Feed on
Posts
Comments

 ’అల్లాహో అక్బర్‌’ గట్టిగా అరిచాడు అమీర్‌ఖాన్‌.
 ”ఫిరంగీ హుకూమత్‌ ముర్దాబాద్‌” అందుకున్నాడు ఫిదా అలీ.
 ”ఫైర్‌’ మిన్నూ మన్నూ ఏకం అయ్యేటట్లు అరిచాడు మేజర్‌ జనరల్‌ ఉడ్‌బర్న్‌.
 ”ఆగండి. నేను డర్‌పుక్‌ను (పిరికివాణ్ణి) కాను. మై పఠాన్‌గా బేఠాహుఁ. నన్ను ఫిరంగి మూతికి కట్టేయండి. నేనే ఫిరంగికి ఎదురుగా నిలుచుంటాను. నేను మృత్యువును ముఖాముఖంగానే చూడదలచుకున్నాను. ఈ భగావత్‌ (తిరుగుబాటు)లో పాల్గొని నా జన్మను సార్థకం చేసుకున్నాను. గతంలో నేను చేసిన పాపాలన్నింటినీ ఈ పవిత్ర జిహాద్‌ ద్వారా శుభ్రపరుచుకున్నాను. నేను ఎంత త్వరగా అల్లా దగ్గరికి వెళ్తే నాకు అంత సంతోషం. అల్లాకో ప్యారీ హై ఖుర్బానీ……” సుదీర్ఘంగా ఉపన్యసిస్తున్నాడు అమీర్‌ఖాన్‌.


 ఇంతలో చెవులు బ్రద్దలయ్యేటట్లు, భూమి కంపించేటట్లు ‘ధన్న్‌’ మని పేలింది ఫిరంగి. అక్కడ నిలబడి చూస్తున్నవారిని దట్టమైన దుమ్ము ధూళి, పొగ ఆవరించింది. వారు మూసుకున్న కండ్లను బలవంతంగా తెరిచి చూసేసరికి ఎదురుగా వొళ్ళు గగుర్పొడిచే భీభత్స దృశ్యం. ఫిరంగికి ఇరవై గజాల దూరంలో అమీర్‌ఖాన్‌ తల తెగిపోయి బంతిలాగా నేలపై పడి ఉంది. కాళ్లు చేతులు ఇతర శరీర అవయవాలు తుత్తునియలుగా తెగిపోయి చిందరవందరగా ఫిరంగికి ఎనిమిది గజాల దూరంలో పడి ఉన్నాయి. నేల మీద పారిన రక్తం మల మూత్రాల నుండి గదరుగదరు వాసన వస్తుంది.
 ”యా అల్లా” అంటూ గొల్లుమన్నారు అమీర్‌ఖాన్‌ సహచర సైనికులు.
 మేజర్‌ జనరల్‌ ఉడ్‌బర్న్‌ మీర్‌ ఫిదా అలీ వైపు తల తిప్పి చూశాడు. అది మరొక నరక దృశ్యం.
 ”దూరదూరంగా ఉన్న రెండు చెట్ల కొమ్మలను బలవంతంగా దగ్గరికి లాగి తాడుతో ఆ రెండు కొమ్మల్ని కట్టేశారు. ఆ తర్వాత మీర్‌ ఫిదా అలీని తలక్రిందులుగా వేలాడదీసి అతడి రెండు కాళ్లను చెరోకొమ్మకు బిగించి కట్టారు.
 ”అంగ్రేజీ హుకూమత్‌ ముర్దాబాద్‌, ఫిరంగీ కాఫిర్‌ ముర్దాబాద్‌” అని అతను అరుస్తునే ఉన్నాడు. ఇంతలో ఒక తెల్లసైనికుడు తన పొడుగైన తల్వార్‌తో ఆ రెండు చెట్లకొమ్మల్ని కలిపికట్టిన తాడుపై బలంగా ఒక వేటు వేశాడు. తాడు పుటుక్కున తెగింది. నారి తెగిన వింటిలాగ ఆ రెండు కొమ్మలు ఉధృతమైన వేగంతో ఒకటి ఒక వైపు మరొకటి మరోవైపు విడిపోయాయి. కనుమూసి తెరిచేలోగా ఆ జిహాదీ వీరుడు ఫిదా అలీ శరీరం సరిగ్గా సగభాగానికి చీలిపోయి చెట్లకొమ్మలతో పాటు ఇటూ అటూ వెళ్ళిపోయి గాలిలో ఊగుతున్నాయి.
 1857 మార్చి నెలలో ఉత్తర భారత దేశంలో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు కొంచెం ఆలస్యంగా జూన్‌ నెలలో హైద్రాబాద్‌ దక్కన్‌కు కూడా వ్యాపించింది. ఆ ‘కాక’ (వేడిమి) ముందు ఔరంగాబాద్‌లో బసచేసి ఉన్న ”హైద్రాబాద్‌ కాంటింజెంట్‌ దళం ”సైనికులకు పాకింది. ఆ పటాలానికి సైన్యాధిపతి మేజర్‌ జనరల్‌ ఉడ్‌బర్న్‌. దళ సైనికులు మాత్రం స్థానికులైన హిందూ ముస్లింలు. వారిలో తిరుగుబాటు ధోరుణులు వ్యాపించటానికి ప్రధాన కారణం, ఔరంగాబాద్‌లో బస చేసి ఉన్న ఆ దళ సైనికులను డిల్లీకి పంపి అక్కడ జరుగుతున్న తిరుగుబాటును అణిచివేయాలని హైద్రాబాద్‌లో ఉన్న బ్రిటిష్‌ రెసిడెంట్‌ పన్నాగం. దానికి నిజాం రాజు కూడా సై అన్నాడు. ఆ ఆలోచన సైనికులలో చిచ్చు రగిల్చింది. తిరుగుబాటుకు దారి తీసింది.
 ”మేం నైజాంరాజ్య సరిహద్దుల్ని దాటి డిల్లీకి వెళ్లం”
 ”డిల్లీ చక్రవర్తి బహద్దూర్‌ షా జఫర్‌కు వ్యతిరేకంగా యుద్దం చేయం”
 ”మా కుటుంబాల్ని వదిలి వింధ్యపర్వతాలను దాటి డిల్లీకి వెళ్లం”
 నినాదాలు ప్రారంభించారు. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది అమీర్‌ఖాన్‌, మీర్‌ ఫిదా అలీలు. ఆ ఇద్దర్నీ కూృరంగా చంపిన తర్వాత ఆ దళంలో ఉన్న తొంభై నాలుగు మందిని నిరాయుధుల్ని చేసి అరెస్టు చేశాడు మేజర్‌ జనరల్‌ ఉడ్‌బర్న్‌. అందులో కొంత మందిని అక్కడికక్కడే చెట్ల కొమ్మలకు ఉరితీశారు. వారి మృతదేహాలు దహన సంస్కారాలు, అంత్య క్రియలకు నోచుకోక రోజుల తరబడి అట్లనే చెట్ల కొమ్మలకు వేలాడబడి కాకులకు, గద్దలకు ఆహారమైనాయి. మరికొంత మందిని తుపాకులతో కాల్చిచంపారు. మిలిగిన వార్ని అరెస్టు చేసి నామమాత్ర విచారణ జరిపి అండమాన్‌ జైలుకు తరలించారు.

తిరుగుబాటు ఆలోచనలు చేసేవారికి ఆ ఔరంగాబాద్‌ సంఘటన ఒక హెచ్చరిక అని నైజాం రాజ్యంలోని రెసిడెంట్‌ అనుకున్నాడు. కాని హైద్రాబాద్‌ పట్నంలోనే అదే జూన్‌ నెలలో తుర్రేబాజ్‌ ఖాన్‌, సయ్యద్‌ మౌల్వీ అల్లాఉద్దీన్‌ల నాయకత్వంలో తిరుగుబాటు తలెత్తింది. కోఠీలో ఉన్న రెసిడెంట్‌ భవనంపై దాడి జరిగింది. భీకరమైన పోరు జరిగినా ఆ తిరుగుబాటు విఫలమైంది. ఆ నాయకులిద్దరూ తప్పించుకొని పారిపోయినా తిరిగి అరెస్టు చేశారు. తుర్రేబాజ్‌ ఖాన్‌ను తూప్రాన్‌లో పట్టుకొని చంపివేసి కోఠీలోని పుత్లీబౌడీ చౌరస్తాలో రోజుల తరబడి అతన్ని శవాన్ని అట్లనే వ్రేలాడదీశారు. మౌల్వీ అల్లా ఉద్దీన్‌ను మాత్రం అండమాన్‌ జైలుకు పంపారు. అక్కడ అతను 26 సంవత్సరాల పాటు నరక ప్రాయమైన జీవితాన్ని గడిపి 1884లో అక్కడనే మరణించాడు.
 ఈ ఇద్దరు అమరవీరుల్ని హైద్రాబాద్‌ నగరం ఎప్పుడూ మరిచిపోదు.
 1857లో అటు ఉత్తరభారతదేశంలోనూ ఇటు హైద్రాబాద్‌ దక్కన్‌లోనూ సిపాయిల తిరుగుబాట్లు జరుగుతున్న సందర్భంలోనే సురపురం రాజా వెంకటప్ప నాయక్‌ కూడా తిరుగుబాటు బావుటాను ఎగురవేశాడు. అది మరొక అమరగాథ.

* * *

ఆనాటి నైజాం ”హైద్రాబాద్‌ రాజ్యంలో” సురపురం ఒక సంస్థానం. ఇది రాయచూర్‌ ‘సుబా’లో కృష్ణానది తీరాన వెలసిన సంస్థానం. గద్వాల, వనపర్తి సంస్థానాధీషుల మాదిరిగానే సురపురం రాజాకూడా ప్రతి ఏటా నిజాంకు కప్పం చెల్లించేవాడు. ఆ సంస్థానంలో మెజార్టీ ప్రజలు ‘బేడర్‌’ కులస్థులు. వీరిది క్షత్రియ పౌరుషం. ఎవరికీ తలవంచని జాతి. తిరుగుబాటు ప్రారంభమయ్యే నాటికి సురపురం రాజా వెంకటప్ప నాయక్‌కు సరిగ్గా ఇరవై నాలుగేండ్ల వయస్సు.
 రాజాకు ఏడేండ్ల వయస్సులోనే ‘పితృవియోగం’ సంభవించింది. అతను మైనర్‌. ఆ పరిస్థితులలో హైద్రాబాద్‌లో ఉన్న బ్రిటిష్‌ రెసిడెంటు ”ఫిలిఫ్స్‌ మెడాస్‌ టేలర్‌”ను సురపురం సంస్థానానికి రాజకీయ పరిపాలకుడిగా మైనర్‌ రాజుకు ”సంరక్షకుడి”గా నియమించాడు. దానికి నిజాం రాజు ఆమోదముద్ర కూడా లభించింది. మేడాస్‌ టేలర్‌ సమర్థవంతమైన పరిపాలకుడే గాక చక్కటి చిత్రకారుడు మరియు రచయిత. ఆనాటి హైద్రాబాద్‌ రాజ్యం, ప్రజల స్థితిగతుల్ని తన జీవిత చరిత్ర, నవలల ద్వారా గ్రంథస్తం చేశాడు. అతను నిజమైన ప్రజా సేవకుడు. ప్రజలను మనసావాచా ప్రేమించిన వాడు.
 టేలర్‌ సురపురం అధికారిగా సంస్థానాన్ని చక్కగా పరిపాలించాడు. మైనర్‌ రాజాకు నిజమైన పోషకుడిగా, సంరక్షకుడిగా నిలిచి తండ్రి ప్రేమను అందించాడు. వీరిద్దరి మధ్య తండ్రికొడుకుల సంబంధమే పెనవేసుకుంది. కృష్ణదేవరాయల వారికి తిమ్మరుసుకు మధ్య వున్న సంబంధమే వారిరువురి సంబంధం. ఆ బాలుడికి సరిఐన విద్యాబుద్ధుల్ని చెప్పించి, చక్కటి పరిపాలకుడిగా తీర్చిదిద్దుతున్న రోజులలో ఒక విచిత్రమైన సంఘటన టేలర్‌కు ఎదురైంది.
 ఆ రోజు ఆయన తన కార్యాలయంలో కూచొని శ్రద్ధగా ఒక మిసల్‌ను అధ్యయనం చేస్తున్నాడు. ఇంతలో ఒక జ్యోతిష్యుడు కాపలాదారుడు వారిస్తున్నా వినకుండా ఆయన గదిలోకి ప్రవేశించాడు. అతడొక మరాఠీ బ్రాహ్మణ పండితుడు. ముఖం ఎంతో తేజస్సుతో వెలిగిపోతుంది. ఆ కండ్లు వర్తమానాన్ని కాక భవిష్యత్తులోకి తొంగి చూస్తున్నట్లు ప్రకాశిస్తున్నాయి. అతను ఇలపై కాక కలలో నడుస్తున్న మనిషిలాగ కనబడుతున్నాడు.
 ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ”ఏ బాలకుడినైతే మీరు పోషిస్తూ, సంరక్షిస్తూ మొక్కను పెంచినట్లు పెంచి పెద్ద చేస్తున్నారో వాడి ఆయుస్సు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఒక్క రోజు కూడా అటూ ఇటూ ఉండదు. పుట్టినరోజు - గిట్టిన రోజు రెండూ ఒకటే. ఇక ఈ రాజ్యం అతడితోనే ఆఖరు. ఈ రాజ్యం పరుల పాలవుతుంది” - అన్నాడు.
 కర్ణకఠోరమైన ఆ మాటలకు టేలర్‌ ముందు ఆశ్చర్యపోయి లిప్తకాలంలో తేరుకొని కోపంతో కంపించిపోయాడు. అనుమతి లేకుండా కార్యాలయంలోకి చొరబడిందే గాక పైనుండి గరళపు గుళికల్లాంటి చేదు మాటలు. నిప్పులు కురిపించే చూపులతో ఆ జ్యోతిష్యుడి చూపుల్ని ఛేధిస్తూ
 ”స్టాపిట్‌” అని గట్టిగా అరిచాడు.
 అతడు వేదాంతి. కావున వేదాంతిలాగే చల్లగా, నిబ్బరంగా ఓ చిర్నవ్వు నవ్వి టేలర్‌ కోలుకోక ముందే ఆ గదిలోనుండి నెమ్మదిగా నిష్క్రమించాడు. మళ్లీ ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరికీ కనబడలేదు. అతని పేరేమిటో, ఊరేమిటో కూడా ఎవరికీ తెలియదు.
 జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మని టేలర్‌ ఆ రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. తను కూడా త్వరలోనే ఆ సంగతిని మరిచిపోయాడు.
 1843 నుండి 1853 వరకూ టేలర్‌ సురపురాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ప్రజలకు ఉపయుక్తమైన అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేశాడు. రాజ్యం శాంతి భద్రతలతో చల్లగా వర్ధిల్లింది. ప్రజలు సుఖశాంతులతో జీవించారు.
 1853లో రాజా వెంకటప్పనాయక్‌కు మైనార్టీ తీరింది. రాజకుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తూ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ డల్హౌసీ ఒక ఉత్తర్వునుహైద్రాబాద్‌లో ఉన్న రెసిడెంటుకు జారీ చేశాడు. దాని ప్రకారంగానే టేలర్‌ స్వయంగా తన చేతులతో అతనికి పట్టాభిషేకం చేసి స్వర్ణఖచిత సింహాసనం పై అధిష్టింపచేశాడు. ఆ రోజు సురపురం సంస్థానంలో ఉత్సవ సౌరంభం ఇంతా అంతా కాదు. సంబరాలు అంబరాన్ని అందుకున్నాయి. మూడు రోజులు రాత్రింబవళ్లు, ఉత్సవాలు జరిగాయి.
 పట్టాభిషేకం మహోత్సవాన్ని చూడటానికి వివిధ స్థాయిలకు చెందిన ప్రజలు చాలా మంది వచ్చారు. అతిధులందరికీ అత్తరులను పూసి మెడలో పూలదండలు వేశారు. అందరికీ వస్త్రాలు దక్షిణ ఇచ్చారు. పండ్లు తాంబూలాలు పంచారు. బ్రాహ్మణులకు సత్కారాలు చేశారు. విందులు - గోవిందులు రెండు రోజుల పాటు సాగినై. రాజబంధువులందరికీ తల పాగాలు, ఉత్తరీయాలు బహుమతులుగా ఇచ్చారు. వారి విడిది కోసం ఊరంతా రంగురంగుల డేరాలతో గుడారాలు వెలిసినై. మేళతాళాలు పెట్టారు. కొమ్ములు, బూరాలు ఊదారు. గాలిలో తుపాకులు పేల్చారు.
 పట్టాభిషేకం జరిగిన ఆ రాత్రి రంజుగా రాణించింది. చెట్లన్నింటికీ కాగడాలను ట్టారు. రంగురంగుల దీపాలతో చెట్ల కొమ్మలను అలంకరించారు. ప్రక్కన మైదానంలో అంబరాన్ని చుంబించే బాణాసంచా ప్రదర్శనలు సరేసరి. రెండు వందల పటాకులతో ఆకాశంలోకి ఎగిరి పూలు ఈనే బాణాసంచా ప్రత్యేకంగా అందరినీ ఆకర్శించింది. ఆ రాత్రంతా చెట్లక్రింద రాయచూరు, గుల్బర్గా, బీజాపూర్‌ నుండి వచ్చిన భోగంమేళాల ఆటపాటల నృత్యాలు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు చివరికి ముగింపుగా ఈజిప్టు దేశం నుండి ప్రత్యేకంగా ఆహ్వానించి పిలిపించబడిన అరబ్బీ సుందరి చేసిన ”కమర్‌ మచల్‌” (బెల్లీ డ్యాన్సు) మరో ఎత్తు.
 ఈ బెల్లీ డాన్స్‌ను అరబ్బీ భాషలో ”రక్స్‌ షర్కి” అంటారు. ఈ నృత్యానికి సరిఐన చారిత్రిక ఆధారాలైతే లేవుగాని మధ్య ప్రాచ్యదేశాల జానపద కళల్లోంచి పుట్టిందని చెప్పవచ్చు. లెబనాన్‌, టర్కీ, ఈజిప్టు, ఆఫ్రికా దేశాలలోని నాట్య కళారీతుల్ని ఆకళించుకున్న ఈ ‘కమర్‌ మచల్‌’ నృత్యం పుట్టిన కాలం చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు.
 మధ్య యుగాల కాలంలో అరబ్బు దేశాలలో వివాహ సందర్భాలలో ఈ నృత్యాన్ని అరబ్బీ సుందరీ మణులచే ఏర్పాటు చేసేవారు. నూతన వధూ వరులను శృంగార భావనల స్థితిలోకి తీసుకెళ్ళటానికి, పండంటి బిడ్డల్ని కనమని ఆశీర్వదించడానికి కూడా ఈ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసేవారని అంటారు.
 ఈ నృత్యానికి అరబ్బీ సంగీత వాయిద్యాలే ప్రాణాధారం. గజ్జెల గుర్రంలా పైలా పచ్చీసు వయస్సులో ఉన్న కన్నెపిల్లలే మూలాధారం. మైమరిపించే ఎదబాగం, సన్నటి నడుముతో ఉన్న పొత్తికడుపు విన్యాసాలు ఈ రెండే ఆ నృత్యంలో ప్రధానమైన ఆకర్శణలు. ప్రారంభం నుండి చివరి వరకూ ఈ నృత్యానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది.
 నరాలని వెర్రెక్కించే నేపధ్య సంగీతంతో నల్లటి మఖ్మలీ మేలి ముసుగులోని ఆమె స్వర్ణవర్ణ శరీరం రకరకాల విరుపుల విన్యాసాన్ని పదర్శిస్తూ బొంగరంలా తిరిగిపోతుంది. ఒక దశలో ఆకస్మికంగా ఆగిపోయే సంగీతంతో పాటు ఆమె నడుము కూడా ఒక విచిత్ర స్థితికి వచ్చి ఆగిపోతుంది. ఈ విభాగాన్ని ‘మల్ఫోప్‌’ అంటారు.
 ఆ తర్వాత నడుముని లయబద్ధంగా కదలిస్తూ తిరిగి ప్రారంభించే విభాగం ‘మస్కూం’. ఇందులో అకస్మాత్తుగా సంగీతం బాణీ ‘తక్సీం’ లోకి మారిపోతుంది. దానితో ఆమె కదలికలు కూడా పాములా మారిపోతాయి. నమ్మశక్యంగాని అంగాంగ విన్యాసాలతో చూపరులను రెచ్చగొడుతూ ఆ నాట్యగత్తె బుసలు కొడుతూ హఠాత్తుగా శిలాసదృశ్యంగా నిలబడిపోతుంది.
 ఇక ఆ తక్సీంలో నుండి వచ్చేదే ‘బెలేడీ’ అన్న విభాగం. అందులో సంగీతం పతాక స్థాయికి చేరుకుంటుంది. దీన్ని అసుసరించే ఆమె ఊపులు, విరుపులు వేగం పుంజుకుంటాయి. సంగీతం విజృంభిస్తున్న క్షణాల్లో ఆమె నడుము, ఎదభాగం సముద్రపు అలల్లా పైపైకి ఎగిసి పడే రసవత్తర ఘట్టం మొదలవుతుంది. దీనిని ‘ఫిలాహీ’ అంటారు.
 బెలేడీ, ఫిలాహీ ఒకదానిలో మరొకటి లయించి మారిపోతూ ఉంటే ఆ నృత్యకారిణి నాట్యాభినివేశం పరాకాష్టనందుకుంటుంది. దానితో ప్రేక్షకులు తన్మయత్వంతో రెచ్చిపోతారు.
 అప్పటికే చెమట చిత్తడిలో తడిసిపోయిన ఆమె వొంపుసొంపుల నిగారింపులు విద్యుత్‌ తీగలాగ మెరిసిపోతూ ఉంటాయి.
 ఆ కమర్‌ మచల్‌ నృత్యకారిణి ‘లైలాఖలీదా’ను రాణి ఈశ్వరమ్మ కంచిపట్టుపీతాంబరాలతో సన్మానించింది. అప్పటికి భళ్ళున తెల్లారింది.
 మరునాడు మధ్యాహ్నం ఊరికి దక్షిణంగా ఉన్న చింతలతోపు మైదానంలో విప్రవినోదులు ప్రదర్శించిన ఇంద్రజాలం, మహేంద్రజాలం విద్యలు చూపరుల జీవితంలో మరిచిపోని మధుర అనుభవం. వారు ఏ దేశం వారో ఎక్కడ్నుంచి వచ్చారో ఎవరికీ సరిగా తెలియదు. మలయాళీ మాంత్రికులని కొందరనుకుంటే కలకత్తా జాదూగర్‌లని మరికొంతమంది అనుకున్నారు. వారు మాట్లాడిన భాష అర్థం కాకున్నా వారు ప్రదర్శించిన మాయాజాలం విద్యలు మాత్రం మహా అద్భుతం.
 మొదట ఒక ఫకీర్‌ లాంటి వృద్ధుడు చాలా పొడుగైన తాడుతో రంగం మీదికి వచ్చి ఆ తాడును బలంగా ఆకాశంలోకి విసిరాడు. ఆ తాడు పాములాగా సర్రున పైకి ఎగిరి క్రిందపడి పోకుండా గాలిలో అట్లనే నిలిచిపోయింది. అప్పుడొక పదేళ్ల పిల్లవాడు ఆ తాడును పట్టుకొని పైపైకి ఎగబాకి అందరూ చూస్తుండగానే మబ్బులలో మాయమయ్యాడు. అప్పుడా వృద్ధుడు ఆ పిల్లవాడిని వాడి పేరుతో పిలుస్తూ క్రిందికి దిగిరమ్మని చాలాసార్లు అరిచాడు. పైనుండి ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు. చివరికి నిరాశ చెందిన వృద్దుడు ఒక పెద్ద కత్తిని తీసుకొని ఆ తాడు ఎక్కి పైకి వెళ్లి అతను కూడా మాయం అయ్యాడు. ప్రేక్షకులు శ్వాసించటం కూడా మానుకుని నోళ్లు తెరిచి గుడ్లప్పగించి అట్లనే మెడలు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠత. కొంత సేపటికి పైన అరుపులు, కేకలు వినబడుతాయి. ఒకరినొకరు కొట్టుకుంటున్న చప్పుడు కూడా వినబడుతుంది. ఆ తర్వాత బాలుడి ఖండిత అంగాలు ఒకటొక్కటే నేల రాలుతాయి. ప్రేక్షకులలో హాహాకారాలు. ఆ తర్వాత రక్తం కారుతున్న కత్తి పట్టుకుని వృద్దుడు నేల మీదికి దిగి ఆ అంగాలన్నింటినీ ఒక్కటొక్కటే ఏరి అక్కడున్న బుట్టలో వేసి పైన ఒక గుడ్డ కప్పుతాడు. తన భాషలో ఏవేవో మంత్రాలు చదవగానే ఆ బుట్టలోనుండి బాలుడు నవ్వుతూ లేచి బయటికి వచ్చి అందరికీ నమస్కారాలు చేస్తాడు.
 మళ్లీ రెండవ ప్రదర్శనలో ఆ తాడును అట్లనే పైకి విసిరి ముందు బాలుడు పైకి వెళ్తాడు. ఆ తర్వాత వృద్ధుడు ఒక సింహాన్ని మరొక పులిని ఇంకొంత మందిని ఆ తాడు ఆధారంగా పైకి పంపిస్తాడు. అందరూ ఆకాశంలోకి అదృశ్యమైన తర్వాత ముసలాడు తీరికగా తాడును క్రిందికి దించి చుట్ట చుట్టి బుట్టలో పెట్టుకొని అక్కడినుండి నిష్క్రమించాడు.
 వారంతా ఏమయ్యారో ఎవరికీ అంతుచిక్కదు.
 అదే గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌.
 మొగల్‌ రాజుల కాలంలో ఈ విద్యలు విరివిగా ప్రదర్శించబడేవి. చైనా దేశం నుండి ఈ మాయాజాల విద్యలు భారతీయులు నేర్చుకున్నారని అంటారు.
 ఇక మూడవ రోజు ముగింపు ఉత్సవాలు.
ఆ ఉదయం వసంతోత్సవం మరియు ఆటల పోటీలు. సాయంత్రం ఊరేగింపు మరియు దైవదర్శనం.
 వసంతోత్సవాన్ని ”ఊయెడి” అని కూడా అంటారు. ఆ ఉదయమే స్త్రీ పురుషులందరూ పసుపు రాచిన తెల్ల గుడ్డలను ధరించి కొండ క్రింద ఉన్న మామిడితోటలో జమయినారు. మార్చి నెల ఉగాదికి ముందు రోజులు కావున తోటతోటంతా మా మిడిపూతలతో, పిందెల సువాసనలతో గుబాళించి, గుమ్మెత్తి పోతుంది. నలుదెసలా నయనానందం కల్గించే సతత హరితమే. ధరించిన పసుపు గుడ్డలకు తోడుగా ప్రతి ఒక్కరి మెడలో ముద్దబంతి పూలదండలు. ఒకరిపై ఒకరు చల్లుకునే బుక్కాగులాల్‌, పీచీకారీల నుండి చిమ్ముకుంటున్న రంగు నీళ్ళు. మధ్యమధ్యలో నోళ్లను తీపి చేస్తున్న పాలకోవా మిఠాయిలు. ఆటపాటల కేరింతలతో తడిచిన తనువులతో సాగసుగత్తెల కోడెగాండ్ల సరససల్లాపాలతో ఆ వసంతోత్సవం సప్తవర్ణాల హరివిల్లులా వెల్లివిరిసింది. రాచకుటుంబ సభ్యులందరూ తరతమస్థాయీ భేదాలను విస్మరించి ఆ వసంతోత్సవ వేడుకలలో నిండామునిగి తేలారు.

వనభోజనాలు ముగిసినాక మధ్యాహ్నం ఆటల పోటీలు. పహిల్వాన్ల (మల్లయోధులు) కుస్తీ పోటీలు జరిగిన తర్వాత స్తంభానికి ఎగబాకి దూకే క్రీడ ప్రారంభమయ్యింది. దాదాపు ముప్ఫైఅడుగుల ఎత్తు స్తంబాలు పాతి వాటికి దట్టంగా ఆముదం పూసిపైకి పాకుతారు. ఆ స్తంభాలపైన గుమ్మడికాయ ముక్కలు కడతారు. వాటిని నోటితో కరుచుకుని క్రిందికి దిగిరావాలి. నలుగురు, ఐదుగురు దృడకాయులు స్థభం మొదట్లో కూచుంటారు. వారి బుజాలపై కొందరు వారి పైన ఇంకో ఇద్దరు ఆ చివరిపైన ఒకడు ఇట్ల అంచెలంచెలుగా నిలబడతారు. ఆపై వాడు స్తంబానికి కట్టి ఉన్న గుమ్మడి ముక్కల్ని అందుకోగానే జనమంతా చప్పట్లు కొడుతారు. అప్పుడు స్తంభంపైకి ఎక్కినవాడు తనదగ్గరున్న ఆయుధాన్నో, నీళ్లనో క్రింద ఉన్న వాళ్లందరిపైన కుమ్మరించగానే అందరూ కుప్పగూల్తారు. క్రీడలలో గెలిచిన వారికి రాజు బహుమతులను అందించాడు. ఇక ఆ సాయంత్రం సురపురం వీధులలో రాజుగారి ఊరేగింపు. రాజా వెంకటప్ప నాయక్‌ సతీ సమేతంగా ఏనుగుపై ఊరేగుతూ పురవీధులలో విహరించాడు. వారి చుట్టూ పహరా చేస్తూ మెరికల్లాంటి అంగరక్షకులు నడుస్తున్నారు.
  అతని భార్య మైసూరు సంస్థానానికి చెందిన అందమైన బాలిక. చామన చాయ. చెంపకు చారడేసి కండ్లు. నిరంతర మందస్మిత. మళయాళీ స్త్రీల పద్ధతిలో దట్టమైన కేశపాశాల కొప్పుముడితో కేశాలంకరణ చేసుకుంది. గజారోహణ ఊరేగింపుకు ముందు భాగాన ఆశ్వికదళం, పదాతిదళాల కవాతు దృశ్యాలు. ఏమాకోలాహలం! ఆ ఊరేగింపు నగరం మధ్య కూడలి వద్దకు వచ్చేసరికి జనసమ్మర్థం పెరిగిపోయింది. రంగురంగుల దుస్తులు ధరించిన స్త్రీలు, పిల్లలు మిద్దెలపై నిలబడి పూలవానలు కురిపించారు. చీకటి పడగానే వందలాది కాగడాలతో నిలబడి పూలవానలు కురిపించారు. వందలాది కాగడాలతో, నీలిదీపాలతో ఊరంతా వెలిగిపోయింది. వెన్నెల వెలుగులతో ఊరు మురిసిపోయింది.
 రాజకుటుంబం వారు వారి ఇలవేల్పు దేవళం లోపలికి వెళ్ళి సాష్టాంగదండాలు అర్పించుకున్నారు.
 రాణి ఈశ్వరమ్మ రాచకుటుంబం తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంది.
 ప్రభుత్వ ప్రతినిధిగా మెడాస్‌ టేలర్‌ పట్టాభిషేకం ఉత్సవాలు ముగిసినాయని అధికారికంగా ప్రకటించినాడు.
 ఆ విధంగా సురపురం రాజా వెంకటప్ప నాయక్‌ 1853లో అధికారం చేపట్టినాడు. ఆ తర్వాత బ్రిటిష్‌ రెసిడెంటుగారు మెడాస్‌ టేలర్‌కు పదోన్నతి కల్పించి ‘బిరార్‌’కు తబాదలా (ట్రాన్స్‌ఫర్‌) చేశాడు.
 ఆ వార్త వినగానే రాజా వెంకటప్ప నాయక్‌ ఆనందమంతా ఆవిరైపోయింది. తన హోదా దర్పం అన్నీ మరిచి తనే స్వయంగా టేలర్‌ నివాసానికి వెళ్లాడు. టేలర్‌ కనబడగానే గట్టిగా కౌగలించుకుని
 ”అప్పా మీరు నిజంగానే వెళ్లిపోతారా? మీ మార్గదర్శకత్వం, మీ సలహాలు లేకుండా ఈ రాజ్యభారాన్ని నేను నిర్వహించగలనా? మీరు లేకుండా నేను ప్రజలకు ఎటువంటి మంచి పనులు చేయలేను. నన్ను విడిచి వెళ్లండి అప్పా” అని కండ్లనిండా నీళ్లు నింపుకున్నాడు.
 ”లేదురాజా. నేనొక మామూలు ప్రభుత్వ అధికారిని. మా అధికారులు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలి. తప్పదు. అయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు మంచి రాజుగా, పరిపాలకులుగా మన్ననలు పొందుతారు” అన్నాడు టేలర్‌.
 ”అప్పా నేను మళ్లీ చిన్న పిల్లవాడిగా మారితే ఎంత బాగుంటుంది! మీరు నన్ను ఎత్తుకుంటారు. ఒడిలో కూచోబెట్టుకుంటారు. కథలు చెబుతారు. మళ్లీ ఆ రోజులు రావు కదా. ఎందుకొచ్చిన ఈ రాజ్యభారాలు, ఈ ముళ్లకిరిటాలు?” వైరాగ్యంతో అన్నాడు రాజు.
 ”బాధపడకు రాజా. నేనెక్కడికి వెళ్లినా నా మనస్సులో నువ్వే ఉంటావు. నీకు ఏం కష్టం వచ్చినా రెక్కలు కట్టుకొని వాలుతాను. ”రా” అని ఒక్క అక్షరం రాస్తే చాలు.”
 ”నేను మీ బిడ్డడనే సంగతి మరచిపోండి అప్పా” అని టేలర్‌ కాళ్లకు దండం పెట్టినాడు రాజు.
 ఇద్దరి కండ్లల్లో కన్నీళ్లు జలజలారాలుతుండగా టేలర్‌ తన అధికార నివాసానికి చేరుకున్నాడు. అయితే అంతటితో ఆ ఘట్టం ముగిసిపోలేదు. సురపురం ప్రజల వద్ద శలవు తీసుకోవడమే ఆయనకు కష్టమయ్యింది.
 సురపురాన్ని వదిలి వచ్చేటపుడు ఎవరికీ తెలియకుండా, ఎవర్నీ కలువకుండా అర్థరాత్రి దొంగలా ప్రయాణం చేయాలని టేలర్‌ పథకం వేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తెల్లవారుజామున ఇంటినుండి బయటికి వచ్చాడు. ఆశ్చర్యం బేడర్లందరూ నిద్రలు మాని వీధులలోనే ఆయన కోసం చూస్తున్నారు. కొందరు ఏడ్చారు. మరి కొందరు భారమైన హృదయాలతో ఆయన వెంబడి ఊరిపొలిమేరల వరకు నిశ్శబ్దంగా నడిచారు.
 ”దొరా మేమంటే మీకెందుకంత ప్రేమ” అని ఒక సామాన్యుడు కండ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా గద్గదస్వరంతో అడిగాడు.
 ”నేను పేరు కోసం ఏనాడు తాపత్రయ పడలేదు. నేను చేతనయినంత వరకూ మీకు, ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడానికే ప్రయత్నించాను. మీ ప్రతి విన్నపాన్ని విన్నాను. ప్రతి వారికి నన్ను కలుసుకొని తమ సమస్యలు చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చాను. నా ధర్మం నేను నిర్వహించాను” అని టేలర్‌ సమాధానం ఇచ్చాడు.
 ఒక స్త్రీ ధైర్యంగా ముందుకొచ్చి ”దొరా ప్రతి ఉదయం ధాన్యం దంచుకునేటపుడు ప్రతి సాయంత్రం దీపం వెలిగించుకునేటప్పుడు స్త్రీలు మీ పేరే తలుచుకుంటారు. తొలి అన్నం ముద్ద చేతిలోకి తీసుకున్నా మీ పేరే తలుచుకొంటారు” అన్నది.
 మహాదేవ్‌ బాబాకీ…… అని ఎవరో అరిచారు.
 ”జై” అని ప్రజలంతా ఆశీర్వదించారు.
 ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ఫిలిప్స్‌ మెడాస్‌ టేలర్‌ ”మహాదేవ్‌ బాబా” గా అవతరించి హైద్రాబాద్‌కు చేరుకున్నాడు.

* * *

కాలవాహిని అలల వాలున కాల చక్రం గిరగిరా నాలుగేళ్లు తిరిగి 1857 లోకి ప్రవేశించింది. తుర్రేబాజ్‌ఖాన్‌, సయ్యద్‌ మౌల్వీ అల్లా ఉద్దీన్‌ల తిరుగుబాటు ఉప్పెనతో హైద్రాబాద్‌ నగరం అల్లకల్లోలానికి గురై అప్పుడప్పుడే చల్లబడుతున్నది. హైద్రాబాద్‌ నగరంలోని తన నివాసంలో ”దివాన్‌ఖాన్‌”లో కూచొని టేలర్‌ మరాఠీ భాషలో తన ఆత్మకథ రాసుకుంటున్నాడు.
 ఇంతలో ఒక చప్రాసీలోపలికి వచ్చి వొంగివొంగి మూడుసార్లు సలాం చేశాడు.
 రాస్తున్న పెన్నును ఆపి ”ఏమిటీ సంగత”న్నట్లు కళ్ళద్దాల పై నుండి చూశాడు.
 ”హుజూర్‌! ఆప్‌కే లియే లష్కర్‌ ఖైద్‌ఖానసే జైలర్‌ సాబ్‌ అయే హైఁ” అన్నాడు వినయంగా.
 ”పేష్‌ కరో”
 తలమీది రూమీ టోపీ తీసి చంకలో పెట్టుకున్న ‘జైలర్‌” గదిలోకి వినయంగా వచ్చి వొంగి వొంగి సలాములు చేశాడు.
 ”క్యా బాత్‌ హై”
 ”జైల్లో మిమ్మల్ని కలవటానికి ఓ ఖైదీ ఎదిరిచూస్తున్నాడు. అతడి చివరి కోరిక అదొక్కటే”.
 ”వాట్‌! ఏ ఖైదీ ఫర్‌ మీ!!” ఆశ్చర్యంతో అడిగాడు టేలర్‌.
 ”యస్‌ సార్‌!”
 ”హూ ఈజ్‌ హీ?”
 ”జీ హుజూర్‌! హిజ్‌ నేమ్‌ ఈజ్‌ రాజా వెంకటప్ప నాయక్‌”
 ”వ్వాట్‌? ఆర్యూ మాడ్‌?” కోపంతో వొణికాడు టేలర్‌.
 ”సారీ సర్‌! హి ఈజ్‌ ఇన్‌ ది ప్రిజన్‌”
 ”ఓ మై గాడ్‌!” రెండు చేతులతో తల పట్టుకుని టేబుల్‌పై వాలిపోయాడు టేలర్‌.
 ”మై సన్‌. మై సన్‌” అని రోధిస్తున్నాడు.

* * *

జైలు గదిలోకి టేలర్‌ అడుగు పెట్టగానే ‘అప్పా’ అని గట్టిగా కావలించుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు రాజా వెంకటప్ప నాయక్‌. దారి తప్పిన పిల్లవాడు తండ్రిని కలుసుకుని దుఖిస్తున్నట్లే ఉంది. తన ఒడిలో ఆడుకున్న పిల్లవాడు, తన ఒడిలో ఓనమాలు దిద్దిన పిల్లవాడు, తను పెంచి పెద్ద చేసిన లేత చిన్నారి కొమ్మ రత్నఖచిత సింహాసనం నుండి కింద పడి దుమ్ముధూళి పేరుకున్న ఈ చీకటి గదిలో ఒంటరిగా…
 దుఃఖాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నాడు టేలర్‌.
 రాజా వెంకటప్ప నాయక్‌ గద్గదస్వరంతో సురపురంలో ఏం జరిగిందో వివరించాడు. ఆ సంగతులన్ని ఓపికగా విన్నాడు టేలర్‌.

* * *

ఒకప్పుడు సురపురం మరాఠాల కింద ఉన్న సామంత రాజ్యం. తర్వాత బ్రిటిష్‌ ఆధీనంలోకి వెళ్లింది. 1857 తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్‌ వారి నుండి స్వతంత్రం పొందాలని ఆలోచన చేశాడు రాజు వెంకటప్ప నాయక్‌. అట్లనే హైద్రాబాద్‌ సంస్థానం పెత్తనం నుండి కూడా విముక్తి పొందొచ్చని ఆశపడ్డాడు. దానికి తోడు నానా సాహెబ్‌, రాయచూర్‌ జమీందార్లు కూడా అతనిని ప్రోత్సహించి గెలిచిన తర్వాత సురపురం నుండి రామేశ్వరం వరకూ దక్షిణ మహారాష్ట్ర రాజ్యానికి రాజును చేస్తామని ప్రలోభపెట్టారు.
 సురపురం ప్రజలు ‘బేడర్లు’ కూడా తామసగుణం కలిగిన క్షత్రియ వీరులు కావున స్వతంత్ర ప్రతిపత్తి కోసం రాజును బాగా వత్తిడి చేశారు. తమని తిరుగుబాటు చేయకుండా ఆపుతున్నందుకు రాజును పిరికివాడు, మూర్ఖుడు అని తిట్టిపోశారు. సహజంగానే దేశభక్తి కలిగిన రాజు వారి వత్తిడులకు లొంగిపోయి తిరుగుబాటులో పాల్గొన్నాడు. అనుభవశూన్యుడైన రాజు మొత్తం దక్షిణ మరాఠా దేశానికి రాజు కావచ్చని ఆశపడ్డాడు.
 తన సైన్యమే గాక ఆరు వందల మంది రోహిల్లాలు, అరబ్బు సైనికులను చేర్చుకుని పెద్ద పటాలాన్ని నిర్మించాడు. ఈ తిరుగుబాటు సన్నాహాలను గమనించిన హైద్రాబాద్‌ రెసిడెంట్‌ డేవిడ్‌సన్‌ తిరుగుబాటులో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని, వారి ఆస్తుల్ని జప్తు చేసుకుంటామని రాజా వెంకటప్ప నాయక్‌కు బెదిరింపు లేఖ పంపాడు.
 ధైర్యం చేసిన రాజు చివరికి తిరుగుబాటు బావుటా లేవనెత్తాడు. కాని ఏం ఫాయిదా? ఆ భగావత్‌ విఫలమయ్యింది. హైద్రాబాద్‌ నుండి వచ్చిన బ్రిటిష్‌ ఫౌజ్‌ సురపురాన్ని దిగ్బంధనం చేసింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం ప్రాణనష్టం జరిగి బలగాలన్ని చెల్లాచెదురైన తర్వాత రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. బయటి నుండి ‘సహాయం’ వాగ్దానాలకే పరిమితమయింది తప్ప ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి క్లిష్ట సమయంలో సురపురం నుండి సైన్య దిగ్బంధనాన్ని ఛేదించుకుని తన ఒకప్పటి సంరక్షకుడు, తండ్రిలాంటి వాడైన ”టేలర్‌”ను కలుసుకుని సలహా తీసుకుందామని హైద్రాబాద్‌ నగరానికి రహస్యంగా చేరుకున్నాడు.

* * *

రాజా నగరానికి రాగానే ముందు రెసిడెన్సీ బజారుకు వెళ్లి టేలర్‌ కోసం విచారించగా ఆయన దౌరాకు (క్యాంపుకు) వెళ్లాడని ఒకటిరెండు రోజులలో రావచ్చని సమాచారం తెలిసింది. నిరీక్షించటం తప్ప మరో మార్గం లేదు కావున కాశీ యాత్ర ముగించుకొని వస్తున్న ఒక హిందూ ”ముసాఫిర్‌” లాగ వేషం మార్చుకొని మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు.
 ఆ రోజులలో పట్నం జనాభా మూడున్నర లక్షలు. పట్నం చుట్టూ ఒక సఫీల్‌ (కోటగొడ) ఉంది. దానిపొడుగు ఆరుమైళ్లు. మొఘలుల దండయాత్రల నుండి నగరాన్ని రక్షించే ఉద్దేశ్యంతో కుతుబ్‌షాహీ రాజులు ఆ కోటగొడ నిర్మాణాన్ని ప్రారంభించగా 1803 లో రెండవ నిజాం రాజు దానిని పూర్తి చేశాడు. నగరం అంటే ఆ రోజులలో మూసీనదికి దక్షిణ భాగాన చార్మినార్‌ కేంద్రంగా ఉన్న ప్రాంతమే అని అర్థం. చౌక్‌, చౌమహల్లా ప్యాలెస్‌, చిచ్లం (శాలీబండ) డబీర్‌పురా లాంటివి ముఖ్యమైన ప్రాంతాలు. నగరానికి పదమూడు దర్వాజాలు, పదమూడు కిటికీలు ఉన్నాయి. ఆ దర్వాజాల దగ్గర హమేషా ఖడీనిగురానీ, సక్త్‌ పహరా ఉంటుంది. కొత్త వారిని, అనుమానితులను, సంచార జాతుల వారిని ఆ దర్వాజాల దగ్గరే ఆపుతారు. కోత్వాల్‌ (పోలీస్‌ కమీషనర్‌) అనుమతి లేనిదే నగర ప్రవేశానికి ఎవరికీ వీలుండదు సూర్యోదయాన ఆ దర్వాజాలు తెరిచి సూర్యాస్తమయం కల్లా తిరిగి మూసేస్తారు. ప్రతి దర్వాజా మీద ఒక ”నగారా” ఉంటుంది. దానిని ‘నక్కర్‌ఖానా’ అంటారు. ప్రజలకు జాములు, గడియలు, పొద్దు తెలిపేందుకు ఆ నగారాలపై లెక్క ప్రకారం గంటలు కొడుతారు. చాలా దూరం వరకు మొహల్లాలలో (బస్తీలలో) ఆ చప్పుడు వినబడుతుంది. పట్నంలో అనేక తోటలు, చెరువులు, బావులు ఉన్నాయి. ఆ తోటల వల్లనే నగరాన్ని ”బాగు నగర్‌” అని కూడా అంటారు. చెట్లు, తోటల వలన నగర వాతావరణం చల్లగా, హాయిగా ఉంటుంది. పురవీధులలో జన సంచారం అంతంత మాత్రమే. గరీబులు మాత్రమే పాదచారులు. అమీరులు బగ్గీలమీదా, ఎక్కాల మీదా, మేనాలలో సవారీలు చేస్తున్నారు.

‘రాజా’ పాత వాలాద్రి (పురానాపూల్‌) క్రింద ప్రవహిస్తున్న ముచికుందా నది (మూసీ) తీరానికి చేరుకుని అక్కడి ఇసుక తిన్నెల మీద తీరికగా కూచున్నాడు. అక్కడ సురపురాన్ని మరిపించి మనస్సును మురిపించే మనోహర సుందర దృశ్యాలెన్నెనో ఉన్నాయి. నగరానికి దూరంగా ఉన్న అనంత పద్మనాభ స్వామి కొండ కోనలలో జన్మించిన ‘ముచికుందమ్మ’ ఇక్కడ నగరంలో పాలవెల్లువలా పొంగిప్రవహిస్తుంది. ఒక్కొక్కసారి ఆగ్రహమొస్తే ఉగ్రరూపం కూడా దాల్చుతుంది. గతంలో గోల్గొండ కోట మీద దాడి చేయటానికి వచ్చి లంగర్‌హౌజ్‌ ప్రాంతంలో విడిది చేసిన ఔరంగజేబు సైనిక పటాలాన్ని పూర్తిగా తూడ్చేసి పొట్టన పెట్టుకుంది. ఆగ్రహమూ, అనుగ్రహము రెండు కండ్లు ముచికుందమ్మకు. నదిలో కొంత మంది స్నానాలు, సంధ్యలు చేస్తున్నారు. కొంత మంది బట్టలు ఉతుక్కుంటున్నారు. మావటీలు ”ఫీల్‌ఖానా”నుండి ఏనుగులను తీసుకొచ్చి ఇసుకతో రుద్ది వాటికి స్నానాలు చేయిస్తున్నారు. బాటసారులు ఇసుక తిన్నెల మీద కూచొని వీచే చల్లగాలులకు సేద తీరుతున్నారు. స్త్రీలు ఇసుక తిన్నెల మీద చెలమలు తవ్వి. నీరు తోడి త్రాగటానికి ఆ నీటిని బిందెలతో ఇండ్లకు తీసుకపోతున్నారు. నది ఒడ్డున ఉన్న శివమందిరం నుండి గోసాయిలు గంటల్ని గణగణ మ్రోగిస్తున్నారు. చింతచిగురు రవికా చిలకాకు పచ్చ లంగా, బీర పువ్వురంగుల వోణీ వేసుకున్న ఓ కన్నె పడుచు వొయ్యారంగ నదీ తీరాన నడుస్తూ ఎటో పోతున్నది.
 నగరంలో మొట్టమొదటి నిర్మాణ కట్టడం పాత వాలాద్రి. 1578లో దీనిని ఇబ్రాహీం కుతుబ్‌షా రాజు కట్టించాడు. రంగయ్య చౌదరీ ఈ నిర్మాణానికి గుత్తేదార్‌గా (కాంట్రాక్టర్‌) పని చేశాడు. చౌదరయ్య అనగా పనివాళ్ల నాయకుడని అర్థం. కుల చిహ్నం కాదు. ఖులీ కుతుబ్‌షా భాగమతిల ప్రేమ వారధి ఈ పాత వాలాద్రి.
 పాతవాలాద్రికి ఎదురుగా ధూళిపేట. (దూల్‌పేట్‌) గుర్రాలు, ఒంటెలు అక్కడి బస్తీలో ఉండటం వల్లవాటి పదఘట్టనలతో రేగే దుమ్మువలన ‘దూళిపేట’ అని పేరువచ్చింది. అక్కడ నివసించే లోథ్‌ క్షత్రీయులు ద్రాక్ష సారాయం కాస్తారు. గోల్కొండ కోట సైనికులే వారి గిరాకీ. ఆ పక్కన్నే జుమ్మేరాత్‌ బజార్‌. ప్రతి జుమ్మారోజు తెల్లారగట్లనే అక్కడ అంగడి ప్రారంభమవుతుంది.
 రాజా ఇసుక తిన్నల మీద నుండి లేచి రోడ్డు మీదికి వచ్చి నిలబడ్డాడు. కారవాన్‌ నుండి ధాన్యం బస్తాలు నింపుకున్న ఒక ఓంటెద్దు బండి చార్మినార్‌ వైపు పోతున్నది. బండి వాడి ప్రమేయం లేకుండానే ఎద్దు గమ్యం వైపు బండిని లాగుతున్నది. బండి వాడు తీరికగా చుట్టకాల్చుకుంట ధాన్యం బస్తా మీద ఒరిగి ”బండ పట్నంలో శాలిబండ, పేరైనా గొలుకొండా ”అని లల్లాయి పాట పాడుతున్నాడు. రోడ్డు మీద నిలబడ్డ రాజా ముఖ వర్చస్సు చూడగానే ”దొరా కూకో చార్మినార్‌ కాడ దింపేస్తా” అన్నాడు. రాజావారు మాట్లాడకుండ బండీ ఎక్కి బస్తాలమీద ఆరాంగ కూచున్నాడు. ‘పట్నంలో శాలిబండ’ పాట మళ్లీ మొదలయ్యింది.
 ఆ రోజులలో శాలిబండ చాలా ప్రముఖప్రాంతం. దీనినే ‘చిచ్లం’ అని కూడా అనే వారు. భాగమతి స్వంత ఊరు చిచ్లం. తర్వాత కాలంలో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది దివాన్‌లు (ప్రధాన మంత్రులు) పేష్కార్లు (ఆర్థిక శాఖా మంత్రులు) ఇతర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే నివసించటం వలన ”శాలిబండ” నాగరీకులు, ధనవంతులు నివసించే ప్రాంతంగా పేరు పొందింది. పట్నానికి సరుకులు మోసుకొచ్చే బండీ వాళ్ళు శాలిబండాను చూడటానికి వెళ్లుతున్నామన్న సంతోషంతో కట్టిన పాటే ‘పట్నంలో శాలిబండ’ పాట. ఎత్తైన ప్రాంతం కావున ‘బండ’ అని వ్యవహరించేవారు. శాలిబండనే గాక ఫిసల్‌బండ, గాజుల బండ, రాంబక్షబండ, మేకలబండలాంటి ప్రాంతాలు అక్కడ చాలా ఉన్నాయి. ‘మిట్ట’ అన్నదానికి పర్యాయపదమే ‘బండ’.
 ఆ రాత్రి శాలీబండాలో ఒక మరాఠీ బ్రాహ్మణ వితంతువు నిర్వహించే ‘పూటకూళ్ల’ ఇంటిలో రాజా బస చేశాడు. అక్కడ అన్నీ శాఖపాకాలే. రుచికరమైన సాత్వికాహారం. జొన్నరొట్టెలు. బచ్చలి ఆకు వేసిన పెసరపప్పు. రెండు మూడు రకాల పచ్చళ్లు. అంచుకు అప్పడాలు ముక్తాయింపుగా పూరణ్‌పోలీలు దానికి అనుపానంగా ఘుమఘుమలాడే కమ్మటి ఆవునెయ్యి. భోజనానంతరం తాండూరు లేత తమలపాకులలో ”ఆకు-వక్క”. కొంచెం దమ్ము కొట్టటానికి గులాబీరెక్కలు వేసి గొరువెచ్చని పన్నీరుతో సిద్ధం చేసిన రాజస్థానీ హుక్కా.
 విశాలమైన డాబా మీద వెన్నెల వెలుగుల్లో తెల్లటి మెత్తటి పరిశుభ్రమైన పరుపులు దిండ్లు. వీటి మీదికి ఒరగగానే సురపురానికి చెందిన చింతలన్నీ మనస్సులోనుండి మాయమైనాయి. వేప చెట్టు చల్లని గాలి వింజామరలు వీస్తుంటే కంటినిండా నిద్ర పోయినాడు.
 మరునాడు ఉదయం స్నానపానాలు పూర్తి చేసుకుని ‘చందూలాల్‌ బేలా’ దగ్గరున్న ‘అక్కన్న మాదన్నల’ గుడికి వెళ్లాడు. ఆఖరి కుతుబ్‌షా, అబుల్‌ హసన్‌ తానీషా నవాబుకు ప్రధాన మంత్రిగా, ఆర్థిక మంత్రులుగా పని చేసిన ‘అక్కన్న మాదన్నలు’ ఈ గుడిని కట్టించినందున వారి పేరే స్థిరపడింది. ఈ గుడిని చత్రపతి శివాజీ కూడా దర్శించాడు. అక్కడ పూజ ముగించుకొని సమీపంలో వున్న ‘నాగుల చింత’కు వెళ్లాడు. అదొక దట్టమైన చింతలతోపు. నాగదేవత విగ్రహంలో ఒక చిన్న గుడి ఉంది. మొదటి సారి ఖులీ కుతుబ్‌షా తన ప్రేయసి భాగమతిని ఆ చింతల తోపుల ఉన్న దేవళం వద్దనే చూశాడని అక్కడున్న ఒక వృద్ధదేవదాసి చెప్పింది. వాస్తవానికి నాగుల చింత ప్రాంతంలో ఆ నాటికే దేవదాసి, వేశ్యాగృహాలు చాలా ఉన్నాయి. భాగమతి ‘నాట్యగత్తె’ కావున ఆ కథ నిజమేనని ‘రాజా’ భావించాడు.
 ఆ సాయంత్రం ఒక అంజాన్‌ ‘ముసాఫిర్‌ లాగానే నడుచుకుంటూ మక్కామసీద్‌ను, చార్మినార్‌ను సందర్శించాడు. కాసేపు విశ్రమించటానికి చార్మినార్‌ చబూత్రా మీద కూచున్నాడు.
 కాలం కలిసిరానపుడు పచ్చికట్టెకూడా పామై కరుస్తుంది.
 ”కుఫియాలు” నలుమూలల్నుండి చుట్టు ముట్టి ఆ సురపురం రాజాను ‘గిరఫ్తార్‌’ చేసి లష్కర్‌ లో ఉన్న తిర్మల్‌గిరి ఖైద్‌ఖానాకు తరలించారు.
 కేసు కోర్టు విచారణలో ఉంది.

* * *

అంతా సావధానంగా విన్న టేలర్‌ ”రాజా రెసిడెంటు గారిని కలుస్తావా?” అని అడిగాడు.
 ”లేదప్పా! నేను కలువను. నాకు ఇష్టం కూడా లేదు. నేను ప్రాణభిక్ష కోసం క్షమాభిక్ష కోసం ప్రార్థించాలని ఆయన ఆశిస్తాడు. ఎంతైనా నేను మీ పెంపకంలో పెరిగాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను వెళ్లను. మరణదండననైనా స్వీకరిస్తాను గాని పిరికివాడిగా మాత్రం బతకలేను.”
 ”సరే రాజా! కనీసం కోర్టు విచారణలోనైనా అన్ని సంగతులు ధైర్యంగా చెప్పు. న్యాయం భగవంతుడికే వదిలేద్దాం.”
 ”నాకు సంబంధించినవి మాత్రమే చెప్పగలను అప్పా! నాకు సహకరించిన వారి పేర్లు చెప్పి వారిని మోసం చేయలేను. నన్ను ఉసిగొల్పిన వారి పేర్లు కూడా చెప్పను.”
 ”నీకు ఇంగ్లీషు వాళ్ల మీద అంత కోపమెందుకు రాజా నేనూ ఇంగ్లీషు వాడినే కదా?”
 అప్పా తండ్రి ప్రేమ ఏమిటో తెలియని అభాగ్యుణ్ణి నేను. మీరే నాకు తండ్రి లాంటి వారు. మీతో అబద్దం చెపుతానా? నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదా కోపం లేదు. ఇంగ్లీషువారి పెత్తనం మీదే నా కోపమంతా.
 టేలర్‌ ఒడిలో తలపెట్టుకుని ప్రశాంతంగా పడుకున్నాడు రాజా. మళ్లీ చిన్ననాటి సురపురం రోజులు వచ్చినట్టనిపించింది ఇద్దరికీ. రాజా వీపును ప్రేమగా నిమురుతున్నాడు… తండ్రి.
 ”అప్పా. నాకు మీరొక సహాయం చేస్తారా” తలెత్తకుండానే చిన్న పిల్లాడిలాగోముగా అడిగాడు.
 ”ఏంటదీ?”
 ”ఎట్లాగూ నాకు మరణదండన శిక్షనే విధిస్తారు. దానికి నేను సిద్ధమే. భయపడనుగాని ఉరి మాత్రం తీయోద్దని చెప్పండి. దొంగలను బందిపోట్లను ఉరితీసినట్లు నన్ను ఉరి తియ్యొద్దు. మరణంలో కూడా నేను గౌరవాన్నే కోరుకుంటాను. అయినా నేనేమంత పాపం చేశాను? దేశం కోసం పోరాడటం పాపమా? దేశభక్తి ఉండటం నేరమా?”
 ”లేదు బేటా. నువ్వేమీ తప్పుపని చేయలేదు.” టేలర్‌ కంఠం వొణికింది. కన్నీళ్లు జలజలా రాలి రాజా తల మీద పడ్డాయ.
 ”నన్ను ఫిరంగి మూతికి కట్టిపడేసి పేల్చివేసినా నేను భయపడను అప్పా. కాని నన్ను ఉరి మాత్రం తీయొద్దు. అట్లనే జైలు శిక్ష కూడా నాకు ఇష్టం లేదు. రాజుగా బ్రతికిన నేను ప్రతిక్షణం కృంగి కృశించి మరణించడం కంటె ఫిరంగి మూతికి కట్టి పేల్చేసినా పరవాలేదు”. సున్నితంగా తన చేత్తో అతడి పెదాలను మూశాడు టేలర్‌.
 టేలర్‌ వెళ్లడానికి లేచి నిలబడగానే రాజా అతని పాదాలకు ప్రణామం చేశాడు.

* * *

కోర్డు విచారణ ముగిసింది. ముందు ఉరిశిక్ష ఖాయం చేశారు. కాని మెడాస్‌ టేలర్‌ జోక్యం వలన చెంగల్‌పట్టు కోటలో ఆ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వచ్చింది. ఆ తీర్పును యావజ్జీవ శిక్షగా మార్చి, రాజాను హైద్రాబాద్‌ నుంచి మద్రాసుకు తరలిస్తుంటే శంషాబాద్‌ ప్రాంతంలో సైనికులు కొంతసేపు విశ్రాంతి కోసం ఆగారు. ఒక సైనికుడు తన బెల్టుకు ఉన్న పిస్టల్‌ను చెట్టుకింద పెట్టి స్నానానికి పక్కకు వెళ్లగానే ఆ పిస్టల్‌ను చేతిలోకి తీసుకుని కణతకు గురి పెట్టుకుని పేల్చుకున్నాడు.
 సరిగ్గా ఆ రోజుకు అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు నిండాయి. ఒక రోజు కూడా అటూ ఇటూ తేడా లేదు.
 నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సురపురం సంస్థానం నైజాం రాజ్యంలో 1861లో విలీనం అయ్యింది.

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com