ్వరు నిలదీయడం లేదు. పోలీసు చర్య పేరిట హైదరాబాద్‌ని ఆక్రమించుకున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు, వారితో ప్రేరేపితులైన హిందూత్వ వాదుల చేతిలో సంఖ్యానేకంగా నిజాం రాజ్య ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. వారి వారసులు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఉద్యోగాలు, ఆస్తి, ఉనికి కోల్పోయి ఇప్పటికీ మూగగా రోదిస్తున్నారు. సాయుధ పోరాట యోధులవి మాత్రమే ప్రాణాలయినట్టు వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మెజారిటీ తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ నిజాం ఒక ప్రతీక. ఈ విషయమై ఉర్దూ పత్రికల్లో జరుగుతున్న చర్చ చూసినట్టయితే నిజాంకు రజాకార్లకు మధ్యన ఉన్న విభజన రేఖను హిందూత్వ వాదులు చెరిపేస్తున్నారన్న భావనలో వారు ఉన్నట్టు స్పష్టమవుతుంది.

హిందువులుగా కాకుండా లౌకిక వాదులుగా ఆలోచించినట్లయితే వారి మనోభావాలు అర్థం చేసుకోగలం. బ్రిటీషధికారులైన కాటన్‌కు విగ్రహం, బ్రౌన్‌కు లైబ్రరీ కట్టి, థామస్ మన్రో పేరు పెట్టుకుని ఇప్పటికీ వాళ్లను ఆంధ్రదేశం గుర్తు పెట్టుకుంటే ఏ ఇబ్బందీ లేదు! కానీ, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి, వాళ్లలాగే అంతో ఇంతో సేవ జేసిన నిజాం గురించి మాట్లాడితే చాలు నియంత, నిరంకుశుడు అంటున్నారు. ఏ విలువలకీ ‘ప్రస్థానం’? ఇప్పటికైనా తెలంగాణ చరిత్రను సరైన ఆధారాలతో నిష్పాక్షికంగా సమీక్షించుకుని సమగ్రంగా రాసుకోవాల్సిన అవసరముంది. చాలా మంది తెలుగు చరిత్రకారులకు అరబిక్, ఉర్దూ తెలియక పోవడంతో ఆ భాషలో ఉన్న కొన్ని వేల పుస్తకాల్లోని సారాంశం తె లుగు పాఠకులకు అందు బాటులోకి రాలేదు. అలాగే ఆంగ్లంలో ఉన్న సమాచారం కూడా అందరికీ తెలియరాలేదు. వీటన్నింటిని బేరీజు వేసుకుని ఎవరికి దక్కాల్సిన వాటాని వారికి న్యాయబద్ధంగా అందజేసి కక్షసాధింపుతో, పక్షపాత బుద్ధితో రాసిన చరిత్రను సవరించుకోవాలి.

తెలంగాణ సాయుధ పోరాట త్యాగాల స్ఫూర్తిని కొనసాగిస్తూనే పయాం సంపాదకుడు ఖాజి అబ్దుల్ గఫార్ ఖాన్ నిర్భీతికి నివాళులర్పిద్దాం. రజాకార్లను సమర్ధవంతంగా నియంత్రించలేకపోయిన నిజాంకు 1948 ఆగస్టు 13 నాడు బాకర్ అలీ మీర్జా, నవాబ్ మంజూర్‌జంగ్, అహ్మద్ మీర్జా (రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్), ఎం.హెచ్. జాఫ్రీ (రిటైర్డ్ విద్యాశాఖాధికారి), హెచ్.ఎ.మునీమ్ (రిటైర్డ్ అక్కౌంట్ జనరల్) ఫరీద్ మీర్జా (డిప్యూటి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అధికారి)మొదలైనవారు నిరసన వ్యక్తం చేసి ధైర్యాన్ని చాటుకున్నారు. రజాకార్లను రద్దు చేసి ఇండియన్ యూనియన్‌లో కలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ముస్లిములయినందుకు తెలుగు ప్రజలకు తెలియకుండా పోయిన షోయెబుల్లా, బందగీ, అలియావర్ జంగ్, మెహదీ నవాజ్ జంగ్, మహబూబ్ అలీఖాన్, అక్బర్ హైదరీ లాటి అనేక మంది విస్మృత వీరులను గుర్తుకు తెచ్చుకుందాం. తెలంగాణ చరిత్రలో భాగం చేసుకుందాం.

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో